Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> పక్కిల్లు

pakkillu

“మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్ భాస్కర్.. మేడ్ ఇన్ హెవెన్ అని ఎవడన్నాడో తెలియదు కానీ వాడికి ఖచ్చితంగా పెళ్లై ఉండదు..” కాస్త కోపంగా, దిగులుగా చెప్పాడు శ్రీకాంత్ అప్పుడే వచ్చిన కాఫీ నిరాసక్తంగా సిప్ చేస్తూ.

“అదేంట్రా అంత మాటన్నావ్? అయినా నువ్వు చెప్పింది పచ్చి నిజం.. పెళ్ళైన ప్రతీ వాడూ కనీసం ఒక్కసారైనా నరకంలో ఉన్నట్టు ఫీలవుతాడు. అయినా ఇదంతా అన్ని చోట్లా ఉన్నదే. మీ ఆవిడతో ఏదైనా గొడవలా?” అడిగాడు భాస్కర్ దిగులుగా ఉన్న శ్రీకాంత్ ను చూసి. ఇద్దరూ ఆఫీసులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు కాఫీ తాగుతూ. ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు.
“మా ఆవిడతో గొడవలు కొత్తేమీ కాదురా. గత పదిహేనేళ్ళుగా ఇద్దరికీ బాగా అలవాటే. అప్పుడప్పుడూ బాగానే ఉంటూ ఉన్నంతలో ఏదో నెట్టుకొచ్చేవాళ్ళం. అయితే ఈ మధ్య ఓ కొత్త సమస్య వచ్చి పడింది. దాని వల్ల రోజూ గొడవలే. మన:శాంతి లేకుండా పోయింది పూర్తిగా. ఏం చేయాలో అర్ధమై చావట్లేదు..”

“ఏంట్రా అంత పెద్ద సమస్య?” ఆసక్తిగా అడిగాడు భాస్కర్, సమస్య ఏమై ఉంటుందా అని ఊహించడానికి ప్రయత్నిస్తూ.

“ఆ సమస్య పేరు మా పక్కిల్లు.. కొత్తగా ఓ నికృష్టపు జంట మా పక్కింట్లో అద్దెకు దిగార్రా.. మొగుడిది మన వయసే నలభయ్ నలభై ఐదు మధ్య. మా ఆవిడ ప్రతీ విషయంలో వాళ్ళతో పోల్చుకొని చూసుకొని నన్ను గ్యాప్ లేకుండా సాధిస్తుంది..”

“అవునా? మీ పక్కిల్లు అసలే మరీ పక్కగా ఉంటుంది.. డబ్బున్న వాళ్ళా ఏమైనా? అదేనా ప్రాబ్లం?”

“అంత సీన్ లేదు. మన లాగే మిడిల్ క్లాస్ బతుకు వాళ్ళది కూడా. అయినా ఏ టీవీ, ఫ్రిజ్ లాంటి విషయాల్లో కంపేర్ చేస్తే, అప్పో, తప్పో చేసి తేల్చిపారేయొచ్చు. మా ఆవిడ కంపేర్ చేసేది అవేవీ కాదు..”

“మరింకేంటి?”

“వాళ్ళు ఈ వయసులో కూడా ఎంతో అన్యోన్యంగా, కొత్తగా పెళ్ళైన జంటలా ఉంటారు. అది చూసి మా ఆవిడ మేము అలా లేమన్న దిగులుతో ఏదో ఒక వంక పెట్టుకొని నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటుంది. రోజూ ఆఫీసు నించి ఇంటికి వెళ్ళగానే ఇదే గోల. పక్కింటాయన ఇలాట, అలాట అని నా ప్రాణాలు తీస్తుంది. వాడు మా ఆవిడ దృష్టిలో ఓ పెద్ద హీరో. భర్తకు సరైన నిర్వచనం. వాడు కూడా చుట్టుపక్కల మాలాంటి సగటు భార్యా భర్తలు ఉన్నారని కూడా గమనించడు. పెళ్ళాన్ని ఓ దేవతలా చూస్తాడు. వాడు వాడి వెధవ ప్రేమ. వాళ్ళావిడ కూడా మా ఆవిడతో స్నేహం చేసుకొని మరీ వాళ్ళ బంగారు కుటుంబం గురించి చెబుతుంది. ఏంటో ఈ వెధవ గోల..” కసిగా చెప్పాడు.

