Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
amma naanna o katha

ఈ సంచికలో >> యువతరం >>

శయనేషు రాణి

shayaneshu rani

విరగపూసిన వెన్నెల ఆలుమగల సమాగమానికి ఆహ్వానం పలుకుతున్నట్లుంది. కొత్త దంపుతుల కోరికలను  గుర్రాలుగా దౌవుడూ తీయించే పనిలో నిమగ్నమై ఉన్నాడు చంద్రుడు. పతి కౌగిలిలో ఒరిగిపోయి, కోరికలను సంతృప్తి పరచటానికి భావ ,భాహ్య అందాలను దిద్దుకుని గదిలోకి అడుగు పెట్టింది మాధురి. నిండైన శరీరాకృతి , ఆహ్లాదమైన ఆహార్యం, మధురమైన మాట కలగలిపి మలచిన మగువ మాధురి. ఆమె జడలో తురిమిన ఒక్కగా నొక్క సంపెంగ తన సువాసనతో, తొలి ప్రేమలాగా ఆ గదిని గాధంగా చుట్టేసింది. నీలపురంగు చీరలో నీలి మబ్బుల మధ్య మెరుస్తున్న నక్షత్రంలాగా మెరుస్తూ , ఊరిస్తూ ఉంది మాధురి.

అవేమీ పట్టనట్లు లాప్ టాప్ లో తల దూర్చి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు శ్రీకర్. మెల్లగా వెళ్లి “ఎప్పుడూ లేనిది ఇలా కంప్యూటర్ లో మునిగి పోయున్నారు. పనా“  అంది మాధురి. కళ్ళెత్తి చూడకుండా ‘ఊ’ అన్నాడు శ్రీకర్. అతని అనాసక్తకు కొంత విస్మయం చెందింది. వారి పెళ్లి అయ్యి ఆరునెలలు. ఇంట్లో ఉండే సమయంలో అరక్షణం కూడా వృధా చేయకుండా, ‘ఓ మధూ...చేసావే జాదూ‘ అంటూ సరసాలాతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడు. ప్రక్కచేరే ముందైతే ఇహ చెప్పనే అక్కర్లేదు. శయన మందిరంలోకి ఆహ్వానించటంతో ఆరంభించి సరస సల్లాపాలతో అలసి సొలసేదాకా ముంచెత్తుతాడు. ‘ప్రతి రేయి తొలి రేయి ‘ అన్నట్లు సాగుతున్న వారి జీవితం లో ఈనాటి అతని ప్రవర్తన అపశృతిలాగా ఉంది మాధురికి.     

మనసులోని భావాలకు తాళం వేసి అతని పనిని, పరిస్థితిని  అర్ధం చేసుకున్నట్లు ఓ చూపు చూసి వెళ్లి టీపాయ్ మీద ఉన్న మ్యాగజైన్ చేతిలోకి తీసుకుని బెడ్ మీద వంపుగా చేరగిలబడి పేజీలు  తిరగేయటం మొదలెట్టింది.ఆమె ప్రతి చర్యను చూసీ చూడనట్లు ఓర కంట గమనిస్తున్న శ్రీకర్ కు, వంపుగా కూర్చున్న ఆ భంగిమలో ఆమె నడుము సొంపులు కళ్ళ బడి టెంప్ట్ చేస్తున్నాయి. పట్టీలతో సుకుమారంగా ఉన్న ఆమె పసిడి పాదాలు, ముంగురులు తడుముతున్న చంప ‘విందుకు వేళాయెరా, మా సంగతి చూడరా ‘ అన్నట్లు అనిపించి ఒక్క ఉదుటున లేవబోయాడు.

