Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అదే ఊరు .. అదే ఇల్లు

ade ooru ade illu

తూర్పు తెలతెలవారుతుంది.

పొగమంచు దుప్పటి దట్టంగా  భూమ్మీద పరచుకునే  ఉంది.  ఎదుట ఉన్నవారి ముఖాలు సరిగ్గా కనబడడం లేదు, ఆకారాన్ని బట్టి పోల్చుకోవడమే, ఆ వచ్చేవాడు ఫలానా అని.

అలాంటి మసక వెలుతురులోనే సత్యం పొలానికి వెళ్లి .. అక్కడే ఉన్న ..  పశువుల పాకలో ఆవులకి, గేదేలకి మేతవేసి,  పాలు పితుక్కుని  పొలం గట్లవెంట ఇంటి బాట పట్టాడు. చేతిలో ఉన్న ‘ఇత్తడి గుండిగ’ లో  నిండుగా నిండివున్న పాల  గుండిగను  నైలాను తాళ్ళ చిక్కంలో పెట్టుకుని, దాని చుట్టూ తలకి కట్టుకున్న తుండు గుడ్డ తీసి చుట్టాడు.  వెలుతురు రాకుండా .. ఇంటికెళ్ళిపోతే  ఎవరి ‘దిష్టి కళ్ళు’  తన పాలపాత్ర  మీద  పడవని  వడివడిగా ఇంటివైపు అడుగులేస్తున్నాడు.

ఇంటి సమీపానికి వచ్చి “ ఇదిగో! ఎక్కడున్నావ్” పిలిచాడు భార్యని.

అప్పుడే పళ్ళు తోముకుని పెరట్లోకి వస్తున్న సుబ్బరావమ్మ “ఆ వచ్చే వచ్చే” అంటూ పాల చిక్కం అందుకుంది.అప్పటికి .. మెల్లగా వెలుతురొస్తూ ఉంది.  కొబ్బరాకుల సందులోంచి సూర్యుడు తన ఏటవాలు కిరణాలను భూమి మీదకు ప్రసరిస్తున్నాడు. ఊరు మేల్కొంటుంది.  పిల్లలు ఒకరొకరుగా లేస్తున్నారు. మళ్ళీ లేటైతే స్కూల్ బస్సు అందదు.

పుల్లల పొయ్యి వెలిగించాలని ‘అగ్గి నిప్పు’ కోసం మరిది గారింట్లో పొయ్యి రాజేసారో లేదో చూసింది .. సుబ్బరావమ్మ.  వీళ్ళ వంట వసారీ లోంచి చూస్తే .. వాళ్ళ పొయ్యి వెలిగించినదీ లేనిదీ తెలుస్తుంది. దూరం నుంచి అయినా .. భగభగా మంటలు ఎగసి పడుతూ కనిపించాయి. మంటనీ, పొగనీ దాస్తే దాగేవా. 

“లచ్చన్న గారింట్లో పొయ్యి వెలిగించారు చూడు. మళ్ళీ ఎండేక్కి పోతే పిల్లలకి ఆలశ్యం అయిపోతుంది ” పురమాయించింది పెద్దకోడలు తులసీ రత్నానికి.  వెంటనే  కొబ్బరాకుల దోనే కట్టుకు వెళ్ళింది తులసీరత్నం చిన మామగారి ఇంటికి.

రెండవ కోడలు  సుమతి ఉదయం టిఫెన్ కోసం .. పూరీలు చేసే ప్రయత్నంలో ఉంది. పూరీలంటే పిల్లలకు ఇష్టం.  పెంకుటింటి వసారీలో .. ఓ పక్కన గ్యాస్ స్టవ్ మీద బంగాళ దుంపలు కుతకుతలాడుతూ  ఉడుకుతున్నాయి. తల్లి ప్రక్కన చేరారు ఆమె పిల్లలు ఎప్పుడెప్పుడా అంటూ.
మూడవ కోడలు ఆదిలక్ష్మి ఇంటి పనుల్లో అత్తగారికి సాయం చేస్తుంది. ఆమెతో పాటు పెద్ద మండువా వసారీ ఊడ్చుకొస్తుంది. అందరూ తలో చెయ్యీ వేస్తే తప్ప ఇంటిడి పని తెమలదు.

