Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue313/806/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)....  "ఈ ఊరు.. మీరు నన్ను మార్చారు. మనిషిని చేశారు. అందుకే ఈ ఊరి శివారులో కొన్ని ఎకరాల స్థలం తీసుకున్నాను. అందులో నిరాదరణకు గురైన వృద్ధుల కోసం, అనాథ పిల్లల కోసం, శక్తి ఉండి మరో దారి తెలియక అడుక్కుంటున్న వాళ్ల కోసం ఆశ్రమం కడుతున్నాను. కొంత వరకు పూర్తయ్యింది. స్త్రీ అంటే తల్లి. ఆమె కుండే ఓరిమి శక్తి, పనిచేసే నైపుణ్యత పురుషుడికి రమ్మన్నా రాదు. కాత్యాయని గారూ మీరు మరో పెళ్లి చేసుకోలేరు. ఎవరు కాదన్నా మీ పండంటి జీవితం పగిలిపోడానికి నేనే కారణం. అందుచేత ఆశ్రమ నిర్వహణ బాధ్యత మీకు అప్పగిస్తాను. ఫండింగ్ అంతా నేను చూసుకుంటాను. ఆశ్రమంలో ఉన్న వాళ్లని కంటిపాపల్లా కనిపెట్టుకుని ఉండడమే మీ పని. మీ మీద నేను ఆ బాధ్యత పెడదామనుకున్నపుడు..నా మనసు ప్రశాంతతనందింది. ఇది ఖచ్చితంగా కాత్యాయని అమ్మవారి సంకల్పమే! నిర్ణయం మీమీదే ఆధారపడి ఉంది." అంటూ ముగించాడు.

‘కొంగు ముడితో.. అగ్ని చుట్టూ ఏడడుగులు తిరిగిన మొగుడు బయటకి గెంటేశాడు. తనకేమీ కాని ఒకతను తన వల్ల అతని మనసు పావన గంగైందని సమాజానికి సేవ చేద్దామని నడుంకట్టాడు. విధి చేసే వింత విన్యాసాలు అంతా ఇంతా కాదు.’ కాత్యాయని మనసులో మనోహర్ పట్ల ఆరాధనా భావం.

‘అమ్మాయిల వెంట పడి వేధించే ఆకతాయిలు. కట్టుకున్న భార్యను కడతేర్చే భర్తలున్నారని ఛానెల్లో తనెన్నో న్యూసులు కవర్ చేసింది. ఇవాళటి ఈ సంఘటన తన వృత్తిపర జీవితంలో ఓ విచిత్రం. కాత్యాయని నిజంగా అమ్మవారి అంశ. అందుకనే ఆమెకి ఆశ్రయమిచ్చేవారే కాని అపరాధం చేసేవారుండరు’ మనసులో అనుకుంటూ కాత్యాయని వంక చూసింది హేమ. ఆమె కళ్లకి జరీ చీర, అలంకరణ, కిరీటం లేని అమ్మవారి ముఖం ఆమె ముఖంలో ద్యోతకమైంది. అప్రయత్నంగా మనసులో చేతులు జోడించింది.

‘నేను ఆశ్రమ బాధ్యత తీసుకుంటానండి. అమ్మ నా జీవితానికో మార్గం చూపింది. రేపటి ఆశ్రమ వాసులంతా నా  పిల్లలనేమో నాకు పిల్లలు కూడా కలగలేదు. అంతేకాదు, ‘నన్ను అల్లారు ముద్దుగా పెంచిన నా తల్లిదండ్రుల పరిస్థితి ఎలాగన్న’ దిగులు నన్ను బాధించేది. ఇప్పుడు వాళ్లను కూడా ఆశ్రమం లో ఉంచి ఇతోధిక సేవ చేసుకుంటాను. ఇలా చేస్తేనన్నా వచ్చే జన్మలో నా జీవితం ఒడిదుడుకులు లేకుండా ఉంటుందేమో! మనోహర్ గారూ మీలో నాకో అన్నయ్య, తండ్రీ కనిపిస్తున్నారు. నా మేలు కోరుకునే మీరు భగవంతుడే! నాలో ఊపిరున్నంత కాలం ఆశ్రమాన్ని జాగ్రత్తగా, అందులోని వాళ్లని నాకు దేవుడిచ్చిన సంతానంగా చూసుకుంటాను" కన్నీళ్లతో అంది.

