Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

ప్రేమ నేర్పిన పాఠం

prema nerpina patham

‘హలో..... ఈ వాలెట్  మీదేనానండి ....’ కాలేజీ గ్రౌండ్ లో కింద పడిన వాలెట్ తీసుకుని , కొంచెం దూరంలో పోతున్న అతన్ని చూస్తూ అడిగింది  శిల్ప.సెల్  లో మాట్లాడుతూ వెళుతున్న అతను  ఆగి వెనక్కి చూసాడు తననేనా పిలిచింది అన్నట్లు. అక్కడ ఆరెంజ్ తెలుపు కలిసిన కుర్తా పైజామా తో సన్నగా, తెల్లగా , నాజూగ్గా ఉన్న అమ్మాయి నిలబడి ఉంది. కింద  పడ్డ తన వాలెట్   ఆమె చేతిలో. ఒక్క క్షణం ఆమె అందానికి వివశుడయ్యాడు. ‘మీదేనా...’ ఆమె చేతిలోని వాలెట్ ఊపుతూ అంది. ‘ఆ...ఆ...నాదేనండీ...థాంక్ యూ....’ తీసుకుంటూ అన్నాడు. కాలేజ్ లో అదే రోజు జాయిన్ అయ్యాడు. కాలేజీ స్టార్ట్ అయ్యి నాలుగైదు రోజులైనా  తను అక్క వాళ్ళింటికి వెళ్ళడంతో రాలేక పోయాడు .

‘ఎరా.ఎవర్రా.. ఏమయ్యింది...?’ అటునుండి ప్రాణస్నేహితుడు రాజేష్ అడుగుతున్నాడు సెల్ లో ‘ఎవరో అమ్మాయి .. కొత్త టాబ్ లా ఎంతందంగా ఉందొ... తొలకరి జల్లులా ఎంత చక్కని స్వరమో..’ ‘ఏంటీ... కాలేజీలోకి అడుగు పెట్టీ పెట్టగానే లైనేస్తున్నావా...’ ‘నా సంగతి వదిలేయ్ గాని.. నువ్వెవరో అమ్మాయితో ప్రేమలో పడ్డానన్నావ్... ఎవరా అమ్మాయి..’ ‘మల్లెపూవుకన్నా లాలిత్యంగా ఉంటుంది... అసలు మామా ....ఆమె లేకపోతె జీవితమే వ్యర్దం అనిపిస్తుందిరా’ ‘మరి చెప్పావా....’ ‘ఎదో ప్రయత్నిస్తున్నా..... ఏమిటోరా ఈ ఆడపిల్లలు అప్పుడే అర్దమయినట్లుంటారు... అప్పుడే అర్ధం కారు...నన్ను సతాయించకు..నను వదిలిపెట్టు అంటుంది.. మనం వదులుతామా ....అందంతో మనకు కిర్రెక్కించి వాళ్ళు బాగానే ఉంటారు. ... చదువు బుర్రకేమీ ఎక్కట్లేదు..  ఎంతైనా నీకన్నా ఒక ఏడాది సీనియర్ ను కదా ....  త్వరలో శుభవార్త చెబుతాలే..’ ‘బెస్ట్ ఆఫ్ లక్...’ ఫోన్ పెట్టేసాడు. వాడు తన కన్నా మంచి ఇంటలిజెంట్ అని స్కూల్లో ఒక తరగతి జంప్ చేయించడం వల్ల తనకన్నా సీనియర్ అయిపోయాడు.

