Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue333/842/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

 

(గత సంచిక తరువాయి)...‘యవ్వన మధువనిలో… వన్నెల పూవుల ఉయ్యాలా…’’ ఉయ్యాల ఊగుతోంది జోరుగా. మౌక్తిక తనువు గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది. మనసు మైమరచి మధుర రాగాలాలపిస్తోంది.అంతలోనే… ఎప్పటిలాగానే… అమ్మో! స్పర్శ… బరువైన మెత్తని స్పర్శ…జుగుప్సని కలిగించే స్పర్శ.సుతిమెత్తని ఆమె కంఠ సీమ చుట్టూ దండలా చుట్టుకుని, రక్తనాళాలు తెగిపోయేలా మెడచుట్టూ బిగుసుకుంటూ… ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసే విచిత్రమైన స్పర్శ.

తన గొంతుచుట్టూ హారాల్లా అల్లుకుంటున్న ఆ పాములను తీసి పారేయాలని ప్రయత్నించింది మౌక్తిక. కాని, సాధ్యపడలేదు. ఆమె తీసేద్దామనుకున్న కొద్దీ మరింతగా అల్లేసుకుంటున్నాయి ఆ సర్పాలు. ఇంతలో… గగనతలం నుంచి కిందికి దిగివస్తూ…గాలిలో అలవోకగా తేలుతూ…ఆమెవైపే వస్తోంది…తెల్లని పారిజాత సుమమాల. మత్తైన సువాసన. స్వర్గలోకంలోని నందనవనంలో విరబూశాయేమో…దివ్యమైన సుగంధాలను నలుదిక్కులా వెదజల్లుతున్నాయి ఆ దేవపుష్పాలు. అందాలొలికే ఆపారిజాత సుమమాలిక మౌక్తిక వైపే వస్తోంది. కాంతులీనే ఆమె గళసీమను అలంకరించేందుకే వస్తోంది. ఆనందంతో పరవళ్ళు తొక్కింది మౌక్తిక మది. తన మెడని ఆప్యాయంగా కౌగిలించుకునేందుకు వస్తున్న ఆ అద్భుతహారాన్ని చూసి మురిసిపోయింది మౌక్తిక. అప్పటికే… అతిబలంగా ఆమె మెడచుట్టూ పెనవేసుకుని ఉన్న ఆ పాములు “ నీకిక్కడ స్థానంలేదు… ఆచోటుని మేమెన్నడో ఆక్రమించేశాము.’’ అంతూ వికటాట్టహాసం చేశాయి.

అంతేకాదు… మౌక్తికను చేరడానికి ఆత్రంగా వస్తున్న ఆ విరిదండను, తమ తోకలతో విసిరికొట్టాయి.అధాటికి…దూరంగా మట్టిలో పడిపోయిన ఆ పారిజాతమాలిక’ ఏంచేయనూ…ఎంతో ఆశగా నీమెడను చేరడానికి వస్తున్న నన్ను నెట్టి పారేశాయవి. సున్నితమైన నన్ను నీ చెంత చేర్చుకునే అదృష్టం నీకులేదు.’’ అంటూ జాలిగా పలకరించింది ఆమెని.

మౌక్తిక మృదువైన చేతులు ఆపాములను వదిలించుకునే ప్రయత్నం చేసీ…చేసీ… అలసిపోయి, బలహీనమై మరింతగా కందిపోయాయి.  నిస్సహాయంగా భూమ్మీద రాలిపోయిన ఆ పూలహారాన్ని…విజయగర్వంతో చూశాయి ఆపాములు. దిగ్గునలేచి కూర్చుంది మౌక్తిక. ఎప్పుడూ వచ్చే ఆకల… ఆరోజు మరికాస్త విచిత్రంగా వచ్చింది. సాధారణంగా…తనపక్కన ఎవరైనా తోడుంటే ఆ కల రాదు. కాని, ఇవాళ పక్కనే రమ్య ఉన్నా ఆ కల వచ్చింది.మౌక్తిక నిద్రలోనుంచి ఉలిక్కిపడి మేలుకున్నందువలన ఆ విసురుకి ఆమె చేయితగిలి మంచంపక్కనే ఉన్న నీళ్లజగ్గు పెద్ద చప్పుడుతో కిందపడింది. జగ్గులోని నీళ్లన్నీ కళ్లాపి జల్లినట్లుగా నేలమీద పడ్డాయి.గాఢనిద్రా పరవశురాలై ఉన్న రమ్య డిస్టర్బ్ అయినట్లుగా కళ్ళు తెరిచింది. మౌక్తిక గుండె దడదడమంటూ వేగంగా కొట్టుకుంది. ఒళ్లంతా ముచ్చెమటలు పోశాయి.అప్పుడప్పుడు…పిలవని పేరంటంలా తన ప్రమేయం లేకుండా వచ్చి తనను పలకరిస్తూ భయభ్రాంతురాలిని చేసే ఈవిచిత్రమైన కలకి ఈ వింత పొడిగింపేమిటి! దీనర్ధం ఏమైఉంటుంది?

జీవితాంతం ఇలా… ఈ పీడకల బారిన పడుతూ… ఒత్తిడికి గురౌతూ…తానిలా నరకయాతన అనుభవించవలసిందేనా!? అంతులేని ఆవేదన మౌక్తిక మదిని అతలాకుతలం చేసింది.ఆమె స్థితిని గమనించిన రమ్య లేచికూర్చుంది.“ఏమైంది ముక్తా… ఎందుకలా భయపడుతున్నావు? పీడకలేదన్నా వచ్చిందా!’’ మౌక్తిక వీపుమీద నిమిరింది రమ్య సాంత్వనగా.మాట్లాడలేనన్నట్లుగా సైగచేసింది మౌక్తిక. రమ్య వెళ్లి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి ఆమెచేత తాగించింది. ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టింది. చల్లని నీళ్ళు తాగిన తరువాత మౌక్తిక ప్రాణం తెరిపినపడింది. దడ, ఆయాసం తగ్గుముఖం పట్టాయి. రమ్య ఓపిగ్గా అంతసేపూ ఎదురుచూసి” ముక్తా… నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ అని అంటావే గాని. ఏనాడూ కూడా నీమనసులోని బాధ నాకు చెప్పవు. ప్లీజ్… అలా నిద్రలోనుంచి ఎందుకులేచావు? ఏదన్నా పీడకల వచ్చిందా?’’ అనునయంగా అడిగింది రమ్య మౌక్తికను పొదివిపట్టుకుంటూ. ఆ లాలనకి మంచులా కరిగిపోయింది మౌక్తిక.ఆమె భుజంమీద తలవాల్చి తెప్పరిల్లుతున్నట్లుగా ఉండిపోయింది కాసేపు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్