"చెప్పాను కదండీ, ఇది నాకు పునర్జన్మ అని. ఆశ్రమ పనులు వేగంగా జరుగుతున్నాయి. మీరు రేపటి నుంచి దగ్గరుండి చూసుకోవచ్చు"అన్నాడు.

’మీ ఇద్దరి సంబంధం దైవికం. మీరు ఒకరినొకరు ‘గారూ..’అనే తోకని తీసేసి ఆప్యాయంగా మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం’
’అలాగే హేమ గారూ..ఇదిగో ఆశ్రమం చిరునామా ఉన్న కాగితం. మీరు కాత్యాయనిని అక్కడికి ఎప్పుడైనా తీసుకురావచ్చు. ఆవిడకు చక్కని సౌకర్యావంతమైన రెండు గదులు ఉన్నాయి"అన్నాడు.

"అంటే నేను మీకేమీ కానా అన్నయ్యా, ’గారూ..’ తీసేసి నన్నూ చెల్లెమ్మా అనే అను కాత్యాయని నాకు దేవుడు.. కాదు కాదు దేవత ఇచ్చిన సోదరి’అంది ఆప్యాయంగా కాత్యాయని చుట్టూ చేతులేసి.

అతను ’అలాగేనమ్మా..’అంటూ వెళ్లిపోయాడు.

ఇద్దరూ కాసేపలాగే ఉండిపోయారు.

తర్వాత తేరుకున్న కాత్యాయని ‘పద హేమా అమ్మానాన్నలకి ఈ విషయం చెబుదాం’అంటూ ఆమెని బయల్దేరదీసింది.
ఇద్దరూ ఇంటికెళ్లారు.సోమయాజులుగారికి, వరాలమ్మకి ఛానల్ ఆఫీసులో జరిగిన సంగతంతా పూసగుచ్చినట్టు చెప్పింది హేమ.
"నాకు తెలుసమ్మా, కాత్యాయని గుళ్లోని ఆ తల్లేనని. మమ్మల్ని ఉద్ధరించడానికి కొన్నాళ్లు మా ఇంట్లో ఆశ్రయం పొందిందంతే! నీ జీవితం ఇహ ఒక గాడిన పడ్డట్టేనమ్మా..చిరంజీవ’అని ఆశీర్వదించాడాయన. వరాలమ్మకూడా మురిసిపోయింది.‘అమ్మా, మాకు పిల్లల్లేరని తెలుసుగా ఈ గుడిని చూసుకోలేని వార్ధక్యం వచ్చినప్పుడు మీ ఆశ్రమంలో మాకింత చోటియ్యమ్మా, నీ సన్నిధిలో కృష్ణా, రామా అనుకుంటూ కాలంగడిపి ప్రాణాలొదిలేస్తాం’ అని సోమయాజులుగారనగానే అందరి కళ్ళు సజలాలయ్యాయి.

’కాత్యాయనీ, రేపు నువ్వు ఎనిమిందింటికి సిద్ధంగా ఉండు. మనిద్దరం ఆ ఆశ్రమానికి వెళ్లి ఎలా ఉందో చూసొద్దాం. నేనూ దాని గురించిన విషయాలు, విశేషాలూ కవర్ చేసుకుంటాను’ అంది హేమ.

అలాగే అన్నట్టు తలూపింది కాత్యాయని.

ఆశ్రమానికి వెళ్ళి అక్కడ వాతావరణాన్ని చూసిన కాత్యాయని ఆశ్రమం లో వుండడానికి ఒప్పుకుంటుందా లేదా తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందే....    

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
prema enta madhram