Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
peddaloo tasmat jagratta

ఈ సంచికలో >> కథలు >> కఠిన హృదయాలు

kathina hrudayalu

" హలో శ్రీను మాస్టారేనండి " అంటూ ఓ ఆడగొంతు ప్రశ్న."ఔను

ఇంతకీ మీరెవరు? " ఇవతలి నుంచి ఎదురుప్రశ్న . " నేనండి సీతను. పదిహేనేళ్ళ క్రితం మీరు మేము యలమంచిలి లో రామారావు గారి ఇంట్లో పక్క పక్కనే అద్దెకి ఉండే వాళ్ళం, గుర్తుకు వచ్చేమా? " " ఓహొ సీత గారా? బాగున్నారా?"

"బాగున్నామండి, . ఎంతమందినో కనుక్కున్నాము మీ నెంబరు కోసం. మేము అనకా పల్లిలో ఉంటున్నాము ఒకసారి మా ఇంటికి రండి. అని చిరునామా చెప్పి ఫోన్‌ పెట్టేసింది ఆవిడ .

****

అనుకోకుండా ఓ సారి అనకాపల్లి వెళ్ళినప్పుడు నేను సీతగారింటికి వెళ్ళడం జరిగింది .సుభాష్ గారికి సెలవుకావడం తో ఇంటివద్దే ఉన్నారు . దంపతులిద్దరూ ఇంటిలోకి సాదరంగా నన్ను ఆహ్వానించారు. భార్యా భర్త లిరువురు చాలా జాగ్రత్త పరులు కావడం తో పైసా పైసా కూడబెట్టి అపార్ట్మెంటు కొనుక్కున్నారు . కుశల ప్రశ్నలు అయ్యాక

"మీ అబ్బాయి సురేష్ చదువు ఎలా సాగుతోంది?" అని అడిగాను.

ఆవిడ మనసులోమాటను చెప్తూ " మా వాడు మారలేదు అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే పద్దతి.పదవ తరగతిలో 9.8 వచ్చాయి  ఇంటరులో వెయ్యికి 956 మార్కులు వచ్చాయి. మా వెధవకి ఎంత మొత్తుకున్నా బుర్రకెక్కలేదు .

మరి కొంచెం కష్టపడితే పదికి పది పాయింట్లూ, వెయ్యికి వెయ్యి వచ్చిఉండేవి. నా మాట వింటే కదా" అంటూ అసంతృప్తిని వ్యక్తంచేసారు ఆమె.

"956 అంటే తక్కువనా మీ ఉద్దేశ్యం? "

"తక్కువేకదండీ ..మా ఎదురు వాటాలో అబ్బాయికి ఇంటరులో 998 మార్కులు వచ్చాయి.  రెండుమార్కులు తగ్గాయని పిల్లడిని ఇంట్లోకి రానివ్వలేదు . పై పోర్షన్‌ లో వాళ్ళ అమ్మాయికి ఎం.సెట్‌ లో ఫస్ట్‌ ర్యాంకు రాలేదని కిందా మీదా అయిపోతున్నారు . "

" సీతగారూ మన పిల్లలకి ఫస్ట్‌ ర్యాంక్‌ రావాలనుకోవడం తప్పుకాదు . ఫస్ట్‌ ర్యాంక్‌ మాత్రమే రావాలనుకోవడం తప్పు "

      "వీడు ఎప్పటికి మారతాడో నాకైతే అర్ధంకావడం లేదు" నిస్పృహగా అన్నారామె.

      "అప్పుడు,ఇప్పుడు ఒకేలా ఉంది మీ తీరు. మారాల్సింది మీ అబ్బాయి కాదు, మీరు" అంటూ ఉండగా గతం నాకళ్ళ ముందు కదలాడింది.

         ****

రామారావు గారి మేడమీద రెండువాటాలు. ఒకవాటాలో మేము పక్కవాటాలో కోర్టులో గుమాస్తాగా పనిచేసే సుభాష్,   అతనిభార్య సీత, కొడుకు సురేష్ ఉండే వారు. వీధి గుమ్మంలో రెండువాటాలకి హద్దు వెదురు తడక మాత్రమే. ఆదివారం సెలవు కావడంతో  వీధిగుమ్మంలో కూర్చుని 'పిల్లల మనసు తెలుసుకుందాం' పుస్తకం చదువుకుంటు న్నాను.ఇంతలో పక్కవాటా

లోంచి..

" వెధవా రాయరా...

దుఃఖపెట్టకురా....నీకు చెప్పలేక చచ్చిపోతున్నానురా...ఆ ఫోర్‌ రూల్‌ పుస్తకం లో అలాగేనా రాసేది? కుదురుగా రాయరా..." అంటూ తిట్లు, దబ్,దబ్ మనే శబ్దాలు,"అమ్మా ..వొద్దే

నొప్పెడుతోందే!"అని భరించలేని భాధతో పిల్లాడి ఏడుపు వింటూ.1,2,3,4...19,20 అని మనసులో అనాలోచితంగా లెక్కపెడుతూనే ఒక్క పరుగున పక్కవాటాలోకి వెళ్ళిన నాకు అక్కడ కనిపించిన దృశ్యం కన్నీరు పెట్టించింది. రక్తం మరిగిపోయింది . కడుపు తీపి ,పేగు బంధం అంటే ఇదేనా కసాయివా?కన్నతల్లివా ?

 

ఇలా ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉన్నా అది వారి వ్యక్తిగతం కావడంతో నిస్సహాయంగా నిలబడి పోయిన నన్ను చూడగానే

" చూడండి మాస్టారూ వీడు నన్ను ఎలా ఏడిపిస్తున్నాడో ?"

"వాడు మిమ్మల్ని ...????"

 

"అవునండీ . కింద ఇంట్లో రాజి హోం వర్కు పూర్తిచేసేసి, వాళ్ళ నాన్న పెట్టే డైలీ టెస్ట్‌ రాస్తోంది.వీడూ ఉన్నాడు  ఎందుకు అటు ఇటు దిక్కులు చూడటంతోనే సరిపోతోంది . స్కూల్‌ వాళ్ళు ఇచ్చిన హోం వర్కు చేయాలి , తరువాత నేను పెట్టే డైలీ టెస్టు రాయాలి . ఇదంతా అయ్యేసరికి రాత్రి పది అవుతుంది. ఓపక్క నిద్ర, ఓ పక్క చదువు ఇలాగైతే క్లాస్‌ పస్టు ఎలావస్తాడు చెప్పండి?"

 

"అలాగని యూకేజీ పిల్లాడిని మరీ ఇంత దారుణంగా ...???"

 

" కొడితేనే మామాట వినలేదు, లేకుంటే అసలు వినడు . గత పరీక్షల్లో 25 మార్కులకు 241/2 మార్కులు వచ్చాయి. 1/2 మార్కులో రెండో స్థానానికి వెళ్ళిపోయాడు. ఎంత సిగ్గండీ .."

 

"మీ పిల్లాడు ఫస్ట్‌ ర్యాంక్‌ లో ఉండాలని ఇరవై సార్లు ఆ చిన్ని బుర్రని సిలిండరు కేసి కొడితే ..

ఆచిన్న  మెదడు ఏమౌతుందో ఒక్కసారి ఆలోచించారా ? వాళ్ళని చూసి మీరు, మిమ్మల్ని చూసి వాళ్ళు మీ మనసుల్లో ఉన్నది పిల్లల మీద రుద్దేసి పోటీ పేరుతో హింసిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడమే మరచి పోతున్నారు ."

 

మొహం కందిపోయి, వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ పిల్లాడిని చూసి, ఇక  ఒక్క క్షణంకూడా అక్కడ నిలవాలనిపించక, ఇంటికి వచ్చేసిన నాలో ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు .

 

"మాస్టారూ! టీ తీసుకోండి" అన్న సీతగారి పిలుపుతో వాస్తవం లోకి వచ్చిన నేను  

"చూడండి సీతగారూ! మీరిద్దరూ చదువుకున్నవారే . మీ అప్పులు, ఆస్థులు కష్టసుఖాలు పిల్లాడికి అవసరమంటారా?. ఆ చిన్ని మనసుకేం తెలుస్తుందని? వాడి ఇష్టాయిష్టాల గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకోడానికి ప్రయత్నించారా ? బాల్యపుటానందాలను దూరం చేసి పిల్లలని మరమనుషుల్లా మారుస్తున్నారు .

 

మీ ఆలోచనలు వాడిమీద రుద్దే ప్రయత్నం చేసారే కాని వాడి ఆలోచనకి మీరెప్పుడూ విలువివ్వలేదు.

 

          "ఈరోజు మీవాడు మొండిగా తయారయ్యి స్నేహితులతో బలదూర్ గా తిరుగుతున్నాడంటే అందుక్కారణం మీరే! అలా తయారు చేసింది మీరే!! అన్నాను నేను ఆవేశంగా.

