Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nope short flim review

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

మన దేశంలోనేమిటి, ప్రపంచమంతా “ పట్టుకుంటే దొంగ, పట్టుకునేఫాకా దొర “..  ఇందులో రాజకీయ నాయకులైతే మరీనూ..అధికారంలో ఉన్నంత కాలమూ, నానా గడ్డీ తిని, డబ్బు సంపాదించి, ఆస్థుల్ని పెంచుకోవడం. పైగా నీతినిజాయితీల గురించి లెక్చర్లు దంచడం. “ అబ్బ ఎంత నీతిమంతుడో..” అనుకుంటారందరూ.. దానికి సాయం ప్రచారసాధనాల్లో తమ గురించి , ఎటువంటి ( చెడువి) ప్రచారం జరక్కుండా, జాగ్రత్తలు తీసుకోవడం.

గత వారంలో చూసాం కదా.. మాజీ ఆర్ధిక మంత్రిని అరెస్ట్ చేయడానికి ఎంత హడావిడి జరిగిందో..అదేదో 2007 లో ఏదో డబ్బులు తిన్నారుట.. ఆ కేసు. అసలు పుష్కరం పాటు టైమెందుకు పట్టిందీ అరెస్ట్ చేయడానికీ అని అడిగే దిక్కు లేదు.. అలాగని ఈయనొక్కడేనా డబ్బులు తిన్నదీ అంటే అదీ కాదూ.. ప్రతీ పార్టీలోనూ , అతిరథ మహారథులు ( డబ్బులు తిన్నవాళ్ళు) ఉన్నారు. ఏదైనా  raids  జరిగితే, నిస్సిగ్గుగా, పార్టీ మారి, అధికార పక్షంలో చెరేవారు కోకొల్లలు. అధికారంలో ఉన్నంతకాలం వీళ్ళు బేఫికిర్ గా ఉంటారు.. అయిదేళ్ళ తరువాత మళ్ళీ మరో పార్టీ.. అసలు ఇలాటివారిని చేర్చుకోడానికి అధికార పార్టీ వారికి సిగ్గూ శరమూ ఉండదేమో. పైగా  నీతులు మాత్రం చెప్తారు.

వచ్చిన గొడవెక్కడంటే, ఒక్కసారి అధికారమంటూ చేతికొచ్చిన తరవాత, ఒళ్ళూ కళ్ళూ తెలియవు. పోనీ ఏదో సమాజానికి ఏదో సేవ చేస్తాడని కదా  ఎన్నుకున్నదీ ప్రజలూ అన్న విషయం ఛస్తే గుర్తుకు రాదు. పదవిలో ఉన్నంతకాలమూ, అధికారం ఉపయోగించుకుని, ఎంత డబ్బు కూడబెడదామనే ఆలోచన… వీళ్ళకి సాయం చాలా సందర్భాల్లో వీళ్ళ పిల్లలూ.. ఎలాగూ వీడు పోయినతరవాత వాడేకదా ఎన్నికల్లో పోటీ చేసేదీ,  ఖర్చులకి డబ్బులుండొద్దూ?

ఏదో ఆ ప్రధానమంత్రిగారికి పిల్లాపీచూ లేకపోబట్టి కానీ, మిగిలిన ఏ రాజకీయనాయకుడికైనా వంశపారంపర్యమే.. ఎక్కడో అక్కడక్కడ మాత్రమే మినహాయింపు చూస్తూంటాము. వీళ్ళందరికీ ఏదో ఒక  scam  లో భాగస్వామ్యం ఉండే ఉంటుంది. మనదేశంలో ప్రస్తుత పరిస్థితి మాత్రం ఇదే, మార్పు రావాలనుకోవడం అత్యాశే.. చిత్రం ఏమిటంటే, ఇలా ప్రజల డబ్బు దోచుకుంటారనీ, కోటానుకోట్లు నల్లధనం కూడబెట్టారనీ, ప్రభుత్వంతో సహా అందరికీ తెలుసు. అయినా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారు. వీళ్ళమీద ఏదో నామ్ కే వాస్తే ఓ కేసు బనాయించేసి, అవేవో  Income Tax raids, Enforcement Directorate raids  అని ఓసారి హడావిడి చేసేసి, కేసులాటిదోటి నమోదు చేస్తారు. మన న్యాయస్థానాల్లో వాటికి అతీ గతీ ఉండదు. రికార్డు కోసం మాత్రం ఓ  bail  లాటిదుంటుంది. అంటే చెప్పడమన్నమాట –

నీ మీద కేసేమీ ఎత్తేయలేదూ, ఏదో  cold storage  లో పెట్టామూ, అవసరానికి ఉపయోగించుకుంటామూ అని. నూటికి 70 మందికి ఇవన్నీ అలవాటే.. అఛ్ఛా ఎప్పుడైనా ఓ గొప్ప వాడిని అరెస్ట్ చేస్తే, వాడి పార్టీకి సంబంధించిన వారు చెప్పే మొదటి మాట – “ ఇదంతా రాజకీయ కుట్ర “ అని—నవ్వాలో ఏడవాలో తెలియదు. తిన్నంతకాలమూ పట్టుబడలేదంటేనే రాజకీయ ప్రాప్తం అని ఎప్పుడైనా ఒప్పుకున్నారా వీళ్ళూ?  ఒకవిషయం మాత్రం చెప్పొచ్చు—ఈ అరెస్టులూ హడావిడీ, ప్రసారమాధ్యమాల్లో వేడి వేడి చర్చలూ, ఒఠ్ఠినే ప్రజలని ఊరుకోపెట్టడానికి చిట్కాలన్నది నిజం.

మన చట్టాల్లోకూడా చాలా వెసులుబాట్లున్నాయి. అదేదో  chargesheet  తయారు చేసేటప్పుడు, ఏ వాక్యమో తప్పుగా ఉంటే, కేసు నిలబడదుట. అంటే, అలా కావలని చేసిందే అని తెలుస్తోందిగా. అరెస్ట్ కాకుండా, ముందస్తు బెయిల్ అని ఒకటుంది. ఎవడికైనా తనని అరెస్ట్ చేస్తారే,ఓ అని ఉప్పందిందా, వెంటనే, ముందస్తు బెయిల్ కి వెళ్తాడు. అంటే వెధవపనేదో చేసినట్టేగా?  మనదేశంలో కోర్టులు కూడా, పాపం ఆ బెయిలేదో ఇచ్చేస్తారు. వీడేమో అచ్చోసిన ఆబోతులా తిరుగుతూనే ఉందడమో, సాక్ష్యాలు డబ్బిచ్చి కొనేసుకోవడమో చక్కబెట్టుకుంటాడు.
మరి కొంతమందైతే, దేశాన్నే వదిలి విదేశాల్లో మజా చేస్తూంటారు… అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, వాడి దారిన వాడిని వదిలేయడమో, కాదూకూడదంటే, దేశంలో ఉన్న వాడి ఆస్థులు వేలంవేయడమో చేయడం. అదికూడా మనల్ని ఊరుకోపెట్టడానికే అని అందరికీ తెలిసిన విషయమే. పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు, ఎవరికి వారే తమతమ క్షేమం కోరుకోవడంలో ఆశ్చర్యమేముందీ ?

సర్వేజనా సుఖినోభవంతూ …

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu