Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి..http://www.gotelugu.com/issue310/799/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

(గత సంచిక తరువాయి)..... వారానికి రెండు రోజులు మిత్ర వింద అబ్బాస్ ను రహస్యంగా కలుస్తునే ఉంది. ఇద్దరు గంటల తరబడి మాట్లాడుకుంటారు. ఒకవేళ కలుసుకోవటానికి వీలు లేకపోతే ఫోన్ లో మాట్లాడుకునేవారు. రోజురోజుకు అబ్బాస్ మీద మిత్రవిందకు ఇష్టం ఎక్కువవుతోంది. ముఖ్యంగా అతని తల్లి షబ్నమ్ ను చూడాలనే ఆసక్తి కూడా పెరిగింది. ఇంత జరుగుతున్న మిత్రవింద తన చదువును నిర్లక్ష్యం చెయ్యలేదు. రోజు ఎనిమిది గంటల పాటు చదువుకునేది. తీరిక ఉన్నప్పుడల్లా తల్లికి ఇంటి పనిలో సహయం చేసేది.
ఆ రోజు శనివారం. అబ్బాస్ ను కలుసుకునే రోజు. ఆటోలో కంచె దగ్గరకు చేరుకుంది. అప్పటికే అబ్బాస్ వచ్చేశాడు. బండమీద కూర్చుని పరధ్యానంగా కనిపించాడు.

“ఏమిటి అబ్బాస్ అలా ఉన్నావు”అంది మిత్రవింద.

“ఈ రోజు మా అమ్మ నా పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. నేను ఆఫీసుకు బయలుదేరుతుంటే తన గది లోకి పిలిచింది. ముఖ్యమైన పనిఉంటే తప్ప అమ్మ నన్ను పిలవదు. విషయం తెలుసుకుందామని ఆవిడ దగ్గరకు వెళ్ళాను.

“ఇంకా ఎంత కాలం ఇలా ఉంటావు”అంది అమ్మ నవ్వుతూ.

ఆమె మాటలు నాకేం అర్ధంకాలేదు. అయోమయంగా చూశాను.

“నా ఉద్దేశం పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావని”అంది తిరిగి.నా మనస్సులో ఉన్న మాట చాల రోజులనుంచి ఆమెతో చెప్పాలని అనుకుంటున్నాను.  కాని సమయం సందర్భంరాలేదు. అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.

“నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆమెనే పెళ్ళిచేసుకోవాలని అనుకుంటున్నాను”అన్నాను.

“ఎవరా అమ్మాయి ఎక్కడ ఉంటుంది”అంది ఆమె.

“ఆమె పాకిస్ధాన్ దేశస్ధురాలు కాదు. కనీసం మన మతం కూడా కాదు. ఆమె భారతీయురాలు. పేరు మిత్రవింద”అన్నాను. ఈ మాట వినగానే ఆమె విపరీతంగా స్పందిస్తుందని భావించాను. కాని అలాంటిది ఏం జరగలేదు. చల్లగా చిరునవ్వు నవ్వింది.

“ఆ అమ్మాయి ఎవరైతే ఏమిటి. ఏ దేశస్ధురాలైన ఏమిటి. నీకు నచ్చింది ప్రేమించావు. పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నావు. నాకుఎలాంటి అభ్యంతరం లేదు. నిన్ను ఇంతగా ఆకర్షించిన అమ్మాయిని చూడాలని ఉంది. ఆమె ఫోటో ఉందా “ అంది.

“ఫోటో లేదమ్మా. ఆమెను అడిగి తీసుకుంటాను. ఈ రోజు సాయంత్రం నీకు చూపిస్తాను”అన్నాను.

“సరే వెళ్ళి తీసుకురా. నా కోడలు పిల్ల ఫోటో చూడాలని నాకుఎంతో ఆత్రంగా ఉంది”అంది.

“ఇది జరిగింది. ఇప్పుడు అర్జంటుగా నీ ఫోటో కావాలి మిత్రవింద”అన్నాడు.ఉన్నట్టుండి అతను ప్రపోజ్ చేసేసరికి మిత్రవిందకు నోటమాట రాలేదు. ఈ పరిణామం ఆమె ఊహించిందే. ఈ రోజు కాకపోయిన రేపయిన తనే చెప్పాలనుకుంది. కాని అంతకంటే ముందే అబ్బాస్ నోరు విప్పాడు. ఇంతకంటే ఆమెకు కావల్సింది ఏముంది. ఆమె ఆశ్చర్యపోతుంది అందుకు కాదు. ఏ మాత్రం ఉపోద్ఘాతం లేకుండ అతను మరోరకంగా తన అభిప్రాయం చెప్పాడు. అది ఆమెకు విస్మయాన్ని కలగచేసింది.