ఇప్పటి వరకు స్కూల్లో ఒక పద్ధతి ప్రకారం చదివి ఇప్పుడు కాలే జీ లో అడుగుపెట్టగానే ఒకేసారి చాలా పెద్దవాడయి పోయినట్లు, ఏంతో  స్వేచ్చ వచ్చినట్లు అనిపిస్తుంది. స్కూల్లో లా ప్రేయర్ బెల్ కొట్టగానే వరుసలో నిలబడటం, జైలు లాంటి క్లాస్ రూమ్ లో కూర్చుని టీచర్ చెబుతుంటే నిద్ర ఆపుకోవడానికి తంటాలు పడటం, బెల్ బెల్ కి క్లాస్ వర్క్ హోమ వర్క్  నో ట్ బుక్స్ తీయడం,ఎప్పటికీ ఒకే స్కూల్ డ్రెస్ వేసుకోవడం ,  టాయ్ లేట్ కి వెళ్ళాలన్నా చేయి చూపించి అడిగి వెళ్ళడం లాంటివేమీ లేవు. తన ఇష్టం.... క్లాస్ రూమ్ నుండి ఎప్పుడు పడితే అప్పుడు  బయటకు రావొచ్చు . తన కిష్టం లేని క్లాస్ మిస్ చేయవచ్చు. బండెడు పుస్తకాలు భుజాన వేసుకు రాకుండా స్టైల్ గా ఒకే నోట్ బుక్ పట్టుకు రావొచ్చు... అబ్బో... ఎన్నని .... క్లాస్ రూమ్ లో కూర్చున్నాడు. తొలిసారిగా కంబైండ్... కో ఎడ్యుకేషన్... అమ్మాయిలంతా సీతాకోక చిలకల్లా ఉన్నారు. ఎవరికిష్టమైన బట్టలు వారు వేసుకోవచ్చు. ఈ నాలుగు రోజులు ఎం జరిగాయో పక్క నున్న తన స్కూల్ ఫ్రెండ్ ని అడుగుతున్నాడు.

 ఆ క్లాస్ లోకి అడుగు పెడుతున్న ఆమె ను అప్పుడే చూసాడు. అంటే ఆ అమ్మాయి కూడా తన క్లాసే అన్న మాట. ఎందుకో ఉత్సాహం తన్నుకొచ్చింది. ఆమెను చూస్తూ నవ్వాడు. ఆమె చూడలేదు లా ఉంది. క్లాస్ అయిపోయేంత వరకు ఆమె వైపు దొంగ చూపులే. క్లాస్ కాగానే బయటకు వస్తున్న ఆమె పక్కకు కాజువల్ గా వచ్చినట్లు చేరి , ‘మీరు ఇదే క్లాసా.... నా పేరు సురేష్... మీరు..’ అన్నాడు మాటలు కలుపుతూ.. అ.. కీర్తి..’ అంది చిరునవ్వుతో. వెయ్యేనుగుల బలమోచ్చింది  అతనికి ... ‘కీర్తీ సురేష్’ వాటే మాచింగ్ నేం .... ఆమె ఫ్రెండ్ తో కల్సి వెళ్ళిపోయింది. ఆ రోజు బస్ చాలా రద్దీ గా ఉంది. ఫుట్ బోర్డ్ పై ఉన్న అతనికి అల్లంత దూరం నుండి ఆ బస్ కోసం పరుగెత్తుతు వస్తు న్న ఆమె  కనపడగానే , బస్ ఆపమంటూ చేయి తో బస్ పై కొట్టాడు..కొంచెం స్లో కాగానే ఆమెకు చేయందించాడు. ఆమె ఆ చేయందుకుంటూ అతను  కొంచెం పక్కకు జరగడంతో మరో చేత్తో రాడ్ పట్టుకుంది. అతనికి సినిమాలోని సీన్లు గుర్తొచ్చాయి... అప్పుడు కాలేజీ గ్రౌండ్ లో కలిసి అడుగులేసాడు..ఇప్పుడు పాణి గ్రహణం..అంటే తానంటే ఆమెకూ ఇష్టమే. అందుకే ఎప్పుడైనా చిరునవ్వుతో మాట్లాడుతుంది. బస్ సడెన్ బ్రేక్ వేసినట్లున్నారు. ఫుట్ బోర్డ్ నుండి పైకి ఎక్కుతున్న  ఆమె పూర్తిగా  అతనిపై వాలిపోయింది. ఒక్కసారి ఊపిరి ఆగిపోయింది  అతనికి. శ్వాస తీసుకోవడం మర్చి పోయాడు.

