Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కర్నాటక తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

karnataka  viharayatralu

( బెంగలూరు )

బెంగలూరు గురించి మరోముఖ్యమైన విషయం యేమిటంటే యిక్కడ అన్ని మతాలవారూ , యెటువంటి భయాలూ లేకుండా జీవీస్తున్నారు అనడానికి యిక్కడవున్న అక్షరాల వెయ్యికి పైబడ్డ హిందూ దేవాలయాలు , 400 కు పైగా ముస్లిమ్ ప్రార్ధనా స్థలాలు , వందకుపైగా చర్చ్ లు , 40 జైన మందిరాలు , మూడు గురుద్వారాలు , రెండు బౌద్ద విహారాలు , ఒక పార్సీ అగ్ని మందిరం తెలియజేస్తున్నాయి . ఎప్పుడూ యిక్కడ మతకలహాలు జరిగిన దాఖలాలు లేవు .

కబ్బన్ పార్క్ ——-1870 లో అప్పటి ఆంగ్లేయులచే నియమింపబడ్డ మేజర్ జనరల్ రిచర్డ్ షేంకి వంద ఎకరాలలో నిర్మించిన ఉద్యానవనం తరువాత చేసిన మార్పులతో ప్రస్థుతం 300 ఎకరాలలో విస్తరించి వుంది .దీనిని మొదటగా ‘ జాన్ మీడే ‘ పేరుమీద ‘ మీడే ‘ పార్క్ గా వ్యవహరించేవారు , తరవాత మార్క్ కబ్బన్ గౌరవార్ధం దీనిని ‘ కబ్బన్ పార్క్ ‘ గా మార్చేరు 1927 లో శ్రీ కృష్ణరాజ వడయార్ జ్ఞాపకార్ధం దీనిని కృష్ణరాజ  పార్క్ గా మార్చి , 1864నుంచి 1894 వరకు మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీ చామరాజేంద్ర వడయార్ పేరుమీద చామరాజేంద్ర పార్క్ గా మార్చేరు . కాని యెక్కువగా దీనిని కబ్బన్ పార్క్ అనే అంటారు .కబ్బన్ పార్క్ బెంగలూరు నగర నడిబొడ్డున వుంది , చిన్నచిన్నరాతి గుట్టలు దట్టమైన వృక్షాలతో ఓ చిన్న అడవిలా అనిపిస్తుంది . పార్క్ లో చక్కటి నడక రోడ్డులు వున్నాయి , సుమారు ఆరివేల వృక్షాలు వున్నట్లు అంచనా . చాలా వెదురు పొదలు , బొటానికల్ పేర్లతో వున్న అనేక వృక్షాలు పేర్లు కూడా తెలీవు , రకరకాల రంగురంగుల పూల వృక్షాలు ఆశ్చర్యాన్నిస్తాయి , ఇక్కడ యెక్కువగా శిలా విగ్రహాలు వుంటాయి , విక్టోరియా రాణి , ఏడవ ఎడ్వర్డ్ రాజు , చామరాజేంద్ర వడయార్ మొదలయినవారి విగ్రహాలను చూడొచ్చు .

కబ్బన్ పార్క్ లోపల యెర్రటి రంగులో వున్న కట్టడాలు, హైకోర్టు , సెంట్రల్ లైబ్రెరీ , విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నొలాజికల్ మ్యూజియం కూడా కబ్బన్ పార్కులోనే వుంది . కబ్బన్ పార్క్ లో వున్న వృక్షజాతులు మనదేశంలో మరెక్కడా లేవని అంటారు , బోటనీ విద్యార్థులకు కావలసిన వృక్షజాతులు యిక్కడ లభిస్తాయి , చాలా విశ్లవిద్యాలయాలు తమ విద్యార్థులను యీ పార్క్ కి స్టడీ టూర్ కి తీసుకువస్తూ వుంటారు .

బెంగళూరు నగర మధ్యలో ఇంత చక్కటి వుద్యానవనం వుండడం వల్లనే యింకా అక్కడ గాలి స్వఛ్చంగా వుందేమో ?

విధాన సౌధ ———-

నియో ద్రవిడ శిల్పకళతో 1952 లో మొదలుపెట్టి 1956 లో పూర్తి చెయ్యబడింది విధాన సౌధ . కర్నాటక శాసనసభ సమావేశాలు జరిగే ప్రదేశం . బిల్డింగ్ లోపలకి మనకి ప్రవేశం వుండదు బయటనుంచే చూడాలి , చాలా సినిమాలలో ఈ కట్టడాన్ని మనం చూసేం , విధానసౌధ కి కుడివైపున ఇలాంటిదే మరో కట్టడం 2005 లో నిర్మించేరు దీనిని వికాశ్ సౌధ అని అంటారు .