అంతలోనే ‘ఊహు , తనని లైన్ లో పెట్టాలంటే నాకు కంట్రోల్ తప్పదు ‘ అనుకుంటూ ఆగిపోయాడు.మాధురి చేతిలోని బుక్ ను మనసు లేనట్లు ప్రక్కన పడేసి , చటుక్కున మంచం దిగి బయటకు నడిచింది. డాబా మీద పిట్టగోడకు ఆనుకుని తదేకంగా తారాకాంతుడి కేసి చూసింది. ఓపలేని విరహాన్ని విదిలించు కోవటానికన్నట్లు బాహువులను ఎత్తి తనువును విరుచుకుంది. 

తిరిగి గదిలోకి వచ్చి మెల్లగా శ్రీకర్  ప్రక్కన చేరి ‘చాలా రాత్రయింది. ఆరోగ్యం పాడవుతుంది. పని రేపు చేసుకోవచ్చు, పడుకుందామా’ అంది తన పేరు లోని మాధుర్యాన్ని గొంతులో కూడా నింపుకుని. తియ్యగా ఉన్న ఆ పిలుపుకు చలించిన మనసును, కోరికను ఉగ్గబట్టుకుని ‘ఊహూ ‘ అన్నాడు శ్రీకర్.అది విని కమాండ్ ను రిసీవ్ చేసుకున్న రోబో లాగ మంచమెక్కి దొర్లి దొర్లి నిద్ర పోయింది మాధురి. సరసాలు లేని ఆ రాత్రి కంప్యూటర్ లో సాలిటైర్ గేమ్ ను ఆడి ఆడి అలసిపోయి వెళ్లి ప్రక్కమీద , తన ప్రక్కన చేరాడు. మొగ్గలా ముడుచుకుని పడుకున్న మాధురిని చుట్టేయ్యాలనిపించింది. అలా చేసి తన కోరిక వ్యక్త పరిస్తే అది అర్ధరాత్రి అయినా ఆమె ‘సూర్య కిరణం సోకిన కమలంలాగ ‘ అతని హృదయ తటాకంలో విచ్చుకుని అందాల విందు చేస్తుందని అతనికి తెలుసు.

“ఉహు, నేను తొందర పడకూడదు. ఇలా నేను నాలుగు రోజులు స్ట్రిక్ట్ గా ఉంటే, తనే అర్ధం చేసుకుని నా దారిలోకి వస్తుంది ” అనుకుంటూ చెలరేగుతున్న మోహాన్ని అణచుకుని అసంతృప్తి నిండిన హృదయంతో ముసుగు పెట్టి, ముడుచుకుని పడుకున్నాడు.

*****

హైదరాబాద్ లో సి.ఎ. గా పనిచేస్తున్న శ్రీకర్ ది స్వస్థలం విజయవాడ. అమ్మా నాన్నలతో నాలుగు రోజులు. గడుపు దామని విజయవాడ వెళ్ళిన శ్రీకర్ వాళ్ళతో కలిసి అనుకోకుండా దగ్గరున్న శివపురం అనే పల్లెలో దూరపు బంధువుల  పెళ్ళికి వెళ్ళాడు. ఆ పెళ్లి లో చెక్కు చెదరని చిరునవ్వుతో అందరికీ కావలసినవి అందిస్తూ విరిసిన పారిజాతం లాగ ఉన్న మాధురిని చూసి మనసు పారేసుకున్నాడు.

అప్పటిదాకా పెళ్లి మీద,  జీవిత భాగస్వామి పట్ల శ్రీకర్ కి ఎటువంటి ఆలోచన లేదు. కాని ఎప్పుడైతే ఆ అమ్మాయి కంటి ముందు ఎంట్రీ ఇచ్చిందో ఆ నిమిషంలోనే లైఫ్ పార్టనర్ మీద క్లియర్ క్లారిటీ వచ్చింది. ‘ఎంతో రసికుడు దేవుడు....ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడో అన్నిటిలో నిన్నే చూడమన్నాడు’ అన్నట్లు ముగ్దమనోహరంగా ఉన్న మాధురి రూపం అతని మనసులో చెరగని ముద్ర వేసింది. మాధవిలోని  ఒద్దిక , ఆమె చూపుల్లోని నును సిగ్గు, మాటలోని మాధుర్యం , అవయవ సౌష్టవం అతనిని ఆకట్టుకుంది. తన మనసులో మాట అమ్మకు చెప్పాడు. అంత సడన్ గ చెప్పేసరికి ఆమె మొదట నమ్మల. తరువాత అర్ధం చేసుకుంది. ఆ అమ్మాయితో మాట కలిపింది.

