Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

ఇదే ధ్యేయం! ఇదే గమ్యం!!

ide dhyeyam..ide gamyam

ఫ్రెండ్స్ తో కలిసి సెలవుల్లో నేను నార్త్ ఇండియా లో మస్తు ఎంజాయ్ చేసి తిరుగు ప్రయాణం ట్రైన్ లో ఉన్నాం! డిల్లి లో ట్రైన్ ఎక్కి  ఫోన్ లో అందరితోమాట్లాడ్డం పూర్తి చేసి చూస్తే మేము ముగ్గురం కాకుండా భోగి లో ఇంకో కుర్రాడు కనిపించాడు. ట్రైన్ ఎక్కిన దగ్గర్నుంచి ఏదో బుక్ చదువుతున్నాడు. నా ఫ్రెండ్స్ ఇద్దరూ ఎవరి లోకం లో వాళ్ళు వున్నారు శీనుగాడు ఫుల్ గా ఫుడ్ లాగిస్తూ మధ్య మధ్యలో ఎవరూ చూడకుండా మందు కొడుతున్నాడు. శేఖర్ గాడు గాళ్ ఫ్రెండ్ రమ్య తో చాటింగ్ చేస్తున్నాడు. నాకేమో మ్యూజిక్ వినటం సిగిరెట్ కాలుస్తూ ఎవరో ఒకరితో హస్కుకొట్టటమంటే ఇష్టం! ఏసీ భోగి అవటం తో కాల్చడం కుదరట్లేదు! “రేయ్ మావా! బాటిల్ ఇవ్వు” రెండు పెగ్గులు వేద్దామని అడిగాను “సుశీలా?సుమతా?” నవ్వేడు శీను.

వాడి ఉద్దేశ్యం సుశీల అంటే మా క్లాసుమేటు ఒట్టి కూల్ డ్రింక్ తాగే పిల్ల! సుమతి మాతో మందు కొట్టే పిల్ల! ”నీయబ్బ! ఈ టైం ల సుశీల్నిఎవడైనా అడుగుతాడ్రా?” శేఖర్ కసిరితే నేను బాటిల్ లాక్కుని రెండు గుక్కలు నోట్లో వేస్కున్నా! ఇంకో ఫ్రెండ్ కిఫోన్ చేస్తే “మావా!ట్యుషన్ లోబిజీ!తర్వాత కాల్ చెయ్యి”కట్ చేశాడు. సరే కొత్త కుర్రాడు వీడితో హస్కు కొడదాం అని చొరవ తీసుకుని “హాయ్!నా పేరు రఘు, ఇంటర్ సెకండ్ ఇయర్”  అన్నాను. బుక్ లోంచి తలెత్తి “హాయ్!నాపేరు కిరణ్!” అన్నాడు.

“ఏం చేస్తున్నావ్?” అడిగితే “కాన్పూర్ ఐ ఐ టి లో ఫస్ట్ ఇయర్ మొన్నే జాయిన్ అయి,ఇంటికెళ్తున్నా!”

“వాట్!! ఐ ఐ టి లోనా? ఐ ఐ టి లో సీటు తెచ్చుకోవటం నాకల!” గర్వంగా చెప్పాను. “రేయ్ మావా డిన్నర్ రెడీ, లాగిస్తావా?” శీనుగాడు చెప్తే సరేనన్నా.కిరణ్ లేచి ఎదురుగావుండేబెర్తు మీద కూర్చుని మళ్ళీ సీరియస్ గా బుక్ చదువుతున్నాడు.మేము ముగ్గురం ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిన్నాక కిరణ్ ఇటు వైపు వచ్చేడు. నాది శేఖర్ గాడివి మిడిల్ బెర్తులు! శీనుగాడు భయంకరమైన లావు వాడికి అప్పర్ బెర్త్ వచ్చింది!
“ రేయ్ అప్పర్ బెర్త్ ఎక్కరా!” శేఖర్ ఆటపట్టిచ్చాడు

“పై బర్త్ ఎక్కాలా?అమ్మోవల్ల కాదు” శీనుగాడు ఏడుపు మొహం పెడితే ఎదురుసీటు అంకుల్ వెం టనే “ఓకే! నాలోయర్ బెర్తులో పడుకోఒడి,నేను పై బెర్తుకి వెళ్తాను” చెప్పేసి చకచకా పై బెర్తు ఎక్కేశాడు.

