Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

వృత్తిదేవోభవ

vruttidevobhava

"ఒరేయ్...మల్లన్నా"! తండ్రి  అట్టా పిలవంగానే...మోకాళ్ళ మధ్య తలదూర్చి...దిగాలుగా కూర్చున్న వాడల్లా చివుక్కున తలెత్తి చూసాడు ...పదేళ్ల పసివాడు. చెంపల నిండా కన్నీరు కార్చిన చారికలు. శివయ్య కొడుకు ముఖం చూడంగానే... తల్లడిల్లిపోయాడు.

ఏమయ్యిందిరా నీకు...? వారం దినాలబట్టి సూతున్నా నిన్ను. ఒకటే మంకుబట్టి కూకున్నావ్. నీకీ ఊళ్ళో నేనేం తక్కువ సేసానో సెప్పు...!  మనింటా వంటా సదువుకున్నోళ్లు లేకపోనా గానీ...నువ్వు సదువుకోడానికి బళ్ళో ఏశాను. నీకిట్టం లేదంటే సెప్పు....బడి మానేసి...నాకూడా వత్తానంటే రా ...నీకీయాల నుంచే గుండె దిట్టం సేసుకోడమూ వత్తాది." శివయ్య...కొడుకు బాధేమిటో తెలియక అలా ఊహిస్తూ  అడిగాడు ఎంతో  ప్రేమగా. తండ్రి మాటలకు...మల్లన్న కళ్లలోంచి జలజలా రాలిపడ్డాయి మరికొన్ని కన్నీటి చుక్కలు. శివయ్య...కొడుకుని గుండెలకానుంచుకుని..."అలా ఏడవమాకురా. నీకొచ్చిన కట్టమేంటో సెప్పు..."? ఊరుకోబెడుతూ అన్నాడు.

ఈ సారి మల్లన్న చొక్కాని పైకెత్తి...కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు. "అయ్యా...నాకేమో పేరెందుకు అలా పెట్టావ్. నాకేం నచ్చలేదు. బళ్ళో అందరూ నన్ను అలా పిలుస్తూ నవ్వుకుంటున్నారు. నాకా పేరొద్దు. 'మల్లేష్' అని అందంగా పెట్టకపోయావా.."? అమాయకంగా అడిగిన కొడుకు మాటలకు...పడి పడి నవ్వాడు శివయ్య.

"అరె...ఇందుకేనేట్రా...అంతలా అయిపోనావు. నువ్వలా అనకూడదు...నీపేరు కేట్రా మన కులపు సాములోరి పేరది.  మల్లన్నంటే ...ఆ ఈశన్న పేరు. నాపేరేమో శివయ్య. నీ తాతదేమో సాంబయ్య. ఇయన్నీ సాములోరి పేర్లే ".

"పో...అయ్యా...! నాకేం నచ్చలే. మా బళ్ళో పిల్లల పేర్లన్నీ భలే బావుంటాయి. నాపేరు 'మల్లేష్' అని మారిపించయ్యా..."  అని ధీనంగా కొడుకు అడిగేసరికి...శివయ్య  వాడిని ముద్దాడి ...." అలాగేరా  బళ్ళో పంతులు గారితో సెప్పి మారిపించేత్తాను"...అని తండ్రి చెప్పగానే అప్పుడొచ్చింది  మల్లన్న మొఖంలోకి వెలుగు.

కొడుకు బాధ చూడలేక పేరుని మార్పించాడే గానీ...ఎంత మాత్రమూ పేరు మార్చడం ఇష్టం లేదు  శివయ్యకు .

"పర్లేదులేరా...మల్లేష్ అన్నా శివుడి పేరే. అర్థమేమీ మారిపోలేదు లేరా..." అంటూ బళ్ళో పంతులు చెప్పాకా...శివయ్య ఎంతగా సంబరపడ్డాడో...!మల్లన్న -  మల్లేష్ గా మారిపోయాకా...వాడి మొఖంలో ఏదో సాధించానన్న ఆనందంతో పొంగిపోయాడు.

*         *       *

మల్లేష్  డిగ్రీ చదివాడు...! శివయ్య ఆనందానికి అంతులేదు. తమ కుటుంబంలో బాగా చదువుకున్నవారిలో తన కొడుకు మాత్రమే.     కొద్దిసేపట్లో...ఇంటికి రాబోతున్న కొడుకు కోసం కళ్ళలో ఒత్తిలేసుకుని ఎదురుచూస్తున్నాడు.

ఈసురోమని ఇంటికొచ్చిన  వచ్చిన కొడుకు చేతిలోని ఫైల్ని గిరాటేసి...అక్కడే  మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని కూర్చున్నాడు .వాడు అలా కూర్చున్నాడు అంటే...వాడి మనసుకేదో అయ్యిందని తెలిసిపోతుంది శివయ్యకి. వీడు చిన్నప్పటి నుంచీ అంతే. మనసులోనే బాధను నాన్చుకుంటూ...అడగ్గా అడగ్గా ఒక్కసారే కుండ బద్దలైనట్టు అరుత్తాడు . పెద్దయినా గానీ...ఆపసితనం పోలేదీడికి అనుకుంటూ కొడుకు దగ్గరగా వెళ్ళాడు శివయ్య.

