Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> చివరికి మిగిలింది!

chivaraku migilindi

ఇంటి యజమాని  రాజయ్య  వృధ్యాప్యం తెచ్చిన రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం సరిగ్గా మట్లాడలేని, ఎవర్నీ పోల్చుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆఖరికి ఎప్పుడైతే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తిరోగమించిందో అప్పుడే అతని చెయ్యి, కాలుపడిపోవడమే కాకుండా నోట మాట కూడా దాదాపు పోయింది. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు అతని కుటుంబ సభ్యులు.  బీపీ, సుగర్‌ ఉండటంతో, కిడ్నీ, లివర్‌ కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.  నెల రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాత పరిస్థితి మరింత క్షీణించడంతో డాక్టర్లు పెదవి విరిచి దగ్గర బంధువులందరికీ కబురు చేసుకోమని చెప్పనే చెప్పారు.  ఈ మాటవిని రాజయ్య భార్య కాంతం కళ్ళనీళ్ళు పెట్టుకొని తన కొడుకులిద్దరికీ సంగతి వివరించింది.  అప్పటికే మధ్యమధ్య ఆఫీస్‌కి వెళ్ళి వస్తున్నా కొడుకులిద్దరూ దాదాపు నెలరోజులనుండి తండ్రి దగ్గర హాస్పిటల్‌లోనే ఉన్నారు.

తొలుత అతన్ని మల్టీస్పెషల్ ఆస్పత్రిలో చేర్పించారు.  అయితే డబ్బుకి డబ్బు ఖర్చైనా ఆరోగ్యం మాత్రం చేకూరలేదు.  అంతే కాకుండా మరేం చేయలేమని చేతులెత్తేసారు డాక్టర్లు.  చనిపోయిన తర్వాత కూడా చికిత్స చేస్తూ వేలు, లక్షలు గుంజే కార్పరేట్ హాస్పిటల్స్ ఉన్న ఈరోజుల్లో వాళ్ళు కూడా కేసు వదులుకోవటంతో రాజయ్యన్ని ఇంటికి తీసురాక తప్పలేదు.  బహుశా అతని బంధువుల వద్ద మరి డబ్బులు మిగలలేదని అనుమాన పడ్డారో వాళ్ళు, లేక పేషంట్ తమ ఆస్పత్రిలో చనిపోతే తమకి చెడ్డపేరు వస్తుందని భయపడ్డారో ఆ దేముడికే ఎరుక.  మెరుగైన వైద్యం కోసం ఇంకో హాస్పిటల్‌కి తీసుకువెళ్దామన్నా, లేక ఇంకో చోటకి తీసుకెళదామన్నా చేతులో డబ్బులు లేవు, అప్పు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడింది.  రాజయ్య ఉద్యోగం చేసే రోజుల్లో బాగా సంపాదించాడని భార్య కాంతానికి, కొడుకులిద్దరికీ తెలుసుగానీ, ఏ బ్యాంక్‌లో ఉంచాడో తెలియకపోవడం వాళ్ళకి సమస్యగా మారింది.  అది తెలిసే ఉపాయం కనిపించలేదు.   అతను చెప్పే పరిస్థితిలో లేడు. కన్న కొడుకులకి, కనీసం భార్యకి కూడా ఎప్పుడూ ఆ విషయం  చెప్పలేదు రాజయ్య. ఆ విషయాన్ని పూర్తి రహస్యంగా దాచాడాయన.  అప్పటికీ వంతులు వేసుకొని కూర్చున్నారు అతని భర్యా, పిల్లలూను, ఎప్పటికైనా కళ్ళు తెరవబోతాడా, ఎమైనా చెప్తాడేమోనని ఎదురుచూస్తూ.

