Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue335/844/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి)... “ఈ మధ్యన చాలా రోజులుగా మాఫ్రెండ్ కి ఓ వింతకల వస్తోంది. దానివలన తను మానసికంగా చాలా డిస్టర్బ్ అవుతోంది. ఆకల ఎందుకొస్తోందో మీరు అనలైజ్ చేసి, ఆమెకి మనశ్శాంతి కలిగేందుకు ఏదైనా రెమిడీ సూచిస్తారేమోనని… మీదగ్గరకు తీసుకొచ్చాను.’’ రమ్య చెప్పింది క్లుప్తంగా.
యతిరాజ్ ఆసక్తిగా చూశాడు మౌక్తికవైపు. తన పరిశోధనకి కొత్త సబ్జెక్ట్ లభించిన అనందమా అది!...నవ్వుకుంది మౌక్తిక.

“చెప్పమ్మా మౌక్తికా…ఆకల ఏమిటో నాకు సవివరంగా చెప్పు…’’ సౌమ్యంగా అడిగాడు యతిరాజ్.కొత్త వ్యక్తులముందు నోరిప్పే అలవాటు మౌక్తికకులేదు. మనసిప్పడం మరీతెలియదు. ప్రియమైన నెచ్చెలి రమ్యకే  తన మదిలోని బాధ ఏనాడూ చెప్పుకోలేదు. ఇప్పుడీ అపరిచిత వ్యక్తిముందు తన హృదయఘోషను ఎలా వెల్లడించగలదు! కల గురించి విన్నాక ఈయన తానేదో తీరని కోరికలతో కొవ్వెక్కి కొట్టుకుంటోందని అపోహచెందితే? సంశయంగా వెనుకంజ వేస్తున్న మౌక్తికకేసి చిరాగ్గా చూసింది రమ్య.

“ఆయన కలలమీద రీసెర్చ్ చేసి పట్టా పుచ్చుకున్న వ్యక్తి. నీకొచ్చిన ఆపాడుకలని విశ్లేషించి, నీ ఒత్తిడి తగ్గే మార్గం చెబుతారని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు ఆయనకి నీకల గురించి మాత్రమే చెబుతున్నావు. నీ జీవిత చరిత్ర మొత్తంకాదు…ఆయన సమయం చాలా విలువైనది. మురిపించుకోక మొదలుపెట్టు’’ కాస్త కోపంగా మౌక్తికకు మాత్రమే వినబడేతట్లు అంది రమ్య.

అలా అనడంలో ఆమెలోని సహనం తగ్గుముఖం పట్టినట్లుగా అనిపించింది. ఇక తప్పదన్నట్లుగా ప్రారంభించి మౌక్తిక. అలా… బిడియ పడుతూనే  తనకొచ్చే కల, దానిలోని అంశాలు…అన్నీ పొల్లుపోకుండా వివరించింది. చెప్పడానికి ముందున్న సంకోచం చెప్పేశాక తొలగిపోయింది. యతిరాజ్ భృకుటి ముడివడింది ఒక్కసారి. ఆలోచనా నిమగ్నుడై అలా తదేక దృష్టితో చూస్తూండి పోయాడు. ఆయనేం చెప్పబోతున్నాడో అని… మౌక్తిక ఉద్విగ్నతతోనూ, రమ్య ఉత్సుకతతోనూ చూస్తూండిపోయారు.

“కలలు-వాటి ఫలితాలు…దీనిగురించి తెలుసుకోవాలంటే ముందు మనం మూలాల్లోకి వెళ్ళాలి. జ్యోతిష్య శాస్త్రవేత్తలు, సిధ్ధాంతులు… ఈ కలలనోరకంగా విశ్లేషిస్తే మనస్తత్వశాస్త్రం ఇంకోరకంగా విశ్లేషిస్తుంది. రెండూ విభిన్నకోణాలు. దేనినీ మనం తక్కువ అంచనా వేయకూడదు. దేన్ని నమ్మేవారు దాన్ని నమ్ముతారు.