“తన పేరు మాధురి . ఈ ఊరి తెలుగు మాష్టారికి ఉన్న ముగ్గురు కూతుళ్ళలో తను పెద్దది. ప్రక్కనున్న విజయవాడ లో ఎం.కాం. పూర్తి చేసింది. వయసు 23 సంవత్సరాలు” వివరాలు పట్టుకొచ్చింది. ఆ మర్నాడే మధ్యవర్తులతో మాట్లాడి పెళ్లి చూపులు ఎరేంజ్ చేసింది.
ఏకాంతం లో  “నా పేరు శ్రీకర్. సి.ఎ.  పూర్తి చేసి .....”అంటూ చెపుతుండగానే

“ఈ డీటెయిల్స్ నువ్వు చెప్పేదేంటి, నాకు ముందే తెలుసు“ అన్నట్లు అదో మాదిరి శబ్దం కాకుండా నవ్వింది.“నా గురించి మీ పెద్దలు చెప్పి ఉంటారు. నా ఉద్యోగం మంచిదనో, ఆస్తి పాస్తులు ఉన్నాయనో ఈ పెళ్ళికి ఒప్పుకోమని అడగను. నాకు మిమ్మల్ని చూడగానే ఏదో ప్రశాంతత అనిపించింది. మీలోని ఒద్దిక నన్ను ఆకట్టుకుంది. నాకు మీతో సంతోషంగా గడపగలనని అనిపించింది. మీకు కూడా అలాంటి విశ్వాసం కలిగితే నా గురించి ఆలోచించండి” అన్నాడు శ్రీకర్.

మెరుస్తున్న కళ్ళతో ఓ నవ్వు విసిరింది ‘నిన్ను కరుణించాను పో’” అని ఆ నవ్వుకు అర్ధం చెప్పుకుని ఆనందపడ్డాడు శ్రీకర్. నెల తిరక్కుండానే ఆ పల్లెలో వాళ్ళ పెళ్లి వైభవంగా జరిగిపోయింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే శ్రీకర్ కు అర్ధమయ్యింది, ఆ నవ్వుకు అర్ధం తను అనుకున్నది కాదని. ‘అడగకుండా వరమిచ్చిన దేవుడినో , బోనస్ ఇచ్చిన యజమానినో’ చూసినట్లు చూసి నవ్విన నవ్వదని శ్రీకర్ కి జ్ఞానోదయమయ్యింది. పెళ్లి అయిన దగ్గరనుండి మాధురి ప్రతి చర్యలో అది ప్రస్పుటమవుతోంది. ఎంత భార్యా భర్తలైనా , తనతో సహా మాధురికి అన్నీ కొత్తే కదా , మొదట్లో ఆ మాత్రం బిడియం ఉంటుందనుకున్నాడు.  కాని ఆరునెలలు  అయినా ఎటువంటి మార్పు రాక...లేక, నిరాశకు గురవుతున్నాడు.

‘ఏ కూర ఇష్టం, ఏ చీర ఇష్టం.....’ అంటూ ఫుడ్ నుండి బెడ్ దాకా అంతా శ్రీకర్ ఇష్టాలు కనుక్కుని  అనుసరిస్తుంది. “ఎప్పుడూ నీ ఇష్టమేనా ? నా రుచులు , ఇష్టాలు నీకు తెలియద్దూ .....”అని దభాయించి చిలిపి తగవులు పెట్టుకోవాలని.....అలా అలా పడకటింటిలో కూడా తన అభిరుచులు వ్యక్తపరచాలని , విందు చేయాలని అతని కోరిక. సున్నితంగా చెప్పి చూసాడు .