“ఓహ్ పెద్ద సమస్యేరా నీది. అయినా ఈ పక్కింటి వాళ్ళంతా ఇంతే. మన ఇళ్ళల్లో గొడవలకు సగం కారణం వాళ్ళే. అయినా పెళ్లై ఇన్నేళ్ళైనా అంత అన్యోన్యంగా ఎలా ఉంటున్నార్రా? విచిత్రంగా ఉంది. వాళ్ళావిడ అంత అందంగా ఉంటుందా?”

“నాకూ అదే అనుమానం వచ్చింది రా. పని గట్టుకు మరీ ఆవిడ ఎలా ఉంటుందో చూసాను. పెద్ద అందగత్తేమీ కాదు. వాళ్ళ అన్యోన్యతకు ఆవిడ అందం మటుకు కారణం కాదు. మొదట్లో వైజాగ్ లో ఉండేవాళ్ళుట. మొగుడు ఏదో కంపెనీలో లాయర్ గా పని చేస్తున్నాడు. ఈ మధ్యే ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు మా ప్రాణాలు తీయడానికి. వీడికి భార్యను సంతోష పెట్టే టెక్నిక్ ఏదో తెలుసు. లేకపోతే ఈ వయసులో కూడా ఇంత సంతోషంగా ఏ గొడవా లేకుండా కాపురం చేసే వాళ్ళని నేనెక్కడా చూళ్ళేదు..”             

“మరైతే ఏం చేద్దామని ఇప్పుడు?”

“అదే అర్ధంకావట్లేదు. ఇలాగే వదిలేస్తే త్వరలోనే మా ఆవిడకూ నాకూ ఇద్దరికీ పిచ్చెక్కి గుడ్డలు చించుకోవటం ఖాయం..”

“పోనీ ఓ పని చేయరా. మీ పక్కింటి వాడ్ని ఫాలో అయిపో. మీ ఆవిడ ఏ విషయంలో అయితే వాడ్ని మెచ్చుకుందో అదే పని నువ్వు చేసి చూపించు. అనవసరంగా ఆర్గ్యూ చేసి లాభం లేదు. ఆడవాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి గెలిచిన మగాడు ఇంత వరకూ పుట్టలేదని ఈ మధ్యే ఎక్కడో చదివాను..”

“అవును. మంచి ఐడియా. నేనూ అదే అనుకున్నాను. పక్కింటి వెధవను కాపీ చేసి చూస్తాను. ఏం జరుగుతుందో..”

టాపిక్ ఇక్కడితో ముగించి ఇద్దరూ ఆఫీసు పనిలో మునిగిపోయారు.

*******

మధ్యలో కాస్త టైం దొరగ్గానే మళ్ళీ ఇంట్లో గొడవల గురించి ఆలోచించాడు శ్రీకాంత్. పక్కింటి వాడి గురించి ఈ మధ్య భార్య చెప్పిందేంటి? వాడు ఆఫీసు పని మీద ఏదో ఊరు వెళితే అక్కడ నుంచి భార్యకు మంచి డ్రెస్ ఏదో పట్టుకొచ్చాడు ప్రే..మ..గా... తనూ ఎన్నో సార్లు బయట ఊళ్ళకు వెళ్ళాడు కానీ ఎప్పుడూ ఏమీ కొన్న పుణ్యాన పోలేదు. ఈసారి వాడు చేసిందే తను కూడా ఫాలో అవ్వాలి. ఏముంది అందులో పెద్ద గొప్ప విషయం? పనికిమాలిన వెధవ. పక్కింటాయన్ని కాసేపు తిట్టుకున్నాడు. చాలా రోజులుగా ఆఫీసు పని మీద ముంబై వెళ్ళాల్సిన పని పోస్ట్పోన్ చేస్తూ వచ్చాడు తీరిక లేక. ఇప్పడు భార్యకు డ్రెస్ కొనటానికైనా తీరిక చేసుకొని వెళ్ళాలి. డేట్స్ చూసుకొని, ముంబై ప్రయాణం పెట్టుకున్నాడు రెండ్రోజుల్లో. భార్య విషయంలో చేయాల్సిందేంటో నిర్ణయించుకున్నాక కాస్త రిలీఫ్ గా అనిపించింది.   

సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చాడు ఉత్సాహంగా. భార్యతో యుద్ధానికి చరమ గీతం పాడాలి త్వరలో. పక్కింటి వెధవ తన ముందు ఎందుకూ పనికిరాడని భార్య సిగ్గుతో ఒప్పుకోవాలి. ఈల వేస్తూ ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఈల సౌండ్ ఆగిపోయింది వెంటనే. నోట మాట రానట్టు నిలబడిపోయాడు ఒక్క క్షణం. పక్కింటావిడ హడావిడిగా ఇంట్లోంచి బయటకు వెళుతుంది తమ ఇంటి వైపు, ఫోన్లో వాళ్ళాయనతో ఏదో మాట్లాడుతూ. ఉత్సాహమంతా ఆవిరైంది. ఈ మహాతల్లి ఇంటికి వచ్చింది అంటే, ఈ పూటకు తన కొంప ముంచడానికి ఏదో చెప్పే ఉంటుంది.
“శ్రీదేవీ, కాఫీ పట్రా వేడిగా.. నీ చేత్తో చేసే కాఫీ నిజంగా అమృతం..” చెప్పాడు భార్యతో అసలు తన మూడ్ ఎలా ఉందో ముందు తెలుసుకోవాలి అనుకుంటూ.

“ఈ పొగడ్తలకేం తక్కువ లేదు. కాఫీ పొడి అయిపోయింది, సాయంత్రం వచ్చేటప్పుడు తెమ్మని చెప్పాను. నేనేది చేప్పినా మీకు గుర్తుండదు. నేనంటే మీకసలు లెక్కే లేదు..” కోపంగా చెప్పింది శ్రీదేవి గొడవకు శ్రీకారం చుడుతూ.

అనుకున్నదే అయిందని శ్రీకాంత్ కు అర్ధమైంది. గొడవ కాఫీ పొడికి సంబంధించింది కాదు. పక్కింటావిడ ఏదో చెప్పుంటుంది భర్త గురించి గొప్పగా. ఆ దిగులుతో శ్రీదేవి ఇలా మొదలు పెట్టింది. విసుగ్గా అనిపించింది. ఏంటీ పక్కింటి న్యూసెన్స్. 

“ఆ పక్కింటావిడని మనింటికి రానివ్వకసలు. ఊరికే మనింట్లో గొడవలు పెట్టడానికి కాకపోతే..”

“మధ్యలో ఆవిడేం చేసింది.. వాళ్ళాయన ఏదో సినిమా బుక్ చేసాడుట ముందుగా చెప్పకుండా, టైం అయిందని హడావిడిగా వెళ్ళిపోయింది. వాళ్ళు మనలా ఎప్పుడూ ఇంట్లోనే శాపగ్రస్తుల్లా పడుండరు..” అంటూ మొదలుపెట్టి భర్తతో పెద్ద తగువేసుకుంది.

కాసేపు ఓపిగ్గా ఆర్గ్యూ చేసాక, ఆడవాళ్ళతో ఆర్గ్యుమెంట్ గెలవటం అసాధ్యం అని భాస్కర్ ఉదయం చెప్పిన మాట గుర్తుకువచ్చింది. బదులు చెప్పటం వెంటనే ఆపేసి కోపంగా గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. కాసేపటి తరువాత కోపం తగ్గి శాంతంగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఏంటీ జీవితం ఇలా అయిపోయింది? ఇక లాభం లేదు. అర్జెంటుగా తను అనుకున్న పని చేయాల్సిందే. ఇలాగే పోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉంది. మన:శాంతి అన్నిటికంటే చాలా ముఖ్యం. ఏదో ఒకటి చేసి ముందు శ్రీదేవిని తృప్తి పరచాలి. 

మర్నాడు తను కూడా భార్యను సినిమాకి తీసుకు వెళ్ళాలి అనుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాల మీద బొత్తిగా ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. మూడు గంటల సేపు హాల్లో కూర్చోవాలంటే ఎంత విసుగ్గా ఉంటుంది. అయినా వేరే దారి లేదిప్పుడు. భార్యను దారిలోకి తెచ్చుకోవాలంటే ఇలాంటివన్నీ తప్పదు.

*******

“మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్ భాస్కర్.. మేడ్ ఇన్ హెవెన్ అని ఎవడన్నాడో తెలియదు కానీ వాడికి ఖచ్చితంగా పెళ్లై ఉండదు..”
“మళ్ళీ ఏమైందిరా? ఇంట్లో గొడవలు ఇంకా తగ్గలేదా? కొన్నాళ్లుగా బాగా బిజీ అయిపోయావ్... ఏం జరిగిందసలు?” అడిగాడు భాస్కర్. ఇద్దరూ ఆఫీసుకు దగ్గరలో ఉన్న ఓ రెస్టారెంట్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. మనసు బాలేదని శ్రీకాంత్ భాస్కర్ ను తీసుకొని వచ్చాడు అక్కడకి సాయంత్రం ఆఫీసు అయ్యాక.