రాజయ్యకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్దవాడు రాంబాబు, చిన్నవాడు రవిబాబు ఆ పట్టణంలోనే ఉద్యోగం చేస్తున్నారు.  ఇక కూతురు కమల ఒక్కర్తే దూరప్రాంతాన ఉంది.  అయితే ఆమె రోజుకు మూడు నాలుగుసార్లు అయినా తండ్రి ఆరోగ్యం గురించి వాకబు చేస్తోంది.  రాజయ్య ని ఇంటికి తీసుకువచ్చాక ఆమెకి వెంటనే కబురు చేసారు.  ఆ తర్వాత రోజుకల్లా  కమల, ఆమె భర్త రమేష్ ఇంటికి చేరిపోయారు.  ఇక మిగతా దగ్గర బంధువులందరికీ కూడా కబురు అంది, ఒకొక్కరే రాసాగారు.  ఇలా వచ్చేపోయే బంధుజనంతో ఆ ఇల్లు చాలా సందడిగా ఉంది

"ఏంట్రా రాంబాబు!  ఎలా ఉన్నాడు మీ నాన్న?  తెలివొచ్చిందా?  కళ్ళు తెరిచాడా?"  అని అప్పుడే హడావుడిగా ఆటో దిగివచ్చిన రాజయ్య చెల్లెలు మాణిక్యం అన్నయ్య గురించి వాకబు చేసింది.

"లేదత్తా!  హాస్పిటల్‌నుండి తిరిగి వచ్చినప్పటినుండి కళ్ళు తెరవలేదు!" అన్నాడు రాజయ్య పెద్ద కొడుకు రాంబాబు విచారంగా.

"ఎమన్నార్రా డాక్టర్లు?  త్వరలో నయమవుతుందన్నారు కదా!"  ఆదుర్దాగా అడిగిందామె.

"ఏమో అత్తా!  డాక్టర్లైతే ఆశ వదిలేసుకోమన్నారు.  ఇక ఇంటికి తీసుకెళ్ళిపోండని, మరి మందులేమీ పనిచెయ్యవని తెగేసి చెప్పేసారత్తయ్యా.  అందుకే ఇంటికి నాన్నని తీసుకొచ్చేసాము.  అయితే  నాన్నని కనిపెట్టి ఉండడానికి ఒక నర్సుని తెచ్చేమనుకో.  మన వీధి డాక్టరే మధ్య మధ్య చూసి పోతున్నాడు." అన్నాడు రాంబాబు బెంగగా. అది విన్న మాణిక్యం రాగాలు తీస్తూ ఇంట్లోకెళ్ళింది. ఇక్కడ రాజయ్య గురించి కొంత ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  రాజయ్య ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఓ పదేళ్ళు దాటాయి.  రాజయ్య చదువు పూర్తైన తర్వాత సరి అయిన వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగంలో ఉండగా రెండుచేతులా బాగా ఆర్జించాడు.  ఉద్యోగంలో చేరిననాటి నుండి పైరాబడి బాగా ఉండే సీటేదో తెలుసుకొని దాని మీద కన్నేసాడు.  అయితే అటువంటివాటికి బాగా పోటి ఉండడంతో అతని కల చాలా రోజులవరకు నెరవేరలేదు.  ఏమైతేనేమి ఎట్టకేలకు ఉద్యోగంలో చేరిన పదేళ్ళకు నానా పైరవీలు చేసి, అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకొని అక్షయపాత్రలాంటి సీటు ఒకటి కొట్టేసాడు. ఆ తర్వాత నుండి అతను మరి వెనుదిరిగి చూసుకోలేదు.  తనకి చాలాకాలం తర్వాత దక్కిన అవకాశం సద్వినియోగం చేసుకొని చాలా సంపాదించాడు.  తన ఇద్దరు కొడుకులనూ బాగా చదివించాడు.  రాజయ్య ఉద్యోగంలో ఉండగానే వాళ్ళిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.  కూతురికి కూడా ఒక మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్ళిచేసి అత్తవారింటికి పంపించాడు.  సొంత ఇల్లు  కూడా  కట్టుకున్నాడు.