పిల్లలు  ఒక్కొక్కళ్ళుగా ముఖాలు కడిగి,  కాఫీల కోసం  ఎదురు చూస్తున్నారు. సత్యం గారు తులసి కోట చప్టా మీద కూర్చుంటే,  మనవలు వసారీ మెట్ల మీద కూర్చున్నారు.ముందు రోజు ఆదివారం సంతలో తాతయ్య కొనుక్కొచ్చిన ‘కాస్తాల పేకెట్టు’ పట్టుకొచ్చుకున్నాడు ఆఖరి మనమడు పండుగాడు. వాడికి ఉదయాన్నే కడుపులో ఏదో ఒకటి పడాలి.సత్యానికి ముగ్గురు కొడుకులూ, ఓ కూతురు. అందరికీ కలిపి మొత్తం ఎనిమిది మంది మనవలు, మనవరాళ్ళు.సుబ్బరావమ్మ ఇంటికి కావలసిన పాలు వేరుగా తీసి,  మిగిలిన పాలల్లో రేటుని బట్టి, నీళ్ళు కలిపి వాడకం దార్లకు .. స్టీలు కేనుల్లోకి ..  సీసాల్లో సర్దిపెట్టింది. జీతగాడు రాగానే పంపాలి అని .. అనుకుంటుండగానే వచ్చేసాడు వేంకటేశ్వరు.

వేంకటేశ్వరు.. ఆ ఇంటికి నమ్మిన బంటు. చిన్న వయస్సు నుండి సత్యంలో పనికి  కుదురుకున్నాడు.  అప్పటి నుంచి అక్కడే ఉండి పోయాడు. మనిషి సన్నగా .. బక్క పలుచగా ఉన్నా పని బాగా చేస్తాడు.“ ఇదిగో ఎంకటేసులూ  కాఫీ తాగేసి అందరికి పాలిచ్చిరా!  ‘నెంబర్’ గారికి పాలేక్కువ కావాలన్నారు, వాళ్ళ పెద్దమ్మాయి ఊరి నుంచి వస్తుందట. పెద్ద స్టీలుకేన్లో ఉన్నవి పోసిరా!” పురమాయించింది సుబ్బరావమ్మ. ఆ  నెంబరు గారు అనబడే వ్యక్తి .. పంచాయతీ బోర్డ్ మెంబరు. అందుకే ఊల్లో అందరు నెంబర్ గారు అని పిలుస్తారు. సలహాలకి, సంప్రది౦పులకీ అన్నింటికీ ముందుంటాడు సదరు నెంబరు గారు.

“ ఆయ్” పలికాడు వేంకటేశ్వరు.

తులసీరత్నం ఓ పొయ్యి మీద పాలు కాస్తూ, మరో పొయ్యి మీద కాఫీ డికాషన్ కాస్తుంది. ఇంతలో గదిలో చంటిదానికి మెలకువ వచ్చింది. పక్కనే  అమ్మ కనిపించక పోవడంతో పెద్దపెట్టున ఏడుపు లంకించుకుంది.చంటిదాని ఏడుపు వినిపించినా .. తులసీరత్నం అక్కడ నుంచి కదలడానికి లేకపోయింది. అటుగా వస్తున్న ఆడపడుచుని చూస్తూ “పిన్నిగారూ! మా చంటిదాన్ని కాస్త ఇక్కడికి  తీసుకోచ్చేయండి. నేను  లేస్తే పాలు పొంగిపోతాయి” అంది బ్రతిమాలుతున్నట్లు.

“ ఆ పనీ .. అయ్యింది. నా దగ్గరకు రావడం లేదు. నేను ఇక్కడ చూస్తాలే  నువ్వెళ్ళు” అంటూ పొయ్యి ముందు పీట మీద  కూలబడింది వసుంధర.వసుంధర రావడంతో “ ఏం పిల్లా, కాఫీలు ఇచ్చేది ఏమైనా ఉందా! .. ఆలస్యం అయిపోతుంది .. పొలం వెళ్ళాలి కదా” తొందర చేసాడు కూతుర్ని సత్యం.