“ఏంట్రా గొడవలు తగ్గేది? బాగా పెరిగినయ్. పక్కింటి వాడ్ని కాపీ చేద్దామన్న మన ఐడియా భయంకరంగా బెడిసి కొట్టింది..”

“అవునా? ఏం జరిగిందసలు? మొన్న ముంబై కూడా వెళ్ళినట్టున్నావ్..”

“మా ఆవిడ చెప్పినవన్నీ గుర్తుకు తెచ్చుకొని పక్కింటి చెత్త వెధవని ఫాలో అయ్యాను. ముందు సినిమాతో మొదలు పెట్టాను. ఓ సినిమా అనుకొని టికెట్స్ బుక్ చేసి శ్రీదేవికి చెప్పాను సాయంత్రం రెడీగా ఉండమని. సరిగ్గా ఇంటికి వెళ్ళే టైంకి మన బాస్ గాడు ఏదో అర్జెంట్ పని అని ఆఫీసులో కూర్చోబెట్టేసాడు. ఇంటి నుంచి వరుసగా ఫోన్లు త్వరగా రమ్మని. చివరకి టెన్షన్ పడుతూ, ఏదో రకంగా కాస్త ఆలస్యంగా ఇంటికి వెళ్ళి, అక్కడ నుంచి సినిమాకి వెళ్ళాం హడావిడిగా..”

“మొత్తానికి వెళ్ళారు కదా. ఇంకేంటి ప్రాబ్లం?”

“ఏం వెళ్ళటమో ఏంటో. సినిమా పరమ చెత్తగా ఉంది. పరమ బోరు. అసలు అలాంటి సినిమాలు ఎందుకు తీస్తారో అర్ధం కాదు. అలవాటు లేకపోవటం వల్ల ముందు వెనకా చూడకుండా ఆ సినిమాకు బుక్ చేసాను..”

“అయినా ఇందులో నీ తప్పేముంది? చాలా సినిమాలు చెత్తగానే ఉంటాయి..”

“అది కరెక్టే.. ఆఫీసు పని వల్ల ఆ పూట లేటుగా వెళ్ళటం, చాలా రోజుల తరువాత వెళ్ళిన సినిమా చెత్తగా ఉండటంతో మూడ్ అంతా పాడై, పెద్ద గొడవ ఇంటికి వెళ్ళగానే. నేనేదో మొక్కుబడిగా ముందు వెనకా ఆలోచించకుండా ఆ సినిమాకు బుక్ చేసాననీ, ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా అలా చేసేవాడ్ని కాదనీ, అదే పక్కింటాయన అయితే అన్నీ చూసుకొని మంచి సినిమా అయితేనే తీసుకు వెళ్తాడనీ మొదలు పెట్టింది. నాకూ ఒళ్ళు మండి నోటికొచ్చింది వాగాను. ఇంకేముందీ పెద్ద గొడవ..”

“అరె.. బాడ్ లక్ రా నీది. నీ ముంబై ట్రిప్ ఏమైంది? ముందు అది చెప్పు. మీ ఆవిడకు గిఫ్ట్ తెచ్చావా ఏమైనా?”

“తెచ్చాను రా. ముంబైలో ఆఫీసు పని అవగానే, రకరకాల షాపులు తిరిగి రెండు మాంచి డ్రెస్ లు సెలెక్ట్ చేసి కొన్నాను. సినిమా ఏదో మొక్కుబడిగా బుక్ చేసానని గొడవ అయిందని ఈ సారి చాలా కేర్ ఫుల్ గా మా ఆవిడ రంగుకు బాగా నప్పేలా చూసుకొని మరీ కొన్నాను. మంచి గిఫ్ట్ పాక్ చేయించి ఇంటికి వెళ్ళగానే మా ఆవిడను సర్ప్రైజ్ చేసాను గిఫ్ట్ ప్యాకెట్ చేతిలో పెట్టి. ఈ దెబ్బతో మా ఆవిడ ఇంప్రెస్ అయి తీరుతుంది అనుకున్నాను..”

“అంతా అనుకున్నట్టే జరిగిందా అయితే?”