మనిషి జీవితం ఎన్నోరకాల అనుభవాల సమాహారం. అనేకరకాలైన భావోద్వేగాల సమ్మేళనం. మనం నిరంతరం అనేకరకాలైన సమస్యలతో పోరాటం చేస్తూ అంతులేని సంఘర్షణకి లోనౌతూ ఉంటాము. ఆ ఘర్షణ ఫలితంగా అంతులేని మానసిక ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది.   కొందరు తమ మనసులోని భావాలను, బాధలను సన్నిహితులతో పంచుకుని ఈ ఒత్తిడిని పారద్రోలుతారు. మరికొంతమంది మాత్రం మనసులోనే బలవంతంగా అదిమేసుకుని తమలోతామే నలిగిపోతూ ఉంటారు. ఫలితంగా ఆఒత్తిడి మరింత అధికమై రకరకాల శారీరిక మానసిక రుగ్మతలుఎదురౌతూ ఉంటాయి.

ఆకలి, నిద్ర కరువవుతాయి. తీవ్రమైన ఒత్తిడికి గురైనవారు ఎంతో ప్రయత్నిస్తేగాని నిద్రపోలేరు. ఒకవేళ నిద్రపట్టినా చప్పున మెలకువ వచ్చేస్తుంది. అటువంటి కలత నిద్రలోనే కలలు వస్తాయి. మన జీవితానికి, మనం కనే కలలకి సంబంధం ఉండి తీరాలన్న నిబంధనేమీలేదు.
కాని, చాలామంది అనుభవాలను, వారికొచ్చే కలలను బేరీజు వేసి చూస్తే …జీవితంలో వారు చవిచూసిన చేదు అనుభవాలు మనసుపై చెరగని ముద్ర వేసినప్పుడు… ఆముద్రలోనుంచి ఉద్భవించాయి వారికొచ్చే కలలు.

సగం సుషుప్తావస్థ, సగం జాగృదావస్థ లో ఉన్నప్పుడు ఆ అనుభవాలు కలిగించే వేదన కలలరూపంలో వచ్చి వారిని వెంటాడుతూనే ఉంటుంది.’’ యతిరాజ్ కంఠస్వరం మెస్మరైజ్ చేస్తున్నట్లుగా ఉంది. ఆయన చెబుతున్న విధానం ఎదుటి వ్యక్తులని ఆకట్టుకునేలా ఉంది.

“నీకొస్తున్న కలనే తీసుకుందాం. అందమైన పువ్వులతోటలో ఉయ్యాలలూగుతున్నావు. హాయిగా విహరిస్తున్నావు. నిన్ను ఆ ఆనందానికి దూరం చేస్తూ…కొన్ని పాములు నీమెడ చుట్టూ అల్లుకుని నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటినుంచి విడిపించుకోవడానికి నువ్వు శతవిధాల ప్రయత్నిస్తున్నావు. అంతలో…అందమైన పారిజాతపూలమాలిక తనంత తానుగా నిన్ను చేరడానికి వస్తోంది. నువ్వు ఆనందంతో పులకించిపోయావు.కాని, ఆపాములు ఆ విరిదండని నీదగ్గరకి రానీయక తమ తోకలతో దూరంగా విసిరికొడుతున్నాయి. ఇదేగా… నీకల సారాంశం.’’  మౌక్తికను ప్రశ్నించాడు యతిరాజ్.

అంతేనన్నట్లుగా తలూపింది మౌక్తిక.ఆమెకి చాలా కుతూహలంగా ఉంది… ఆయన తన కలని ఏరకంగా విశ్లేషిస్తాడోనని.ఇంతలో పనిమనిషి ఒక ట్రేలో ఫ్రూట్ జ్యూస్ లున్న గ్లాసులని తీసుకొచ్చి వాళ్ళకి అందించింది. యతిరాజ్ కోరికమేరకు స్నేహితురాళ్ళిద్దరూ జ్యూస్ తీసుకుని సిప్ చేయసాగారు.