“ నేను కోరని వరం మీరు. లేకపోతే ఏదో పెళ్ళికి ఎక్కడి నుండో మీరు రావట మేమిటీ, సామాన్యమైన నన్ను అన్నీ ఉన్న మీరు పెళ్ళి చేసుకోవటమేమిటి ?ఇంత అదృష్టానికి నోచుకున్న నాకు ఇంకా కోరికలా !” అని కొట్టి పడేసింది.

కాస్త  గట్టిగా చెప్పాలనిపించినా అసలుకే ఎసరు పెడుతుందేమో అనే అనుమానంతో ఆగిపోయాడు శ్రీకర్. అందుకే ఇలా తను దూరం పెడితే , విరహాన్ని ఓపలేక , కోరికను బహిరంగపరచి , సొగసులతో తానే స్వయంగా విందు చేస్తుందని ఆశ. దానిలో ఆరంభంగా నేడే తన పధకానికి శ్రీకారం చుట్టాడు శ్రీకర్.

*****

రోజులు దొర్లిపోతున్నాయి. మాధురి మనసులో మోహాగ్ని చెలరేగుతోందో లేదో తెలియదు కాని శ్రీకర్ కి మటుకు మహాబాధగా ఉంది. సొంత భార్యతో ఒకే మంచాన్ని పంచుకుంటూ ఆమెని కనీసం కౌగిలిలోకి కూడా తీసుకోలేకపోవటం, దాహంతో గిల గిలలాడుతూ ఎదురుగా ఉన్న నీటిని తాగాలేకపోతున్నంత కష్టంగా ఉంది .

ఆ రోజు ఆదివారం. హాలిడే. అంటే సరసాలకు స్పెషల్ జాలీడే అని అర్ధం. సెలవు వచ్చిందంటే చాలు మార్నింగ్ ముద్దులతో స్టార్ట్ చేసి అర్ధరాత్రి దాకా శృంగార సీమలో విహరింపచేస్తాడు. కానీ ఇప్పుడు తన ప్లాన్ కి కట్టుబడి, కట్టుకున్న ఆలి కళ్ళెదుటే తిరుగుతున్నా కళ్ళెత్తి చూడటం లేదు శ్రీకర్. అది నరకంగా ఉంది అతనికి.

“ ఇప్పుడే వస్తాను” అని చెప్పి మాధురి కిందనున్న ఓనర్స్ ఇంటికి వెళ్ళింది. “తనను ఏదో ఉద్దరించాననే ఫీలింగ్. తనకు తాను విలువ ఇచ్చుకోలేక పోతోంది. నేను చెప్పినదానికి తల ఊపటం తప్పితే తన ఇష్టాయిష్టాలు ఏమీ లేవు. నా ఆర్డర్స్ వింటున్న ఓ రోబో తో బ్రతుకుతున్నట్లు ఉంది...”  టి.వి. కి కళ్ళప్పగించి, మనసులో ఆలోచనలతో సతమవుతున్నాడు శ్రీకర్. క్రింద ఓనర్ ఇంటికి వెళ్ళిన మాధురి క్షణం లో రొప్పుకుంటూ పైకి వచ్చింది.

“ఏమయ్యింది మధూ “ ఆత్రుతగా అడిగాడు శ్రీకర్.

“యెంత ఘోరం” అంది వస్తున్న ఆయాసాన్ని ఆపుకుంటూ. అర్ధం కానట్లు  చూసాడు శ్రీకర్. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని “ఆంటీ సోఫాలో పడుకుని ఉంటే అంకుల్ కాళ్ళు ఒత్తుతున్నారు. అది చూడలేక లోపలికి వెళ్ళకుండా వచ్చేసాను“ ఏదో చూడకూడని దృశ్యం చూసినట్లు హడావిడి గా చెప్పింది మాధురి.