మిత్రవింద పరిస్ధితిని అతను గమనించాడు.

“సారీ మిత్రవింద నీ అభిప్రాయం తెలుసుకోకుండ ప్రపోజ్ చేశాను. కనీసం ఇప్పుడైన నీ అభిప్రాయం చెప్పు”అన్నాడు.

మిత్రవింద మాట్లాడలేదు. మెల్లగా అతని చేతిని తన చేతులలోకి తీసుకుని చెంపకు ఆనించుకుంది. అది చాలు అబ్బాస్ కు ఆమె తనని ఇష్టపడుతుందని తెలుసుకోవటానికి.

“అమ్మ నీ ఫోటో చూడాలని అంటుంది. ఒక ఫోటో తీసుకోనా”అడిగాడు అబ్బాస్.

“అలాగే తీసుకో అని సర్దుకుని కూర్చుంది.

అబ్బాస్ తన సెల్ ఫోన్ తో ఆమె ఫోటో తీసుకున్నాడు.

“నీ చదువు ఎలా సాగుతోంది”ఉన్నట్టుండి అడిగాడు అబ్బాస్.

“చక్కగా సాగుతుంది. తప్పకుండ విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది”అంది మిత్రవింద.

“నా వైపు నుంచి పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక మిగిలింది మీ వాళ్ళు.  మీ వాళ్ళను ఒప్పించే బాధ్యత నీ మీద ఉంది. సాధ్యమైనంత తొందరగా మన విషయం మీ వాళ్ళకు చెప్పు”అన్నాడు అబ్బాస్.

“ఈ రోజే నాన్నగారితో మాట్లాడతాను”అంది ఆత్మవిశ్వాసంతో మిత్రవింద.

అబ్బాస్ తో చెప్పింది కాని ప్రాక్ఠికల్ గా అది ఎంత కష్టమైనదో మిత్రవిందకు తెలిసివచ్చింది. ఇంటికి వెళ్ళిన తరువాత తండ్రి కోసం కాచుకుంది. రాత్రి ఏడుగుంటలకు తండ్రి వచ్చాడు. కాఫీ తాగి రిలాక్స్ గా ఆరుబయట కూర్చున్నాడు అతను. చుట్టు ఎవరు లేకపోవటం చూసి మెల్లగా తండ్రి దగ్గరకు నడిచింది. అబ్బాస్ విషయం చెప్పాలని నోరు తెరవబోయింది. అప్పుడే తల్లి అటువైపు వచ్చింది. తల్లిని చూడగానే మిత్రవింద నోరు మూతపడింది. వెనక్కి తిరిగి వచ్చేసింది.తల్లి తండ్రి ఏదో విషయం గురించి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో తన ప్రేమ ప్రస్తావన తీసుకోస్తే బెడిసికొడుతుంది. అందుకే తండ్రి మూడ్ చూసి తరువాత తీరికగా చెప్పాలనుకుంది.

ఆ అవకాశం డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చింది. తండ్రి చాల సంతోషంగా ఉండటం గమనించింది మిత్రవింద. భోజనం అయిన తరువాత తండ్రి తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఏ పేపరో పుస్తకమో చదువుకుంటాడు. అప్పుడు అబ్బాస్ విషయం చెప్పాలి. ఆ సమయంలో ఆయన మూడ్ చాల బాగుంటుంది. తప్పకుండ ఒప్పుకుంటాడని భావించింది మిత్రవింద.

భోజనం అయిన తరువాత చక్రపాణి తన గదిలోకి వెళ్ళికూర్చున్నాడు. మిత్రవింద కూడా భోజనం చేసి తన గదిలోకి వెళ్ళింది. తండ్రి ముందు అబ్బాస్ ప్ర్తస్తావన ఎలా తీసుకురావాలో అని ప్రాక్టిస్ చేసింది. అద్దం ముందు నిలబడి మరి ప్రాక్టిస్ చేసింది. దాంతో ఆమెకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే తండ్రి గదివైపు నడిచింది.