ఎంత అడ్డదారిన సంపాదించినా ఎప్పుడూ అవినీతి నిరోధక శాఖకి కాని, పై అధికార్లకి కాని ఎప్పుడూ చిక్కలేదు, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా గాని.  అలా ఎలా మేనేజ్ చేయగలిగే వాడో,  ఏ మేజిక్ చేసేవాడో  ఎవరికీ, చివరికి అతని సహోద్యోగులకి కూడా అంతు చిక్కేది కాదు.  అయితే అవినీతి పరులైన ఇతర సహోద్యోగుల్లా ఆడంబరంగా జీవించక, సామన్యమైన జీవితాన్ని గడిపేవాడు.  తనే కాకుండా భార్య, పిల్లల్ని కూడా ఆడంబరాల జోలికి వెళ్ళనియ్యలేదు.  అందుకే మిగతావాళ్ళు చాలా సులభంగా అవినీతి నిరోధకశాఖవారికి పట్టుబడితే రాజయ్య మాత్రం తప్పించుకొనేవాడు.  అంతేకాకుండా లంచం తీసుకొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించి తన మీద ఎవరి దృష్టి పడకుండా తప్పించుకునేవాడు.  అందుకే అతనితో కలసి పనిచేసే తోటి ఉద్యోగులకి రాజయ్యంటే చాలా మంటగా ఉండేది.  అతనంటే కిట్టనివాళ్ళు అతనిపై ఫిర్యాదు చేయడంవల్ల ఓ రెండుసార్లు అతని ఇంటిమీద దాడి చేసారు అవినీతి నిరోధక శాఖవాళ్ళు, ఆదాయపన్ను శాఖవాళ్ళు.  అయితే ఇల్లంతా కిందమీదా  గాలించినా అతనివద్ద పెద్దగా నగదు పైకం గాని, బంగారం గానీ వాళ్ళకు దొరకలేదు.  పోనీ ఏదయినా రియల్ ఎస్టేట్‌లోగానీ పెట్టుబడి పెట్టాడేమోనని ఆరా తీసారు.  అయితే దానికి కూడా ఏ మాత్రం ఆధారం చిక్కలేదు వాళ్ళకి.  వాళ్ళకి రాజయ్య విషయంలో మాత్రం మొట్టమొదటిసారిగా పూర్తి వైఫల్యం మాత్రమే మిగిలింది.  అలాంటి ఘనచరిత్ర కలిగిన రాజయ్య పరిస్థితి ప్రస్తుతం దీనాతి దీనంగా ఉంది. ప్రస్తుతం, పిల్లలిద్దరి వద్ద ఉన్న డబ్బులు యావత్తూ ఖర్చైపోవడమే కాకుండా పైన అప్పులు కూడా చేసేసారు.  ఇక మరి అప్పులు పుట్టవన్న సమయంలోనే ఓ అర్ధరాత్రి వేళలో రాజయ్య ఇహబంధాలన్నీ వదులుకొని ఆఖరి శ్వాస వదిలాడు. బంధువులే కాకుండా తెలిసినవాళ్ళూ, అతనితో కలసి ఇదివరకు పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు, ఇతర స్నేహితులు రాజయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు.  ఇంత సంపాదించినా ఆఖరిక్షణాల్లో అతనివద్ద అసలు డబ్బులు లేవని తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక ఉంటున్న ఇంటి దస్తావీజులు తెలిసిన వారిద్వారా తాకట్టు పెట్టి కొంత అప్పు చేసి మరీ  రాజయ్య అంత్యక్రియలు, ఆ తర్వాత చేయవలసిన కర్మకాండలన్నీజరపవలసి వచ్చింది.  తామున్న పరిస్థితికి వాళ్ళకే జాలి కలిగింది.  ఈ అప్పుల బాధ తీరేదెలాగో అంతుపట్టలేదు.