ముగ్గురం అంకుల్ ని ఆశ్చర్యంగా చూశాం, శీనుగాడయితే షాకు తిని కిందపడి తన్నుకుంటున్నాడు! మళ్ళీ నేను తలుపు దగ్గరికెళ్ళి సిగిరెట్ తాగేసొచ్చి బెర్త్ సర్దుకుని పడుకున్నాను . ట్రైన్ శర వేగంగా చీకటిని తొలుచుకుంటూ హైదరాబాద్ దిశగా దూసుకుపోతోంది.

***     ****   ****

ఉదయం పది గంటల వేళ .. మెలకువ వచ్చి చూస్తే కిరణ్ లాప్ టాప్ లో ఏదో వర్కు చేస్తూ కనిపించి స్నేహ పూర్వకంగా నవ్వి”గుడ్ మార్నింగ్ రఘు!” అన్నాడు. నాకెందుకో తప్పుచేసినట్టు ఎప్పుడూ లేని గిల్టీ ఫీలింగ్ కలిగింది!వెళ్లి మొఖం కడుక్కుని సిగిరెట్ తాగి లోనికి వచ్చాను.శేఖర్ గాడు కిరణ్ తో హస్కేస్తు న్నాడు. శేఖర్ కవితలు రాస్తాడు.శేఖర్ రాసినవి చూపిస్తుంటే కిరణ్ లోపాలు చెప్తూ ఎలా దిద్దుకోవాలో చెప్పి “ మంచి రచయిత అవ్వాలంటే ఒక దృక్పధఒ, ధ్యేయం ఉండాలి. ప్రపంచ సాహిత్యం పోకడలు ఆధునిక సాహిత్యపు గమనం కూడా చూడాలి” అంటూ బోలెడు మంది పేర్లు చెప్పి “వీళ్ళు రాసిన పుస్తకాలు చదవండి!” అన్నాడు. కిరణ్ ధోరణి చూసి నాకు ఒళ్ళు మండుకొచ్చి

” వాడి డ్రీం సినిమా డైరెక్టర్ అవ్వాలని!” ఘాటుగా చెప్పాను.

“అవునా వెరీ గుడ్! ముందు డిగ్రీ కంప్లీట్ చెయ్యండి!అన్నట్టు గ్రిఫిత్ పిక్చర్స్ ఏం చూశారు?” శేఖర్ గాడు నోరు వెళ్ళబెట్టి “గ్రిఫితా?” అన్నాడు. కిరణ్ ఉత్సాహంగా“గొప్పసిన్మా డైరెక్టరు!19వశతాబ్దంసినిమాప్రాధమిక దశలోఉన్నప్పుడు షాట్ డివిజన్, టేకింగ్ తదితరవిషయాల్లో గొప్ప ప్రత్యేకత చూపినవ్యక్తి గ్రిఫిత్!‘బర్త్ ఆఫ్ ఎ నేషన్’ ఫ్రెంచ్ విప్లవ నేపధ్యం లో ఇద్దరుఅక్కచెల్లెళ్ళబాధలు చిత్రిస్తూ ‘ఆర్ఫన్స్ ఆఫ్ ది స్టాం’ తను తీసిన గొప్ప సినిమాలు!” చెప్తుండగా శీను “రేయ్! టిపను తినండ్రా” అంటూ ఇద్దరికీ పెట్టాడు.

నాకు కిరణ్ మీద కోపం ఆగటం లేదు వీడు ఏం మాట్లాడినా ఏదో అర్ధం కాకుండా చెప్తున్నాడు. ఇంతలో నాకల గుర్తొచ్చి “ఐ ఐ టి చెయ్యాలఒటే నేనేం చెయ్యాలి?ఏం చదవాలి ”కిరణ్ ని గట్టిగా అడిగాను.

