Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscopemay  31st to june 6th

ఈ సంచికలో >> శీర్షికలు >>

అక్షర నీరాజనం - రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

akshara neerajanam
శేషేంద్ర స్మృతిలో......
 
ధరిత్రిని హలందున్నితే 
అపుడు అవుతుంది
అది ఒక దేశం
ధరిత్రిని కలం దున్నితే
అపుడు అవుతుంది
ధరిత్రి ఒక ఇతిహాసం
 
ఇది  శేషేంద్ర ఉవాచ.
నిజం దేశానికి నిలువెత్తు  వెన్నెముకను నిర్మించే పండుగలో కర్షకులదీ, కవులదే ముఖ్యమైన పాత్ర. దేశ ప్రజలకు ఆహారం అందాలన్నా మంచి మార్పుకై ఓ ఉద్యమం రావాలన్నా కావలసిన వారు వారే ఇది చరిత్ర నిరూపించిన సత్యం!
శేషేంద్ర తానో కవన హలమై. కవితాకలమై కవితాదేశమై తెలుగు కవితను నోబుల్ బహుమతి గడప దాకా చేర్చిన కీర్తిని సొంతం చేసుకున్నారు
తన  కవితా చెంగల్వల తటిల్లతను ధరిత్రీ తలమునందు సహృదయ మానసములకానంద జిలుగు రవ్వలద్ది, జ్ఞాన రసాన్నందించిన యుగకవి (జ్ఝానమే కదా  మనిషి ఎదుగుదలకు  మూలం). 
వ్యాకీర్ణ వాసంతికా 
ద్యుతిగా కవితా 
జ్వలన జ్వాలగా 
రసజ్ఞులలోని పంచభూతాల నుంచి ప్రాణాలకు స్పందన, యోచన, చేతన నందించిన మేటి కవి.. చల్లని వేళ జాజుల పరిమళ మంటి సాహితీ పరిమళాన్ని పాఠక మనో లోకాలకు అద్దిన సౌగంధికా వనం.  రెల్లుపూల
సౌందర్యమంటి భావ సుమాలను పూయించిన మేలి కవన తోటమాలి శేషేంద్ర.
 
"శేషేన్ ! నీవు కవివి!
 సుత్తులతో కత్తులతో జీవితం శిల్పించే వాళ్ళని నిద్ర
లేపుతావు విప్లవానికి నీవు ఉదయ తారవు...." అంటూ తనను గురించి తానే వ్యక్తీకరించుకున్న వాడు శేషేంద్ర. నిజం ఎవరైనా సరే తమను గురించి తాము ఇంత నిజాయితీగా చెప్పుకుంటే ఎంత బాగుండు....
" నా పోయెం  అవమానము అశ్రువు
క్రోధము, గాయము, తుఫాను అనే పంచభూతములు తో చేసిన శిశువు". అని,
" నా పోయెం  ఒక లిల్లీ నీడ.  ఒక నదీ స్మృతి ఒక ఆందోళన లో మునిగిపోయిన దినం" అంటూ తన కవితావిర్భావానికి మూలమేమిటో చెప్పారు నిజమే కదా.
శ్లోకం ఆగతః శోకం...
 వాల్మీకి మాటదే కదా.. " నేను తుఫానులు కోసం. గాయాలు కోసం 
వెతుక్కుంటూ పోయే వాణ్ణి
ప్రజా శిఖరాలు చూస్తే
కరిగి ఒక పద్యాన్నయ్
కాగితం  మీదికి కారి పోతా  కన్నీటి వాక్యాన్నై జనంలోకి పారిపోతా"
అంటూ కవిగా తను ఎటుండాలో తెలుసు కుని తానో పదమై. ఓ పథమై ఈ దేశం మీద కురిసిన అద్భుత కవితా వర్షం..హర్షం!
ఆనాడు తన కవన హృదయ శబ్దంతో "శబ్దం నుండి శతాబ్దాల దాకా" విస్తరిస్తున్న వాడు శేషేంద్ర.
" సముద్రం ఒకరి కాళ్ళు దగ్గర కూర్చుని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనటం ఎరుగదు
పర్వతం ఎవడికి వంగి
సలాం చెయ్యదు". అన్న మాటల్లో స్వీయ
వ్యక్తిత్వ విలువను అత్మాభిమానాన్నిగాఢ భావ తరంగా  తెలిపారు. అంతే కాదు... 
"నేనంతా పిడికెడు మట్టే కావచ్చు కానీ కలమెత్తితే  
నాకు ఒక దేశపు జెండా కున్నంత పొగరుుంది"
...అంటూ తనను తాను వెలువరించుకోవటమే కాదు ఎవరైనా అలాగే ఉండాలని కూడా వారు సూచించారు.
' నా గొంతు జలపాతా నికి బెదిరి చెదిరి పోతారు కాలం మేకులకు వేలాడే కవులు" అంటూ తన విశ్వాసా న్ని నిర్మొహమోటంగా చెప్తూ....
నడిచే నా అడుగులు 
మబ్బుల్లో పరుగెత్తే పిడుగులు
దించితే నా చెయ్యి
వెయ్యి కిరణాలు వేలాడే సాయం సంధ్య"...అంటూ తన
"మాటల్ని ఈ దేశపు మట్టిలో చల్లి 
అన్ని దిక్కులా కత్తులు మొలవాలని  
నేను జ్వాలల్ని కొరడాలుగా 
ఘళిపిస్తున్న అగ్నిని"
అని పరిచయం చేసుకుంటూ జనానికి (చదువరులకి) దగ్గరయ్యారు.
కవితను ఒక ద్రాక్షగా, ఉత్ప్రేక్షగా చూపి 
కన్నీటితో గుండె పిండి కవితా మీద ఆరవేశాను" అన్న శేషేంద్ర  
"జీవితం వసంతమైనా గ్రీష్మమై నా ఏ తార ఏ రహస్యంచెబుతుందో" అనుకున్న శేషేంద్ర
" నా వాక్యం ఓ పిల్లనుగ్రోవి" అంటూ తన వాక్యాలతో లోకాన్నిసమ్మోహింప చేశారు.
ఒక్క పూవును చూస్తూ యుగాలు 
గడిపేయగలనన్న శేషేంద్ర .....
నేను పూలతో పోట్లాడుతాను
తుఫానులతో పోట్లాడుతాను
పోట్లాట నేను బ్రతక టానికి పీల్చే  ఊపిరి" 
అంటూ తన పోట్లాటెందుకో కూడా  చెప్పారు. 
 
