Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> చిగురించిన ఆశ

chigurinchina aasa

ఓ వేసవి సాయంత్రం గాంధీ పార్కులో కూర్చున్నాను.  ఎదురుగా పిల్లల చేస్తున్న అల్లరి చూస్తూ మురిసిపోయాను, నన్ను నేనే మరిచిపోయాను . గతం నా కళ్ళముందు కదలాడింది.

**********************

నా పేరు సుబ్బారావు. నేనో చిరుద్యోగిని. నేను చదువుకునే రోజుల్లో మా బంధువుల పెళ్లిలో పుత్తడిబొమ్మలాంటి అమ్మాయిని చూసాను.    తొలిచూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాను. ఆమె పేరు విమల అని తెలుసుకున్నాను. ఆమెను కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కలవలేకపోయాను.ఆమె చదివే కాలేజీలో చేరి ఆమెతో స్నేహం చేయడం మొదలుపెట్టాను. ఆమె ఇష్టాఇష్టాలు తెలుసుకొని ఆమె మనసులో చోటు సంపాదించాను. నా మనోభీష్టాన్ని ఆమె ముందు ఆవిష్కరించాను. చదువు పూర్తి అయ్యి ఉద్యోగం వచ్చాక చేసుకోవడానికి ఆమె అంగీకరించింది. కొన్నాళ్ల తరువాత పెద్దల సమక్షంలో  విమలతో నా పెళ్లి జరిగింది . నా సంపాదన చాలా తక్కువ  చుట్టాలు రాక పోకలతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది.

విమల సౌమ్యురాలు. ఇంటిని జాగ్రత్తగా నడుపుకొచ్చేది. అందరితో కలసిమెలసి ఉండేది. ఏడాది గడిచింది. సరిగ్గా అప్పుడు మొదలైయ్యాయి విమలకి  అమ్మ సాధింపులు.

"గొడ్రాలిని కోడలిగా చేసుకుని నాకొడుకు జీవితం చేచేతులారా నాశనం చేసాను .సంవత్సరం గడిచినా పిల్లా లేదు పీచు లేదు.ఈ ఇంటికి వారసుల్లేకుండా చేసావు కదే ముదనష్టపుదానా!" అని గునపాల్లాంటి మాటలతో గుచ్చేదని ఇరుగు పొరుగు చెప్పగా విన్నాను. సంతోషం అందరికి పంచేది కానీ దుఃఖాన్ని మాత్రం తనలోనే దాచుకునేది విమల. ఎన్ని మాటలన్నా  అమ్మకి ఏనాడు ఎదురు చెప్పేది కాదు.

విమల కోరిక మేరకు డాక్టరుని సంప్రదించాం. అన్ని పరీక్షలు చేసి మాకు పిల్లలు పుట్టేయోగం లేదని అందుక్కారణం నేనేనని తేల్చి చెప్పారు. దాంతో విమల మరీ డీలా పడిపోయింది. తన ఆశలన్నీ పేకమేడల్లా కూలిపోయినందుకు మానసికంగా కృంగిపోయింది. డాక్టరు చెప్పిన విషయం అమ్మకు చెప్పాను..

" నీ పెళ్ళాం నిన్ను కొంగుని ముడివేసుకుంది. నువ్విప్పుడు దాని చేతిలో కీలుబొమ్మవయ్యావు.అది తానా అంటే నువ్వు తందానా అంటావు ఎవరికి తెలియని భాగోతంచెప్పు. అమ్మ అల్లం పెళ్ళాం బెల్లం. దాని లోపాన్ని కూడా నీమీద వేసుకున్నావంటే అది ఎంత గడసరో అర్ధ మౌతోంది "  అంది అమ్మ మూతి మూడు వంకలు తిప్పుతూ...ఎదురు చెప్పలేక మౌనం వహించాను. కొన్నాళ్ల తరువాత ..

"అనాధ పిల్లలని పెంచుకుందామని అనుకుంటున్నాం అని అమ్మకి చెప్పాం"..."కంటే ఖర్మ కానీ పెంచుకుంటే ప్రారబ్ధం" అని మా ఆశలపై నీళ్లు జల్లింజ్ది.అనాధ పిల్లల్ని పెంచుకోడానికి ససేమిరా ఒప్పుకోలేదు. అమ్మని ఒప్పించలేక విమలని నొప్పించలేక నాలో నేనే మధన పడ్డాను.

