Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> మూగ మనసులు

moogamanasulu

"సూర్యం ! " ఎవరో పిలిచి నట్టయింది. వెనక్కి తిరిగి చూసిన సూర్యానికి ఎవరూ కనిపించ లేదు. ఇదంతా తన భ్రమ అనుకున్నాడు.  సాయంకాలం సంధ్యా సమయం. పగలంతా పరుగులు పెట్టి అలసిపోయిన సూర్యుడు అలసటతో ముఖాన్ని ఎర్రగా మార్చుకుని సముద్ర గర్భంలో విశ్రాంతికి బయలు దేరాడు.  పక్షులు వాటి స్తావరాలకు చేరుకుంటున్నాయి. మత్స్యకారులు రోజంతా పట్టిన చేపలు నిండిన పడవలతో తీరానికి చేరుకుంటున్నారు.

చల్లని సముద్రపు అలలు పోటీ పడి ఒడ్డుకి పరుగులు పెడుతున్నాయి. సముద్రం ఒడ్డున ఇసుక దిబ్బ మీద కూర్చున్న సూర్యం ఈ దృశ్యాల్ని చూస్తూ గతంలో జరిగిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.

*                     *                  *

తనూ, కరణం గారమ్మాయి ఇందిర ఇదే సముద్రపు ఇసుక తిన్నెల మీద కట్టుకున్న గుజ్జన గుళ్లు , పిచిక గూళ్లూ, ఇసుకలో గీసుకున్న బొమ్మలు గుర్తుకు వస్తున్నాయి. చిన్న గవ్వలు ,శంకాలు ఏరి ఇస్తే వాటిని భద్రంగా తను కట్టుకున్న కుచ్చు లంగాలో మూట కట్టుకునేది. మా నాయన నర్సింహ కరణం గారింట్లోపాలికాపు పని చేస్తూంటాడు. ఇంట్లో పనులు , పొలం పనులు , గొడ్లను శుభ్రం చెయ్యడంతో రోజంతా గడిచి పోతుంది. అప్పుడప్పుడు నాయనతో కలసి కరణం గారింటికెల్తే " ఏరా,సూర్యం! ఎలాగున్నావు? రోజూ బడికి పోతున్నావా?" అడిగి బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. అరుగు మీద కూర్చున్న  కరణం గారమ్మాయి ఇందిర నేను తీసుకెళ్లిన కాల్చిన తేగలు సంతోషంగా తీసుకుని పల్లీ కాయలు తెమ్మనేది. వాళ్లింట్లో ఉండే జున్ను  అరటి ఆకులో పెట్టి తినమని ఇచ్చేది.

కరణం గారి భార్యను అమ్మ గారని పిలుస్తూంటాను.ఆవిడ కూడా నన్ను చూసి" ఏరా , సూరీ! మీ నాయనమ్మ ఆరోగ్యం బాగుంటోందా" అని పలకరించి వారి ఇంట్లోని ఆవకాయను తెచ్చి ఇచ్చేవారు.ఇందిర ఏకైక కూతురైనందున ముద్దుగా చూసుకుంటూ నాతో ఊరి బడిలో చదువుతూండటం వల్ల పెద్దవాళ్లేమీ అబ్యంతరం పెట్టేవారు కాదు మా చనువుకి. నాకు అమ్మ  చిన్న తనంలో చనిపోవడం వల్ల నాయనమ్మ చేరదీసి పెంచిన సంగతి కరణం గారింట్లో తెలుసు కాబట్టి నన్ను పాలేరు కొడుకులా చూడలేదు. పండగలప్పుడు ఇంటికి పిలిచి కొత్త బట్టలు , పిండి వంటలు పెట్టేవారు. నాకు చదువు బిక్ష పెట్టింది  పరంధామయ్య మాస్టారు.చదువు పై నాకుండే శ్రద్ద తెలివితేటలు చూసి నాకు క్లాసు పుస్తకాలు ఇతర వస్తువులు సమకూర్చేవారు.రాత్రిళ్లు వారింటి వద్ద ట్యూషన్ చెప్పి స్కూలులో ప్రథమశ్రేణిలో పాసయేలా ప్రోత్సహించారు. ఇందిర కూడా నా క్లాసే  అయినందున చదువు లో తనకి తెలయని విషయాలు నన్నడిగి తెలుసుకునేది.

మాది సముద్ర తీర పల్లె అయినందున హైస్కూలు చదవుకి పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్లవలసి వచ్ఛేది. పరంధామయ్య మాస్టారే నన్ను ప్రోత్సహించి నా హైస్కూలు చదువు కి ఆర్థిక సాయం చేసేవారు. వారికి సంతానం లేనందున  నన్ను వారి బిడ్డలా ఆదరించేవారు. నాకు చదవుతో పాటు మంచి నడవిక సమయపాలన నేర్పారు.

