Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
dasara mamoollu

ఈ సంచికలో >> కథలు >> కొత్తా దేవతండీ.....

kotta devatanandee

“నే చెప్పింది చేయిరా...  సిద్దమ్మకు  మొక్కొని  రా... అమ్మాయి పెళ్లి వెంటనే కుదురుద్ది... పోయినేడాది మా అబ్బాయికి ఉద్యోగం రావాలని మొక్కొని వచ్చా..... మూడు నెలల్లో మంచి ఉద్యోగం వచ్చింది.. నీకు తెలుసుగా... మన ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు యే సమస్య వచ్చినా సిద్దమ్మ  దగ్గరకే వెళుతున్నారు....అనుకున్న  పనులు అందరికి అవుతున్నాయి... అందుకే నువ్వు అమ్మాయి పెళ్లి గురించి మొక్కొని రా  నా మాట విను....” ఫోన్లో చెప్పాడు ఆనంద్

“అది కాదురా... నీకు తెలుసు నేను ఇప్పటికే చాలా ఖర్చు పెట్టి పూజలు చేశా...  ఇంతవరకు దారి, తెన్ను లేదు... దేవుడంటేనే నమ్మకం పోయింది... అక్కడికెళ్లడం నాకిష్టం లేదు రా”..   బదులిచ్చాను....

“నీ ఖర్మరా... . ఇన్ని పూజలు చేశావు కాబట్టే సిద్దమ్మ  గురించి  తెలిసింది..ఇప్పటి వరకు ఈ పేరే నువ్వు వినలేదు...ఏం కాదులే.. ఇన్ని  చేశావు... ఇదొక్కటి చేయి... ఎందుకో నువ్వు సిద్దమ్మ దగ్గరకెళితే  అమ్మాయి పెళ్లి కుదురుతుందనిపిస్తుంది... ఈ ఒక్కసారి నా మాట విను”......   హితబోధ చేసాడు ఆనంద్...

ఫోన్లో చాలాసేపు సిద్దమ్మ  గురించి చెప్తునే ఉన్నాడు... వాడి మాటలు నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చాయి... ఇన్ని చేశాము,  ఈ ఒక్కటీ చూద్దామనిపించింది...నా సమస్య తీవ్రత అలాంటిది  మరి...

నేను ఆనంద్ ఇద్దరం చిన్నప్పటి నుండి కలిసే చదువుకున్నాం. ఇద్దరిదీ పాండురంగాపురమే ...ఒకే వూరు , పక్కపక్క ఇళ్ళు... మాకు 14 యేళ్ళు వచ్చేవరకు ఆ ఊళ్ళో పెరిగాం...తరువాత మా  కుటుంబాలు గుంటూరు వచ్చేశాయి... ఇద్దరం ఇంజనీరింగ్  చేశాం ... ఇద్దరికి  ఒకేసారి అమెరికా ఛాన్స్ వచ్చింది... ఇద్దరం  నలభై  యేళ్ళ క్రితమే  అమెరికా వచ్చాం.... సొంతుర్లో ఇద్దరికీ ఆస్తులు లేవు, అలాగే పెద్దగా బంధువులు కూడా లేరు... ఇద్దరం అమెరికా లో ఎప్పుడో సెటిల్ అవ్వడం వల్ల  ఆ ఊరికి  పోక సుమారు నలభై యేళ్ళు అయ్యింది.    పిల్లలు కూడా ఇక్కడే పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడ్డారు.... నాకు మొత్తం ముగ్గురు పిల్లలు ఇద్దరు మగ , ఒక ఆడ... నాకు  ఆడపిల్లే పెద్ద సమస్య....  మా అమ్మాయికి ఒకసారి పెళ్లి అయి చెడిపోయింది... పెళ్లి అయిన ఐదు యేళ్ళకు కొన్ని సమస్యల వల్ల మా అమ్మాయి, అల్లుడు విడిపోయారు... దేవుని దయవల్ల మా అమ్మాయికి పిల్లలు లేరు...

ఈ అమ్మాయికే రెండో పెళ్లి చేయాలని మూడేళ్ళ నుండి ట్రై చేస్తున్నా  పెళ్లి కుదరడంలేదు.... పూజలు, జపాలు చేసినా ఫలితం కనిపించలేదు.... ఈ రోజు  నా మనసులోని బాధను ఆనంద్ కు  చెప్పాలనిపించి చెప్పాను.... వాడు కూడా బాధపడ్డాడు...నా  సమస్య పరిష్కారం  కోసమే సిద్దమ్మ ను దర్శించమని  పోరుతున్నాడు..

మరుసటి రోజు ఆనంద్ కి  ఫోన్ చేసి మందిరం అడ్రస్స్ తెలుసుకున్నా.... మా ఇంటికి సుమారు 200 మైళ్ళదూరం లో ఉందది..  నువ్వు వెళ్ళిరా నాకు ఈ రోజు పనుంది...  మరోసారి వస్తానని చెప్పాడు.. నేను సతీసమేతంగా  మందిరానికి బయలుదేరాను... ఓ నాలుగు గంటల్లో  మందిరానికి చేరుకున్నాం...