మెల్లగా నవ్వి బ్యాగు లోంచి బుక్ తీసిచ్చాడు. అది కలాం’వింగ్స్ ఆఫ్ ఫైర్! “కలాం తెలుసా?” అడిగాడు. “రాజకీయ నాయకుడుకదా! తెల్సు” పొగరుగా చెప్పాను. కిరణ్ కాదన్నట్టు తలూపి చెప్పాడు..

”గొప్ప రాకెట్ శాస్త్రవేత్త, మన దేశానికి రాష్ట్ర పతి గా కూడా చేశారు ”

సరే ఇంతకీ ఏందీ ఐతే అన్నట్టు విసుగ్గా చూసాను. “ఈ బుక్కు చదవితే విద్యార్ధి దశలో మనం ఎలా ఉండాలో ఏమి చెయ్యాలోఎలాముందుకుపోవాలో అర్ధం అవుతుంది!” “చంపేవు బాసు!ఇప్పుడు నేను ఈ బుక్కు చదవాలా?” వ్యంగ్యం గా నవ్వి ‘సరే ఇవ్వు” అని చదవటం ప్రారంభించాను. ఈ లోగా అటువైపు బెర్తు లోవున్న అంకుల్ కిరణ్ ప్రక్కన వచ్చి కూర్చున్నాడు.ఇద్దరూ ఏదోపెద్ద ఫ్రెండ్స్ లా మాట్లాడుకోవటం మొదలెట్టారు.నాకు అలాంటి విషయాలు వినటం మొదటిసారి! అంకుల్ అమెరికాకి ఇరాన్ కి సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్తూఒటే అవి ఎందుకు దెబ్బతిన్నాయో కిరణ్ మాట్లాడుతూ హార్ముజ్ జలసంధి మొదలుకుని చమురు ఉత్పత్తులు, అమెరికా ఇరాన్ ని ఎలానియంత్రిం చాలని చూస్తుందో చెప్పసాగాడు.నాకా సంగతులన్నీఅద్భుతంగాఅనిపించాయి.అంకుల్ ఏ విషయం ఎత్తినా కిరణ్ చకచకా వాటి గురించి చెప్తూ మధ్య మధ్యలో ఇద్దరూ ఒకరినొకరు సరిచేసుకుంటూన్నారు. అసలు నేను శ్రద్దగా వినటం ఫస్ట్ టైం! కాసేప్పయ్యాక ఇద్దరూ చెస్ ఆడడం మొదలెట్టారు.

బుక్ బోర్ కొడుతోంది ఏమీ ఎక్కటం లేదు. విసుగ్గా అటు చూస్తే పక్క బెర్తుల దగ్గర పెద్ద రచ్చ! గొడవుంటే హుషారు! లేచెళ్ళాను. రాత్రి బెడ్ షీట్లు చిరిగినవి ఇచ్చావని అటెన్ డెంట్ తో ప్రయాణీకుడు చెప్తుంటే అటెన్ డెంట్ అడ్డంగా వాదిస్తున్నాడు. నేను కల్పించుకుని అటెన్ డెంట్ ని బూతులు తిట్టాను.వాడు నా లాజిక్ తట్టుకోలేక నోరు మూసుకుని వెళ్ళిపోతే అతను మంచి పని చేశావు ’నన్నుపొగిడాడు’ గర్వంగా కిరణ్ వంక చూశాను. ఇంతలో టీటీఈ వస్తే కిరణ్ కంప్లైంట్ బుక్ తెప్పించి ఏదో రాసాడు. “ఏం రాసావు కిరణ్” అంకుల్ అడిగితే “చిరిగిన బెడ్ షీట్స్ ఇచ్చాడు కదా ఆ విషయమే!” అన్నాడు. నేను ఆశ్చర్యంగా నీకు అట్లాగే ఇచ్చాడా అంటే అవునని “బెడ్ రోల్స్ ఇచ్చినకుర్రాడితోగొడవ పెట్టుకునేకంటే అసలు అలాంటి బెడ్ రోల్స్ సప్లయ్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి!అప్పుడే సమస్య కి పరిష్కారం!”  చెప్పాడు. కొంచెం సేపు కాగానే ఇంకోకడేవరో వచ్చి బాగున్న మంచి బెడ్ షీట్లు అందరికీ ఇచ్చెళ్ళాడు.