“ఏంట్రా జరిగేది నా మొహం. కొన్న డ్రెస్ లు రెండూ సరిగ్గా ఫిట్ అవలేదు. చెండాలంగా ఉన్నాయి వేసుకొని చూస్తే ఫిట్టింగ్ సరిగ్గా లేక. రెండూ పనికి రాకుండా పోయినయ్. ఇన్నేళ్ళైనా కనీసం తన సైజు కూడా నాకు సరిగ్గా తెలీదని పెద్ద గొడవ చేసింది మా ఆవిడ.. అసలు ముంబై నుంచి ఏమీ తేకపోయినా ఆ పూట ప్రశాంతంగా ఉండేదనిపించింది.. ”

“ఏంట్రా ఇది. నీ టైం మరీ ఇంత దారుణంగా ఉంది..”

“అవున్రా ఇది మాత్రమే కాదు. ఇంకా చాలా జరిగినయ్. ముంబై ప్లాన్ కూడా ఫ్లాప్ అయిన తరువాత, పట్టు వదలని బేతాళుడిలా మళ్ళీ పక్కింటి వాడ్ని కాపీ కొట్టబోయాను. వాడేదో అప్పుడప్పుడూ పెళ్ళానికి విశ్రాంతి ఇవ్వటానికి ఇంట్లో వంట కూడా చేస్తాడని తెలిసింది. ‘ఇంకా నయం.. అంట్లు తోమాడు కాదు..’ అనుకొని, పోయిన ఆదివారం నేనూ ఇంట్లో వంట చేసాను చాలా కష్టపడి. తాజా కూరగాయలు బేరమాడకుండా చక్కగా కొనుక్కొని వచ్చి, మసాలా బాగా దట్టించి నాకు చేతనైనంతలో వంట చేసాను. దాదాపు గంటకు పైగా వంటింట్లో గడిపాను బిజీగా..”

“ఆహా. మంచి పని చేసావ్. ఈసారైనా మీ ఆవిడ సంతోషించిందా?”

“లేదు రా. మా ఆవిడ, అబ్బాయి చాలా ఆకలి మీద ఉన్నారు అప్పటికే. వంట చేస్తున్నంత సేపూ బాసు గాడు ఒకటే ఫోన్లు...ఓ చేత్తో ఫోను, మరో చేత్తో గరిట తిప్పుతూ వంట చేసాను. అందుకు తగ్గట్టే వంట ఘోరంగా తగలబడ్డది.. ఉప్పూ, కారం రెండూ వీధి కుక్కలు కూడా తినలేనంతగా ఎక్కువైనయి ప్రతీ దాంట్లో.. మా ఆవిడ ఒకటే తిట్లు, మూసుకొని కూర్చోకుండా వంటిల్లంతా నాశనం చేసి దిక్కుమాలిన వంట చేసాననీ, ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా ఇలా జరిగేది కాదనీ.. చివరకు బయటకు వెళ్ళి భోజనం కొనుక్కొని రావాల్సి వచ్చింది ఆ పూటకి. తినటం పూర్తయ్యే సరికి సాయంత్రం నాలుగు..”

“ఛ. ఏది చేసినా ఫెయిల్యూర్ అన్నమాట..” మొహం సీరియస్ గా పెట్టి చెప్పాడు భాస్కర్ జరిగింది ఊహించుకుంటూ. ఓ పక్క స్నేహితుడి పాట్లు వింటే నవ్వొస్తుంది.

“అవున్రా అంతా బెడిసి కొట్టింది.. పులిని చూసి కుక్క వాతలు పెట్టుకున్నట్టైంది..”

“కుక్క కాదురా నక్క.. ఇంతకీ నిన్ను ఇన్ని తిప్పలు పెట్టిన మీ పక్కింటి పులి ఎవరో చూపించోసారి వాట్స్ అప్ లో ఫోటో ఏదైనా ఉంటే..”
ఫోటో చూపించాడు శ్రీకాంత్ “వీడే ఆ చెత్త వెధవ..”. ఆసక్తిగా చూసాడు భాస్కర్. చూస్తూనే అన్నాడు.

“ఎక్కడనుంచి వచ్చాడన్నావ్? వైజాగ్ కదూ?”

“అవున్రా. నీకమైనా పరిచయం ఉందా?”

“పరిచయం లేదు కానీ, లాస్ట్ ఇయర్ ఎక్కడో పెళ్ళిలో చూసానితన్ని వైజాగ్ లో. మా ఇద్దరికీ ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నాడులే.”

