Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue337/846/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి)... “నేను నిన్నేమీ బలవంతం చేయడం లేదు ముక్తా…నువ్వు అలా లోలోపలే కుమిలిపోతూ ఉంటే దాని ప్రభావం నీ శరీరం మీద పడి, నీ ఆరోగ్యం చెడుతుందేమోనని భయపడి అడుగుతున్నాను. తెల్లారితే మనం టి.వి. ఛానల్స్ లో చూస్తున్నాం. పేపర్లలో చదువుతూనే ఉన్నాం. ‘ డిప్రెషన్ అన్ని వ్యాధులకి ముఖద్వారంలాంటిది ‘అని. మన పెద్దలేనాడో చెప్పారు… ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని.

ఈ రోజులను బట్టి బతికినంతకాలం ఆరోగ్యంగా ఉన్న మనుషులు దాదాపు అరుదనే చెప్పాలి. ప్రతిమనిషీ కూడా ఏవేవో భయాలు, ఒత్తిళ్ళతో సతమమవుతూ రోగాలబారిన పడుతూనే ఉన్నాడు. ఆ దౌర్భాగ్యం నీకు పట్టకూడదన్నదే నాబాధ. నీకు ఏదైనా బాధాకరమైన గతం ఉందా? చెప్పు ప్లీజ్…’’ మౌక్తిక పక్కనే కూర్చున్న రమ్య అడిగింది చనువుగా.

ఏనాడూ తన వ్యక్తిగత విషయాలలోకి తొంగిచూడని రమ్య అంతలా అడుగుతూ ఉంటే కాదనాలనిపించలేదు మౌక్తికకి. రమ్యలాంటి నెచ్చెలితో తన భయాలను, బాధలను, భావోద్వేగాలను పంచుకుంటే… అది తనకెంతో ఉపశాంతినిస్తుందని ఆమెకిప్పుడిప్పుడే తెలిసొస్తోంది.  ఆలోచనలో మునిగిపోయి తనమాటలకి స్పందించని మౌక్తికవైపు ఓపంగా చూస్తూ “నేను నిజంగా చాలా పొరబడ్డాను ముక్తా…ఇన్నాళ్ళూ నీ మనసుకి చేరువగా రాగలిగాను … అని ఒకటే మురిసిపోయాను. అది అబధ్ధమని ఇవాళ తేలిపోయింది. ఒక్క విషయం గుర్తు పెట్టుకో… ఎల్లవేళాలా అంతర్ముఖంగా ఉండడం అంత మంచిపని కాదు.’’ విసురుగా లేవబోయింది రమ్య.

చప్పున ఆమె చేయిపట్టుకుని ఆపింది మౌక్తిక. ఆమె కళ్లలోకి చూసి నవ్వింది రమ్య. స్వఛ్ఛమైన స్నేహబంధానికి నిర్వచస్నం పలికే నిలువుటద్దాల్లా ఉన్నాయామె కళ్ళు.

ఆ చూపులలోని చల్లదనం…తన గుండెలలో రగిలే కార్చిచ్చుని ఆర్పివేస్తుంది. ఆమె ఆప్యాయతలోని తీయదనం మండే తన మనసుకి ఓదార్పునిస్తుంది. ఇక తానీ భారం మోయలేదు. తన మదిని జ్వలింపజేసే ఈ దావానలాన్ని, ఇలాగే గుండెల్లో అదిమేసుకుంటే తాను డిప్రెషన్ లోకి వెళ్ళడం ఖాయం.

అందుకే… తన బతుకుచిత్రాన్ని రమ్యముందు ఆవిష్కరించాలి అనుకుంది మౌక్తిక. మేఘావృతమైన ఆకాశం  మౌక్తిక హృదయంలాగే భారంగా ఉంది. నిండా నీటిని నింపుకుని, చిరుగాలి స్పర్శకే వర్షించేటట్లుగా ఉన్న మేఘాలు…కాస్త లాలన లభించగానే కురవడానికి సిధ్ధంగా ఉన్న ఆమె నయనాల్లా ఉన్నాయి.

“చెప్పు ముక్తా… యతిరాజ్ అంకుల్ నీ కలల గురించి అనలైజ్ చేస్తూ, విడదీసుకోలేంత పెద్దబంధం ఏదో నీ జీవితంలో ఉండి ఉండచ్చును అని అన్నారు. అది… నిజమేనా?’’ ప్రశ్నించింది రమ్య మూసుకుపోయిన మౌక్తిక మదిగది తలుపులు తెరవాలని యత్నిస్తూ. తిరువనంత పురం లో కొలువుదీరిన ‘ అనంత పద్మనాభస్వామి’ ఆలయంలోని రహస్యమాళిగలను తెరిస్తే అపారమైన సంపదలు బయటపడ్డాయట! కాని, మౌక్తిక హృదయాంతరాళాలలో ఉన్న ఆరహస్య మందిరపు తలుపులు తెరిస్తే బయటపడేదేమిటి! అనంతమైన ఆవేదనతప్ప!

“నిజమే రమ్యా…ఆయన అన్నట్లుగా ‘ వదిలించుకోలేని అతి పెద్ద బంధం’ నాకుంది. నిజానికి ఆ బంధాన్ని నేను సులువుగానే వదిలించుకో గలిగాను.  కాని, అదిమి మిగిల్చిపోయిన చేదు జ్ఞాపకాలను, అది నా బ్రతుకుపై ఏర్పరచిన మరకలను మాత్రం నేను పోగొట్టుకోలేక పోతున్నాను. ఆ బంధం నన్ను వీడీపోయినా… దాని గుర్తులు సశేషంగా మిగిలి, నాతో చెలగాటమాడుతూనే ఉన్నాయి.’’ మౌక్తిక విరక్తిగా నవ్వింది. రమ్య నొసలు ముడివడింది. మౌక్తిక మాటలామెకి అర్ధం కావడంలేదు. ఒకపక్క వదిలించుకోలేని బంధం ఉందంటుంది…మరోపక్క ఆబంధం ఏర్పరచిన గుర్తులు వీడిపోలేదంటుంది! ఏమిటి ఆమె మాటల్లోని అంతరార్ధం!?

రమ్యలోని విచికిత్స గమనించినట్లుగా చిన్నగా నవ్వింది మౌక్తిక. తుఫాను ముందర ప్రశాంతత అలముకుందా ప్రదేశంలో. “నేను… పెళ్ళై… విడాకులు పొందిన ఆడదాన్ని” రమ్య నోరెళ్ళబెట్టి మౌక్తికవైపు చూస్తూ ఉండిపోయింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్