Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
What about that?

ఈ సంచికలో >> యువతరం >>

'నిర్మల'మైన 'విజయం' ఆమెకు మాత్రమే సాధ్యం.!

The 'pure' success is only possible for her.!

ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.. పురుషాధిక్య సమాజంలో మహానుభావులెందరో.. కానీ, లెజెండరీ మహిళలు మాత్రం కొందరే. ఆకాశంలో సగం. అన్నింటా సగం అంటారు. కానీ, మారిన పరిస్థితుల రీత్యా అది ఇప్పుడు. కానీ, అప్పుడు కాదు. నాటి తరంలో తాను స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఎంచుకుని ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి విజయ నిర్మల. ఆ తరం, ఈ తరం కాదు, ఆమె జీవితం ఎందరో తర తరాల మహిళలకు ఆదర్శం. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా బహుముఖ ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించారు విజయనిర్మల. అందుకే ఆమెను లెజెండరీ అనడం అతిశయోక్తి కాదేమో. తెలుగు సినిమా ఇండస్ట్రీకి 'ఐరెన్‌ లేడీ' ఆమె. దర్శకురాలిగా దివంగత సీనియర్‌ నటి భానుమతిగారి తర్వాత అంతకు మించిన స్థాయిలో సత్తా చాటిన మహిళ విజయనిర్మల. దర్శకురాలిగా అత్యధిక సినిమాలను తెరకెక్కించిన ఆమె రికార్డ్‌ను మరొకరు బ్రేక్‌ చేయడం సాధ్యం కాని పనే అనక తప్పదు. ఈ జనరేషన్‌ మహిళా దర్శకులందరికీ ఆమె ఓ స్పూర్తి.

ఏడేళ్లకే సినిమాల్లోకి వచ్చిన ఆమె తొలుత బాలనటిగా సత్తా చాటారు. బాలనటిగా ఉన్నప్పుడే ఆమెలోని నటనా చాతుర్యమే కాకుండా, ఆ వయసు నుండే, ఏదో తెలియని స్పార్క్‌ని పలువురు సీనియర్‌ సినీ ప్రముఖులు గమనించారు. ఇక హీరోయిన్‌గా 'రంగుల రాట్నం' సినిమాతో ఎంట్రీ ఇచ్చారు విజయ నిర్మల. తదుపరి పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా విభిన్న పాత్రల్లో సత్తా చాటారు. ఆమె నటించిన ప్రతీ పాత్ర మహిళకు ఆదర్శమే. 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో ఆమె పోషించిన 'సీత' పాత్రను ఎప్పటికీ మర్చిపోలేం. ఆ పాత్ర యువతకు ఎంతో ఆదర్శనీయం. అలాంటి పాత్రలు ఆమె జీవితంలో ఎన్నో పోషించారు. నటనలో చతురత ప్రదర్శించిన ఆమె తదుపరి దర్శకురాలిగా అవతారమెత్తింది. పురుషాధిక్యత మెండుగా ఉన్న ఆ రోజుల్లో ఓ మహిళా దర్శకురాలిగా ఆమె ఎన్నో అవమానాల్ని, ఒత్తిడుల్ని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. కానీ, దర్శకురాలిగా నిలదొక్కుకున్నారు. అందుకే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తెలుగు మహిళా దర్శకురాలిగా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ఆమెని వరించేందుకు ఉబలాటపడింది. ఆమె జీవితం ఎందరో మహిళా దర్శకులకు స్ఫూర్తి దాయకం.

ఈ జనరేషన్‌కి సంబంధించి, నేటి తరం యువత సినిమా రంగం వైపు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఎంతో మంది యువ దర్శకులు దర్శకత్వం వైపు మొగ్గు చూపుతూ మంచి విజయాలు అందుకుంటున్నారు. ఆ కోవలో అమ్మాయిలు కూడా ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు. దర్శకత్వంలో మెలకువలు తెలుసుకుంటున్నారు. అలాంటి వారందరికీ అమ్మ విజయ నిర్మలే ఆదర్శం. ఇప్పటికే తెలుగులో సత్తా చాటుతున్న జీవిత, నందినీ రెడ్డి తదితర మహిళా దర్శకులకూ విజయ నిర్మలే ఆదర్శం. ఆమె జీవితం సినీ ప్రియులకు మాత్రమే కాదు, ఇతర రంగాల్లో సక్సెస్‌ కావాలనుకునే నేటి తరం డైనమిక్స్‌కీ ఇన్సిప్రేషనే. ఓ మహిళగా దర్శకత్వ రంగంలో మాత్రం ఆమె సాధించిన ఘనత ప్రత్యేకం. మహిళల్లో మున్ముందు తరాలవారు ఆ రంగంలో ఆమె సాధించిన ఘనతను సాధించడం బహుశా సాధ్యం కాదేమో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం కొంతమందికే చెల్లుతుంది. సాధించిన విజయాల కంటే, అదే వారికి అందమైన అభరణం. తెలుగు సినిమా ఉన్నంతకాలం విజయనిర్మల పేరు మార్మోగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆమె తెలుగు సినిమా ఆస్థి. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోవచ్చు. ఆమె నింపిన స్ఫూర్తి మాత్రం తరతరాలకీ గుర్తుండిపోతుంది.

మరిన్ని యువతరం