Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
veremettu

ఈ సంచికలో >> యువతరం >>

ముఖ పుస్తకం

mukha pustakam

హ్..న్నో..!" పాత సినిమాల్లో పావలా సీన్ కి పది రూపాయల ఎక్సప్రెషన్ చూపిస్తూ, వంద రూపాయల వాల్యుబుల్ పిచ్ ని వాయిస్ లో ఒలికిస్తూ అరిచినట్టు గట్టిగా అన్నాడు అతుల్ కళ్ళముందున్న ఆండ్రాయిడ్ ఫోన్ లోంచి కళ్ళు త్రిప్పే ప్రయత్నం మాత్రం అప్రయత్నంగా నైనా చేయకనే.

"వాట్ మై సన్...ఎందుకలా అరిచావ్?" అడిగాడు నెలకు పదిలక్షల జీతం సంపాదించే సాఫ్ట్ వేర్ ఇంజనీరైన సారంగ్,  తెల్లవారు ఝాము దాకా ఇండియా లోని తన కంపెనీ మీటింగ్ కి అట్టెండయి, అప్పుడే మెల్లగా కోడినిద్ర లోకి జారుకోబోతుంటే అయిన డిస్ట్రబెన్స్ కి విసుగ్గా లేచొచ్చి.

"చూడండి డాడ్..మాం ఏమంటుందో. నెక్స్ట్ మంత్ మనం అందరం తిరుపతి వెళ్ళాలట"  కంప్లైంట్ చేస్తున్నట్టు అన్నాడు ముక్కూ ముఖం తెలియని ఫేస్ బుక్ ఫ్రెండ్స్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్స్ కి లైక్ కొడ్తూ.

"అరె. వాట్ మై డియర్ జానూ. టాపిక్ రేపటికి పోస్ట్ పోన్ చేస్కో. ఓకే మై సన్. ఈ మేటర్ రేపు కంటిన్యూ చేసి డిసైడ్ చేద్దామేం?" చెప్పేసి అక్కడే ఉన్న సోఫాలోకి ఆవలిస్తూ అమాంతంగా జారిపోయాడు సారంగ్ వురఫ్ సారంగపాణి.

"నీ చిన్నప్పుడు అన్నప్రాశన చేయించేసి ఇక్కడి కొచ్చేశాం. ఇక అప్పట్నుంచీ ఈ ఇరవై నాలుగేళ్ళుగా కనీసం ఇండియా వైపు తలపెట్టి పడుకునే సమయమైన లేనంత బిజీ బిజీ అంటూ మీనాన్న ఇంట్లో ఉన్న నాతో కూడా పరధ్యానంతో గజిబిజిగా మాట్లాడేస్తూ వుంటాడు. మీ నాన్నమ్మ మీ నాన్న చిన్నపుడే కాలం చేసిందట. ఇక మీ తాతగారు పదేళ్ళ క్రితం పోయారు. అప్పుడైనా పోయి రావచ్చనుకుంటే అర్జెంట్ వర్క్ వుందని వెళ్ళకుండా ఇక్కడే ఒక పంతుల్ని పిలుచుకుని ఇంట్లోనే శుద్ధి నీళ్ళు చల్లించేస్కున్నాం. మొన్న రెండేళ్ళ క్రితం మా బామ్మ పోయినప్పుడైనా నయం స్కైప్ లో అయినా అందర్నీ చూడగలిగా. అప్పట్నుంచే నాకు మన ఊరెళ్ళాలని, నీ పుట్టు వెంట్రుకలు వేంకటేశ్వర స్వామికి ఇచ్చి మొక్కు తీర్చుకోవాలని ఆశ కలిగింది రా." అంటూ కడుపులో వున్నదంతా వెళ్ళగ్రక్కింది జానకి.

"దటీజ్ నాట్ ఆశ...ఓన్లీ దురాశ. ఆర్యూ మ్యాడ్? ఇప్పుడు నాకు గుండు చేయిస్తావా?"  ఫేషన్ పేరుతో ముద్దుగా బొచ్చుకుక్క తోకలా జెల్ పెట్టి పోషించుకున్న తన బారెడు పోనీటైల్ ని ప్రేమగా నిమురుకుంటూ అరిచాడు అతుల్.