అమ్మ పంతం ముందు మా కోరిక నిలువలేక పోయింది. జీవితాంతం తోడుగా ఉంటుందనుకున్న  నా భార్య  అనారోగ్యం తో అర్ధాంతరంగా తనువు చాలించి నన్ను ఒంటరి వాడిని చేసింది. ఆ బాధ నుంచి తెరుకోక.ముందే అమ్మ కూడా దూరమైంది.ఇప్పుడు నాకు నా అన్న వాళ్లే కరువయ్యారు. ఒక అనాధని పెంచుకుంటే వారికి  ఆసరా ఇచ్చిన పుణ్యమైనా మిగిలి ఉండేది.

*********************

"సుబ్బారావ్ సుబ్బారావ్" అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన నాకు ఎదురుగా నా స్నేహితుడు  రామనాధం కనపడ్డాడు..రామనాధం నువ్విలా..అన్నాను ఆశ్చర్యంగా..

"అవును సుబ్బారావ్ నువ్వు తిండి తిప్పలు మానేసి ఇలా పార్కులో ఉంటే బాధ తీరుతుందా? పద మాయింటికి ఎంగిలి పడుదువుగాని" అన్నాడు రామనాధం.

"ఈ పిల్లల అల్లరి తోటే కడుపు నిండిపోయింది అది చాలు నాకు" అన్నాను నేను .

"నేను చెప్పేది విను నాతో రా " అని ఆప్యాయంగా ఇంటికి తీసుకువెళ్లి కడుపునిండా భోజనం పెట్టించి పట్నం లోని ప్రేమసమాజం దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఆఫీసు బయట ఉన్న కూర్చీలో నన్ను కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు రామనాధం.

"ఇక్కడికెందుకు తీసుసువచ్చాడో అర్ధం కాలేదు నాకు . కాసేపటి తర్వాత రామనాధం బయటికి వచ్చి నాతో.. "ఎప్పుడో ఎదో చెయ్యలేకపోయామని తలచుకుని బాధపడే బదులు.. ఇప్పుడు ఏమిచేయగలమా అని ఆలోచించాలి అప్పుడే ఆనందంగా ఉండగలం అన్నాడు"

"నీ మాటలు నాకు అర్ధం కాలేదు" అన్నాను

"ఇందులో అర్ధం కాకపోడానికి ఏముంది..అంటూ నిర్వాహకుల సాయంతో ఆశ్రమమంతా తిప్పిచూపించాడు . తల్లి తండ్రి లేని పిల్లలు ఎంత చక్కగానో వారిపనులు వారు చేసుకుంటూ కలసి మెలసి ఉన్న వాళ్ళని చూపిస్తూ..

"ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ అనాధ పిల్లలే వాళ్ళ అవసరం నీకులేకపోవచ్చు కానీ నీ అవసరం వాళ్ళకుంది" అన్నాడు రామనాధం నాతో.
"అంటే" అని ఆశ్చర్యంగా అడిగాను.

"ఇది దాతల సాయంతో నడుస్తోంది..నువ్వు సంపాదించే దానిలో కొంత మొత్తం వీరికి ఇస్తే ఈ పిల్లలు నీలో తండ్రిని చూసుకుంటారు. వాళ్లే కన్నబిడ్డల్లా కనపడతారు నీకు.ఏమి పోగొట్టుకున్నామని ఆలోచిస్తూ కూర్చోకూడదు.ఏమి పొందాలన్నదానిగురించి ఆలోచించాలి"..అన్నాడు రామనాధం.అతని మాటల్లో మర్మం అర్ధం చేసుకున్నాను.

"నిజమే ఎవ్వరికీ ఉపయోగపడని జీవితమెందుకు అని మనసులోనే అనుకుని

"రామనాధా! నువ్వు నా కళ్ళుతెరిపించావు అని అతని రెండు చేతులూ పట్టుకుని...నా జన్మ సార్ధకం చేసావు.నా జీవితంలో వెన్నెల కురిపించావు.ఇకనుంచి ప్రతీనెలా నా జీతాన్ని వీళ్ళకే ఇచ్చి నా శేష జీవితాన్ని ఇక్కడే గడిపేస్తాను అన్నాను. చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ..ఆనాటినుంచి  పిల్లల ఆలనాపాలనా మధ్య ఒంటరిని అన్న భావన లేకుండా సాగుతోంది నా జీవితం.

మరిన్ని కథలు
amma kosam tapana