కమలకి ఇంకా ఇంట్లో ఉండాలని మనసులో ఉన్నా ఆమె భర్త రమేష్ ఆమెని తండ్రి చనిపోయిన పన్నెండోరోజే బయలు దేరదీసాడు.  ఒకవేళ అక్కడే మరికొన్ని రోజులుంటే మరిన్ని ఖర్చులే కాకుండా అప్పులు కూడా చుట్టుకుంటాయేమోనని జడిసాడు అతను.  అసలు ఆస్తిలో వాటా ఏమైనా కలసొస్తుందేమోనని వచ్చాడుకాని, ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత అతనికి పూర్తిగా అర్థమైంది తాము ఎంత వేగంగా వెళ్ళిపోతే అంత మంచిదని!  వచ్చిన బంధువులందరూ కూడా పరిస్థితి గమనించి ఒకొక్కళ్ళూ వెనుదిరిగారు. వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయాక ఇంట్లో తల్లీ, కొడుకులు ముగ్గురే మిగిలారు.  వాళ్ళందరి మనసులోను ఒక్కటే ఆలోచన!   రాజయ్య డబ్భులు ఎక్కడ దాచాడో తెలిస్తే దాంతో ఉన్న అప్పులు తీర్చుకొని ఇంటి దస్తావీజులు కూడా విడిపించుకోవచ్చని.

"నాన్నగారు నీకేమైనా ఎప్పుడైనా చెప్పారేంటిరా?  ఏ బ్యాంక్‌లో డబ్బులు దాచారో ఏమో నీ కేమైనా తెలుసా?" అడిగింది కాంతం ఒకరోజు రాంబాబుని. "నా కేమీ చెప్పలేదు అమ్మా! తమ్ముడికేమైనా తెలుసేమో?" సందేహం వెలిబుచ్చాడు రాంబాబు. రవిబాబు కూడా తనకేమీ తెలియదన్నాడు. ఇలా కాదని వాళ్ళు ముగ్గురూ ఇల్లంతా వెదికారు, ఎక్కడైనా ఏ ఆధారమైనా రాజయ్య వదిలిపెట్టేడేమోనని.  ఇంట్లో ఎక్కడా ఇతర బ్యాంక్ పాస్‌బుక్ లేవీ దొరకలేదు, ఒక్క పెన్షన్ పాస్‌బుక్ తప్ప. అందులో కూడా ఒక నెల పెన్షన్ డబ్బులు మాత్రమే ఉన్నాయి.
'మరి తండ్రి అక్రమంగా సంపాదించిన డబ్బులు ఏమైనట్లు?' అని అనుకున్నారు వాళ్ళు.  అప్పుడు చిన్నవాడైన రవిబాబుకి ఓ అనుమానం వచ్చింది.  తన మనసులో మాట అన్నకి, తల్లికి చెప్పాడు,"నాన్నేమైనా రియల్ఎస్టేట్ లాంటివాట్లో పెట్టుబడి పెట్టాడేమో?  దస్తావీజులేమైనా ఉన్నాయేమో? ఇల్లంతా వెదికితే దొరుకుతాయేమో?"

వాళ్ళకీ ఆ మాట నిజమేనేమో అనిపించి ఇల్లంతా దస్తావీజులకోసం వెతికారు. ఊహూ...ఏమాత్రం ఫలితం లేదు.  ఎక్కడా ఏమీ దొరకలేదు.  
అప్పుడు రాంబాబుకో విషయం తట్టింది. "ఒకసారి నాన్నకి మాధవరావు అంకుల్ షేర్ల్‌లోని, స్టాక్‌మార్కెట్లో డబ్బులు పెట్టమని సలహా ఇవ్వడం విన్నాను.  అందులో ఏమైనా పెట్టారేమో?" అన్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా ఆ దిశలో మళ్ళీ క్షుణ్ణంగా వెతకడం ప్రారంభించాడు. అప్పుడు రవిబాబుకి తండ్రి తాలుకు పాత డైరీలన్నీ ఓ అలమరలో దొరికాయి.

"ఈ డైరీల్లో నాన్నగారేమైనా షేర్లు గురించి రాసారేమో వెతకండి." అంది కాంతం.  ముగ్గురూ డైరీలన్నీ ముందేసుకొని తమ పరిశోధన ఆరంభించారు. అయితే అందులో అందరికీ తెలిసిన విషయలే ఉన్నాయి కాని దాచిన డబ్బు విషయమై ఏ విధమైన ఆచూకీ లభించలేదు.  చివరికి మాధవరావుతో కూడా మాట్లాడారు.  తను ఆ సలహా ఇవ్వడం నిజమేనని, కాని రాజయ్య అందులో పెట్టుబడులేమీ పెట్టలేదని చెప్పాడతను.