 ఒక్క క్షణమే అయినా బస్ డ్రైవర్ కి మనస్సులోనే కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు. ‘సారీ...’ విడివడుతూ చిన్నగా అంది. కాజువల్ గా ఉండ డానికి శ్రమ పడాల్సి వచ్చింది. అప్పటి నుండి ఎంత ఆలస్యమయినా ఆమె వచ్చేంత వరకు బస్ ఎక్కక పోయేవాడు. ఆమె బస్ స్టాప్ కి రాగానే , చిరునవ్వుతో  పలకరించేవాడు.  ఆమె కూడా సరదాగా కబుర్లు చెప్పేది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అవుతున్నాయి. సురేష్ కి మనస్సు అస్సలు చదువు పై లగ్నం కాలేదు. పుస్తకం తెరిస్తే ఆమె రూపమే... ఇక లాభం లేదు ఎలాగైనా చెప్పాలనుకున్నాడు. కాని పరీక్షలు... అతి కష్టం పై పరీక్షలు రాసాడు. ఆ తర్వాత సెలవులు. ఇక ఆమెను చూసే అవకాశమే లేదు అనుకోగానే నీరుగారి పోయాడు. ఎలాగైనా ఆమెను కలవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. కాని ఆమె సెలవలకు వేరే ఊరికి కంప్యుటర్ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్లిందని తెలుసుకుని రోజులు యుగాలుగా గడిపాడు. ఆమె సెల్ నంబర్ కూడా పర్సనల్ ది  కాదు, వాళ్ళు పేదవాల్లని తెలుసుకున్నాడు.   ఈ లోగా పరీక్షల ఫలితాలు తెలిసాయి. రెండు సబ్జెక్టు లలో తను ఫెయిల్ అయ్యాడు. కీర్తి డిస్టింక్షన్ లో పాసయ్యింది. చ... ఎప్పుడెప్పుడు కాలేజీ తెరుస్తారా అని ఎదురు చూసాడు. కాలేజీలు తెరిచారు  . ఆమెకు తన ప్రేమ గురించి ఎలాగైనా చెప్పాలి.

ఆమె ప్రేమలో పడి  తను ఎలా చదువులో వెనక బడ్డడో  చెప్పాలి, అని ఎన్నో రకాల ప్రిపేర్ అయి పోయాడు. అయితే ఇదివరకు తను పలకరిస్తే చిరునవ్వుతో  మాట్లాడే కీర్తి ఇప్పుడు అసలు ఒంటరిగా దొరకడమే కష్టం  అవుతుంది.  కావాలని తప్పించుకుని తిరుగుతుందా.... తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందా...ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు. కారణం ఏమి ఉంటుంది..కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరైనా దొరికాడా.... అనుక్షణం అదే ధ్యాస .....  ఆలోచనలతో పిచ్చివాడై పోయాడు. ఈ రోజు ఎలాగైనా ఒంటరిగా కల్సుకోవాలి, నిలదీయాలి.అదృష్టం బావుంది. క్లాస్ అయిపోయాక లాంగ్వేజెస్ క్లాస్ కోసం బయటకొచ్చి ఎవరి రూమ్ వైపు వారు వెళుతున్నప్పుడు పరుగున వెళ్లి కలిసాడు. ఆమెది సంస్కృతం , తనది తెలుగు.  ‘కీర్తి కంగ్రాచ్యులేషన్స్..... ఏంటీ డిస్టింక్షన్ వచ్చిందనా మాట్లాడ్డం మానేసావు.....’

‘థాంక్స్ .... అబ్బే... అలా ఎందుకు చేస్తాను... సెకండ్ ఇయర్ కదా మొదటి నుండే మంచిగా కాన్సంట్రేట్ చేయాలని, ఇటీవల కంప్యుటర్ కోర్స్ లో, మ్యూజిక్ క్లాస్ లో జాయిన అయ్యాను. చాలా బిజీ అయిపోయానంతే....’‘నీతో మాట్లాడాలి.... ఈ పీరియడ్ అయిపోయాక ,లాస్ట్ క్లాస్ సర్ రాలేదు కాబట్టి అప్పుడు మాట్లాడదాం..’‘ఓ కే..’    అంత  సేపు చాలా టెన్షన్ గా చూసాడు.  కీర్తి వచ్చింది.‘ఏంటి సురేష్..త్వరగా చెప్పు ...... .నే వెళ్ళాలి..’‘ఎం లేదు... నేను రెండు సబ్జెక్ట్ లు ఫెల్ అయ్యాను.... తెలుసా..’

‘పాస్ కాలేదు....అని తెలుసు... అయినా అలా ఎందుకు అయ్యావు... ఇప్పటికయినా సంప్లమెంట రీ కయినా కడితే ఆన్యువల్ టెన్షన్ ఉండదు..’‘అసలు ఎందుకయ్యానో తెలుసా...నీ వల్ల నే...’‘ఏంటీ..నా వల్ల నా... నేనేం చేశా....’‘ఎంత వద్దనుకున్నా నన్ను చదవనివ్వకుండా పుస్తకం తెరిచినా, మూసినా నువ్వే కనబడి నన్నేం చదవనివ్వకుండా చేసావు..’