“ ఉండు మరి కాగాలా.. వద్దా. నీకన్నిటికీ తొందరే ” డికాషన్ లో పాలు పోస్తూ గడిమింది కూతురు.

“ అప్పుడే కూలోళ్ళు కాలవ గట్టు మీదకొచ్చేసారు. మీరు నాకు కాఫీ ఇవ్వడానికే  ఇంత లేటు చేస్తే,  ఇంక వాళ్ళకెప్పుడు ‘టీ’ లూ, ఉప్మాలు ఎప్పుడు పంపిస్తారు” తొందర చేసాడు కూతుర్ని.

పొలాన్ని ఆనుకుని సత్యం గారి ఇల్లు ఉండడంతో .. ఇంట్లో కూర్చున్నా ఊరిలోకి ఎవరు వచ్చేదీ తెలుస్తుంది. పనిని బట్టి, ప్రొద్దుటే కూలీలు పనిలోకి ఎక్కుతారు.  రోజు విడిచి రోజు కాలువ గట్టు మీద సత్యం తోటలోని బీర, బెండకాయ కోత పనులు సాగుతాయి. కోసిన కాయని గంపలకు ఎత్తి దొడ్లోకి తెచ్చి పోస్తారు కూలీలు. వాటిలో పుచ్చులూ, సచ్చులూ తీసేసి గంపకు పేరుస్తాడు సత్యం. అలా అయితే, మంచి రేటు వస్తుంది సంతలో.. అదీ ఆలశ్యం కాకుండా వెళితేనే.

అప్పటికి ఇంటి పనులు పూర్తి చేసుకున్న సుబ్బరావమ్మ .. అక్కడే పెద్ద కత్తి పీట ఒకటి ముందేసుకుని వద్దనుకున్న బెండకాయల్ని శుబ్రం చేసి చేటడు ముక్కలు తరుగుతుంది. బెండకాయ  వేపుడు పెట్టి, లచ్చించారు పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.  

అలా నిత్యం పిల్లా పాపలతో .. కళకళ లాడుతూ ఉండేది,  సత్యం గారి ఇంట్లో  పూటకు ఇరవైమంది అయినా భోజనం చేసేవారు.  
అన్నీ బాగుంటే అనుకోవడానికి ఏముంది? కాలంతో పాటు పరిస్తితులూ మారాయి.

****

నాలుగేళ్ళ తరువాత ..

ఓ రోజు తెల్లవార లేదు  సత్యంగారికి .  సుఖంగా .. నిద్ర లోనే తనువు చాలించాడు. “ నా దేవుడు నన్ను వదిలిపెట్టి పోయాడు. ఇక నాకు దిక్కెవరు? దేవుడా!” గట్టిగా శోకాలు తీసి ఏడ్చింది, సుబ్బరావమ్మ. విషయం తెలుసుకుని .. ఎక్కడెక్కడి చుట్టాలో వచ్చి చేరారు.
“ రోజూ పూజలు చేసే దానివి .. నీకీ కష్టం ఏమిటమ్మా ” వదిన్ని అల్లుకుని, నెత్తి నోరు బాదుకుంది ప్రక్క ఉరిలో ఉండే, వరుసకు  ఆడపడుచు అయిన సత్తెమ్మ. అంతే .. కాదు నేలమీద  పడి  పొగిలి. . పొగిలి ఏడ్చింది, స్పృహ తప్పిపోయేలా. తన్ని స్వంత చెల్లెలి కన్నా ఎక్కువగా చూసాడన్న విషయం అందరికీ  తెలిసేలా.