“ దానిలో అంత ఘోరమేముంది ? భార్యా భర్తలిద్దరూ సమానం. అర్ధనారీశ్వర తత్వ్తం కూడా అదే కదా ! సొంత భార్యకి సేవ చేయటం తప్పేముంది” ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకర్.

అంతే “ ఏం చెపుతున్నారు మీరు. ఆవిడ ఇంటర్ చదివిందేమో. ఆయన బ్యాంకు మేనేజర్. పెద్ద పోస్ట్ లో ఉండి అలా చెయ్యటమేమిటీ? మరీ స్టైల్ ఆవిడకి. పైగా ఆవిడని వెనకేసుకొస్తున్నారా ? మా ఊరిలో భర్త ఎదురుగా నుంచునుంటే భార్య కుర్చీలో కూడా కూర్చోదు తెలుసా” అని కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని ఖరాఖండిగా  చెప్పింది మాధురి.

భార్య కు కాళ్ళు పట్టటం భూతద్దం లో నుండి చూస్తున్న మాధురి ఆలోచనాసరళికి బిత్తర పోయాడు శ్రీకర్. ‘

*****

అర్ధరాత్రి అయ్యింది. శ్రీకర్ కి కంటి మీద కునుకు రావటం లేదు. తెల్లవారు ఝామున క్యాంప్ కు కూడా వెళ్ళాలి. శ్రీకర్ మాధురిని తన చేతులలోకి తీసుకుని , చిలిపి చేష్టలతో మురిపించి , లాలించి శృంగార రాజ్యం లో విహరింపచేసి అప్పటికి ముప్పై రోజులు గడిచింది. వెన్నెల రాత్రులు కంటి ముందే వృధాగా కరిగిపోయాయి.

ఇన్నాళ్ళు మాధురితో అంటీ ముట్టనట్లు ఉంటూ, ఆమె పడక చేరే వేళ లాప్ టాప్ లో తల దూర్చి సీరియస్ వర్క్ లో మునిగి ఉన్నట్లో లేదా అలసి నిద్రపోతున్నట్లో నటించేస్తున్నాడు శ్రీకర్.

శ్రీకర్ మాధురి కేసి చూసాడు. ఆమె కనురెప్పలు అల్లల్లాడాయి. రెస్ట్ లెస్ గా అటూ ఇటూ దొర్లుతోంది. మొహంలో ఏదో అశాంతి.

“అలా అల్లల్లాడే బదులు తనంత తానుగా ‘రా రా శ్రీకరా’ అన్ని నన్ను చుట్టేసి, ‘నా కోరిక తీర్చు’ అని డిమాండ్ చెయ్యొచ్చుగా ....’చాలెంజ్’ విసరొచ్చుగా, ఆ ముందు అడుగు వెయ్యదే “ అంటూ మన్మధుని కోరలలో చిక్కుకున్న శ్రీకర్ మధనపడుతున్నాడు.

మరల ఆమెకేసి చూసాడు. క్యాంప్ కు వెడితే రేపటి నుండి ఈ ‘కనువిందు’ కూడా కరువవుతుంది అని అనుకుంటే అతనికి దిగులుగా ఉంది. మబ్బు పట్టిన ఆకాశంలో మెరుపులాగా ఉంది మాధురి. తన శంఖం లాంటి మెడ ‘ముద్దులతో పూరించమని’ అతనిని ఊరిస్తోంది. నడుము సొంపు పదిహేనురోజుల కంట్రోల్ ని పటాపంచలు చేస్తోంది. వంపు తిరిగిన పెదవులు వలపు బాణాలు విసురుతున్నాయి. ‘ఎన్నాళ్ళు మమ్మల్ని ఇలా మూగగా ఉండమంటావు?’  అని మాధురి కాలి పట్టీలు నిలదీస్తున్నట్లు ఉన్నాయి. ఆవేశం పొంగి ఆమెను ఆక్రమిoచు కోవాలని గబ గబా బెడ్ కేసి నడిచాడు.