‘ఎం మాట్లాడుతున్నావ్.... అంత పిచ్చి పిచ్చి గా మాట్లాడకు..’‘నువ్వు ఎం తెలీనట్లు మాట్లాడకు..నువ్వు నన్ను ప్రేమించలేదూ ... ఇప్పుడు మళ్ళీ  ఎవరు దొరికారని నన్ను దూరం పెట్టావ్...’ ‘ఏయ్... మాటలు జాగ్రత్తగా రానీయ్.. నేను నిన్ను ప్రేమించడమేమిటీ... ఎవరో దొరకడమేమిటీ’ ‘అబ్బా.. ఎం తెలీని నంగనాచిలా మాట్లాడకు... క్లాస్ లో ఓరకంట నేను చూసినపుడు చిరునవ్వులు చిందించడం.... ప్రతిరోజూ బస్ స్టాప్ లో నేను నీ కోసం వెయిట్ చేయడం, నువ్వు నవ్వడం. బస్ లో నన్ను హత్తుకోవడం, నా చేయందు కోవడం .. ఇవన్నీ ప్రేమ లేకుండానే చేసావా... ‘

‘నిజంగా నువ్వు పోరబడ్డవు.... బస్ స్టాప్ లో రోజూ ఆ సమయానికే నువ్వూ వస్తున్నావనుకున్నా గాని నా కోసం చూస్తున్నావనుకోలా... బస్ స్పీడందుకుందని నువ్వు చేయి అందిస్తే తీసుకున్నానే తప్ప మరో ఉద్దేశ్యం తో కాదు... బస్సేదో బ్రేక్ వేసిన దానికి ఎదో ఊహించుకోకు,  ఛీ ఛీ ..నువ్విలా ఆలోచిస్తావనుకుంటే మాట్లాడే దాన్నీ కాదు...’ ‘మాట మార్చకు....   చేసేవన్నీ చేసి మమ్మల్ని పిచ్చివాళ్ళను చేసి ఆడించడం మీకు బాగా తెల్సు కదా...అయినా నేను నిన్ను వదుల్తాననుకున్నావేమో.... నేనస్సలు వదల ’ ‘ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నావ్....ఇందులో నేను చేసింది ఎం లేదు.. అందరిలా స్నేహంగా మాట్లాడా నెమో గాని నువ్విలా ఆలోచిస్తున్నావనుకోలా... అసలు మన వయస్సు ఎంతని ... ప్రేమ,దోమా అని ఆలోచించడానికి, కనీసం మేజర్లం కూడా కాలేదు. మంచి చదువు చదివితేనే కదా మంచి భవిష్యత్ ఉండేది. మనం మన జీవితాన్ని దిశానిర్దేశం చేసుకునే సమయమిదే... మనకు ఎందులో ప్రావీణ్యం ఉందొ, ఏరకంగా మన జీవితాన్ని మలచుకోవాలో నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన మలుపు ఇది.... నేను ఆ దిశలో అడుగులు వేస్తున్నాను... నువ్వెందుకు ఇప్పుడే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావ్... నీకు ధ్యేయమే  ఉంటె  దాని ప్రకారం ప్లాన్ చేసుకో.... నీలోని ప్రతిభ నంతా చదువు మీదే చూపించు అప్పుడు మీ అమ్మానాన్నలు కూడా సంతోషిస్తారు.... పాత సబ్జెక్ట్ లతో పాటు నీలో కసే ఉంటె క్లాస్ లో ఫస్ట్ రాగలవేమో ప్రయత్నించు.... అది సాధించేవరకు నాతొ మాట్లాడడానికి ప్రయత్నించకు...బై’ ఆమె వెళ్లిపోతుంటే కోపంతో రగిలి పోయాడు.