ఇంకా చెప్పాలంటే, తన కూతుర్ని అన్నగారి రెండవ కొడుక్కి చేసుకోలేదని కొన్నాళ్ళు మాటలు లేని విషయం మరపుకు వచ్చేలా.  ఆమె ఓ రెండేళ్ళు ఆ ఇంటి గడప తోక్కలేదన్నది జగమెరిగిన సత్యం.  అయినా అభిమానం అభిమానమే. అవకాశం అవకాశమే.రోజూ .. అలవాటుగా సైకిలు మీద .. ఆ వైపుకు వచ్చిన  ఆర్.ఏం.పి డాక్టరు .. అప్పటికప్పుడు .. ఆమెకు వైద్యం చెయ్యాల్సి వచ్చింది.  ఎవ్వరి కోసం ఏదీ ఆగదు. జరగాల్సినవన్ని జరిగి పోయాయి.. చేదు జ్ఞాపకాలు .. కాలం మరుగున పడిపోయాయి.  ఏటికి ఎదురీదడం నేర్చుకుంది ..సుబ్బరావమ్మ.
కొడుకులు ఎంతసేపూ .. హైదరాబాదు వెళ్లి పోవాలి .. అక్కడే ఏదైనా ఫాక్టరీలో పనికి కుదిరితే .. ఆ జీవితమే వేరు. పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు .. అంటూ గాల్లో పేకమేడలు కట్టుకుంటున్నారు. వ్యవసాయం మీద ఆసక్తి లేదు. అలా అని వారసత్వంగా వచ్చే పొలాన్ని వదులుకుంటారా. దాంతో ప్రతిపనీ  దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది సుబ్బరావమ్మకి.

వెంకటేశ్వర్లు .. రెండు మూడు రకాల ఎరువులు  బరకం  మీద  వేసి కలుపుతున్నాడు. “ ఈ రోజు ఎరువు మూల పొలంలో .. చల్లిరా. రేపు మెరక పొలంలో చల్లోచ్చు” చెప్పింది సుబ్బరావమ్మ.  సత్యం బ్రతికుండగా ఇలాంటి  పురమాయి౦పులు ఆమెకు  తెలీవు.    

*********

భర్త పోయి ఇంటి భారాన్ని మోస్తున్న సుబ్బరావమ్మకి .. మరో ఎదురు దెబ్బ తగిలింది.పెద్ద కొడుక్కి కిడ్నీలు పాడై ప్రాణాల  మీదకి వచ్చింది. ఓ నాలుగేళ్ళ మృత్యువుతో పోరాడి .. ఇంకా .. పోరాడే ఓపిక లేక .. ఓడి పోయాడు. ఈ మధ్య కాలంలో డబ్బే మంచినీళ్ళలా ఖర్చయ్యింది. కొంత పొలానికి రెక్కలొచ్చాయి.తులసీరత్నం జీవితం చిన్నవయసులోనే మోడువారింది. అది సుబ్బరావమ్మను బాగా క్రుంగదీసింది. ఇంకా బాధపడే విషయం ఏమిటంటే .. పుట్టిన ఒక్క పిల్లా మూగది కావడం.ముద్దుగా బుట్టబొమ్మలా ఉన్న పిల్లకు ముందు ముందు పెళ్లెలా అవుతుందా అన్న దిగులు. మంచం పట్టేలా చేసింది.  ఉన్నకొడుకులా మాట వినడం లేదు.  భర్త పోయిన తరువాత చిన్నకోడలు ఆదిలక్ష్మి చాలా రోజులుగా పుట్టింటిలోనే ఉంటుంది, ఈ పల్లెటూరిలో ఉండలేనని. భార్య ఎక్కడో ..కొడుకూ  అక్కడే, కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ అక్కడే ఉన్నాడు..‘అదేదో ఇక్కడే చేసుకోవచ్చు కదా’ అన్నా వినలేదు. ‘పాలకొల్లు’ మంచి బిజినెస్ సెంటరు .. అదీగాక .. ఈ సంవత్సర౦ పిల్లల్ని అక్కడే స్కూల్లో చేర్చాలనుకు౦టున్నాను ..  వారానికొక సారి వస్తుంటాలే” అంటూ ఓదార్చాడు.

