Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nayana vinyasam

ఈ సంచికలో >> కథలు >> టాలెంట్

talent

పదమూడేళ్ళ రంగడికి నిద్రరావటం లేదు. కళ్ళు మూసినా తెరిచినా తన స్నేహితుడు చూపించిన మిమిక్రీనే గుర్తుకువస్తున్నది. అందులో అతడిని ఆలోచనకు గురిచేస్తున్నది మిమిక్రీలో గొప్పదనం కంటే దానిని ఆ ఆర్టిస్టు స్వయంగా తీసి యుట్యూబ్ లో పెట్టాడట. దానిని లక్షమందికి పైగా నెట్ లో చూశారట. అతనికి ప్రదర్శనలివ్వమని డబ్బులిస్తామని బోలెడన్ని ఫోన్లు వస్తున్నాయట. ఇదంతా అతని స్నేహితుడు నందు చెప్పాడు. నందు, రంగడు ఇద్దరు మంచిస్నేహితులు. అయిదవ తరగతి వరకు పంచాయితీ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఆపైన చదువుకు పంపితే అక్షరం ముక్క వచ్చినా కొలువులు ఎలాగూ రావని, బతుకు ఇటు ఇంటికూటికి, అటు బంతికూటికి కాకుండా చెడుతుందని తెలిసిన రంగడి తండ్రి చింతయ్య అతడిని మోటారు మెకానిక్ షెడ్ లో పనికి చేర్పించాడు. చదువు మీద అంతంతమాత్రమే ఇష్టం ఉన్న రంగడు ఆనందంతో చేరిపోయాడు. రంగడి అక్క మేరి వాళ్ళ అమ్మతో పాటు కూలి పనికి వెళ్తుంది.

పక్కనే పడుకున్న అక్క వైపు తిరిగాడు. ఆమెను చూస్తుంటే వాడికి ఆమె ఇంట్లో పనిచేస్తూ రోజూ పాడుకునే సినిమా పాటలు గుర్తుకు వచ్చాయి. ఆమె పాడుతుంటే అచ్చు సినిమాలో వాళ్ళు పాడినట్టే ఉండేది. పాట పూర్తిగా రాకపోయినా హమ్మింగ్ చేస్తూ పాడేది. ఆమె పాట వినిన చుట్టుపక్కల వాళ్ళు ఆమె చేత చిన్న చిన్న కార్యక్రమాలలో పాడించుకుని తెగ మెచ్చుకునేవారు. అలా అలా ఆమెకు కూడ అది ఒక పిచ్చిలాగ మారి పాటలకోసం సినిమాలు పదే పదే చూసేది. తోడుగా రంగడిని తీసుకువెళ్ళేది. అందుకే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరూ కష్టపడుతున్నారు వెధవది సినిమానే కదా చూడనీ అన్నట్లుగా చింతయ్య కూడ ఏమీ అనేవాడు కాదు.

మేరిని చూస్తున్న రంగడికి అక్క చేత పాట పాడించి ఆ మిమిక్రీ అతను పెట్టినట్లు నెట్ లో పెడితే... ఏమో ఎవరైనా పిలిచి అక్కకు సినిమాలో పాడే అవకాశం ఇస్తే. అబ్బ అక్క పెద్ద సింగర్ అయిపోదూ. వాడికి ఎక్కడలేని ఆనందం కలిగింది ఆ ఊహకు. ఎలాగైనా నందుతో మాట్లాడి అక్క పాటను యూట్యూబ్ లో పెట్టించాలి. అలా ఆలోచిస్తూ అక్క మీద చెయ్యివేసి అలాగే నిద్రలోకి జారుకున్నాడు రంగడు.

************

"నందూ ఎలాగైనా అక్క పాటను రికార్డ్ చేసి ఆ మిమిక్రి అతను పెట్టినట్లుగా నెట్ లో పెట్టాలిరా ప్లీజ్." బ్రతిమలాడాడు రంగడు."నాకు అలాంటివి తెలియదురా. ఒక పని చేద్దాం మా నాన్నకు తెలిసిన ఒక రికార్డింగ్ షాపు ఉంది. అతను నాకు కూడ బాగా తెలుసు. అతడిని అడుగుదాం మనకేదైనా సహాయం చేయగలడేమో" సలహా ఇచ్చాడు నందు. సరే అనుకుని ఇద్దరూ బయలుదేరారు అక్కడికి. అతడిని కలిసి విషయం చెప్పారు.