ఇందిర కూడా నాతో పాటు హైస్కూలుకి నడిచి వచ్చేది. చిన్న తనం నుంచి  ఒకచోట పుట్టి పెరిగి నందున వయసుతో పాటు తెలియని అనుభూతి ఏర్పడింది. హైస్కూలు పదవ తరగతిలో నేను ప్రథమ శ్రేణిలో  పాసవడానికి పరంధామయ్య మాస్టారి కృషి ఎంతో ఉంది.  నేను హైస్కూలు చదువుతున్నప్పుడు  మా నాయనమ్మ చనిపోవడంతో మాస్టారి భార్య నన్ను చేరదీసి వారింటి వద్దే ఆశ్రయం కల్పించారు. పాలికాపు బిడ్డననే ఆలోచన లేకుండా నన్ను ఆదరించారు.  ఇందిర కూడా లంచ్ లో నా కోసం  ప్రత్యేక వంటకాలు తెచ్చి పెట్టేది. ఆర్థిక స్థోమత  లేనందున  మాస్టారు నన్ను టీచర్ ట్రైనింగుకి పంపి తనలాగే నన్నూ  ఉపాధ్యాయుడిగా తీర్చి దిద్దారు.

హైస్కూలు చదువు అవగానే ఇందిరను ఉన్నత చదువుల కోసం కరణం గారు పట్నం పంపి హాస్టల్లో ఉంచి కాలేజీలో ప్రవేశ పెట్టారు. ఇంటర్ పూర్తయిన తర్వాత యంసెట్ ఎంట్రన్సు ఎగ్జామ్ రాసి ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్టువేర్ ఇంజినీరైంది.

నాకు టీచర్ ట్రైనింగు పూర్తవగానే  మా ఊరి పక్క గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా  ఉధ్యోగ అవకాశం  వచ్చింది. శలవు దినాల్లో ఇందిర ఇంటికి వచ్చినప్పుడు చదువులు ,ముచ్చట్లు మాట్లాడుకునే వాళ్లం. చదువుల కారణంగా మేము దూరమైనా మా అనుబంధం అలాగే కొనసాగేది.మా ఊరి చివరనున్న సముద్రతీర ఇసుక తిన్నెల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. ఇందిరకు చెన్నైలో సాఫ్టువేర్ ఇంజినీరుగా జాబు వచ్చింది. సంతోషంతో నాకు స్వీట్లు పంచింది. తను చెన్నై వెళ్లి జాబులో జాయినయి హాస్టల్లో ఉంటోంది. ఈ మధ్య కాలంలో ఆస్తమా జబ్బు ముదిరి  నాయన కాలం చేసారు.  ఆ వార్త తెలిసి ఇందిర చెన్నై నుంచి ఊరికి వచ్చి నన్ను పరామర్సించి ధైర్యం చెప్పి వెళ్లింది.ఫోన్ ద్వారా నా క్షేమ సమాచారం తెలుసుకునేది.  పండగ లపుడు  ఊళ్లో కొచ్చినపుడు రెడీమేడ్ బట్టలు , గిఫ్టులు కొని తెచ్చేది.

తను వేల రూపాయలు సంపాదించే సాఫ్టు వేర్ ఇంజినీరైనా మునుపటిలా చనువు ప్రదర్సించినా నా తాహతు తెలుసుకుని నా పరిధిలో ఉండేవాడిని. నాన్న చనిపోయి ఒంటరిగా ఉన్న నాకు ఇందిర స్నేహం ఎంతో మనోధైర్యాన్నిచ్చేది.

ఇలా ఆనందంగా  సాగిపోతున్న జీవితంలో నాకొక షాకింగ్ వార్త తెలిసి తట్టుకోలేకపోయాను. చెన్నై నుంచి మహాబలిపురం స్నేహితులతో విహారయాత్రకు వెల్తున్న ఇందిర ఉన్న లగ్జరీ బస్సుకి యాక్సిడెంటు జరిగి మరణించినట్లు,శవాన్ని ఊళ్లోకి అంబులెన్సులో తీసుకువస్తున్నట్టు తెల్సింది. కరణం గారింటి వద్ద శోకాలు వినలేక పోయాను. కడసారి ఇందిర పార్థివ శరీరాన్ని చూడగానే దుఖః కట్టలు తెచ్చుకుంది.ఆ ప్రశాంత వదనంలో నన్ను మన్నించు ' సూర్యం' అని వేడుకున్నట్టు ఓదారుస్తున్నట్లనిపించింది.

నా జీవననౌక నడి సముద్రంలో చుక్కాని లేని నావలాగైంది.  అప్పుడే ఇందిర చనిపోయి సంవత్సరం గడిచిపోయింది. ఆమె స్నేహ  మథుర స్మృతులు నన్ను వెంటాడుతున్నాయి. గత స్మృతుల నుంచి నిట్టూర్పుతో వాస్తవ స్థితి కొచ్చాడు సూర్యం.

మరిన్ని కథలు
come to hall live with all