“సర్లేరా. వాడిగురించి ఇప్పుడెందుకు. నా గురించి చెప్పు ముందు. ఏం చేయాలో తోచట్లేదు..”

“పర్లేదు లేరా. మరీ మూడ్ పాడు చేసుకోవాకు. ఇలాంటి వన్నీ మామూలే..” ఓదార్పుగా చెప్పాడు భాస్కర్.

సడన్ గా ఏదో ఆలోచన వచ్చిన వాడిలా ఆలోచనలో పడ్డాడు శ్రీకాంత్. ఓ సారి మొదటినుంచీ జరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. పక్కింట్లోకి కొత్తగా ఎవరో రావటం, వాళ్ళ జీవన విధానం  చూసి శ్రీదేవి దిగులు పడటం, తను పక్కింటాయన్ని కాపీ కొట్టి భంగపడటం, అన్నీ వరుసగా తలచుకున్నాడు. ఎక్కడో ఏదో లోపం ఉందని తోచింది. అసలు పక్కింటాయన్ని కాసేపు పక్కనబెడితే, తను భార్యతో నిజంగా సంతోషంగా ఉన్నాడా? అసలు శ్రీదేవి తన వల్ల సంతోషంగా ఉందా? అంతా ఇలాగే ఉంటారా? భార్యను ఆర్టిఫీషియల్ గా తృప్తి పరచడానికి పక్కింటి వాడ్ని కాపీ కొట్టబోయాడు. అంతే తప్ప నిజంగా తనకి అలా చేయటం అసలు ఇష్టమేనా? పైగా ఫెయిల్ అయిన ప్రతీ సారీ తన తప్పు నిజంగా లేదు. సినిమా బాలేకపోతే తను మటుకు ఏం చేయగలడు? డ్రెస్ సరిగ్గా ఫిట్ అవక పోవటం, వంట సరిగ్గా రాకపోవటం అంత పెద్ద విషయాలా మరీ? ఈ మాత్రం ఆలోచన శ్రీదేవికి నిజంగా లేదా? ఆలోచన లేక కాదు. తనంటే అప్పటికే ఉన్న విసుగు వల్ల ఏ మాత్రం ముందు వెనకా ఆలోచించకుండా గొడవ పెట్టుకుంది. దీనర్ధం ఏంటి? తనంటే విసుగు, చిరాకు మొదటి నుంచీ ఉన్నాయి. వీటికీ పక్కింటికీ ఏ సంబంధం లేదు. వాళ్ళు పక్కింట్లోకి రాక ముందే, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు వచ్చాక, తన మీద ఉన్న విసుగు కాస్త ఎక్కువగా బయట పడిందే తప్ప, జరిగిన దానికి పక్కిల్లు మాత్రమే కారణం కాదు. అసలు భార్యను సంతోషపెట్టడానికి ఇంట్లో వంట చేయటం, అంట్లు తోమడం లాంటివి నిజంగా అవసరమా? ఇలాంటి వాటి వల్లే పక్కింటి వాళ్ళు చక్కగా ఉన్నారా లేక ఇంకేదైనా కిటుకు ఉందా? అసలు భార్య భర్త సుఖంగా, సంతోషంగా ఉండటానికి ముఖ్యంగా కావలసిందేంటి?   

“ఏంట్రా ఆలోచిస్తున్నావ్?” దీర్ఘంగా ఆలోచిస్తున్న శ్రీకాంత్ ను చూసి అడిగాడు.

“ఇప్పుడు ఏం చేయాలో నాకు క్లియర్ గా అర్ధమైంది..” బిల్ పే చేసి కూర్చున్న చోటు నుంచి లేస్తూ అన్నాడు శ్రీకాంత్.

“ఏంట్రా అది? ఈ సారి ఇంట్లో బట్టలు గానీ ఉతుకుతావా?” నవ్వుతూ అడిగాడు భాస్కర్.

శ్రీకాంత్ కూడా నవ్వి అన్నాడు.  “ఇలాంటివి చేయటం అనవసరం రా..”

“మరింకేం చేస్తావ్?”

“ఇప్పుడే చెప్పను.. సస్పెన్స్” చిన్నగా నవ్వి చెప్పాడు టాపిక్ అంతటితో ముగిస్తూ.