"ఓర్నీ..మ్యాడ్ మై సన్నూ! అదా నీ బాధ? డోంట్ వర్రీ. ఇప్పుడు ఇండియాలో గుండే ఫ్యాషన్. సో మ్రొక్కూ తీరుతుంది. స్టైల్ కి ప్రాబ్లెం రాదు. వన్ బుల్లెట్ కి టూ బర్డ్స్ అన్నట్టు. ఇక పోతే రెండునెలలు అక్కడే వుండి వస్తాం కాబట్టి ఇక్కడి నీ ఫ్రెండ్స్ నీ గుండుని చూడరు. కాకుంటే కొన్నాళ్ళు ఫేస్ బుక్ లో నీ సెల్ఫీస్ పోస్ట్ చేయకుండా వుండు చాలు. ఏమంటావ్?" అంది జానకి ప్రాధేయ పూర్వకంగా.

ఓకే..ఓకే..నీ మాట కాదంటే అడ్డదిడ్డంగా అడ్డొచ్చే వైరస్ లా నన్ను వేపుకు తింటావ్. మన 'ఇంటరెస్ట్ గాడ్ ని ' ఎప్పుడు మనం చూడబోతున్నాం?"  అడిగాడు అతుల్ కాస్త మెత్తబడి.

"ఆ..ఆయనెవరు?" ఆశ్చర్యం గా చూసింది జానకి.

"అదే మామ్ 'వడ్డీ కాసుల వాడు ' మీన్స్ 'ఇంటరెస్ట్ గాడ్' కదా? అంటూ తెలుగు టు ఇంగ్లీష్ ట్రూ ట్రాన్స్ లేట్ చేసి చెప్పాడు నవ్వుతూ ఫేస్బుక్ లోకి ఫేస్, ఫోన్ లోని వాట్సప్ లోకి వ్రేళ్ళు బిజీగా ఇరికించేస్తూ.

జానకి వురఫ్ జానూ మాత్రం ఎవరెస్ట్ కొండంచు మీద పుష్కలం గా ఆక్సిజన్ అందినంత హాయిగా ఊపిరి పీల్చుకుని నిద్రపోయింది కలలోనే 'నమో వేంకటేశా ...' పాడుకుంటూ అలిపిరి దాకా నడిచెళ్ళిపోతూ.

*****

"ఒసే..అలిమేలు మంగ తాయారూ! కాస్త మీ బావ కంట సంగటి ముద్దెట్ట తినాలో నేర్పించు పో. వాళ్ళమ్మ, నాన్న ఏదో ఆఫీసు పనుందని ప్రక్క టౌను కెళ్ళారు" ఇంట్లోనే వుండే విధవ మేనత్త మరియు జానకి అక్క కేకేసింది అలిమేలుని.

"ఎందుకు కమలమ్మా దాన్నట్ట ఏడిపించేది. దానికట్ట పిలిస్తే కోపం వస్తాదని నీకు తెలవదా?" విసుక్కుంది అలిమేలు తల్లి సరోజ. మన 'అలిమేలు మంగ తాయారు  వురఫ్ 'అస్మిత' తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది అక్కడే హాస్టల్లో వుంటూ. సెలవుల్లో ఇంటికొస్తుంటుంది. పైగా అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి అత్త, మామ విత్ వాళ్ళ లాడ్లా బేటా తో వచ్చారని తెలిసి ఎప్పుడెప్పుడు చూద్దామాన్న ఆత్రం తో వచ్చింది కూడాను.

తీరా ఆ బావగాడ్ని చూస్తూనే ఉత్సాహమంతా గాలిపోయిన బెలూన్లా తుస్సు మంది. ఇండియా రాగానే నేరుగా తిరుమల వెళ్ళి మ్రొక్కు తీర్చుకున్నాక ఇంటికొచ్చారేమో..తెల్లగా జొన్న సంకటి ముద్దలా అత్తగారి తల, కాస్త ఎరుపేమో అరగొండ బెల్లం ముద్దలా మామ తల, ఇక వాళ్ళ కొడుకు తలైతే చిన్నప్పుడు తగిలి మానిన గాయాలతో అక్కడక్కడా జీడి పలుకులు, ఎండు ద్రాక్ష వున్నట్టు అచ్చుగుద్దిన తిరుపతి లడ్డూలా వుండి మూడు గుండ్రటి గుండ్లతో అలిమేలు ఆశల్ని నీరు గార్చారు.