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నొలాజికల్ మ్యూజియం ——

కబ్బన్ పార్క్ లో వున్న మరో భవనం , 1958 లో భారతరత్న సర్ విశ్వేశ్వరయ్య గారి గౌరవార్ధం సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం 4000 చదరపు మీటర్ల వైశాల్యం లో నిర్మాణం చేపట్టి 1962 లో జూలైలో పూర్తి చేసేరు అప్పటి మైసూర్ ప్రభుత్వం వారు . 1970 లలో చిన్న పట్టణాలకు పల్లెలకు సైన్స్ బస్సు నడిపి అక్కడి వారికి సైన్స్ మీద అవగాహన కల్పించేవారు , గ్రహనక్షత్రాలను చూసేందుకు వీలుగా టెలిస్కోపును కూడా తీసుకొని వెళ్లేవారు . పెద్ద తెరలమీద సైన్స్ కి సంభందించిన పరిశోధనలు మొదలయినవి చూపించి సైన్స్ ని సామాన్య ప్రజలకు దగ్గరగా తీసుకు వచ్చి ఓ అవగాహన కల్పించేరు .

ఈ మ్యూజియం  వినాయక చవితికి , దశరాదశిమికి తప్ప వేరే అన్ని రోజులూ పగలు 9-30 నుంచి సాయంత్రం 6-30 వరకు తెరచి వుంటుంది .పర్యాటకులు గుర్తుంచుకోవలసిన విషయం యేమిటంటే పెద్ద మ్యూజియంలు ఒకరోజులో చూడలేం అని , వివరంగా చూడాలంటే కనీసం రెండురోజులైనా పడుతుంది .పిల్లలకు పెద్దలకూ కూడా ఆశక్తిని కలిగించే యెన్నో విషయాలు యిక్కడ చూడొచ్చు . డౌనోసార్ పెవేలియన్  ముఖ్యంగా పిల్లలని ఆకర్షిస్తుంది . ఆరు సంవత్సరాల పిల్లలని తప్పకుండా తీసుకు వెళ్లవలసిన ప్రదేశమని చెప్పొచ్చు .        ఒకసారి చూసొస్తే చాలదు , ఎందుకంటే కొత్త ప్రయోగాలను , కొత్త అవిష్కారాలను గురించి తెలుసుకోవాలంటే వీలున్నవారు కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి చూడవలసిన ప్రదేశం .

చిన్నపరిశ్రమలలో వుపయోగ పడే అతి చిన్న మిషన్ నుంచి ఫైటర్ జెట్స్ , మిలటరీ టేంకర్స్ మొదలయిన వాటిలో వుపయోగించే అతి భారీ యంత్రాలను కూడా యిక్కడ చూడొచ్చు , అలాగే రోదసీ నౌకను గురించి కూడా తెలుసుకోవచ్చు . అతి ఆధునికమైన ఎలక్టానిక్స్ పరికరాలను గురించి కూడా యిక్కడ చూడొచ్చు , సైన్స్ ఫర్ కిడ్స్ లో లైట్స్ , సౌండు మొదలయిన వాటిగురించి పిల్లలు యంత్రాలను స్వయంగా వుపయోగించి తెలుసుకోడానికి వీలు కలిగించేరు .

దేశం లో కొత్తగా వచ్చిన టెక్నాలజీ అది మెకానికల్ అయినా , ఎలక్ట్రోనిక్ అయినా , ఎలక్ట్రికల్ అయినా యిక్కడ ప్రజలకోసం అందుబాటులో వుంచడం మెచ్చుకోదగ్గది .

మ్యూజియం చూడ్డమా అని చప్పరించే వాళ్లను చాలా మందిని చూసేను , వారికి నా సలహా యేమిటంటే మ్యూజియంలు చూడండి , మనకి పాతకాలం గురించి అప్పటినుండి నేటి వరకు వచ్చిన మార్పుల గురించి , అలాంటి మార్పులకోసం యెందరు మహాను భావులు యెలా కష్టపడింది తెలుస్తుంది . చూసి తీరవలసిన ప్రదేశం ..

ఉల్సూర్ సరస్సు ———

మైసూర్ రాజ్యాన్ని కేంపగౌడ పరిపాలిస్తున్న సమయంలో నిర్మింపబడ్డ సరస్సు , ఈ సరస్సు వర్షాధారమైనది . మహాత్మాగాంధి రోడ్డుకి దగ్గరగా వుంటుంది . 50 హెక్టార్లలో విస్తరించి వుంటుంది . ఈ సరస్సు మధ్యలో చిన్నచిన్న ద్వీపాలు వున్నాయి , చుట్టూరా గుట్టలు చెట్లు వుండడంతో యిది మంచి పిక్నిక్ ప్రదేశంగా గుర్తించబడింది . బోటు షికారు , ఫిషింగ్ చేసే వీలుంది . ఇక్కడి వాతావరణం కలుషితంకాకుండా కాపాడడానికి ఆరు వాచ్ టవర్లు నిర్మించి చర్యలు తీసుకుంటున్నారు . బెంగుళారు డే టూరు లో యిదొక సందర్శనీయ ప్రదేశం .