“సమస్యని మూలం లోంచి చూడాలి, మంచి పని చేసావు కిరణ్!” అంకుల్ మెచ్చుకున్నాడు! దాంతో నాకు మరింత కోపం పెరిగింది. ఆ కోపం లో రెండు సిగిరెట్లు వూదేసి చాలా సేపు తలుపు దగ్గరే నిలబడి ఫోన్లో ఫ్రెండ్స్ తో మాట్లాడి “పొద్దున కల్లావచ్చేస్తా!రేపు కలుద్దాం” చెప్పి మళ్ళీ లోపలి కొచ్చాను.శీనుగాడు ప్లేటునిండాచికెన్ లాగిస్తున్నాడు.శేఖర్ గాడు ఏదో సీరియస్ గా ఆలోచి స్తున్నాడు. నేను వెళ్లి మీల్స్ చేసి బెర్త్ ఎక్కి నిద్రపోయా. సాయంత్రం మెలకువ వచ్చి చూస్తె ట్రైన్ ఏదో స్టేషన్ లో ఆగిఒది. నలుగురు ఆడవాళ్ళుగబగబా ఎక్కేరో లేదో ట్రైన్ స్టార్ట్ అయ్యింది.వాళ్ళవాలకం చూస్తే టికిట్ కొన కుండా ఎక్కిన బాపతు అనిపించింది. లేవకుండా అలాగే పడుకున్నాను.వాళ్ళు నిలబడుకునే భుజం కి వేలాడే సంచిని తెరిచి చాకు తో చకచకా బెండకాయలు తరుగుతుంటే ముక్కలు సంచి లో పడుతున్నాయి! ఆ దృశ్యం అబ్బురంగా ఉంది! కిరణ్ టక్కున లేచి “కూర్చోండి!” అంటూ హిందీలో చెప్పాడు.

వాళ్ళు ‘మరేం పరవాలేదు ఇది మాకు రోజు మామూలే” అంటూ నవ్వేరు. ఐనా కిరణ్ అంకుల్ పక్కన సర్దుకుని వాళ్లకి జాగా కల్పించి కూర్చోబెట్టి వాళ్ళ గురించి అడిగాడు. వాళ్ళు పాస్ తీసుకుని ఉద్యోగ రీత్యా నిత్యం ఇలానే ప్రయాణిస్తారు. ఇంటికెళ్లేసరికి పిల్లలు ఆకలితో ఉంటారని ఇక్కడే కూరలు తరిగి రెడీ చేస్కుని గమ్యం రాగానే దిగిపోతారట.వాళ్ళ జాబ్, జీవన విధానం గురించి కిరణ్ ఆరా తీస్తే శీనుగాడు తనకి తెలిసిన రుచులు నార్త్ ఇండియన్ వంటలు గురించి మాట్లాడాడు. వాళ్ళు తినుబండారాలు ఇస్తే ఆవురావురు మని మొత్తం ఈ బకాసురుడే మింగేసాడు. తర్వాతి స్టేషన్ లోవాళ్ళు దిగిపోయాక కిరణ్ దుప్పటి పరిచి యోగాసనాలు వేశాడు. అంకుల్ శ్వాసకి సంబంధించిన ఎక్సర్ సైజులు చేయించాక అడిగాను- “ఇవన్నీ ఎందుకంకుల్?”

“ఆరోగ్యం కోసం రఘు!”