పోనీ డబ్బు, బంగారం, ఇల్లు వాకిళ్ళూ కాకుండా బ్యాంక్ లాకరేమైన ఒకవేళ తీసుకొని అందులో, నగదు, బంగారం, ఇళ్ళ దస్తావీజులులాంటివి ఉంచారేమోనని వెదికారు, అయినా ఫలితం శూన్యం.  ఇలా కాదని పెన్షన్ అకౌంట్ ఉన్న బ్యాంక్‌లో వాకబు చేసారు అన్నదమ్ములిద్దరూ తమ తండ్రి లాకరేమైనా ఉందేమోనని.  కాని అలాంటివేవీ తన తండ్రి పేరుమీద లేవని తేల్చి చెప్పాడు బ్యాంక్‌మేనేజర్. హఠాత్తుగా ఒకరోజు కాంతానికి ఒక విషయం తట్టింది.  'ఏమో అలాగ కూడా జరిగివుండొచ్చని ' మనసులో ఒక సందేహం కలిగి తన అనుమానాన్ని తన కొడుకులిద్దరితో పంచుకొంది.

"ఇప్పుడర్థమైందిరా! ఒరే రాంబాబు! రవిబాబు!!  వినండి రా!  నేనొక సారి మీ నాన్నగారిని అడిగాను, ‘ మీరింత సంపాదిస్తున్నారు గదా, నాకో చంద్రహారం, రవ్వల నెక్లెస్ చేయించరాదా’ అని, దానికి ఆయనేమన్నారో తెలుసా, 'పిచ్చిదానా!  నువ్వు అలా నగలు దిగేసుకుంటే నేను సులభంగా పట్టుబడిపోతానే!  నేను ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటానులే! ' అన్నారు.  మా పెళ్ళప్పుడు కట్టిన పుస్తెలతాడు  తప్పితే ఎప్పుడో బోనస్, ఆరియర్స్ వచ్చాయని ఓ రెండు తులాల గొలుసు మాత్రమే కొన్నారాయన.  మీ నాన్న మహనుభావులురా!  నా ఉద్దేశంలో మీ నాన్నగారు సంపాదించిందంతా బహుశా గుప్తదానాలు చేసి ఉంటారు. అంతే అయివుంటుంది! మనమందరమూ ఇంకా ఆయన ఎక్కడో  డబ్బులు దాచాడు, దొరుకుతాయని వెతుకుతున్నాం. మనదే పొరపాటంతా!  మనపిచ్చి కానీ, ఆయన ఆర్జించిందంతా అలా దాన ధర్మాలు చేసిన ధర్మాత్ముడురా !   తన ముక్తిమార్గం ఆయనే ఆ విధంగా ఎంచుకున్నార్రా!" అంది కాంతం కింద కూలబడి కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ.