బెంళూరు పేలస్ —

1873 లో చామరాజవడయార్ బెంగుళూరుకి చదవుల నిమిత్తం వచ్చినప్పుడు ఆంగ్లేయులనుంచి 40 వేల రూపాయలకి యీ ప్రదేశాన్ని కొనుగోలు చేసి అందులో భవన నిర్మాణం చేసేరు . జయ చామరాజేంద్ర వడయార్ కాలంలో యీ భవనానికి దర్బారు హాలు , సంగీతకచేరీలకి గాను హాలు నిర్మించడం జరిగింది , ఈ ప్రదేశం సుమారు 454 చదరపు ఎకరాలుకాగా  భవనం 45 వేల చదరపు అడుగులలో నిర్మింపబడింది ఈ భవనాన్ని జయచామరాజేంద్ర వడయార్ చాముండి హోటల్స్ , శ్రీ వేంకటేశ్వర రియల్ ఎస్టేట్ ఎంటర్ ప్రైజెస్ కి అమ్మివేసి మైసూర్ రాజభవనానికి వెళ్లిపోయేడు . అతను తిరిగి తాను యెవరికీ రాజభవనాన్ని అమ్మలేదని కోర్టులో కేసు వేయగా వారివద్ద అమ్మకపు రశీదులు లేకపోవడం వల్ల తిరిగి భవనాన్ని హస్తగతం చేసుకున్నాడు . అవతలి వారు హైకోర్టునాశ్రయించడంతో యిప్పటికీ కేసు సుప్రీం కోర్టులో తీర్పుకోసం వుంది . జయచామరాజేంద్ర వడయార్ ఆ ఆస్థిని తన అయిదుగురు అక్కచెల్లెళ్లకు యివ్వడం తో ప్రస్తుతం వారు ఆ భవనంలో నివసిస్తున్నారు .1990 , 1994 లలో జయచామరాజేంద్ర వడయార్ ఏకైక వారసుడు శ్రీకాంత దత్త వడయార్ 45 యెకరాల స్థలం తప్ప మిగతా పేలస్ ను దక్కించుకొని అక్కడే నివశించసాగేడు . మిగతా భూమికోసం యిప్పటికీ కోర్టులో కేసు నడుస్తోంది .

సుమారు 30 పడకగదులు , ఫౌంటెన్స్ , స్విమ్మింగ్ పూల్స్ వున్నాయి , ప్రస్తుతపు రాణి ప్రమోదాదేవి వడయార్  ఎమ్యూజిమెంట్ పార్క్ నిర్మాణం చేసేరు . కాని ఇందులో రాణిగారి పర్మిషన్ లభించిన వారికే ప్రవేశం వుంటుందట .ఈ మధ్యకాలంలో రాజవంశీయులచే నడుపబడుతున్న వాణిజ్య సంస్థలు యీ భవనంలోపల కార్యకలాపాలు చేస్తున్నాయి , భవనం లోపల , బయట చాలా పెళ్లి మండపాలు వేసి అద్దెలకు యివ్వడంలాంటివి జరుగుతూ వుండడంతో భవనం చుట్టుపక్కల శుభ్రత లోపించింది . మనకి బయటనుంచే చూపిస్తారు భవనాన్ని

బన్నెరు గట్ట నేషనల్ పార్క్  ——

1970 లో సుమారు 260 చదరపు కిలోమీటర్లని సంరక్షత ప్రాంతంగా గుర్తించేరు , ఇందులో జ్యూ పార్క్ , పెట్ట్ కార్నర్ , ఏనిమల్ రెస్కూ సెంటర్ , బటర్ ఫ్లై హౌస్ , అక్వేరియం , స్నేక్ హౌస్ , సఫారీ పార్క్ వున్నాయి , ఇవి కాక ఈ సంరక్షిత అడవిలో పురాతనమైన మందిరాలు , ఆరు పల్లెలు , ట్రెక్కింగ్ , హైకింగ్ లాంటి ఆకర్షణ లు వున్నాయి , మొత్తం మీద శలవురోజు పూర్తిగా గడిపేందుకు కావలసిన అన్ని ఆకర్షణలూ వున్నాయి . సాధుజంతువులను  , క్రూరజంతువులను వేరువేరు విభాగాలలో వుంచేరు . నేషనల్ పార్కులో తిరగడానికి గైడ్ సహితంగా ప్రభుత్వం వారచే నడపబడే బస్సులు వున్నాయి . ఈ పార్క్ లో అడవి యేనుగలకు శిక్షణ యిచ్చి పెంపుడు ఏనుగులుగా మారుస్తారు .