అంతలోనే “నా మనసులో ఉన్న విషయం తనకు అర్ధమవుతోందా ? నిజంగా నా వర్కే మా సంగమానికి అడ్డం అనుకుని కోరికలను చంపుకుంటోందా?” అనుమానం వచ్చి ఆగిపోయాడు.

తనని లేపి ఆవేశంగా కౌగిలిలో  చుట్టేసి “ ఇన్నాళ్ళు నేను దూరంగా ఉంటుంది నా వర్క్ వలనో, లేదా అలసటతో  నిద్రపోయో కాదు.  పిచ్చి మొహమా, కోరికలను అణచుకుని ఇన్నాళ్ళు ఎలా ఉండగలుగుతున్నావు? స్త్రీ అయినంత మాత్రాన నీకు కోరిక ఉండదా?

లాప్ టాప్ లో తల దూర్చి పని చేస్తున్నట్లు ఫోజు కొడుతున్న నన్ను ‘ఈ టైం లో లాప్ టాప్ తో పనేంటి నన్ను టాప్ చేసి ‘టాకిల్’ చెయ్యి ‘ అని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళవచ్చుగా !

నేను కోరిక వ్యక్త పరిచినపుడు మాత్రమే నీవు సహకరిస్తే అదీ ప్రేమే నేమో కాని నాకు కావలసినది ‘దాసీ ప్రేమ’ కాదు. నీ జీవిత ‘భాగస్వామి’ తో విరహాన్ని , వాంఛను వ్యక్త పరచలేనపుడు అది ఆలుమగల బంధమే కాదు. నేను నిన్నేదో ఉద్దరించిన వాడిని కాదు, నువ్వు నా సేవకురాలివి కాదు. మనం సమఉజ్జీలం మధూ. ‘సై అంటే సై’ అన్నట్లు ఉండాలి. ఎప్పుడూ నీ చాయస్సే నా , నాకూ ‘చాయస్’ ఉంది ‘పోవోయ్’ అని చనువుగా చెప్పగలగాలి . మధూ... దీనిలో గెలుపు ఓటములు లేవు. విజయం ఇద్దరిదీ . అర్ధం చేసుకోవూ’  అని చెప్పాలనిపించింది శ్రీకర్ కి. అసలే సున్నిత మనస్కురాలు, మనసు కష్ట పెట్టుకుంటుందేమో అనే భయం అడ్డు పడింది.
అలా  మదనపడుతున్న శ్రీకర్ కి మెరుపులాంటి ఆలోచన మదిని తట్టింది. అది అమలు చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు.

*****

గత మూడు రోజుల్లో ఎన్ని సార్లు ఫోన్ చేసినా పై పైన పొడి మాటలు తప్ప మాధురిలో తన సహజమైన నవ్వు, హుషారు లేవు. తప్పనిసరిగా క్యాంప్ లో ఉన్నా శ్రీకర్ మనసంతా ఇంటి మీదే. క్యాంపు ముగించుకుని ఇల్లు చేరాడు. మాధురి ఎప్పటి లాగా మామూలుగా అన్నీ అందిస్తూ కనిపెట్టుకుని ఉన్నా ఏదో తేడాగా అనిపిస్తోంది. తన మౌనం శ్రీకర్ కు అసౌకర్యంగా ఉంది. ‘తన మనసు కష్టపెట్టానా’ అని అతని మనసులో బాధ.  భోజనం ముగించి బెడ్ రూమ్ లోకి వెళ్లి లాప్ టాప్ లో మొహం దూర్చుకుని కూర్చున్నాడు.....