ఆమె ఊహించినట్టుగానే జరిగింది. చక్రపాణి తీరికగా పేపర్ చదువుతూ కనిపించాడు. అతని మొహం చాల ప్రశాంతంగా ఉంది. ఇదే మంచి సమయం అనుకుని తడబడే అడుగులతో తండ్రి వైపు నడిచింది మిత్రవింద.ఇంతలో చక్రపాణి పేపర్ లోంచి తలఎత్తి చూశాడు.

“రామ్మా నీకో విషయం చెప్పాలి”అన్నాడు అతను.

“ఏమిటి నాన్న”అంది మిత్రవింద.

“నా కొలిగ్ ప్రసాద్ తెలుసుకదూ.”

“ఎందుకు తెలియదు. బాగా తెలుసు. పోయిన సారి నా పుట్టినరోజుకు వచ్చాడు. మంచి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఆయనే గా”అంది మిత్రవింద.

“అవునమ్మా అతనే. వాడి కూతురు ఎంత పని చేసిందో తెలుసా. ఒక ముస్లిం యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తండ్రికి తెలిస్తే చంపేస్తాడని భయపడి ప్రేమించినవాడితో లేచిపోయింది. ఈ సంఘటన జరిగి వారంరోజులైంది. కాని ప్రసాద్ ఈ చేదువిషయాన్ని నిన్ననే నాతో చెప్పాడు. కూతరు చేసిన పనితలుచుకుని వాడు ఎంతో బాధపడుతున్నాడు. బయట తలఎత్తుకోలేక సిగ్గుపడుతున్నాడు”అన్నాడు చక్రపాణి.

“అయ్యో ఎంత పని జరిగిది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కుడ ఉన్నారు”అడిగింది మిత్రవింద.

“తెలియదమ్మా. మేమంతా పోలీసులకు రిపోర్ట ఇవ్మమని ప్రసాద్ కు చెప్పాం. కాని అతను ఒప్పుకోవటం లేదు. ఈ విషయం నలుగురికి తెలిస్తే తన పరువు పోతుందని భయపడుతున్నాడు. నిజంగా వాడి కూతురుచేసింది చాల తప్పు. ప్రేమించటం తప్పుకాదు. కాని ఆ ప్రేమను పెద్దవాళ్ళకు చెప్పకపోవటం పెద్ద తప్పు. ఎంతో కష్టపడి కని పెంచిన తల్లితండ్రులను విడిచి పరాయివాడితో వెళ్ళిపోవటం ఇంకా పెద్ద తప్పు. అలాంటివాళ్ళను ఏం చేసిన పాపం లేదు” అన్నాడు చక్రపాణి. కోపతో అతని మొహం ఎర్రగా మారింది.

తండ్రి వాలకం చూసి వణికిపోయింది. తన కొలిగ్ కూతురు చేసిన పనికి ఆయన ఎంతో కోపంతో రియాక్ట్ అవుతున్నాడు. అదే కన్న కూతురు అలాంటి పనిచేసిందని తెలిస్తే ఇంకా భయంకరంగా రియాక్ట్ అవుతాడు. ఆ కోపంలో కొట్టిన కొడతాడు. ఈ ఆలోచన రాగానే మిత్రవింద ధైర్యం పూర్తిగా వీగిపోయింది. ఏం మాట్లాడకుండానే గదిలోంచి బయటకు వచ్చేసింది. ఆ ఒక్కరోజు మాత్రమే కాదు. వారంరోజులు గడిచిన అబ్బాస్ గురించి తండ్రికి చెప్పలేకపోయింది. నిజానికి తండ్రితో మిత్రవిందకు ఎంతో చనువు ఉంది. ఏ విషయమైన అరమరికలు లేకుండ ఆయనతో మాట్లాడుతుంది. తన అభిప్రాయాలను అభిరుచులను నిర్భయంగా చెప్పుతుంది. కాని ప్రేమ విషయం వచ్చేసరికి వెనక్కి అడుగు వేస్తుంది.   తండ్రితో ఆ విషయం చెప్పకపోవటానికి కేవలం భయం ఒక్కటే కారణం కాదు. సిగ్గు కూడా. అప్పుడే తను పెళ్ళికి తొందరపడుతుందని అనుకుంటాడని ఆమెకు సిగ్గు. ఇంకో వారంరోజులు గడిచాయి. కాంపిటిటివ్ పరీక్ష రాసి ఇంటికి చేరుకుంది. పరీక్ష బాగా రాసింది. చాల తృప్తిగా ఉంది మిత్రవిందకు.

మిత్రవింద చెప్పే మాట్లలు విని తన తండి ఏవిధంగా స్పందిస్తాడో తెలియాలంటే   వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందే....)    

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్