ఆ రాత్రి, తెల్లవారి మొత్తం అదే ధ్యాస ...   తనకే పాఠాలు చెబుతుందా... తన స్టేటస్ ఏంటి...కో అంటే కోటి మంది వస్తారు. ఎదో తన వెనక పడుతున్నాడని, అందం ఉందని   పొగరా....ఆ రోజంతా అవమానంతో , కోపంతో రగిలి పోయాడు. ఏమైనా  తను ఉపేక్షించకూడదు...  అంత పొగరుగా మాట్లాడింది..ఎం చూసుకుని ఆ మిడిసి పాటు.. తినడానికి చక్కగా లేదు గాని..వలచి వచ్చానని అలుసా.... ఎం చేస్తే దాని పొగరు అణుగుతుంది. ఆ అందం చూసే ఈ గర్వమా.. అది లేకుండా ఆసిడో ఎదో పోస్తే... అయినా  తనకు దక్కని ఆమె మరెవరికీ దక్కొద్దు .... తనకేమైనా ఫర్వాలేదు...  ఏమైనా అనుమానం రాకుండా పని కానిచ్చేయాలి... బుద్దోచ్చిందని , సారీ చెబుతానని పక్కకు పిలవాలి,తననన్ని అన్న దాని  గొంతు మరి పెగలోద్దు. రాజేష్ కూడా అన్నాడు అతని ప్రియురాలు సతాయిస్తుందని ..మగవాళ్ళ జీవితాలతో ఇలా ఆటలాడ కూడదని అందరికీ ఒక గుణ పాఠం కావాలి. ‘ జేబులో కత్తి , బ్లేడ్ పెట్టుకుంటూ కసిగా అనుకున్నాడు. సెల్ మోగింది.... ప్రదీప్ నుండి. ప్రదీప్, రాజేష్, తను ముగ్గురు స్కూల్ నుండి మంచి ఫ్రెండ్స్ ....చాలా రోజులవుతోంది వాడితో మాట్లాడక.... ‘హాయ్ రా ప్రదీప్..ఎరా ఎలా ఉన్నావ్....’ అంటుండగా సురేష్ మాట పట్టించుకోకుండా,’అరేయ్...సూరీ.... మన రాజేష్..మన రాజేష్ ఇక మనకు లేడురా..... ‘ అని ఏడుస్తున్నాడు. ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయ్యింది.

‘ఏమంటున్నావురా....నాకేం అర్ధం కావడం లేదు... నాలుగు నెల్ల కింద మాట్లాడాడు బాగా ఉషారుగా.. ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని..శుభవార్త చెబుతానని అన్నాడు...’ ‘అయ్యో...అదే కొంప ముంచింది రా... వాడు ఈ టెన్షన్ తాళ  లేక ఉరి పెట్టుకున్నాడు....’పిడికిలి బిగిసింది సురేష్ కి .. ఛీ ..ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారు....‘ఏమయ్యిందిరా.... ఆ అమ్మాయి వాళ్ళపై కేస్ పెట్టకపోయారా’కసిగా అన్నాడు ప్రదీప్ తో.‘అమ్మాయేక్కడిది ..చనిపోయింది గా .’  ఆ.. . అదేంటీ.....’

‘అరేయ్..వాడు నీకు రాసిన  ఉత్తరం నీ మెయిల్ కి వచ్చి ఉంటుంది చూడు , నాకూ రాసాడు...... వాడిని కడసారి చూడడానికి ,కన్నీటి వీడ్కోలు ఇవ్వడానికి త్వరగా రారా..మధ్యాన్నం వరకు పోస్ట్ మార్టం వాళ్ళు ఇస్తారేమో...’   మెయిల్ ఓపెన్ చేసాడు.

’ప్రియమైన సూరికి, అరేయ్... నీకీ ఉత్తరం చేరేసరికి నేను ఈ లోకంలో నుండి వెళ్ళి పోతానేమో ..ఆ రోజు నీతో మాట్లాడిన తెల్లవారే ,ఆ అమ్మాయిని  కొంచెం ఎక్కువ బలవంత పెట్టా..... ‘నువ్వు లేకుండా నేను ఉండలేను... అలాగని నన్ను కాదంటున్న నిన్ను వదిలి పెట్టను.. మనం కల్సి తిరిగిన ఫోటో లన్నీ నా దగ్గర ఉన్నాయి... మొదట అంత ప్రేమ చూపించి ఇప్పుడు అదంతా స్నేహం అని  మొహం చాటేస్తే నేనేం ఊరుకోను’ అని అన్నా...  కేవలం అలా అంటే నా ప్రేమ తెలుసుకుంటుంది అనుకున్నా గాని భయంతో,  ప్రేమ పేరుతొ సతాయిస్తున్నానని నా పేరు రాసి పెట్టి ఉరి వేసుకుంటుంది అనుకోలేదు. ఇక నా జీవితానికి నరకం అక్కడి నుండి మొదలయ్యింది. ఆమె అన్న, ఆ చుట్టు పక్కల వాళ్ళు రోడ్డుపైనే నన్ను కొట్టారు, కాళ్ళతో తన్నారు. నన్ను  పోలీసులు అరెస్ట్ చేసారు. అమ్మా, నాన్న, చెల్లెళ్ళు  నన్ను ఛీ కొట్టారు. చదువుకుని స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు అందరి కళ్ళల్లో  ఎంత ప్రేమ,ఆరాధన చూసానో, ఇప్పుడు అంత అసహ్యం చూసాను. నేను కలెక్టర్ అవుతానని అమ్మా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. నేను ప్రేమించిన ఆమె చనిపోవడం వీళ్ళంతా ఇలా సమాజం నుండి వెలివేసినట్లు చూడడం, పోలీసులు చాలా ఘోరంగా ట్రీట్ చేయడం భరించలేక పోయాను. నా జీవితాన్ని నా చేజేతులారా నేనే నాశనం చేసుకున్నాను.

