Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue331/840/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి).... ఛ…ఛా…నేను నీ ప్రియసఖిని. నిన్ను తప్పుగా అనుకుని నన్నునేను అవమానించుకోలేను. కాకపోతే… వాడలా కాకమ్మ కథలు వినిపిస్తున్నాడంటే… దానికి మూలం ఏదో ఒకటి ఉండాలి కదా! అందుకే…నిన్ను గుచ్చిగుచ్చి అడిగింది. ఆ వెధవకి ఎంతధైర్యం?’’ ఉక్రోషంతో రమ్య పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

మౌక్తిక ముఖం జేవురించింది. రక్తమంతా ముఖంలోకి పొంగుకొచ్చినట్లుగా ఎర్రగా మారిందామె మోము. అవమానభారంతో తనువు నిలువెల్లా కంపించింది. పొనీ కదా…వానలో తడిసి ముద్దైనాడన్న జాలితో లోపలికి రానిస్తే…తనమీద అత్యాచారం చేయడానికి ట్రై చేసి అది కుదరక పోయేసరికి, రివర్స్ గేర్ లో దుష్ప్రచారం చేస్తున్నాడు. రాస్కెల్…ఎంతకు తెగించాడూ!

లజ్జాభారంతో మండిపోతున్న మనసునీ, పూలతీవెలా ఊగిపోతున్న తనువునీ కంట్రోల్ చేయడానికి విఫలయత్నం చేసింది మౌక్తిక. ఉద్రేకంతో ఆమె హృదయం ఉడికిపోయింది.

వెధవన్నర వెధవ… నోరుంది కదాని ఇష్టానికి వాగుతాడా!? లాభంలేదు. వీడినిలా వదిలేస్తే అది మెతకదనంగా భావించి ఇంకా పేట్రేగిపోతాడు. ఈకాలేజ్ లో తన పరువు తీస్తాడు. వాడినోరు మూయించే తీరాలి. విసవిస నడుస్తూ స్టాఫ్ రూమ్ కేసి నడిచింది మౌక్తిక… ఆమె ఆగ్రహం చూసి  బెదిరిపోయిన రమ్య ”ముక్తా ఆగు… నామాట విను…’’ అని అరుస్తున్నా ఆగకుండా. స్టాఫ్ రూమ్ లోకి ప్రవేశిస్తూండగానే “బయటకలా  అమ్మమ్మలా …ఎమీ ఎరగనట్లు ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది గాని,ఆ మౌక్తిక ‘అక్కడ’ మాత్రం ఎంత యాక్టివో తెలుసా!’’ శివాజీ చెప్తూండడం చెవులారా వింది మౌక్తిక.

ఇక ఆలస్యం చేయకుండా తిన్నగా వెళ్ళి అన్నం తింటున్న శివాజీ షర్ట్ కాలర్ పట్టి గుంజింది మౌక్తిక.

“ఏయ్ మేడమ్… ఏమిటీ రౌడీయిజం…ముందు షర్ట్ వదలండి’’ ఆమె చేతిని నెట్టేయాలని చూశాడు శివాజీ. మౌక్తిక చూపులకే మండించేగుణం ఉండుంటే కనుక అతడా క్షణమే మాడి మసైపోయుండేవాడు.

“ఏంట్రా రాస్కెల్… నువ్వు రాత్రంతా నా గదిలోనే ఉన్నావా? తెల్లార్లూ మనం కలిసి ఎంజాయ్ చేశామా! నీది నాలుకా ? తాటిపట్టా? స్త్రీల పట్ల నీకింత చులకన భావమా! నీ నాలుక తెగ్గోసినా పాపంలేదురా’’ హిస్టీరిగ్గా అరవసాగింది మౌక్తిక. అప్పటికే అక్కడ లంచ్ చేస్తున్న స్టాఫ్ వాళ్ళ చుట్టూ మూగారు. అంతా వినోదం చూస్తున్నట్లుగా నిలబడ్డారేగాని, ఏ ఒక్కరూ కూడా జోక్యం చేసుకోలేదు. దానికి కారణం మౌక్తిక రౌద్రాకారం కావచ్చు. భీతి గొలిపేట్లుగా ఉన్న ఆమె వాలకాన్ని చూసి కాస్త బెదిరాడు శివాజీ. అతడి ముఖం కత్తివేటుకి నెత్తుటి చుక్క రాలనంతగా పాలిపోయింది. ఆమె అంతలా రియాక్టౌతుందని అతడూహించలేదు. ఏదో… సొల్లు కార్చుకుంటూ తన చుట్టూ మూగే సోంబేరి బ్యాచ్ ని ఆకట్టుకునేందుకే అతడా కట్టుకథను వినిపించాడు. కాని, అది మౌక్తిక చెవిదాకా వెళ్తుందని,ఆమె ఇలా దాడి చేస్తుందని అతడస్సలనుకోలేదు.
చుట్టూ మూగిన వాళ్లని తోసుకుంటూ ముందుకొచ్చారు శమంతకంగారు, అహోబిలం గారు.