క్రూరజంతువుల విభాగంలో పెద్దపులులు , బెంగాల్ తెల్లపులులు , సింహాలు , ఎలుగుబంట్లు వున్నాయి . చాలా నేషనల్ పార్క్ లలో ఓపెన్ జీపు సఫారి వుంటుంది , ఇక్కడ మాత్రం మనం పకడ్బందీగా మూసిన తలుపుల వెనుక వుంటాం జంతువులు అడవిలో తిరుగుతూ వుంటాయి . కొన్ని పులులు మాత్రం యెత్తైన ఫెన్సింగ్ వెనుకవున్నాయి సింహాలు కొన్ని తెల్ల , పెద్ద పులులు చెట్ల మధ్య విహరిస్తున్నాయి .

ఈ పార్క్ లో చాలా సార్లు క్రూరజంతువులు పర్యాటకులపై దాడి చేసినట్లు వార్తలు వచ్చేయి , అలా జరిగినప్పుడల్లా సఫారీ మూసివేస్తూ వుంటారు . సాధుజంతువుల విభాగంలో రకరకాల లేళ్లు , దుప్పులు , జీబ్రా మొదలయిన అనేక జంతువులను చూడొచ్చు . పురివిప్పి ఆడే నెమళ్లు కనువిందు చేస్తాయి.

కెఎస్ఐసి ప్యాక్టరి —-

కర్నాటక సిల్క్స్ ఫేక్టరీ , మైసూర్ శాండల్ సోపు ప్యాక్టరీ పర్యాటకులకోసం తెరచివుంటుంది . పర్యాటకులకు గైడ్ నిచ్చి అక్కడి వస్తువుల తయారీని గురించి వివరిస్తారు .  ముందుగా సిల్క్ ప్యాక్టరీ గురించి , ఇక్కడ తయారయే సిల్క్ ని క్రేప్ సిల్క్ అంటారు , లైట్ వైట్ పట్టుచీరల నేతలో ఒంటిపోగు ధారం వాడుతారు , కాంచిపురం సిల్క్ నేతలో రెండు ధారాలను వుపయోగించి నేస్తారు , క్రేప్ సిల్క్ లో మూడుధారాలను మెలిపెట్టి నేతలో వుపయోగిస్తారు ,  చాలా శుభ్రమైన పట్టుని వుపయోగిస్తారు , ఈ చీరలలో వాడే జరీ 24 కేరెట్ల బంగారం నుండి తయారు చేస్తారు , ప్రతీ చీరకీ కట్టు కొంగుకి ఓ నెంబరు వుంటుంది , ఈ నెంబరు ఒక్క కెఎస్ఐసిలో తయారయే చీరలకు మాత్రమే వుంటుంది . మిగతావన్నీ నకిలీవే , వాటి నాణ్యత కూడా అలాగే వుంటుంది . ఈ క్రేప్ సిల్క్ చీరలు వాటర్ ఫ్రూఫ్ కూడాను . ఒక్కో చీర పాతికవేలకి తక్కువ ఖరీదులో వుండవు , బంగారం ఖరీదు పెరుగుతూ వుంటే ఈ చీరల ఖరీదుకూడా పెరుగుతూ వుంటుంది . ఈ చీరల మన్నిక చాలా యెక్కువ . నాదగ్గర 30 యేళ్లక్రిందట కొన్నచీర యిప్పటికీ మెరుపుకూడా తగ్గలేదు . జరీ లేని ప్రింటెడ్ క్రేప్ సిల్క్ చీరలుకూడా తయారు చేస్తారు వీటి ఖరీదు పదివేల రూపాల దరిదాపులలో వుంటుంది .

బెంగుళూరు హింధుస్థాన్ ఏరోనాటిక్స్ , భారత్ ఎర్త్ మూవర్స్ , భారత్ ఎలక్రానిక్స్ లాంటి భారి పరిశ్రమలే కాక సాఫ్టవేర్ హబ్ కూడా , అందుకే మనదేశంలో అతిపెద్దనగరాలలో 5వ స్థానాన్ని సంపాదించుకుంది . ఈ వారం తో బెంళూరు గురించి తెలుసుకున్నాం పై వారం బంగారు గనుల గురించి చదువుదాం అంతవరకు శలవు .        

మరిన్ని శీర్షికలు
weekly-horoscope september 13th to september 19th