కవి అంటే......
"మరణించే లోపుగా తన మాట చెప్పలేని
నిస్సహాయ మానవుడి గొంతు పేరే కవి....అంటూ కవిని నిర్వచించారు. మరి కవి అన్న వాడు తన కర్తవ్యమేదో గుర్తెరగాలి .... ఎరుగని వారినుద్దేశించేనేమో. మరి...
" నేనే మీ రస్తానై కలలు కుంటున్నాను
వడివడిగా నడిచే మీ
ముందడుగు కోసం
పదండి ముందుకు నేనే మీ జండానై
ఎగురుతాను" అంటూ మార్గనిర్దేశం చేశారు.
"నా కవిత్వం ఏ జెండాను ఎగురవేయదు..." అంటూ సంఘాన్ని పీడించే  ఏ పక్షానికి (కొంతమంది కవులలా ) కొమ్ము కాయనన్నారు.
మనుష్యుల మీద ఆ మనుష్యులుండే దేశం మీది ఎంత నమ్మకం ప్రేమ లేకపోతే....
 "నదులు కవులు భూ గోళపు రక్తనాళాలు
నదులు ప్రవహిస్తాయి కవితల్లా 
పశువుల కోసం పక్షులు కోసం మనుష్యుల కోసం
నుదులు కనే కలలు
ఫలిస్తయి పొలాల్లో
కవులు కనే కలలు
ఫలిస్తాయి మనుష్యులలో"." అంటూ ఎంత గొప్పగా కవికుండాల్సి న ఉదాత్త ఆశయాల గురించి చెప్పారు.
 
ఒక పువ్వునై దూకు తాను 
నీవు కన్నెత్తి చూడకపోతే
పద్యమనే పది అంతస్తుల మేడ ఎక్కి
భూమి మీదికి దూకుతాను....
అంటూ తన సాహితీ
సామర్థ్యాన్ని, జనం మధ్యే ఉండాలన్న తన కోరీకను వెలిబుచ్చారు కవి అన్నవాడు జనం కోసమేనంటూ..
" నేను ఘనీభవిస్తే 
ఒక  పాము రూపాత్మక దేహం
నేను ద్రవీభవిస్తే ఒక జ్ఝాపకాల ప్రవాహం"
అంటూ ఆత్మ పరిశీలనా శక్తితో తనను తాను నిర్వచించుకుని, మరెవరు అందలేని భావుకతను సొంతం చేసుకున్న శేషేంద్రకు కోవెల కట్టాలంటే..
చెట్టు నాటి కొమ్మ మీద ఒక కోకిల పెడితే చాలంట. ఇలా ఆయన గురించి ఎంతగా ఎన్నెన్ని చెప్పుకున్నా తనివి తీరదు ప్రతి మాటను కవిత్వీకరించిన శేషేంద్ర....
"మీ భావాలెప్పుడూ
ఎవ్వరి కాళ్ళు నడవని
దేశాలుగా ఉండాలి
మీ చేతన మానవ చరిత్రకు తెలిపిన 
ఏ హద్దులు తేలీని దేశ
ద్రిమ్మరిలా ఉండాలి
మీ నడకలుఅడవుల్లో నిర్భయంగా తిరిగే
సింహాల్లా ఉండాలి" ...
అంటూ గంభీర తపో 
నిష్ఠలా నవ యువ 
కవులకు దిశా నిర్దేశం చేశారు ఔను కదా.. మన అనుభవంతో కూడిన మాటచేత సదా మరొకరి ఉన్నతికుపయోగపడాలి కదా ఎందరు గమనిస్తారీ విషయిన్ని ఎందరు వింటారు...?
ఇంకా....
కోపము లేక గొప్పయనుకోక 
దురాశకు వొంగి పోక 
ఏ యాపద వచ్చిన ధన మదాంధుల భీతికి పారిపోక 
నీ లోపము లేక దీనజన లోకముపై దయబూని వెన్క సంతాపము లేని జీవన పథమ్ము వరించి తరించు మెంతయున్....... అనే కాక ....
పొండి ఉషస్సులై పొండి...అంటూ 
నూతన ఉషోదయాలకై తన ఆకాంక్షను
అభివ్యక్తీకరించి తెలుగు సాహితీ జగత్తున జన హృదయాల మహత్తుగ వెలుగొందే
ఈ యుగపు మహా కవికి అక్షర నీరాజనం.
మరిన్ని శీర్షికలు
ravvapulihora