“అమ్మా మౌక్తికా… ఏం జరిగిందమ్మా? ఎందుకలా ఆవేశపడుతున్నావూ?’’ అడిగారు శమంతకం గారు ఉగ్రరూపం దాల్చి, నిప్పులు కురిపిస్తున్న మౌక్తికను.మౌక్తిక కోపం ఇంకా చల్లారలేదు. పళ్ల బిగువున దుఃఖాన్ని అణిచి ఉంచడంతో ఆమె పెదవులు అదురుతున్నాయి.

“ఏమైందమ్మా… నీ తండ్రిలాంటి వాడిని నాతో చెప్పవూ?’’ అనునయంగా అడిగారు శమంతకం గారు. భోరుమని ఏడ్చేసింది మౌక్తిక గట్టు తెగిన గోదారల్లే.

“ముక్తా గారూ..ప్లీజ్ రిలాక్స్…’’ ఆస్వరం విని చప్పున తలెత్తి చూసింది మౌక్తిక.ఎదురుగా మధుకిరణ్. మౌక్తిక ముఖం వెలవెలబోయింది. ఏమని చెప్తుంది! తనను ఇలా బహిరంగంగా అవమానించిన శివాజీమీద కక్ష బయలుదేరింది. ఛ… ఇంతకన్నా తాను చచ్చిపోయి ఉంటే బాగుండేది.

ఆమె అసహాయత, అవస్థ గమనించిన రమ్య జరిగినది క్లుప్తంగా వివరించింది. శమంతకంగారు ముక్కున వేలేసుకున్నారు. మధుకిరణ్ శివాజీని మింగేసేలా చూశాడు. తాను చేసిన తప్పు ఇలా నలుగురి ముందు బహిర్గతమవడంతో అవనత వదనుడై నిలబడ్డాడు శివాజీ.ఇలా జరుగుతుందని అతడు కూడా ఊహించి ఉండడు. లేనిపోనివి కల్పించిచెప్పి, తన భజన బృందం దగ్గర హీరో అయిపోదానుకున్నాడు. వికృతమైన మానసికానందాన్ని అనుభవించాలనుకున్నాడు. కాని, చివరకు ఘోరంగా పరాభవింపబడ్డాడు.

శమంతకం గారు అతడిని తీవ్రంగా మందలించారు. ఇకముందెప్పుడైనా ఇలా…నీచంగా ప్రవర్తిస్తే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు.

“వర్ణించి, వర్ణించి నిజమనుకునేలా చెప్పాడు. నేనప్పుడే అనుకున్నాను మౌక్తికా మాడమ్ అటువంటివారు కాదని.’’ ఇంతసేపూ శివాజీ వినిపించిన కట్టు కథలని ఏ రామాయణమో, మహాభారతమో వింటున్నంత ఆనందంగా ఆలకించినవాళ్ళు ఊసరవెల్లుల్లా రంగుమార్చి ప్లేటు ఫిరాయించారు. మాలతి, నవనీతలకి చాలా వినోదం కలిగిస్తోందీ సంఘటన. వికృతానందం పొందుతూన్నట్లుగా చూస్తూ నిలబడ్డారు.

“మీరు చాలా తప్పు చేశారు శివాజీ గారూ… మీరు చేసినవి ఒకటి కాదు రెండు తప్పులు … నిన్న రాత్రి వానలో మీకు ఆశ్రయమిచ్చిన మౌక్తికగారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఒకటైతే… జరిగినదాన్ని వక్రీకరించి ప్రచారం చేయడం ఇంకోటి. స్త్రీ అంటే ఎవరనుకున్నారు? శక్తి స్వరూపిణి, మమతల పాలవెల్లి. మన తల్లి, చెల్లి, అక్క, భార్య అందరూ స్త్రీలే. వారిపట్ల ఎవరైనా ఈరకంగా ప్రవర్తిస్తే మనకెలా ఉంటుంది!?
కాస్త ఆలోచించండి. మగవాడి జీవితానికి ఆసరా, ఆలంబన అయిన మగువను అవమానిస్తే పుట్టగతులుండవు. ఇంకోసారి ఇటువంటి తప్పులు రిపీట్ కానివ్వకండి.’’ మధుకిరణ్ మాటలు మెత్తగానే ఉన్నా, చురకల్లా తగిలాయి శివాజీకి.

అతడి బుర్ర భూమిలోకి కృంగిపోతోంది. ఎటూ మాట్లాడలేక బయటకి వెళ్లిపోయాడు.

