Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
vepa puvvu

ఈ సంచికలో >> కథలు >> ఎన్ని’కలల’ ఉగాది

enni kalala ugadi

అంకయ్య రాష్ట్రం లో ముఖ్య నేత! ఎన్నికల నామినేషన్ వేసే ముందు గుడి కెళ్ళి తన ఇష్టదైవానికి దండం పెట్టుకున్నాడు!

“ స్వామీ! నన్ను గెలిపించు స్వామీ! ఈసారి గెలిస్తే ముఖ్య మంత్రిని అవుతాను!”

గట్టిగా మనసులో అనుకుని గుంజీళ్ళు తీసాడు. టప టాపా చెంపలు వాయిoచుకున్నాడు

“జీవితంలో ఇదే ఆఖరి కోరిక! ఇంకెప్పుడూ నిన్ను ఏమీ అడగను స్వామీ!”

మళ్ళీ ప్రార్ధించాడు. ఇంతలో కళ్ళ ముందు బుస్సుబుస్సున చప్పుడు! భయంగా కళ్ళు విప్పి చూస్తె- ఎదురుగా దేముడు! శ్రీ కృష్ణ అవతారం సినిమా లో ఎన్టీఆర్ లా ఉన్నాడు. 

“ హా! స్వామీ! మీరా?”

“మీరాజాస్మిన్, పాయల్ రాజ్ పుత్ కాదు- కృష్ణుడిని అంకయ్యా!”

కృష్ణుడు చిద్విలాసంగా నవ్వేడు!

అంకయ్యకి నిజమో కాదో అర్ధం కాక చెయ్యి గిల్లి మరీ చూసుకున్నాడు. ఈ లావున ఎర్రగా కందిన చెయ్యి కనిపించగానే కెవ్వున అరిచి

“స్వామీ! నువ్వేనా?ఐతే నిజమేనా? ”  అయోమయంగా అన్నాడు.

“నేనే అంకయ్యా! జీవితంలో ఆఖరి కోరిక అన్నావు కదా, అది తీర్చడానికి వచ్చాను!”

“ థాంక్స్ స్వామీ! ఇన్నిసార్లు మొక్కేను ఎప్పుడూ మీరిలా రాలేదు స్వామీ!”

“ఎప్పుడైనా ఇంత భక్తి గా నువ్వు  ప్రార్ధించావా?”

“ఇట్లా వస్తావు అనుకుంటే ప్రార్ధించే వాడినే స్వామీ”

“అంటే నమ్మకం లేదన్న మాటే గా!” నవ్వేడు కృష్ణుడు.

“అమ్మో!నువ్వు మామూలు దేముడివి కావు స్వామి! నీతో పరాచికమా? కాదులే గానీ ఈసారి నేను గెలుస్తానంటారా?”

“చూసావా?! మళ్ళీ నమ్మకం లేదు!”

“లేదు! లేదు! గెలుస్తా.. కానీ స్వామీ! నీ దయ  కావాలి!”

“నా దయ ఉంటే సరిపోదు! పైగా ఈ ఎన్నికల సమయం లో భక్తులు విశేషమైన కోరిక కోరుకున్నారు!”

“ఏమిటది స్వామీ?” కృష్ణుడు సమ్మోహనంగా నవ్వి 

“చూడు భక్తా! రాజకీయాల్లో ఎలా రహస్యాలు ఉంటాయో అట్లాగే భక్తులకు భగవంతుడికి మధ్య కొన్ని  ఉంటాయి అవి చెప్పకూడదు!” తల అడ్డంగా ఆడించాడు.

“మాకు మీకు మధ్య అగరబత్తీ ఉంటుందనుకున్నాను గానీ ఇలా అనుకోలేదు స్వామీ!నేను గెలిచేలా దీవించండి చాలు!”

“గెలుపు వరం ఇవ్వాలంటే ముఖ్య షరతు ఉంది!”

“ గెలుపు వరం ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నో ప్రాబ్లెం స్వామీ!”

కృష్ణుడు అంకయ్య ని వెర్రివాడా అన్నట్టు చూసి గంభీరమైన గొంతు తో “ వికారి నామసంవత్సర ఉగాది ప్రారంభం అవుతోంది ..తెలుసుగా!” వికారి పదాన్ని ఒత్తి మరీ చెప్పాడు. అంకయ్య విని తేలిగ్గా నవ్వి అన్నడిలా -

“సరే, వికారి నామ సంవత్సరమే! అయితే ఏంటి స్వామీ?”

“ఈ వికారిలో గెలిచిన నేతలకి గండం వుంది భక్తా!”

“గెలిస్తే గండమా? ఏంటి స్వామి?”

“ఎవరు గెలిచినా లోగడ పదవిలో ఉన్నప్పటి స్కాములు అన్నీ బైటికి వస్తాయి!”