అది చాలదన్నట్టు కమలమ్మ చెప్పింది బావ గాడి పేరు "వెంకట రమణ శ్రీనివాస భజ గోవిందం" అట. ముక్కలు ముక్కలుగా తెంపినా అన్నీ పాత పేర్లే అనుకుంటూ జానకి వాళ్ళకోసం కేటాయించిన గది దగ్గరికొచ్చింది అలిమేలు.

"ఏంటి..అలమేలు మంగ తాయారు ఇలా వచ్చావ్?" అన్నాడు లాప్ టాప్ లో కి ఎడమచేయప్పగించి కుడిచేయి సంగట్లోకి ఎలా పెట్టాలో అర్ధం కాక వెర్రిమొహం వేస్కుని చూస్తున్న అతుల్ వేళాకోళం గా. "మాట్లాడ్తేనే నచ్చని మొగుడు ఆట కూడా పట్టిచ్చాడన్నట్టు" ఫస్ట్ లుక్ లోనే ఫేలైన నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టే ధైర్యం కూడానా? ' అనుకుంది అస్మిత కోపం గా.

"నీ అమెరికా మొహానికి సంగటి తినటం కూడా రాదని అత్త నేర్పమంటే వచ్చా బావ" అంది పళ్ళు కొరికి. "వ్వాట్...ఏమన్నావ్?!" అంటూ లేవబోయాడు విసురుగా అతుల్. "అంటే..మీవి అమెరికాలో వుండే ఫేసులు కదా? దాన్నే పల్లెటూరి తెలుగులో కాస్త మోటుగా చెప్పింది అక్క. ఇదిగో ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంపు కుని వాటిని కర్రీలో మునకలేయించి గుటుక్కున మ్రింగేయడమే " అన్నాడు అక్కడికొచ్చిన అస్మిత తమ్ముడు శ్రావణ్.

"ఓస్..ఇంత సింపులా?" అంటూ నాలుగైదు ముక్కలు తుంపి గుటుక్కుమనిపించాడు అతుల్ ఆత్రంగా.

"అయినా మీ పిజ్జా బ్రతుకులకు ఇంత బ్రెడ్లో అంత జాం పూస్కుని లాగిం చెయ్యక ఎందుకు బావా సంగటి జోలికి అనవసరం గా రావటం?" అంటూ అక్కవైపు గుంభనం గా నవ్వుతూ చూసి లేని జాలి అతుల్ పైన కురిపించేశాడు.

"మామ్ చెప్పింది శ్రవణ్ ఈ వెరైటీ టేస్ట్ గురించీ. అందుకే ఒకసారి చూద్దామని" అన్నాడు వాళ్ళ వ్యంగ్యాన్ని పట్టించుకోకుండా. "అవును బావా..చేంతాడంత వున్న నీ పేరుని చూసి మీ అమెరికా ఫ్రెండ్స్ నవ్వలేదా? అడిగింది అస్మిత మంచినీళ్ళ గ్లాసు ప్లేటు ప్రక్కనుంచుతూ.

"నా పేరు సంగతి తరువాత గానీ...మొల త్రాడంత వున్న నీ పేరు చూసి మీ ఇండియా ఫ్రెండ్స్ ఎంత నవ్వారో అది చెప్పు ముందు" అన్నాడు అక్కసుగా అతుల్.

"అబ్బో...వీడి బర్గర్ ఫేసుకీ సెటైర్లొచ్చే!" మెల్లగా గొణిగాడు శ్రవణ్.