 

    పొట్లకాయ  తిన్నగా పెరగ డానికి చిన్న రాయి కడతారు అతి జాగ్రత్తతో పెద్దరాయికడితే ఇలాగే ఉంటుంది. చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం పొందిన వాళ్ళే గొప్పవాళ్లు కాదు. టాటా, బిర్లాలు వ్యాపార రంగంలో, కే ఎఫ్ సి చికెన్ తయారీలో, బూట్లు తయారీలో, మోటార్ రంగంలో వారి,వారి నైపుణ్యాలతో ఎంతోమంది   ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అంతెందుకు, పదవ తరగతి పరీక్ష తప్పిన సచిన్ టెండూల్కర్ భారతరత్నం కాలేదా! మీపిల్లాడికి ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకుని, ఆదిశగా ప్రోత్సహించి, తనేమిటో నిరూపించుకునే అవకాశం ఇవ్వండి" అని చెప్పాను వారి శ్రేయోభిలాషిగా…

 

కాలం గడిచింది..

 

ఒకరోజు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో భిలాయ్ వెళ్లే రైలుకోసం ఐదో నెంబరు ప్లాట్ ఫామ్ దగ్గర కూర్చుని ఉన్నాను. నా ముందు నుంచే పేపర్ రూపాయి అని అరుచుకుంటూ వెళ్తున్నాడో కుర్రాడు. వాడి చేతిలో అన్ని భాషల పేపర్లు ఉన్నాయి. ఏదైనా రూపాయే. రైలు వచ్చేసరికి ముప్పావుగంట సమయం పడుతుంది. ఈలోగా కాలక్షేపం అవుతుందని ఒక రూపాయి ఇచ్చి ఒక పేపరు కొన్నాను. పేపరు ఖరీదు రూపాయే అయినా ఎంతో సమాచారం ఉంది. అలా చదువుతూ రెండో పేజీలో ఒక శీర్షిక దగ్గర నా కళ్ళు నిలిచి పోయాయి..” సైబర్ నేరం క్రింద నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్” వివరాల్లోకి వెళితే అనకాపల్లికి చెందిన సురేష్ పంజాబ్ లో ప్రముఖ కాలేజీలో బి.టెక్ చదివాడు. ఆ సమయంలో విలాసాలకు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు సంపాదనకోసం అతని స్నేహతులతో కలిసి సైబర్ మోసాలకు వ్యూహరచన చేసాడు. అనేకమంది సేవింగ్స్ ఖాతాలనుంచి వారి ప్రమేయం లేకుండా  డబ్బు డ్రా చేసాడు. విశాఖలో నిందితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి టెక్నాలజీ సాయంతో సమస్యను ఛేదించి నిందితుల్ని పట్టుకుని రిమాండుకు తరలించారు.” అన్న వార్త చదివేసరికి నా గుండె ఝల్లుమంది. కన్న కొడుకు జీవితం చేచేతులారా పాడుచేసారు మీరూ తల్లిదండ్రులేనా? మీవి కఠిన హృదయాలు, పాషాణాలు. ఇకనైనా పిల్లల పట్ల మీ ప్రవర్తన మార్చుకోండి. వాళ్ళ ఇష్టాఇష్టాలు తెలుసుకోండి అని నా మనసు ఘోషిస్తూ ఉండగా..నా ఫోన్ రింగ్ అయింది. ఫోన్ రిసీవ్ చేసుకోగానే "హలొ మాష్టారు నేను సీతని సురేష్ వాళ్ళ అమ్మని జరగకూడనిది జరిగిపోయింది. వాడి భవిష్యత్తు నాశనమైపోయింది. మీరు చెప్పినా అర్ధం చేసుకోలేక పోయాము. మా కష్టాలు చెపితే వాడు మారతాడాని అనుకున్నాము కానీ మేము మారాలి అనుకోలేదు. దూరంగా ఉంచితే బాగుపడతాడనుకున్నాము మాకు దూరమౌతాడనుకోలేదు. లక్షలు ఫీజులు కట్టి చదివిస్తే లక్షణంగా చదువొస్తుందని అనుకున్నాము. అవలక్షణాలు అలవడతాయనుకోలేదు. అడిగిన దానికంటే ఎక్కువే ఖర్చు పెడుతున్నాం కదా అనుకున్నాం కానీ అది అనవసరం అన్నవిషయాన్ని గ్రహించలేకపోయాం. వాడు ఎలా ఉండాలో ఏం కావాలో మేము ఊహిచుకున్నాం కానీ వాడి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మేం చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. అంటూ విలపించింది సీత. జరిగిపోయిన తర్వాత బాధపడి ఏం లాభం.అని మనసులో అనుకుంటూ నేను ఎక్కాల్సిన రైలు రావడంతో ఆ వైపుగా కదిలాను...

మరిన్ని కథలు