‘రాణి గారు వేంచేస్తున్నారహో’ అని కాలి పట్టీలు తమ శబ్దంతో ప్రకటిస్తుండగా మాధురి పడక గదిని చేరింది. ఆమె తలలోని మల్లెల సువాసనలకు శ్రీకర్ మనసులో రొమాంటిక్ భావాలు గుప్పుమన్నాయి. అసలు ఏమవుతోందో అర్ధమయ్యేలోపే శ్రీకర్ దగ్గరకు వచ్చి, మెడ చుట్టూ చేతులేసి చెంప మీద ఓ ముద్దెట్టి, మునిపంటితో కొరికింది. చేతిలో లాప్ టాప్ తీసి ప్రక్కన పడేసి గాఢమ్ గా కౌగిలించుకుంది ...... అరచేయి తెరిచి, చేతిలో రాసినది చూపించింది. అది చూసి ‘అవునా’ అంటూ పూరించిన ఉత్సాహంతో మాధురిని  చేతులతో ఎత్తి బెడ్ మీద పడేసి ప్రక్కన చేరాడు. అప్పుడే విరిసి, స్వేచ్చా గాలులు పీలుస్తున్న కుసుమం లాగా ఉన్న తను అంతలోనే ముడుచుకు పోతూ ‘బరితెగింపు కాదా...’ తడబడుతూ సందేహాలు అడిగింది.

“కోరిక పురుషునికే కాదు స్త్రీ కి ఉంటుంది. ఉన్నప్పుడు వ్యక్త పరచుకోవటమూ ఉండాలి. భార్య, భర్త ఇష్టానికి అనుగుణంగా మసలటమే కాదు, తన ఇష్టానికి అనుగుణంగా తనని మలచుకోవటమూ మగడు ఇష్ట పడతాడు. భార్య భర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ , ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతూ పొందే సుఖం, ఆనందాలు ఏక పక్షంగా సాగే అనుభవం, సంతోషం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి”    
శ్రీకర్ మాటలతో సందేహాలు ఆపి సరసాలకు తెర తీసి , ‘శయనేషు రాణి’ అయ్యింది...అడ్డుపడుతున్న శత్రువులు సిగ్గు , బిడియాలను తరిమికొట్టి  సరస సామ్రాజ్యాని ఏలి, రసరాజ్య కోటమీద విజయకేతనాన్ని ఎగురవేసింది.

ఆటలో గెలిచిన క్రీడాకారిణి  తన సక్సెస్ ని ఆస్వాదిస్తున్నట్లుగా , వయ్యారంగా పడుకుని, అనుభవాన్ని నెమరవేసుకుంటూ మాధురి. తన పాదాల మీద తల పెట్టుకుని సేదతీరుతూ శ్రీకర్.

“మధూ , ఈ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను. నా చిన్నప్పడు అమ్మ, నాన్నను ఏదన్నా కొత్త వస్తువు అడగటానికి మొహమాటం అడ్డు వస్తే ఓ పేపర్ మీద రాసి వాళ్లకు కనపడేటట్లు పెట్టే వాడిని. ‘ఏమిట్రా ఇంత మొహమాటం’ అని నవ్వుకుని, కొని ఇచ్చేవాళ్ళు. అది గుర్తుకొచ్చే , నా మనసు నువ్వు గ్రహించుకోవాలని అంత పెద్ద లెటర్ టైప్ చేసి, మెయిల్ చేసాను. కాని నీ మౌనం నాకు ఎంత టెన్షన్ పెట్టిందో తెలుసా! ‘నిన్ను ఇబ్బంది పెడుతున్నానా’ అని బెంగ పడ్డాను. కాని నా మూడు పేజీల ఉత్తరానికి జవాబుగా నువ్వు నీ అరచేతిలో రాసి చూపించిన ఆ పదాలు ....’

‘చట్ , పో ‘ అని  వాటిని ఉచ్చరించపోతున్న శ్రీకర్ ని చెప్పనీయకుండా నోరు మూసేసింది. అతను ఆ పదాలను నెమరు వేసుకుంటూ, హాయిగా నవ్వాడు. సిగ్గుగా నవ్వుతూ తనూ జత కలిపింది.

మరిన్ని యువతరం