" ఏరా...ఈసారి కూడా నీకుద్యోగం రాలేదా..."? అని అడుగుతూ కొడుకు తలపై  చేయి వేస్తూ ఓదార్చాడు కన్న తండ్రి. తండ్రి చేతిని విసురుగా తోసేశాడు.. "లేదు..నాకిక ఏ ఉద్యోగమూ రాదు "..అని చెప్పి గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు మల్లేష్. శివయ్య కొడుకు చేష్టకి అదిరిపోయాడు...గబ గబా లేచెళ్లి కిటికీ సందు గుండా చూసిన శివయ్యకు గుండాగినంత పనయ్యింది. "ఓరి నాకొడుకో...ఎంత పని సేత్తున్నావురా..! అంటూ...తనకున్న కండ బలంతో ఒక్కతోపు తోసాడు తలుపుని. తలుపు గడియ ఊడిపోవడంతో...గబగబా లోనికెళ్లి  ఉరేసుకోడానికి  తయారవుతున్న కొడుకు చేతిలోని తాడుని లాగేసుకుని...చెంప మీద గట్టిగా ఒకటిచ్చాడు.

కొడుకు చేసే పని తట్టుకోలేక...ఆవేశంతో ఊగిపోయాడు శివయ్య. "ఏమొచ్చిందిరా నీకు...? నువ్వు సత్తే....అందరినీ  కాలుత్తున్నట్టే...నిన్నూ నాసేతుల్తోనే  కాలిసేయమంటావా...? నేసత్తే  నా తలకి కొరివేట్టాల్సినోడివి నువ్వు. నువ్వే నాకు కాకుండా పోతే...నాగతి ఏం గావాలా..? సెప్పరా సెప్పు..." అంటూ...నిలదీస్తున్న తండ్రిని అసహ్యంగా చూసాడు మల్లేష్.

"ఒద్దయ్యా ..వొద్దు...! నువ్వెంతసేపూ శ్మశానం లోనే ఉంటూ...శవాలు...కట్టెలూ...పిడకలు...కిరసనాయిలు ...వీటితో పాటూ తాగడానికి కొంత సారా...వీటితోనేగా  నీ జీవితం. నేను చావాలనుకున్నప్పుడూ నీకిదే ఊసు. చిన్నప్పటినుంచీ నిన్ను చూసి చూసి ...చిరాకేస్తుంది. నీకు దూరంగా ఎక్కడికైనా పోయి ఉద్యోగం చేసుకుందాం అనుకుంటే...ఆ ఉద్యోగాలకూ పోటీయే. నాకు చచ్చిపోవాలనుంది...." తల బాదుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మల్లేష్....కొడుకు మాటలకు గుండె పగిలినట్టయ్యింది శివయ్యకు.

"ఒరేయ్...మల్లేసూ....  ఈ సొసానంలోనే  తిరుగాడుతూ...సవాల్ని తగలెట్టుకుంటూ  బతికే కులంలోనే  నేను పుట్టి పెరిగానురా. అలా సంపాదించిన సొమ్ముతోనే నీకు కూడెట్టినా.. సదివించినా... నిన్నింత వాడిని సేశాను కదరా. మా తాత ముత్తాతల నుంచీ ఈ రుత్తినిలా సేత్తున్నాము కాబట్టే...పోయినోళ్లందరినీ ఈమట్టిలో కలిపే పున్యం మనకే దక్కింది".

" పెద్ద పెద్ద సదువులు సదివితేనే ఉజ్జోగాలు సేసుకుని డబ్బు గడించొచ్చని  నువ్వెట్టానుకుంటున్నావో గానీ...ఏ సదువూ లేకపోయినా... దినానికి ఐదారు శవాల్ని తగలెట్టినా...శవానికి వెయ్యి రూపాయలు సొప్పున సూత్తే...ఐదారు వేలు గడించొచ్చు. మన రుత్తి నీకు సిన్నసూపుగా ఉందేమో గానీ...మనకదే ఆ పరమశివుడు సూపించిన బతుకుతెరువు. నీకిట్టం లేకపోతే...ఈపని సేయమాకు. అసలే మీయమ్మ పోయకా నువ్వే నాపానం అనుకుని బతుకుతున్నా. నా కట్టంతోనే నిన్నూ పోసించుకుంటాను గానీ నువ్విలాటి చావు  చావాలనుకుంటే నామీదొట్టే..." కొడుకుని గట్టిగానే మందలించాడు శివయ్య. తండ్రి మాటలకు...మరేమీ సమాధానం చెప్పలేదు మల్లేష్. 

కొద్ది రోజులు గడిచాయి....

కొడుకు మల్లేష్  చేస్తున్న పనికి ఇప్పుడెంతో...సంతోషంగా వున్నాడు శివయ్య...!   చిన్నప్పుడు మల్లన్న  నుంచి మల్లేష్  లోకి  పేరు మార్చినా కుల దేవుడైన శివుడు పేరులోంచి  తప్పుకోలేదు. శవాలు తగలెట్టే వృత్తి నుంచి దూరంగా పారిపోదామనుకున్నా...మనసు మార్చుకుని అదే వృత్తిని చేస్తూ కొడుకు తనను  అనుసరిస్తున్నందుకు...

ఆ తండ్రికి అంతకంటే సంతృప్తి ఏముంటుంది...? వృత్తి అదే అయినా...మల్లేష్ కూడా తృప్తిగా  చేసుకుపోతున్నాడు... చదువుకున్న యువకుడు కదా...ఆపనిలో కొంచెం ఆధునిక పద్ధతిని  తీసుకొచ్చాడంతే....  అదే....ఎలక్ట్రికల్  క్రెమిటోరియం...

మరిన్ని యువతరం
bhayam bhayam