“మీకు సరే , కిరణ్ ఆరోగ్యానికి ఇవన్నీ ఇప్పుడు అవసరమా?” సినికల్ గా అన్నాను అంకల్ నవ్వి “ట్రైన్ ఎలాగైతే డిల్లి లో బైలుదేరి గమ్యం వైపు వెళ్తోఒదో జీవితం కూడా ఒక ప్రయాణమే! ముఖ్యమైన స్టేషన్లలో ట్రైన్ ని చెక్ చేస్తున్నట్టు ఈ ప్రయాణంలో మన ఆరోగ్యాన్ని ప్రతి రోజు సంరక్షించుకోవాలి! అదెప్పుడో ముసలాళ్ళం అయ్యాక చూద్దాం, చేద్దాం అనుకునేది కాదు. టీనేజీ లోనే ఆరోగ్యం పట్ల శ్రద్ద మొదలవ్వాలి! ధ్యానం తో ఏకాగ్రత పెరుగుతుంది!” చెప్పాక అంకుల్ శీను వైపు చూసి “ఈ వయసు లోనే పై బెర్తు ఎక్కలేక పోతే ఇక నా వయస్సు వచ్చేసరికి నువ్వు చిన్న మెట్టు కూడా ఎక్కలేవు!” అన్నాడు. వెంటనే శేఖర్ ఉత్సాహంగా “అట్లా గడ్డి పెట్టండి అంకుల్! ఏది కనిపిచ్చినా తినేయ్యటమే వీడు! మా కాలేజీలో ఒరే శీనుగాడికి కనిపించకుండా ఆ రాయి దాచి పెట్టండ్రా అని జోకులేసుకుంటాం అంకుల్!” నవ్వితే అంకుల్ వారించి “కానీ శేఖర్! శీనూకి మంచి టేస్ట్ వుంది! తన నైపుణ్యం మీద దృష్టి పెడితే గొప్ప షెఫ్ అవుతాడు!” చెప్తే శీను గాడి కళ్ళల్లో మెరుపు వచ్చి లేచి కూచుని “అవునంకుల్! మీరు చెప్పినట్టే నాకు పెద్ద స్టార్ హోటల్ లో వంటవాడవ్వాలని ఉంది” ఆనందంగా పకోడీలు తింటూ అన్నాడు!
“మరి ముందు జంక్ ఫుడ్ మానెయ్యాలి! బరువు తగ్గాలి! గట్టి పట్టుదలతో అనుకున్నది సాధిఒచాలి!” అని చెప్పిఇంటర్ అయ్యాక హోటల్ మేనజ్ మెంట్ ఎక్కడ చదివితే బాగుంటుందో వివరించసాగాడు. అంకుల్ మాటలతో శీను లో చైతన్యం వచ్చి శ్రద్దగా వింటున్నాడు! ఈ లోగా కిరణ్ ఫిడేలు తీసివాయించసాగాడు. శ్రావ్యమైన సంగీతంతో భోగి నిండిపోయింది. అందరూ కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తున్నారు!

***   ****   *****

అర్ధరాత్రి దాటింది! భోగీ నిశ్శబ్దం గా ఉంది! ఎంతకీ నిద్ర పట్టడం లేదు! లేచి తలుపు దగ్గర నిలబడి సిగిరెట్ వెలిగించాను.ఫిడేలు రాగాలు గుండెల్లో పొంగుతూ గొంతునిండా తెలియని దుఃఖం!  ఏవేవో ఆలోచనలు! దారి తప్పి నడుస్తున్నావు అని లోపలి నుంచి చెప్తున్నగొంతు,అది నాదే!కొత్తగా ఉంది! భుజంమీదచెయ్యి పడి వెనక్కిచూస్తె–అంకుల్! చప్పున సిగిరెట్ విసిరేశాను! “ఎందుకు పడేసావు? పర్లేదు తాగు రఘు! “
అంకుల్ కంఠం మృదువుగా ఉంది. నాకిది షాక్! తిడతాడు అనుకుంటే?

“కిరణ్ కీ ఒకప్పుడు మందు, సిగిరెట్ల అలవాటు ఉండేది తెలుసా?!”

“అవునా అంకుల్!” నిర్ఘాంతపోయి “మీకు .. మీకెలా తెలుసు?” ఆతృతగా చూశాను.