“చూడమ్మా మౌక్తికా…నీ కలలో పాములు కనబడ్డాయంటే దానికి గల కారణాన్ని జ్యోతిష్యశాస్త్రం వేరేగా చెబుతుంది. ఎవరికైనా కలలో పాములు కనబడితే… ఆవ్యక్తికి ఏదో కీడు జరుగుతుందని భావిస్తారు సిధ్ధాంతులు. ఆవ్యక్తి జాతకచక్రంలో ‘ కాలసర్పదోషం’ కనుక ఉండి ఉంటే కూడా పాములిలా పదేపదే కలలో కానవస్తాయని చెబుతారు. ఏ శ్రీకాళహస్తిలోనో,  లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోనో అభిషేకం జరిపించుకుంటే ఆకీడు తొలగిపోతుందని సూచిస్తారు.

అంతేకాదు… ఆ పారిజాత సుమమాలిక కలలో కనిపించడానికి కూడా అర్ధాన్ని వారు చెబుతారు. తెల్లని పూలదండ కలలో కనిపిస్తే వారి సమీప భవిష్యత్తులో వాళ్లకేదో మంచి జరగబోతోందని అర్ధం అంటారు.

కాని, పాములు కలలో వస్తే…మనస్తత్వశాస్త్రం ఏమని చెబుతుందో తెలుసా!? మన మదిలో అల్లకల్లోలమైన ఆలోచనలు కలిగినప్పుడు, మనిషి మానసికంగా శాంతిగా ఉన్నప్పుడు… ఆశాంతిని పారద్రోలే ఔట్ లెట్ గా అటువంటి కలలు వస్తాయని చెబుతుంది. మనిషిలో తీరని కోరికలు ఏమన్నా ఉన్నప్పుడు…ముఖ్యంగా సెక్సువల్ డిసైర్స్ కలిగినప్పుడు… అవి తీర్చుకోలేని మార్గం మనిషికి లేనప్పుడు… ఆ కోరికలు అలా పాముల రూపంలో కలలో వచ్చి మానసికంగా వేధిస్తాయి.’’

యతిరాజ్ మాటలకి మౌక్తిక ఇబ్బందిగా కదిలింది కూర్చున్నచోటే. అది ఆయన దృష్టిపథాన్ని దాటిపోలేదు.

“సెక్సువల్ డిజైర్స్ కలగడం ఏమీ తప్పుకాదు మౌక్తికా…పైపెచ్చు అలా కలగలేదంటే ఆమనిషి ఆరోగ్యం సరిగ్గా లేదేమోనని అనుమానించాల్సి వస్తుంది. యుక్తవయసులో ఉన్న స్త్రీపురుషులెవరికైనా అది సహజ పరిణామం. దాన్ని నేరంగానో, ఘోరంగానో పరిగణించాల్సిన పనిలేదు.’’ సున్నితంగా ఉన్న యతిరాజ్ స్వరం మౌక్తికలోని భయాందోళనలను, సంకోచాలను పటాపంచలు చేసింది.

“ సైకాలజీ అనేది ఓ గొప్ప శాస్త్రం. దీని సహాయంతో మనుషుల మనస్తత్వాలను, వారి బాహ్య ప్రవర్తనను బట్టి కొంతవరకు అంచనా వేయవచ్చును. నీకొచ్చిన కలలో పూలతోట దేనికి చిహ్నమో తెలుసా?… యవ్వనం… అవును…యవ్వనమే. ప్రతి మనిషి జీవితంలోనూ నాలుగు ముఖ్యమైన దశలుంటాయి.

అవి…బాల్యం, కౌమారం, యవ్వనం, వృధ్ధాప్యం. అన్నింటికన్నా అపురూపమైన దశ బాల్యం. బాల్యం ఇచ్చే ఆనందాన్ని, అనుభూతులని మరే దశా ఇవ్వలేదన్నది నిర్వివాదాంశం.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్