Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

ఒక్క క్షణం.. నీ ప్రాణం నీది కాదు.!

Just a moment .. your life is not yours.

అక్కినేని నాగేశ్వరరావు పెద్దగా చదువుకోలేదు. కానీ, ఆయన ఇంగ్లీష్‌లో చాలా బాగా మాట్లాడగలిగేవారు. సినీ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారాయన. చాలా రంగాల్లో ఇలాంటి అద్భుతాలు కనిపిస్తుంటాయి. చదువొక్కటే అన్ని సమస్యలకూ పరిష్కారం అనుకుంటే పొరపాటే. చదువు లేకపోతే జీవితం అనర్ధమన్న భావనలో అర్ధమే లేదు. చదువు అవసరమే కానీ, ఆ చదువులో ఫెయిలైనంత మాత్రాన ప్రాణం తీసుకోవడం మహా పాపం. ఒక్క మాటలో చెప్పాలంటే 'నీ ప్రాణం నీది కాదు. నీకు తెలియకుండానే నీ ప్రాణం ఈ భూమ్మీదకు వచ్చింది. నీకు తెలియకుండానే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. మధ్యలో నీ ప్రాణం తీసుకోవడానికి హక్కు నీకెలా వస్తుంది.?' అని అంటాడో మహానుభావుడు. అది ముమ్మాటికీ నిజం.

ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు తెలంగాణాలో 23 మంది విద్యార్ధుల్ని బలిగొన్నాయి. నిజానికి ఇప్పుడు పరీక్షల నిర్వహణలో పొరపాట్ల కారణంగా ఈ విషయం ఇంతలా హైలైట్‌ అవుతోంది కానీ, విద్యార్ధుల ఆత్మహత్యలు ఇప్పుడు కొత్తగా చూస్తున్నవేమీ కాదు. విద్యారంగంలో పోటీ తత్వం పెరిగిపోయే వింత, చెత్త పోకడలు పుట్టుకొచ్చాక ఈ దుస్థితి మొదలైంది. ఒకప్పుడు పరీక్షలో ఫెయిలైతే, మళ్లీ రాసుకోవచ్చులేరా.. అని విద్యార్ధులకు ధైర్యం చెప్పేవారు. ఎమ్‌ఎస్‌ఎన్‌ - మార్చి సెప్టెంబర్‌ మార్చి అంటూ ఓ సరదా ప్రస్థావన కనిపించేది. దానర్ధం బాగా చదవక్కర్లేదు అని కాదు. ఫెయిలైనా ఇంకో అవకాశముందిలే.. అని ధైర్యం చెప్పడం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 89 మార్కులొచ్చినోళ్లు కూడా 92 మార్కులు రాలేదని ప్రాణాలు తీసుకుంటున్నారు. అంతలా ప్రాణాలు చులకనైపోయాయి.

ఈ రోజు ఓడినోడు.. రేపు గెలవడానికి అవకాశముంటుంది. కానీ, ఈ రోజు ప్రాణం పోతే, మళ్లీ తిరిగి రాదది. 'చచ్చి ఏమీ సాధించలేవు. బతికి సాధించు..' అంటాడో మహానుభావుడు. నిజమే. ఎందరో సైంటిస్టులు మొదట్లో చదువు మీద ఆశక్తి లేక, క్లాసుల్లో ఫెయిలయ్యి, ఆ తర్వాత అనూహ్యంగా అద్భుత ఆవిష్కరణలు చేపట్టారు. మనం అభిమానించే రాజకీయ నాయకులు, మనం భుజానికెత్తుకునే సినీ ప్రముఖులు, మనం ఆరాధించే క్రికెటర్లు చదువుతో సంబంధం లేకుండా ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు. అయినా ఇంజనీరింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి, సాప్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీరింగ్‌తో సంబంధం లేని ఉద్యోగం ద్వారా లక్షలు ఆర్జిస్తున్న రోజులివి. ఏ విద్యార్హత లేకుండా మెదడులో మెదిలిన చిన్న ఆలోచనని గొప్ప ఆవిష్కరణగా మలిచి ప్రపంచ ఖ్యాతి పొందుతున్న వారెందరో కళ్ల ముందు కనిపిస్తున్న కాలమిది. ఇంత అడ్వాన్స్‌డ్‌గా ప్రపంచం పరుగులు పెడుతుంటే, అంత సిల్లీగా అత్యంత విలువైన ప్రాణాలెలా తీసుకోగలుగుతున్నారు.?

టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్‌ హీరో పరీక్షా ఫలితాల గురించి, విద్యార్ధుల ఆత్మహత్యల గురించి స్పందిస్తూ ఓ పరుష పదాన్ని వాడాడు. ఆ పరుష పదం విలువ ఏంటో అందరికీ తెలుసు. పరుషంగా మాట్లాడాడు అని కాదు కానీ, ప్రాణం ముందర పరీక్షా ఫలితాలు ఎంత తేలికా.. అని చెప్పడానికి అంతకు మించిన పోలిక బహుశా ఇంకోటి ఉండదేమో.

మరిన్ని యువతరం
yuvataram stories compteion