“కిరణ్ మా అబ్బాయే!”  అవునా?! ఇంకో షాక్! అరె.. కానీ ఇద్దరూ ఫ్రెండ్స్ లా ... “మూడు సార్లు టెంతు ఫెయిలయ్యాక మార్పు వచ్చి ఒక మనిషయ్యాడు!” అంకుల్ గొంతులో చప్పున నాన్న గుర్తొచ్చారు.“వచ్చే సంవత్సరం ఐఐటీ చేరాలంటూన్నావు,ఇప్పుడీ నార్త్ ట్రిప్ టైం వేస్టు! మానేయ్య కూడదూ!” ఒక ఫ్రెండ్ గా ఎన్నిసార్లు,ఎన్నిచెప్పాలని చూసినా చులకనగా తీసిపారేశాను! నీకేం తెలీదు పో డాడీ! అన్నాను. నాన్న మాటల్లో ఎంత వాస్తవం ఉంది! నాన్న గొప్ప ఇంధనం!

“చూసావుగా రఘు?! ట్రైన్ లో ఆ తల్లులు నిత్యం తమ బిడ్డల కోసం నిత్యం ఎంత కష్టపడుతున్నారో?”

నిజమే! అమ్మ కూడా ఎంత తపన పడుతుంది! వాళ్లకి నేను చేసే చెత్త పనులు తెలిస్తే ఎంత క్షోభ పడతారు! తల్లి కొవ్వొత్తికి ప్రతీక! నాకు కంట్లోంచి కాదు, గుండెల్లోంచి కన్నీళ్లు పొంగుతున్నాయి!

“రఘు!ఇంకో విషయం-ఐ ఐ టీ పక్కనెట్టి మేనేజ్ మెంట్ వైపు ఆలోచించు!నీలో లీడర్ షిప్ లక్షణాలు వున్నాయి! మనం ఏమిటోమనకే అర్ధం కావాలి!మనలోని బలాలు,బలహీనతలు తెలుసుకుని తగ్గట్టు రహదారి నిర్మించుకోవాలి!” అంకుల్ చెప్తుంటే కొత్త ద్వారాలు తెరుచుకుని ఇంత వరకూ చూడని దారులు విశాలమైకనిపిస్తున్నాయి!

“అవునా అంకుల్! కానీ.. కానీ .. “ బలమైన బలహీనతల్ని వదలలేకపోతున్నాను!

“ఈ వయసులో మందు,సిగరెట్లు కిక్ ఇస్తాయి కానీ క్విక్ గాజీవితాన్నిఅగాధంలోకి తోస్తాయి!రఘు, నీకోసం నువ్వు ఏపనైనా చెయ్యి! అది మంచో చెడో నీకు నువ్వే చెప్పుకో! ఆలోచించుకో కానీ ఆరోగ్యం, జ్ఞాన సంపద, ఏ పని చేసినా గమ్యం వైపు దృష్టి పెట్టడం ఇవి మాత్రం మరిచిపోకు!”  ట్రైన్ శరవేగంతో సిర్పూర్ కాగజ్ నగర్ విద్యుత్ కేంద్రం ప్రక్కగావెళ్తోంది! ఈ 30 గంటల ప్రయాణంలో అనుభవలేమి ఇంధనమై మండి లోపాల్ని దహించి తేజోమంతమై నా హృదయంలోదీపాలువెలుగుతున్నాయి! దేశంలోని యువత లోపలి పొరలని స్పర్శి స్తూ నిద్రాణమైన యువశక్తీని నిద్రలేపుతూన్నట్టు అంకుల్ స్వరం పలుకుతోఒదిలా –

“రఘూ! అటు చూడు! చీకట్లని పారద్రోలాలని విద్యుత్కేంద్రం వెలుగులు విరజిమ్ముతోంది! ఉరకలేసే ఉత్సాహంతో నువ్వు ఒక విద్యుత్ కేంద్రం లా తయారవ్వాలి!”

మరిన్ని యువతరం