****

సాయంత్రం జానకి వాళ్ళు వచ్చేశాక అంతా కలిసి తోటలు, పొలాలు తిరిగి వచ్చారు. మర్నాటి నుంచీ చుట్టూ వున్న ఊళ్ళల్లోని బంధువులు, చుట్టాలు రావటం, భోజనాలకు రమ్మని ఆహ్వానిస్తే వీళ్ళు వెళ్ళటమనే కార్యక్రమం నిర్విరామంగా మొదలైంది. అందరికీ అమెరికా నుంచీ తెచ్చిన గిఫ్ట్లు, చాక్లెట్లు పంచారు. ఎక్కువగా జానకి బంధువులే వున్నారు. అంతా ఎపుడో విదేశాలు, సిటీలు వెళ్ళి పోవటం తో సారంగ్ రిలేటివ్స్ చాలా తక్కువ వున్నారు. అన్ని చోట్లకీ వాళ్ళతో శ్రవణ్, అస్మితలు వెళ్ళి తీరాల్సిందే అని జానకి అన్న రామచంద్ర ఆర్డర్ వేయడం తో వెళ్ళక తప్పలేదు ఇష్టం వున్నా లేకున్నా. అన్ని చోట్ల అస్మితను 'బుజ్జమ్మ' అని, అతుల్ ని 'అమెరికా బాబు' అని పెట్ నేంస్ పెట్టి పిలవటం తో వాళ్ళ పేర్లతో వుడుక్కునే బాధ తప్పింది. వెళ్ళిన ప్రతి చోటా అస్మితకు బాగా తెలుసు కాబట్టి అమ్మాయి లంతా ఆమెతో కలసి అతుల్ ని ఆట పట్టించేవాళ్ళు.

"మిష్టర్ 'ఏ.జి' గారూ కొబ్బరి బొండాం త్రాగుతారా అని అడగమంది మా అమ్మ" అంది చిన్న మామగారింటికెళ్ళినపుడు వాళ్ళ అమ్మాయి. "ఏ.జీ..అంటే?" అర్ధం కాక అడిగాడు అతుల్ ముఖం చిట్లించి.

అది కూడా తెలియదా..'అమెరికా గుండోడు' అనేసి ఇంట్లోకి తుర్రుమంది అస్మితతో కలిసి నవ్వుకుంటూ. అలాగే, శ్రవణ్ ఫ్రెండ్స్ కూడా 'ఫేస్ బుక్ పిచ్చోడు', 'వాట్సప్వెర్రోడు' అంటూ నిక్ నేమ్స్ పెట్టి ఏడిపించ సాగారు.

మామిడి తోటల్లో ఉయ్యాల లూగటం దగ్గర్నుంచీ తాటి ముంజెలు తినే దాకా అన్నీ తన కెమెరాలోకి ఎక్కించేశాడు అతుల్. అలాగే అయిన వాళ్ళ ఆప్యాయతల్ని క్రొత్తగా చవి చూసినందువల్లేమో అంతవరకు చిరాకు పడినా వాళ్ళ అల్లరిని పట్టించుకోకుండా హాయిగా నవ్వేయడం నేర్చుకున్నాడు క్రొత్తగా.

చుట్టాలకు అతుల్ నచ్చినా, వాడికి ఆల్రెడీ అస్మిత వుంది కదా అని సంబంధం గురించీ అడగటానికి ధైర్యం చేయలేదు ఎవరూ. ఈ రెండు నెలల్లో అతుల్ బలవంతం గా సెల్ఫీ లు  పెట్టకుండా ఆగ గలిగినా, ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఆకాశం నుంచి అట్లకాడ దాకా అన్నిట్నీ ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటం, వాటికొచ్చే బోలెడన్ని లైకులు కామెంట్లకు మురిసి పోవటం మాత్రం మానలేదు.

ఆఖరికి అతుల్ ఫ్యామిలీ తిరుగు ప్రయాణమైంది. అన్నతో వియ్యమందాలన్న ఆశతో అస్మిత గురించీ అతుల్ ని అభిప్రాయ మడిగింది జానకి."ఛి..చ్ఛీ!" అన్నాడు అతుల్.ఇక అస్మితను సైతం తిరుపతి బస్ ఎక్కిస్తూ కూతురి చేతికి లగేజ్ అందించి రామచంద్ర అడిగాడు అమెరికా బావ మీద నీ ఉద్దేశ్యం చెప్పమని."ధూ..యాక్!" అంది అస్మిత.

*****

రాత్రి హాస్టల్ రూం లో నలుగురు స్నేహితురాళ్ళు అస్మిత చుట్టూ చేరారు. అందరూ అన్ని కబుర్లూ పంచుకున్నారు. ఈ లోపు అస్మిత తన ఫేస్ బుక్ ఫ్రెండ్ తో ఛాటింగ్ మొదలు పెట్టింది. స్నేహితురాళ్ళు ఇంట్రెస్ట్ గా వాళ్ళ ఛాటింగ్ చూస్తూ కామెంట్స్ చేయసాగారు. మరి సినిమా యాక్టర్ల గాసిప్స్ కి, ఫ్రెండ్స్ లవ్ ఛాటింగ్ కి వున్నంత క్రేజ్ మరి దేనికీ లేదుకదా నేడు!