రాంబాబు, రవిబాబుకి కూడా ఈ విషయం నిజమేనేమోనని అనిపించింది, లేకపోతే ఈ పాటికి దాచిన సొమ్ము ఏ విధంగానైనా బయట పడేదికదా అని వాళ్ళ అనుమానం. ఈ సంగతి క్రమంగా ఈ నోటా ఆ నోటా ఊరివాళ్ళందరికీ క్రమంగా తెలిసింది.  ఇంతకు ముందు అవినీతి కారణంగా రాజయ్యపై విద్వేషం పెంచుకున్న వాళ్ళందరూ ఇప్పుడు అదే నోటితో అతన్ని తెగ పొగడనారంభించారు.  అతని గుప్త దానాల గురించి కథలు కథలుగా చెప్పుకోనారంభించారు. చేసిన అప్పులు తీర్చడంకోసం అన్నదమ్ములిద్దరూ చాలా కష్టపడవలసి వచ్చింది.  వాళ్ల జీతాల్లో మూడొంతులకు పైగా అప్పులు తీర్చడానికే సరిపోయేది.  అందుకోసం వాళ్ళు ఓవర్‌టైం, పార్ట్‌టైం జాబ్ కూడా చేయవలసివచ్చింది.  కాంతం కూడా అప్పు త్వరగా తీరడానికి     తనకి తెలిసిన విద్యలు ఉపయోగించింది.  చిన్నప్పుడు నేర్చుకున్న కుట్లు, అల్లికలు ఆమెకు బాగా పనికి వచ్చాయి.  తనకి తెలిసిన విద్య ఉపయోగించి తను కూడా కొంత బాధ్యత తీసుకొంది అప్పులు తీర్చే విషయంలో. ఓ రెండున్నరేళ్ళ తరవాత అన్నదమ్ముల అప్పులు తీరి కొద్దిగా కుదుటపడిన పిమ్మట వారికి ఇంటి పురోహితుడు శాస్త్రిగారు చెప్పిన మాట ప్రకారం వాస్తుదోషం నివారించేదుకు ఇల్లు రీమోడల్ చేయ సంకల్పించారు.

దేవుడు గది వద్ద గోడ పడగొడుతుండగా అప్పుడు జరిగింది ఓ విచిత్రం!  గోడ మధ్యభాగంలోనుంచి బయటపడ్డాయి రెండు బాగా తాపడం చేసిన పెద్ద ఇనపపెట్టెలు.  అందులో ఏమున్నాయోనని కాంతం, ఆమె కొడుకులిద్దరూ కష్టపడి వాటి మూత తీసి చూసి ఆశ్చర్యపోయారు.  తమ తండ్రి ఎక్కడో డబ్బులు దాచాడని ఇల్లంతా వెదికిన అన్నదమ్ములిద్దరికీ అందులో ఉన్నవి చూసేసరికి నోట మాట రాలేదు.  కాంతం కూడా ఆశ్చర్యపోయి ఆ పెట్టెల్లోకి చూస్తోంది.  అందులో చాలా చక్కగా, పకడ్బందీగా నోటకట్టలు పేర్చి ఉన్నాయి.  అన్నీ అయిదువందలూ, వెయ్యరూపాయల నోట్లు.  తాము అనుకున్నట్లు భూషణం గుప్తదానాలు చెయ్యలేదని, సంపాదించిన డబ్బు అంతా నగదు రూపంలో పాతకాలపు పద్దతిలో దాచాడని వాళ్ళకి తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు.  అయితే అప్పుడే వాళ్ళకి ఓ విషయం కూడా స్పురించింది.  ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అప్పటికే అయిదు వందలూ , వెయ్యరూపాయల నోట్లు రద్దయ్యాయి మరి!

ముందుగా రాంబాబే తేరుకున్నాడు, "నాన్నగారు సంపాదించిందంతా ఇలా అయిదువందలూ, వెయ్యరూపాయలు లాంటి పెద్ద నోట్లలోకి మార్చి దాచి ఉంచారు.  అంతా వృధాయే! ఇప్పుడు అవి ఎందుకూ కొరగావు. అన్నీ రద్దైన నోట్లే!  చిల్లిగవ్వకి కూడా సాటి రావు.  దీనిబదులు నాన్నగారు గుప్తదానాలు చేసిఉన్నా బాగుండేది." అన్నాడు నిట్టూర్చుతూ. కాంతం, రవిబాబు కూడా తెల్లబోయి ఆ నోట్లవంక చూస్తున్నారు.
చివరికి రాజయ్య నానా అక్రమాలు చేసి అవినీతిపరుడై కూడబెట్టిన సొమ్ము ఎందుకూ కొరగాకుండా పోయింది.  చివరికి మిగిలిందేమీ లేదు.  ఆఖరికి అతని అంత్యక్రియలకి కూడా దాని ఉపయోగం లేకుండా పోయింది.

మరిన్ని కథలు
sruti chesina hrudaya veena