చదువుకోవాల్సిన వయసులో, ఆకర్షణ నే ప్రేమనుకుని  ప్రలోభపడ్డాను. ఆమెనూ విసిగించి ఆమె జీవితాన్ని దూరం చేసి ఆమెకన్నా ఎక్కువ నరకం అనుభవించాను. నా తప్పు తెలుసుకుని ,క్షమించమని అడుగుదామంటే , ఆమె ఈ లోకం లోనే లేదు. నా వల్ల ఒకరి జీవితం బలయ్యిందనే బాధ నన్ను తొలిచేస్తోంది. నా సీనియర్స్  ఎందఱో ఒక ప్లాన్ ప్రకారం చదువుకు ప్రాధాన్యం ఇచ్చి మంచిగా ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాక , పెళ్లి చేసుకున్నారు లేదా ప్రేమించారు . వాళ్ళ కలలు, వాళ్ళను నమ్ముకున్న వాళ్ళ కలలు సాకారం చేసుకున్నారు. భూమి పై  అందరూ పుడతారు. కాని కనీసం ఒక్కరికైనా రోల్ మాడల్ గా నిల్చి నప్పుడే జీవితానికి సార్ధకత. ఎన్నో కలలు కన్నాను. కలెక్టర్ అయి అమ్మా నాన్నల కష్టాలు తీర్చాలనుకున్నాను. కాని  జీవితంలో అది చేయలేక పోయాను. ఆ రోజు నీతో మాట్లాడినప్పుడు నువ్వూ ప్రేమలో పడుతున్నావని పించింది. నాలాంటి తప్పు నువ్వు చేయకుండా నీ జీవితాన్ని అయినా  ప్లాన్ చేసుకుని ఉన్నత శిఖరాలది రోహిస్తావని ఆశిస్తాను., నా జీవితం కనీసం కొందరికయినా గుణపాఠం అయినా నాకు ఆత్మశాంతి అయినట్లే.. వీలయితే నువ్వు సెటిల్ అయ్యాకయినా నాలా ఎవరూ టీనేజీలో జీవితాల్ని వ్యర్ధం చేసుకోకుండా ఒక కౌన్సిల్లింగ్ సెంటర్ పెట్టు .... ఐ మిస్ యు అండ్ ప్రదీప్ అండ్ అల్ మై ఫామిలీ మెంబర్స్ ....  ఈ వయసులో నాన్నకు తోడై ఆయన బాధ్యత ఎత్తుకోవాల్సిన నేను ఇలా ఎందుకు దూరమవుతున్నానంటే, నేనుంటే నా గురించి అంతా  అనే సూటిపోటి మాటలతో వారికి మరింత భారం కావడం నాకిష్టం లేదు. ఈ జన్మలో చేసిన తప్పు మరే జన్మలో ఎవరూ చేయకుండా నా జీవితం అందరికీ ఒక హెచ్చరిక కావాలి కోరుకుంటూ ...

నీ స్నేహాన్ని మరవలేని నీ ప్రియ నేస్తం –రాజేష్. కళ్ళల్లో చిప్పిల్లిన నీళ్ళతో అక్షరాలూ అలుక్కుపోయినట్లు కనబడుతుంటే , సరైన సమయంలో తనలో పరివర్తన తెచ్చిన నేస్తం కు నివాళి అర్పిస్తున్నట్లు జేబులోని కత్తి, బ్లేడ్ తీసి దూరంగా విసిరేశాడు సురేష్.

పదేళ్ళ తర్వాత , తన కిష్టమైన సైకాలజీ లో పీహెచ్ డీ చేసి , టీనేజీ పిల్లలెవరూ ఇలా క్షణికావేశంలో విపరీతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉచిత కౌన్సిల్లింగ్ సెంటర్  స్నేహితుని పేరుపై పెట్టాడు కూడా.

మరిన్ని యువతరం
yuva bharatam