కృష్ణుడు పిల్లన గ్రోవి అటు ఇటు తిప్పుతూ చిద్విలాసంగా నవ్వేడు.

“ఇదెక్కడి ఫిట్టింగు స్వామీ? కొంపదీసి వున్నా పదవి ఊడగొట్టి కోర్టుల చుట్టూ తిప్పి జైల్లో కూచో బెట్టి చిప్ప కూడు తినిపిస్తావా?”

“ఊహు!!” చిద్విలాసంగా నవ్వేడు

“అమ్మయ్య బతికించావు!” రిలీఫ్ గా చెప్తున్న అంకయ్యని సూటిగా చూసి

“దాని కంటే ఘోరమైన ఫలితాలు ఉంటాయి, గెలిచిన వారికి సుమా!” కొంటెగా చెప్పాడు.

“అంటే? జైలుబెడద,  కోర్టుల గొడవ ఇవేవీ కాకుండా ...?”

“అవును అవి ఏమీ వుండవు కానీ –“

“ ఇంకా కానీ ఏమి స్వామీ! అవి లేకుంటే ఏదయినా ఎదుర్కోవచ్చు! నువ్వు గెలుపు అభయం ఇవ్వు చాలు, తక్కింది నేను చూసుకుంటా!”

“ఇంకోసారి ఆలోచించు!”

“ఇంకే ఆలోచన నువ్వు పెట్టుకోకుండా దీవించు స్వామీ!” 

“తధాస్తు!!”  కృష్ణుడు బుస్సుమని మాయం అయిపోయాడు!

****     ****

అంకయ్య  ఎన్నికల్లో విజయం సాధించాడు!ఎన్నికయిన శాసనసభ్యులంతా కలిసి అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తెల్లారి లేస్తే పదవీ పీఠం ఎక్కడం ఖాయం!

అంకయ్య ఉదయాన్నే ఉత్సాహంగా లేచి తెగమురిసిపోతూ  అద్దంలో మొహం చూసుకుని ఉలిక్కి పడ్డాడు!కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూశాడు - చెవుల్లోంచి వేలాడుతున్న ఇంతింత పొడుగున గడ్డి పోగులు! దురద పుట్టి ముక్కు గోక్కుందామని వేలు పెట్టగానే ముక్కులోంచి కూడా మర్రి మాను వూడలు దిగినట్టు గడ్డి మొలకలు! కెవ్వు మని కేక పెట్టాడు. చేతితో ముక్కు లోంచి గడ్డి పీకేసాడు. ఆశ్చర్యం! మళ్ళీ మొలిచింది! మళ్ళీ పీకాడు.. మళ్ళీ మొలిచింది! భయం తో కంగారుతో కేకలు పెట్టాడు. పెళ్ళాం పిల్లలు అనుచరులు పరుగున వచ్చేరు. అందరూ అంకయ్య అవతారం చూసి నిర్ఘాంతపోయారు . కొండకచో కొందరు అనుచరులు కిసుక్కున నవ్వేరు! “నవ్వుతారెంటయ్యా! పీకండి గడ్డి !” గట్టిగా అరిచాడు.

అందరూ ఆ పనిలో ఉండగానే తక్కిన శాసనసభ్యులు కాబోయే మంత్రులు కొందరికి ఇంకా విచిత్రంగా ఒంట్లోంచి ఇసుక రాలడం మొదలైంది. సన్నగా చినుకులు ఆకాశం లోంచి రాలినట్టు ఇసుక రేణువులు రాలటం ప్రారంభమయ్యింది. చూస్తుండగానే చినుకులు పెద్ద వానలా తుఫానులా మారినట్టు వొంట్లోంచి ఇసుక జలజలా రాలి పెద్దపెద్ద కుప్పలు తయారయ్యేసరికి భయంతో కేకలు పెడుతూ బైటికి పరుగులు తీసారు. పరిగేట్టినoత దూరం ఇసుక మేటలు వెయ్య సాగింది. గడ్డి మోపులు మోపులుగా తయారయ్యింది. ఆవులు, గేదల గ్రాసం దొరక్క పాపం ఇన్నాళ్ళు ఎదురుచూస్తున్న వాళ్ళంతా ఇదే అవకాశం గా ఆనందంగా మోపులు తీసుకుపోసాగారు. ఇల్లు కట్టుకుందాం అంటే ఇసుక దొరక్క ఇన్నాళ్ళు బాధలు పడ్డ సామాన్యులు కావలిసినoత లారీల కెత్తుకుని తీసుకుపోసాగారు.

“ఇది అన్యాయం! నా గడ్డి! నా ఇసుక! ఒరే రాజు, నర్సింహా  ఎక్కడ చచ్చారు?!”