మందిరమంటే గుడి లా లేదు .. శర్మ గారింట్లో పై ఫ్లోర్ లో ఉంది.... ..ఇక్కడికి సుమారు 10 మైళ్ళ దూరం లో సిద్దమ్మకి కొత్త గుడి నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది... గుడి పూర్తి అయ్యేవరకు శర్మ గారి పై ఫ్లోర్ మందిరంగా మారింది. ఈయన మా లాగే ఆంధ్రా నుండి వచ్చి సెటిల్ అయ్యాడు... ఈయన సిద్దమ్మ తల్లి కి  ఓ పదేళ్ళ నుండి  వీరభక్తుడిగా మారాడు.. ఇంటి పై ఫ్లోర్ లోనే  లోనే ఓ చిన్న గదిని మందిరం గా మార్చాడు. శర్మ సిద్దమ్మను బాగా ప్రచారం చేసినందువల్ల  మేము అక్కడికి వెళ్ళేటప్పటికే జనం బాగా ఉన్నారు...ఒక గంట లోనే   దర్శనం  పూర్తయ్యింది.  సిద్దమ్మ  విగ్రహం చూస్తే నాకు ఎక్కడో చూసినట్లు గా అనిపించింది..... చాలాసేపు ఆలోచించా గుర్తుకు రాలేదు... మా అమ్మాయి పెళ్లి గురించి మొక్కాము... మా అమ్మాయి పెళ్లైతే  పెద్ద మొత్తం లో మందిరానికి చందా ఇద్దామనుకున్నాం. తిరిగివచ్చేటప్పుడు శర్మ గారిని కలిసాము...

“ఈ తల్లి చాలా మహిమ కలిగింది... నాకు గతం లో చాలా పెద్ద సమస్యలు ఉండేవి... ఈ సమస్యలు తట్టికోలేక చచ్చిపోదామనుకున్న సమయం లో  ఇండియా వెళ్ళాను ,, అక్కడ మా మేనత్త ఈ దేవత గురించి చెప్పి పూజా విధానాన్ని నేర్పించింది... కొంతకాలం పూజ చేసి చూడమంది... నేను ఇక్కడికి వచ్చాక కూడా పూజ కొనసాగించాను , ఈ తల్లి మంత్రాన్ని నిష్టగా జపం చేశాను... ఒక యేడాదిలో నా సమస్యలన్నీ క్రమంగా తొలిగిపోయాయి.. అప్పటి నుండి ఈ దేవికి దాసుడ్నై  ఇంట్లో నే చిన్న మందిరం కట్టా,, ఎన్నో సమస్యలతో ప్రతిరోజూ చాలామంది వస్తారు....అలా వచ్చే వాళ్లందరి కి కల్పతరువైంది. ఈ రోజు ఎన్నో కుటుంబాలకు ఇలవేల్పు అయింది... మీరు కూడా  త్వరలోనే  మంచి వార్త వింటారు.”...  అని తన కథ చెప్పారు శర్మ గారు..

“ సమస్య త్వరగా తీరాలంటే 11 శుక్రవారాలు  రండి... వారానికొక నైవేద్యం సమర్పించి అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వండి.... మీ సమస్య తొలిగిపోతుంది ... నా మాట పై నమ్మకముంచండి..”. అన్నారు.. శర్మగారు...

శర్మగారి  మాటలు మాకు అమృతం లో తోచాయి.. 11 శుక్రవారాలు వద్దామనుకున్నాం.... ఇంతటి  మహిమ గల సిద్దమ్మ  ని పరిచయం చేసినందుకు మనసు లోనే  ఆనంద్ కు థాంక్స్ చెప్పాను...

ఇక ఆ రోజు నుండి నేను  నా భార్య  శర్మ గారిచ్చిన ఇచ్చిన మంత్రాన్ని  త్రికరణ శుద్ధి గా జపం చేశాము.. 11 శుక్రవారాలు క్రమం తప్పకుండా  మందిరానికి వెళ్ళి, పూజలు అన్నదానం చేశాం.  శుక్రవారం రోజుల్లో మందిరానికి జనం తాకిడి ఎక్కువ. . ఎక్కడెక్కడి నుండో మన తెలుగువాళ్లు మందిరానికి వచ్చేవాళ్లు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం.  కొంతమంది అన్నదానం చేసేవాళ్ళు, సాష్టాంగ నమస్కారం  చేసేవాళ్ళు.... మరి కొంతమంది విలువైన కానుకలు సమర్పించేవాళ్లు.  గుడి నిర్మాణానికి పెద్ద మొత్తం లో డొనేషన్స్ వచ్చేవి. శర్మగారికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది... యే సమస్య వచ్చిన ఇక్కడికే  జనం పరుగులేట్టేవాళ్లు...