********      

“సర్ మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు ఫ్రీ గా ఉన్నారా?” పక్కింటాయన్ని అడిగాడు శ్రీకాంత్ అదే రోజు సాయంత్రం పక్కింటికి వెళ్ళి. భాస్కర్ ని కలిసాక నేరుగా పక్కింటికే వెళ్ళి తలుపు తట్టాడు. తన సమస్యకు పక్కింటాయన మాత్రమే సరైన జవాబు చెప్పగలడనిపించింది.  
ఆ తరువాత ఇద్దరూ ఇంటికి దగ్గరలో ఉన్న పార్కులో బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకున్నారు.

మొదటి నుంచీ జరిగినదంతా మొహమాటం లేకుండా, సూటిగా చెప్పాడు శ్రీకాంత్. అంతకు ముందు భాస్కర్ తో రెస్టారెంట్ లో కూర్చొని ఉండగా తనకు వచ్చిన ఆలోచనలు, అనుమానాలు కూడా వివరంగా చెప్పాడు. తనక్కూడా ఇప్పుడు అసలు విషయమేంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఆర్టిఫీషియల్ గా కాకుండా నిజంగా భార్యతో సంతోషంగా ఉండాలంటే తను చేయాల్సిందేంటో తెలుసుకోవాలి.
శ్రీకాంత్ చెప్పింది ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా విన్నాడు పక్కింటాయన. తరువాత చిన్నగా నవ్వి చెప్పాడు “మీరు ఆలోచించిన విధానం కరెక్టే. భార్యను సంతోషంగా ఉంచే విషయం సినిమాలు, వంట చేయటం లాంటివి కాదు..”

“మరింకేంటి సర్..” ఉత్సాహంగా, ఆసక్తిగా అడిగాడు శ్రీకాంత్.

“ఆ విషయం పేరు.. కమ్యూనికేషన్”

నిశ్శబ్దంగా వింటున్నాడు శ్రీకాంత్.

“కమ్యూనికేషన్ అనేది భార్య భర్తల మధ్య చాలా అవసరం. ప్రేమ, నిజాయితీ, నమ్మకం ఈ మూడూ చాలా మంది జీవితాల్లో ఉంటాయి. అయితే, వీటిని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయటమే చాలా మందికి సరిగ్గా తెలీదు. ఇక్కడే అంతా తప్పు చేస్తారు. మీకు మీ ఆవిడంటే ఎంతో ప్రేమ. అయితే అలా ప్రేమ ఉంటే మాత్రమే సరిపోదు. ఆ ప్రేమని సరిగ్గా మాటల ద్వారా, చేతల ద్వారా చెప్పగలగాలి.

ఉదాహరణకి, మీ ఆవిడ మీకు ఇష్టమైన వంటకం ఏదో చేసింది, లేదా మీరు ఊరు వెళ్తున్నారని, మీకు కావలసిన బట్టలు మొదలైనవి టైం కి రెడీ చేసి పెట్టింది. ఇలాంటి వాటికి మీరు మనసులో సంతోషిస్తే సరిపోదు. మీకు సంతోషం కలిగిందన్న విషయం సూటిగా చెప్పాలి. ఆవిడంటే మీకెంత ఇష్టమో కూడా చక్కగా చెప్పాలి. అలాగే మీకు నచ్చని విషయం కూడా చక్కగా, నిదానంగా, పాజిటివ్ గా చెప్పాలి. ఎందుకు మీకు నచ్చలేదో, ఎలా చేస్తే మీకు నచ్చుతుందో సరిగ్గా, విమర్శించకుండా చెప్పాలి.

మాటలతో పాటు మన చేతలు, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకి మీ ఆవిడ మీతో ఏదో చెబుతుంది. ఆ టైం లో, పేపర్ చదువుతూనో, టీవీ చూస్తూనో లేక ఏదో పని చేస్తూ పరధ్యానంగా ఉండటం చాలా తప్పు. మనం శ్రద్ధగా, అవతలి వారి వైపు చూస్తూ చక్కగా వారు చెప్పేది వినాలి. మన బాడీ లాంగ్వేజ్ వల్ల మనం శ్రద్ధగా వింటున్నామన్న విషయం చక్కగా తెలియాలి.

నా లెక్కలో సరైన కమ్యూనికేషన్ అనేది భార్య భర్తలని సంతోషంగా ఉంచే పెద్ద సక్సెస్ సీక్రెట్. అప్పుడప్పుడూ వంట చేయటం, ఊరెళితే ఏదైనా గిఫ్ట్ కొనటం లాంటివి కూడా మన ప్రేమని కమ్యూనికేట్ చేయటమే.. ఈ విషయం తెలిసి ఇలాంటివి చేస్తే, మన సంతోషానికి ఏ ఢోకా ఉండదు..”