గట్టిగా అనుచరులని పిలుస్తూ పెడబొబ్బలు పెట్టారు. ఇంకా విడ్డూరంగా కొందరికి నోరు బోరు బావిలా తెరుచుకుని నోట్లోంచి సన్న కంకర వెలువడింది! కొందరికి దొడ్డు కంకర రాళ్ళు ఊడిపడ్డాయి. కొందరికి చెవులు వికారంగా చేటల్లా పెద్దవి అయ్యి అందులోంచి రెండు వేల నోట్లు కట్టలు కట్టలు కింద పడ్డాయి.

ఇదెక్కడి వింత?! ఇదెక్కడి విడ్డూరం!? చానెల్ వాళ్ళంతా పరుగు పరుగున వోచ్చేసారు!

లైవ్ టెలీ క్యాస్ట్ ప్రసారాలు మొదలైనాయి. గెలిచిన వాళ్ళంతా నొప్పికి తట్టుకోలేక చెవుల్లోంచి ముక్కుల్లోంచి ఊడి పడుతున్న గడ్డిని పీక్కోలేక వొంట్లోంచి రాలుతున్న ఇసుకని తుడుచు కోలేక నోరు తెరిస్తే చాలు వేగంతో పడే సన్నకంకర ఉదృతి ఆపలేక సత మతమైపోతూ చిందులు తోక్కెరు. వీళ్ళ వికార అవతారాలు టీవీలో చూసి జనం నవ్వుతున్నారు!

పది నిమిషాలు కాకుండానే ఇసుక మేటలు! కంకర గుట్టలు! గడ్డి వాములు!నోట్ల కట్టలు!

అంకయ్య దారుణం గా ఇసుక లోకి జారిపోతూ కంకర రాళ్ళ వర్షం లో నిలువు లోతున మునిగి పోతూ,గాయాలవుతూ, కూరుకు పోతూ...

“హా దేముడా! వద్దు ఇంత కన్నా చావు నయం తీసుకు పో! నన్ను తీసుకుపో! నేను చాలా అన్యాయాలు చేసాను! దందాలు చేసాను! ప్రజా సేవ మరిచి డబ్బుకోసం నానా గడ్డి తిన్నాను! స్వామీ! “

గావు కేక పెట్టాడు.ఇసుక తుఫానులో లో కొట్టుకు పోతున్నాడు.సుడిగాలి వేగానికి పైకి లేచాడు. ఆకాశం లోకి ఎగిరి పోయాడు.మళ్ళీ అక్కడినుంచి వేగంగా విసిరేసినట్టు కిందికి వేగంగా అతి వే..గం..గా భూమి మీద ప..డ..బో..తూ--

“ఆ!ఆ! చచ్చాను!!”  ఆర్తనాదం చేసి ఉలిక్కిపడి ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు!

ఎదురుగా పెళ్ళాం! కంగారుపడుతూ అనుచరగణం!

అంకయ్య చెమటలు తుడుచుకుoటూ “హా!ఐతే ఇదంతా కలన్నమాట!” అన్నాడు.

పెళ్ళాం రుస రుస లాడి “బానే ఉంది సంబడం!పొద్దునే కలలు కంటున్నారా?ఆ కేకలేమిటి,  పెడ బోబ్బ లేమిటి?లేవండి! మీ అనుచరులంతా అవతల వెయిట్ చేస్తున్నారు! ప్రచారానికి బైలు దేరండి!”  

చెప్పి వెళ్ళిపోయింది. అంకయ్య నిట్టూర్చి “అమ్మయ్య! బతికించావు స్వామీ! “

అoటూండ గానే పెళ్ళాం మళ్ళీ వచ్చి ఉగాది పచ్చడి చేతిలో వేసి చెప్పిందిలా..

“నువ్వు లీడర్ వి! గెలుపోటములకి అతీతంగా ప్రజలందరి మేలు కోరుకుంటూ వికారిఉగాది పచ్చడి తిను!సరేనా?”   వికారి పదం వినగానే పక్కలో బాంబు పడ్డట్టు అంకయ్య ఉలిక్కిపడి కళ్ళు మూసుకోగానే ప్రచార సభల కొచ్చిన బోలెడుమంది జనం కనిపించారు. అందరూ దేవుడ్ని “ ఈ వికారి సంవత్సరం లో ఎన్నికయిన నేతలు ప్రజా శ్రేయస్సు ని విస్మరిస్తే వికారంగా అయ్యేలా దీవించు స్వామీ ”

భక్తి గా వేడుకుంటున్నారు.

“అమ్మో స్వామీ!ఇదా రహస్యం!ప్రమాణం చేసి చెబుతున్నా ఈసారి గెలిచినా ఓడినా నీతి నిజాయితీ తో ప్రజా సేవ చేస్తా!” అంకయ్య నమ్మకంగా అన్నాడు. వెంటనే పూజగదిలో గంట గణగణమని మోగింది!!

మరిన్ని కథలు