Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

యోగాతో జీవితం సఫలీకృతం.!

Success in life with yoga.!

యోగా అనేది కేవలం ఆరోగ్య సూత్రంగానే భావిస్తున్నారిప్పుడు. అంతా కల్తీ.. పీల్చే గాలి కల్తీ, తాగే నీరు కల్తీ, తినే ఆహారం కల్తీ.. ఈ కల్తీ ప్రపంచంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవడం వల్ల కాని పనవుతోంది. అందుకే ప్రపంచ దేశాలు యోగాపై దృష్టి పెట్టాయి. యోగా పట్ల అవగాహన కల్పించేందుకు సమిష్టి కృషి చేస్తున్నాయి. జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు చోట్ల ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాలు యోగాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.

యోగా అంటే కేవలం ఆరోగ్య సూత్రం కానే కాదు. మన జీవన విధానంలో ఓ భాగం. పూర్వకాలం నుండీ యోగా అందుబాటులో ఉంది. మన సంస్కృతిలో ఓ భాగం యోగా. కానీ, అవగాహన లేని కారణంగా మరుగున పడిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ యోగా వెలుగులోకి వస్తోంది. రకరకాల పేర్లతో యోగా పట్ల అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వయసుతో సంబంధం లేదు యోగాకి. చిన్న పిల్లల నుండి, పెద్ద వారి వరకూ ఎవరికి అందుబాటులో ఉన్న విధంగా వారు ఫాలో చేయొచ్చు. చాలా మందిలో యోగా అంటే ఏదో శరీరాకృతికి సంబంధించిన అంశం. అబ్బే.. ఈ వయసులో మనకి శరీరాకృతితో సంబంధమేముందిలే అని తోసి పుచ్చేస్తుంటారు. కానీ, అదంతా వట్టి అపోహ మాత్రమే. శరీరాకృతికీ, అందానికీ యోగాతో పోలిక పెట్టడం సరికాదు. యోగా అంటే మనల్ని మనం నియంత్రించుకోవడం. మనసునీ, శరీరాన్ని మన అధీనంలోకి తెచ్చుకోవడం. తద్వారా జీవితాంతం ఆరోగ్యంగా ఉండడం.

ఓ పక్క యోగాపై కొంత అవగాహన వచ్చినా మెజార్టీ మెంబర్స్‌ అదేదో సెలబ్రిటీలు అందం కోసం తాపత్రయ పడే చర్యలాగే కొట్టి పాడేస్తున్నారు. అప్పుడెప్పుడో ఓ హీరోయిన్‌ 'బంచిక్‌ బంచిక్‌ చెయ్‌ బాగా.. ఒంటికి యోగా మంచిదేగా.. లేజీగా ఒళ్లు పెంచుకోక, నాజూగ్గా ఉంచు తీగలాగా..' అని పాటేస్కుంది గుర్తుందా.. ఆ పాటని బట్టి కూడా అందరిలోనూ అదే అపోహ. ఓహో స్లిమ్‌గా ఉండడానికే యోగా చేయాలన్న మాట అని. కానే కాదు. యోగా చేసిన వారందరూ స్లిమ్‌గా ఉండాలనేం రూల్‌ లేదు. అయితే, మన అందాల భామలు యోగా పట్ల అవగాహన కోసం ముందుకు రావడంతో, స్లిమ్‌గా ఉండేందుకే యోగా చేయాలన్నమాట అనే భావన కూడా ఏర్పడిపోయింది. కానీ, అందులో ఎంత మాత్రమూ వాస్తవం లేదు. కానీ యువత మాత్రం యోగాపై ఓ మోస్తరు అవగాహనతో ఉంది. ఆ అవగాహనతోనే యోగా పట్ల ఆసక్తిగా ముందుకు దూసుకెళ్తోంది. రోజులో ఎంతో కొంత టైం యోగాకి కేటాయిస్తున్నారు. కఠినమైన ఆసనాలను కూడా అవలీలగా వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సెలబ్రిటీస్‌ యోగా టిప్స్‌ని ఆదర్శంగా తీసుకుంటున్నారు.

అయితే, యోగా అంటే కఠినమైన ఆసనాలు మాత్రమే అనుకుంటే పొరపాటే. చాలా సింపుల్‌గా వేయగలిగే ఆసనాలు కూడా ఉన్నాయి. యోగాలో ప్రధమంగా గుర్తుంచుకోవల్సిన అంశం ఏకాగ్రత. ఏకాగ్రత లేని యోగా దండగ. డైట్‌ కంట్రోల్‌ చేసుకుంటూ, సులభతరమైన ఆసనాలను అనుసరిస్తే, ఆరోగ్యమైన జీవనం మీ సొంతమవుతుంది. ఇకపోతే, యోగాలో రకరకాల ఆసనాలున్నాయి. వాటి గురించి కూడా కొద్దో గొప్పో అవగాహన ఉండాలి కదా. ఏరియల్‌ యోగా, శృంగార యోగా, జలయోగా.. ఇలా రకరకాల పేర్లున్నాయి యోగాలో. వీటిని మన అందాల భామలు ఆదా శర్మ, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, పూజా హెగ్దే తదితరులు ఎంతలా ప్రమోట్‌ చేయాలో అంతలా ప్రమోట్‌ చేస్తూనే ఉన్నారు. వారి ప్రమోషన్‌తో ఆయా యోగాలకు బాగానే ఆదరణ దక్కుతోంది కూడా.

యోగాని డైలీ జీవన సరళిలో భాగం చేసుకుంటే, మందులతో పని ఉండనే ఉండదంటున్నారు నిపుణులు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సుదీర్ఘ వ్యాధులైన బీపీ (హైపర్‌టెన్షన్‌), షుగర్‌ (డయాబెటిస్‌) వంటి వ్యాధుల్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అన్నింటికీ మించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి యోగా తప్ప మరో మార్గమే లేదని తేల్చేశారు మానసిక నిపుణులు. యోగాకి ఇంత పాపులారిటీ రావడానికి మరో కారణం ప్రపంచ దేశాల్ని పట్టి పీడిస్తున్న ఊబకాయ సమస్య. ఆయా సమస్యల నుండి విముక్తి పొందాలంటే యోగా మన జీవన విధానంలో తప్పనిసరి. సో యోగాపై ఇంకేమైనా అపోహలుంటే వెంటనే పక్కన పెట్టేసి, మీ డైలీ టైం టేబుల్‌లో యోగాకీ కాస్త ప్లేస్‌ ఇవ్వడం మర్చిపోకండి. ఉన్నంతలో సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి. ఏమున్నా లేకున్నా ఆరోగ్యమే కదా మహాభాగ్యం.!

మరిన్ని యువతరం
Advance!