"హాయ్..అతుల్!  ఐ మిస్ యు ' అంటూ స్టార్ట్ చేసింది అస్మిత.

"ఏయ్ అస్మి..ఐ మిస్ యు టూ రే" అన్నాడు అతుల్.

"సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశావ్?" అడిగాడు తనే మళ్ళీ.

"వెరీ ఫన్నీ. మై ఆంట్స్ ఫ్యామిలీ కేం టు అవర్ విలేజ్" ఛాటింగ్ ఇంగ్లీష్ గ్రామర్ కి గ్లామరద్దింది.

"ఓ..ఐ అల్సో వెంట్ మై మామ్‌స్ నేటివ్ ప్లేస్ యునో" అన్నాడు అతుల్ ఇంగ్లీషు లెటర్స్ తో గోళీకాయలాట ప్రాక్టీస్ చేస్తూ.

"మా అంకుల్ కొడుకు వచ్చాడు తెల్సా. మా ఇంట్లో అతనితో నాపెళ్ళిచేయాలని ప్లాన్ కూడా వేసారు. నేను గట్టిగా నో చెప్పేసా తెల్సా?" అని టైప్ చేసింది అస్మిత.

"మరి చేస్కోక పోయావా?" అన్నాడు.

"పేరు వింటేనే పవర్ పోతుంది. బోర్లించిన పింగాణీ జార్ లా వున్నాడు. అయినా నువ్వెంత స్టైలిష్ గా వుంటావ్...జులాయ్ లాంటి జుట్టూ, పోకిరి లాంటి లుక్స్, జోష్ గా వుండే నవ్వు. ఓకే నీ కంటే బాగుంటే సరే అందామనుకున్నా. బట్ నువ్వు వెరీ లక్కీ. నేన్నిన్నే సెలెక్ట్ చేస్కున్నందుకు" భక్తుడికి వరమిస్తున్న దేవతలా చెప్పింది అస్మిత ముసిముసిగా నవ్వుకుంటూ.

"వాటె కో ఇన్సిడెన్స్? నా మరదలూ అంతే అట్ల పెనం లా జిడ్డోడే జడ. ఓల్డ్ టామరిండ్ పికిల్ లాంటి నేం. పైగా తనో మిస్ విలేజ్ గా ఫీలైపోతూ నామీదే సెటైర్లేసేది. మా మామ్ కూడా నాకు తననిచ్చి చేయాలని చూసింది. బాప్ రే..! నీ కోసమే తప్పించు కొచ్చేశా తెలుసా?" అన్నాడు జానెడు మందంతో మేకప్ వేసి, లూజ్ గా కండిషన్ చేసి వదిలేసిన జుట్టుతో  లిప్ స్టిక్ పెదాల్ని సాగదీసి నవ్వుతున్న అస్మిత ఫేస్ బుక్ ఫోటో వంకే ఆరాధనగా చూస్తూ.

"ఓకే..మరి నీ మరదలి పేరు చెప్పు, నేను మా బావ పేరు చెప్తా చదివి నవ్వు కుందాం." అంది అస్మిత.

"యా రెడీ" అంటూ టైప్ చేయటం మొదలెట్టాడు అతుల్.

"వెంకట రమణ శ్రీనివాస భజ గోవిందం" అన్న పేరు చదివి అతుల్ అవాక్కైతే, వెనుకే నిలబడి అంతా గమనిస్తున్న జానకి మాత్రం "వావ్!" అని గట్టిగా అరిచింది ఆనందంతో.

"అలిమేలు మంగ తాయారు" అన్నపేరు స్క్రీన్ మీద చూసి తన ఫ్రెండ్స్ అంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుంటే, తన ఫేస్ బుక్ ఫ్రెండే తను వద్దు వద్దనుకున్న బావని తెలిసి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైపోతూ సిగ్గుల మొగ్గయ్యింది అస్మిత.

 

 

 

మరిన్ని యువతరం