ఆలోచనలో పడ్డాడు శ్రీకాంత్. కాసేపటి తరువాత చెప్పాడు నిజాయితీగా.

“చాలా ధాంక్స్ సర్. ఇన్నేళ్ళుగా నేను చేసిన తప్పేంటో తెలిసింది. మీ వల్ల చాలా గొప్ప విషయం తెలుసుకున్నాను. మిమ్మల్ని ఎలా కాపీ కొట్టాలో ఇప్పుడు బాగా అర్ధమైంది”

********      

“మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ భాస్కర్..”

“సూపర్ రా శ్రీకాంత్. మొత్తానికి భార్యతో ఇప్పుడు నీ లైఫ్ చక్కగా ఉందన్న మాట..”

“అవున్రా మా పక్కింటాయన చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేను. ఎంత ఈజీగా భార్యతో సంతోషంగా ఉండొచ్చో చాలా తేలిగ్గా చెప్పాడు..”
“పక్కింటాయన అంటే గుర్తుకొచ్చింది. నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ మధ్యే తెలిసింది. ఊరెళ్ళడం వల్ల ముందే చెప్పటం కుదరలేదు. తరువాత పన్లో పడి మర్చిపోయాను. వింటే షాక్ అవుతావ్..”

“ఏంట్రా అది?” ఆసక్తిగా అడిగాడు శ్రీకాంత్.

“మీ పక్కింటాయన్ది రెండవ పెళ్ళిట..”

“అవునా??”

“అవున్రా మొదటి భార్యతో రోజూ గొడవలేట. ఇతగాడ్ని భరించలేక ఆవిడ ఇంకెవర్నో చూసుకుందిట. గురుడు వైజాగ్ వదేలేసింది అందుకే అనుకుంట. భార్య మీద అతి ప్రేమ ఎందుకో ఇప్పటికైనా అర్ధమైందా? ఈ విషయం మీ ఆవిడకు చెబితే సరి ఇంకోసారి మీ పక్కింటాయన పేరెత్తకుండా..” తేలిగ్గా చెప్పాడు భాస్కర్ టాపిక్ ముగించి ఏదో పని మీద అక్కడ నుంచి వెళ్తూ.

నిజంగానే షాక్ తగిలింది శ్రీకాంత్ కి. వెంటనే ఫోన్ తీసుకొని భార్యకు చేసాడు. ఈ విషయం అర్జెంటుగా చెప్పాలి. ఎక్కడో ఏదో తెలియని ఉత్సాహం. ఫోన్ ఎత్త లేదు శ్రీదేవి. "ఛ. కరెక్ట్ టైం కి ఫోన్ ఎత్తదు..” కాస్త విసుగ్గా అనుకున్నాడు ఫోన్ పక్కన పడేస్తూ. అంతలోనే ఏదో ఆలోచన. మౌనంగా ఉండిపోయాడు కాసేపు. పక్కింటాయన ఎంత మేలు చేసాడు తనకు. ఆయన గురించి చెడుగా అనుకోవటం తప్పు కాదా? అతను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే తనకేంటి? ఏ పరిస్థితుల్లో అలా జరిగిందో ఏంటో అవన్నీ ఆయన పర్సనల్ విషయాలు. తనకెందుకు? ఇప్పుడు ఈ విషయం భార్యకు తెలిస్తే ఉన్న పళంగా ఆయన గురించి నెగెటివ్ గా అనుకునే ఛాన్స్ ఉంది. పైగా చుట్టుపక్కల వాళ్ళకి కూడా విషయం పాకిపోయే ప్రమాదం ఉంది. అలా జరగడం కరెక్ట్ కాదు. ఇలా కాసేపు ఆలోచించి భార్యకు ఈ విషయం ఎప్పటికీ చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆయన తనకు చేసిన మేలుతో పోల్చుకుంటే తన ఈ నిర్ణయం చాలా చిన్న విషయం. అలాగే ఈ విషయం ముందుగానే తెలిసుంటే  కధ ఇంకోలా ఉండేదనీ, అలా జరక్కపోవటం తన అదృష్టమని కూడా అనుకున్నాడు శ్రీకాంత్ నిజాయితీగా.

మరిన్ని కథలు
amtaraatma