“ పెద్దవాడు ఎలాగూ లేడు. నువ్వూ ఇల్లోదిలిపెట్టి పోతావా” అంటూ ఏడ్చింది. పిల్లల భవిషత్తు ముఖ్యం అనుకున్నాడు కొడుకు.  లేకపోతే, తనలాగే వీళ్ళకీ చదువు అబ్బకుండా పోతుందని.

********

బయటి ప్రపంచంతో సంబంధం లేని .. స్వంత ఊరిలో వ్యవసాయం మీద  వచ్చే కొద్దీ ఆదాయాన్నే చూసుకుంటూ స్తబ్దుగా  బ్రతికెయ్యాలని అనుకోలేదు సత్యం గారి రెండవ కొడుకు పార్ధసారధి.ఉన్న కొద్దిపాటి వ్యవసాయం కౌలుకిచ్చేసి  అనారోగ్యంగా ఉన్న సుబ్బరావమ్మకి   వైద్యం పేరుతొ హైదరాబాదు తీసుకెళ్ళి అక్కడే కుటుంబాన్ని పెట్టేసాడు. పిల్లల్ని స్కూళ్ళలో వేసాడు.సుబ్బరావమ్మ రంగుల ప్రపంచం అయిన హైదరాబాదులో ఉన్నా, తన ఊరూ ఇల్లూ వాకిలీ పొలం  అంటూ పదేపదే కలవరించేది. “అక్కడ ఒక్కదానివీ ఎలా ఉంటావ్. నాలుగు రోజులు ఆగు. నెమ్మదిగా వెళదాం” అంటూ నచ్చచెప్పాడు ఎప్పుడడిగినా.వైద్యం .. వైద్యం లాగే ఉండగా  మనోవ్యధతో .. కొద్దీ రోజులకే కన్నుమూసింది.ఉన్న ఇద్దరు కొడుకులూ  బయటికు వెళ్లిపోవడం .. ఆడపడుచు వసుంధర అత్తవారి౦టికెళ్ళి పోవడం .. తోడుగా అత్తగారైనా లేకపోవడం .. పెద్ద కోడలు తులసీరత్నానికి దిక్కు తోచలేదు. తనకున్న  ఒక్కగానొక్క కూతురితో అమ్మగారింలోనే ఉండిపోదాం అనుకుంది.
అత్తగారుండగా కొద్దీ రోజులు అలాగే చేసింది. భర్త లేనప్పుడు తనెందుకు అక్కడ ఉండాలని. అయితే ఇప్పుడు పరిస్తితి వేరు.
వ్యవసాయం కౌలుకిచ్చినా .. రెండు గేదెల్ని మాత్రం అమ్మకుండా ఉంచారు మరుదులు. వాటికోసమైన ఎవరో ఒకళ్ళు ఇంటిలో ఉండాలి. అదీగాక ఇల్లు తాళంలోఉంటె  ఇల్లు  పాడైపోతుంది. ఉన్న ఆస్తులు పోగా .. భర్త లేనందుకు .. ఇంట్లో కూడా వాటా లేకుండా పోతుందన్న ఆలోచనతో తులసీరత్నం .. ఒక్కగానొక్క కూతురితో  ఆ ఇంటిలో ఉండిపోయింది.

అప్పటికి .. ఇప్పటికీ జీతగాడు వెంకటేశ్వర్లే.  సత్యం మీద అభిమానానికి గుర్తుగా.  కూతురి మూగ సౌజ్నలకి తనే ప్రశ్నలు వేసుకుని .. సమాధానాలు చెప్పుకోవడం..  అదీ ఆశ్రమ స్కూల్ కు వెళ్లిందంటే మరింత ఒంటరితనం ..  మాట్లాడే మనిషి లేక  .. ఇంటి వైపు ఎవరొస్తారా అని ఎదురు చూస్తూ .. లంకంత ఇంటిలో దీపం పెట్టె దిక్కుగా ఉండిపోయింది తులసీరత్నం.          

 

 

మరిన్ని కథలు
dari tappina batasari