“వెళ్లండయ్యా..వెళ్లండి. అందరూ సినిమా చూస్తున్నట్లుగా నిలబడ్డారు. ‘చెప్పేవాడికి చెముడైతే వినేవాడికి వివేకం ఉండద్దూ! ‘’ కేకలేశారు శమంతకం గారు.ఎవరి సీట్ల దగ్గరకి వారు వెళ్ళిపోయారు. మౌక్తిక మెదడంతా గజిబిజిగా గందరగోళంగా తయారైంది. తాను సదుద్దేశ్యంతో అతడిని ఇంట్లోకి రానిస్తే ఇతడింత వరస్ట్ గా బిహేవ్ చేశాడేమిటీ! నలుగురిలో తనను నవ్వులపాలు చేశాడు. తలెత్తుకోలేనంతగా పరాభవించాడు.  తన ముఖంమీద ఎవరూ ఏమీ అనకపోయినా ఒక్కొక్కరి చూపుల్లో ఒక్కో రకమైన భావం గోచరిస్తోంది.

‘ఆ(…ఇది ఏదో చేసుంటుంది. లేకపోతే అతడంత నిర్భయంగా చెప్తాడా! కల్పించి చెప్పవలసిన అవసరం అతడికేముంది?’ అన్న భావన కొందరిదైతే… ‘అయ్యో పాపం! ఆడపిల్ల…ఇలా పదిమందిలో పలుచనైతే రేప్పొద్దున్న ఆమె భవిష్యత్తేమిటి?’ అన్న జాలి కొందరి దృక్కుల్లో నిండి ఉంది. అనుమానం, అవహేళన , జాలి, ఆసక్తి…ఇత్యాది భావాలు నిండిన వాళ్లచూపులు తనని చురకత్తులై చీల్చేస్తున్నట్లుగా ఉంది. మనసంతా మసకబారిన అద్దంలా తయారైంది. అది ఆమెను అంతర్ముఖురాలు కాకుండా అడ్డుకుంటోంది. ఓదార్పుగా ఆమె వెన్ను నిమిరింది రమ్య.“వ్వావ్…నువ్వు ‘ అంతర్ముఖి’ వే అనుకున్నాను. అవసరమైతే ‘ఆదిశక్తి’గా కూడా మారగలవని ఇప్పుడే తెలిసింది.’’ చిలిపిగా నవ్వింది రమ్య. ప్రస్తుతం తానున్న మూడ్ లోనుంచి బయటకు రప్పించడానికే ఆమె అలా అంటోందని మౌక్తికకి అర్ధమైంది. కన్నీళ్ళు తుడుచుకుంటూ తేలిగ్గా నవ్వేసింది. రమ్య వదనం నిండా సంతోష తరంగాలు అలుముకున్నాయి.“ఎందుకంత ఎక్సైట్ అయ్యావు ముక్తా…’’ లాలనగా అడిగింది రమ్య. ఇందాకటి తన ప్రవర్తన తలుచుకుని సిగ్గుగా తలదించుకుంది మౌక్తిక. కాని, తాను అలా రియాక్టవడం సబబే అని ఆమెకు తెలుసు.“ఏస్త్రీ అయినా తన క్యారెక్టర్ మీద చెడుముద్ర పడడం సహించలేదు రమ్యా. అతడు నామీద వేసినది నిందేనని నిరూపించకపోతే …దాన్ని అలుసుగా తీసుకుని రేప్పొద్దున్న ఇంకెవడో, ఇంకేదో కూస్తాడు. అందుకే… నోరు తెరవాల్సి వచ్చింది’’

“నిజమే ముక్తా… అపవాదు అగ్నికన్నా ప్రమాదకరమైనది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనం దానికి ఆహుతైపోతాము. మంచిడోసే ఇచ్చావు వాడికి. ఈ దెబ్బతో నీజోలికే కాదు…మరే ఇతర ఆడదాని జోలికీ పోడు.’’ అభినందించింది రమ్య.

“సారీ ముక్తాగారూ… మీకెదురైన పరిస్థితి ఇంకే ఆడపిల్లకీ ఎదురవకూడదు. కాని, మీరు స్పందించిన విధానం, అతడి వైఖరిని ఖండించిన తీరు మాత్రం అపూర్వం. ఆల్ ది బెస్ట్’’ సుతిమెత్తని స్వరంతో ఆమెను మెచ్చుకుని తన సీటు దగ్గరకి వెళ్ళిపోయాడు మధుకిరణ్.

అతడి వాక్కులు చెవిలో అమృతజలం చిలకరించినంత తీయగా ధ్వనించాయి. రమ్య సాభిప్రాయంగా చూసింది అతడివైపు. అక్కడితో ఆగొడవ సద్దు మణిగింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్