"అదేమంత పెద్దపని కాదు. నేను చేస్తాను. మరి పాట రికార్డు చేశారా" అడిగాడు షాపతను.

"ఎలా చేయాలి? నా సెల్ లో వస్తుందా?" అంటూ సెల్ చూపించాడు నందు.

సెల్ చూసి అతను "వస్తుంది గాని అంత క్లారిటి ఉండదు. ఒక పని చేయండి నేను మధ్యాహ్నం నాలుగు గంటలకు ఖాళీగా ఉంటాను. అప్పుడు ఆ అమ్మాయిని తీసుకురండి. రికార్డ్ చేసి యూట్యూబులో అప్ లోడ్ చేద్దాము." అని చెప్పాడు.

ఇద్దరు సంతోషంగా అతనికి ధాంక్స్ చెప్పి బయటకు వచ్చారు.

"అవునురా రంగా అక్క పనికి వెళ్ళింది కదా మరెలా తీసుకువస్తావు" అనుమానం వ్యక్తం చేశాడు నందు."అదంతా నేను చూసుకుంటాను నువ్వు మూడు గంటలకల్లా ఇక్కడికి రా" అని సమాధానం కోసం చూడకుండా పరుగుతీశాడు రంగడు.

******

మనకివన్నీ ఎందుకురా వద్దు అంటున్నా వినకుండా మేరిని లాక్కుని వచ్చి రెండు పాటలు రికార్డు చేయించి యూట్యూబ్ లో పెట్టించారు. "కూలీ కోయిల" అనే టైటిల్ తో అప్ లోడ్ చేశారు. దానికి లైక్ లు వస్తే ఎలా చూడాలో మొత్తం చెప్పి పంపాడతను. అతను కూడ ఆమె పాటకు ముగ్ధుడయిపోయాడు.

"అన్నా డబ్బులు ఎంత ఇవ్వాలి" అడిగాడు నందు షాపతనిని.

"ఇప్పుడేమి వద్దు. మీ అక్క మంచి సింగర్ అయిన తరువాత అప్పుడు ఎంత కావాలో నేనే అడిగి తీసుకుంటా." అని వారి భుజం తట్టి పంపాడు అతను. ఆమె పాటమీద అతనికి అంత నమ్మకం కుదిరింది.

ముగ్గురు తెగ ఆనందపడిపోయారు ఆ మాటలకు. ఆ రాత్రి ఎవరికీ నిద్రపట్టలేదు.

********

ప్రతిరోజూ ప్రోగ్రస్ చూడడం పెద్దగా స్పందనలేదని పెదవి విరుచుకోవడం. అలా వారం గడిచింది. ఒకరోజు షాపతని నుంచి ఫోను వచ్చింది.

"హలో నందూనా. నేను రికార్డింగ్ షాపు నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మీ అక్క పాడిన పాటకు వందల్లో షేర్లు, పదివేలకు పైగా లైకులు వచ్చాయి. నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఫోను వచ్చింది. ఈ విషయాన్ని నేను లోకల్ టెలివిజన్ రిపోర్టరుకు కూడ చెప్పాను. కంగ్రాట్స్." అభినందనలు తెలిపాడతను.

స్కూల్ నుంచి రంగడి షెడ్ దగ్గరకు పరుగెత్తి ఈ విషయం చెప్పి షాపు దగ్గరికి వెళ్ళారిద్దరూ.

"రండి. రండి. గంట గంటకు లైకులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీ అక్క పాటకు అంతా ఫిదా అయిపోయారు. యూట్యూబులో నా నెంబరు తీసేసి మీ నెంబరు ఇచ్చాను. ఇక మీకు ఫోన్లు వస్తాయి. మీ అక్క భవిష్యత్తు ఇక నల్లేరు మీద బండే" భుజం తట్టి మరీ చెప్పాడు అతను.

******

పదిహేను రోజులు తిరిగేసరికి మేరి జాతకమే మారిపోయింది. ఏ టెలివిజన్ లో చూసినా ఆమెతో ఇంటర్వ్యూలే. ప్రముఖ సంగీత దర్శకుడి నుంచి ఫోన్ కాల్. వెంటనే బయలుదేరి హైదరాబాదుకు రమ్మని. వారింటిలో ఇక పండుగ వాతావరణమే నెలకొన్నది. చింతయ్య వెంటనే తోడల్లుడికి ఫోన్ చేశాడు స్టేషనుకు రమ్మని. అతను హైదరాబాదులో చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. పదివేలు బదులు తీసుకుని బయలుదేరారు హైదరాబాద్. వారికి తోడుగా ఉంటాడని నందు వాళ్ళ నాన్న గారిని తోడు తీసుకుని వెళ్ళారు.

******

ఆడిషన్ చేయడం, ఒక పాట మేరి చేత పాడించడం అంతా పదిరోజుల లోపలే జరిగిపోయింది. అందరూ భేష్ అని మెచ్చుకున్నారే గాని ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. చింతయ్య ఆగలేక నందు వాళ్ళ నాన్న గారిని సంగీత దర్శకుని మేనేజర్ వద్దకు పంపాడు. వెళ్ళిన అతను తిరుగు టపాలో వచ్చిన ఉత్తరం లాగా గిర్రున తిరిగి వచ్చాడు.

"ఏమన్నారయ్యా. డబ్బులిచ్చారా?" ఆదుర్దాగా అడిగాడు చింతయ్య.

"లేదు చింతయ్యా. సంగీతజ్ఞానం లేని ఆ పిల్ల చేత పాట పాడించడమే గొప్ప. పది సంవత్సరాలు సంగీతం నేర్చుకున్న పిల్లలే ఫ్రీగా పాడుతున్నారు. ఏదో తక్కువలో ఉండే వారికి ఒక అవకాశమిచ్చి ప్రోత్సహిస్తే మంచిదని చేశాము అంతే. నేనే గాదు ఎవరు అవకాశమిచ్చినా మీరు ఉచితంగా పాడవలసిందే. ఆ పాట హిట్ అయితే అప్పుడు ఆలోచిస్తాం అన్నాడు" అని చెప్పలేక చెప్పాడు నందు తండ్రి. హతాశుడయ్యాడు. తెచ్చుకున్న పదివేలలో ఇక ఒక వెయ్యి మాత్రమే మిగిలాయి. ఇక మర్యాదగా తిరిగి వెళ్ళడమే మేలు అనుకుని బయలుదేరారు తమ ఊరికి.

*******

ఆరు నెలలు గడిచిపోయాయి. క్రమంగా మేరి కోసం, ఆమె పాటకోసం వచ్చేవాళ్ళ సంఖ్య తగ్గిపోసాగింది. చర్చిలో, చిన్న కార్యక్రమాలలో పాటలు పాడే అవకాశం మాత్రం దక్కింది మేరికి. తనకిక తిరుగులేదని ఊహించిన మేరి పనికి వెళ్ళడం మానేసింది. మరల ఇప్పుడు వెళ్ళాలంటే ఏదో అవమానంగా తోచి మానేసింది.

ఆమె పాట పాడిన సినిమా రిలీజయింది. ఆమె పాడిన పాట సూపర్ హిట్ అయింది. కాని చిత్రంగా టైటిల్స్ లో ఆమె పేరు లేదు. రికార్డింగ్ షాపుకు వెళ్ళి సి.డి చూశారు. అందులో ఆమె పాటకు ఎదురుగా ఒక ప్రఖ్యాత గాయని పేరు ఉంది. ఆమె గొంతు, మేరి గొంతు దరిదాపుల ఒకటిగానే ఉంటాయి.

ఆవేశంతో నందు సెల్ నుంచి మేనేజర్ కు ఫోను చేశారు.

"ఇది చాలా అన్యాయం సర్. నేను పాడిన పాటకు వేరే ఆమె పేరు పెట్టారు. డబ్బు ఇవ్వలేదు, పేరు వేయలేదు." ఏడుస్తూ అడిగింది మేరి."నీ పేరు పెడితే ఫిల్మ్ కొనడానికి బయ్యరులెవరూ ముందుకు రాలేదు. అందుకే పేరు మార్చాం. అయినా నువ్వేదో సూపర్ సింగర్ లాగ దబాయిస్తావేమిటి? ఇక్కడ నీలాటి వారు వీధికొకరున్నారు. పెట్టెయ్" విసురుగా అని ఫోను పెట్టేశాడు.

ఏడుస్తున్న అక్కను చూసి ఓదార్చలేక మౌనంగా ఉండిపోయాడు మాయాలోకం గురించి తెలియని పసివాడు రంగడు.

(అంతర్జాలం మాయలోపడి తమ తాహతేమిటో, తమ టాలెంట్ ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోలేక సినీ మాయాప్రపంచం లోకి అడుగుపెట్టి నగుబాటు పాలవుతున్న అమాయకులెందరో)

మరిన్ని కథలు