చిత్రమేమంటే ఇన్ని చేసినా... మా సమస్య మాత్రం అంతే ఉంది. మా అమ్మాయి పెళ్లి విషయం లో ఏ మార్పు లేదు. ఇంత  నిష్టగా  పూజ చేసినా మాకు మాత్రం ఎటువంటి రిసల్ట్ రాలేదు. ఎవ్వరిని కదిల్చినా మాకు ఆ పనైంది, ఈ లాభం జరిగిందని చెప్పేవాళ్లే, మాకు మాత్రం యే పని కాలేదు... ... ఇంతకు ముందు చాలా పూజలు చేశాం ఇది అంతే అని వదిలేశాం... పూజ మానేశాం... సిద్దమ్మ దగ్గరకు వెళ్ళడమూ  మానేశాం......

నాలుగు నెలలు గడిచాయి... ఏదో పనుండి ఆనంద్ నా దగ్గరకు వచ్చాడు... ఆ మాట ఈ మాట అయ్యాక సిద్దమ్మ గురించి ప్రస్తావన వచ్చింది... నేను పూజ వదిలేశానని చెప్పా. మందిరానికి కూడా పోవట్లేదని చెప్పా...

“అదేంట్రా . ఎందుకు మానేశావ్... నీ సమస్య ఈ తల్లి మాత్రమే తీర్చగలదు... శర్మ గారిని కలిసిరా”... అన్నాడు... లేదురా నాకు నమ్మకం పోయింది నేను పోను... అన్నాను గట్టిగా. “నీ ముఖం.. నీ  పూజలు సరిపోలేదేమో....వేరే పూజ ఉందేమో శర్మ గారిని అడుగు... నా మాట విను”.. అన్నాడు.. ఆనంద్ ఈ మాటలు నా భార్య విని మళ్ళీ వెళ్ళొద్దాం అని గొడవ చేసింది... నేను వద్దని గట్టిగా చెప్పాను...
“సర్లే పడుకో.. నేనూ వస్తా గుడికి ..ఇద్దరం వెళ్దాం” అన్నాడు ఆనంద్ నాకైతే నమ్మకం లేదు... ఆనంద్ గాడి పోరు మా ఆవిడ పోరు పడలేక
“సరే రా నువ్వింతగా చెపుతున్నావు కాబట్టి వెళ్దాం ...ఇదే నా లాస్ట్ విసిట్” అన్నాను.. ... .... “సరేలేరా... ఊరికే గొడవ,,, పడుకో”  నిద్రకు ఉపక్రమించాడు... ఆనంద్.

మరుసటి రోజు నేను మా ఆవిడ , ఆనంద్ కలిసి మందిరానికెళ్ళి  శర్మ గారిని కలిసాము. ఆనంద్ కి  శర్మ గారు బాగా తెలుసనుకుంట చాలా ప్రేమగా చనువుగా ఆనంద్ ని పలకరించారు... “నేను చెప్పిన తర్వాతే వీళ్ళు మీ దగ్గరకు వచ్చారు... వీడు రవి , నా బాల్య స్నేహితుడు, బంధువు  కూడా .. వీళ్ళ అమ్మాయి పెళ్లి సమస్య కోసంమీ దగ్గరకు పంపాను. మీరు చెప్పినట్లు అన్నీ చేశారు... ఇంతవరకు సమస్య తీరలేదు... ఆలోచించి మార్గం చెప్పండి” అన్నాడు ఆనంద్, శర్మ గారు నిముషం ఆలోచించి....

“అవును ఆనంద్ గారు... నేనూ చూస్తూనే ఉన్నా... 11 శుక్రవారాలు వచ్చారు.... ఇంత పూజ చేసిన రిసల్ట్ రాలేదంటే,, ఏదో బలమైన ఖర్మ ఉన్నట్లుగా ఉంది.... సిద్దమ్మ తల్లి కరుణ ఇంకా కలగలేదు....  అమ్మవారికి ఇక్కడ కళ్యాణం చేసి భజన పెడదాం ...అప్పటికి సమస్య తీరక పోతే సిద్దమ్మ తల్లి జన్మస్థలం కు వెళ్ళి నిద్ర చేసి రావాలి....” అన్నారు.. శర్మ గారు..

కళ్యాణం, భజన , అన్నదానం చేస్తే  ఒక మండలం అంటే 40 రోజుల్లో రిసల్ట్ ఖచ్చితంగా వస్తుందని శర్మగారు అక్కడ ఉండే పురోహిత గణం మాకు  చెప్పడం తో మూడు రోజులు అందరం అక్కడే ఉండి అన్ని చేసి ఇంటికి వచ్చేశాం. .... .. ఒకరోజు ఉండి మాకు ధైర్యం చెప్పి ఆనంద్ వెళ్లిపోయాడు...

అరవై రోజులు గడిచాయి. ఫలితం  కనబడలేదు. ఇక రిసల్ట్ వస్తుందన్న ఆశ కూడా  పోయింది... నేను సిద్దమ్మ ను పూర్తిగా మర్చిపోయాను ...  మా ఆవిడే మరువలేక ఒక్కసారి మళ్ళీ శర్మగారిని కలుద్దాం అంటుంది.. మహిమ లేకపోతే ఇంతమంది ఎందుకొస్తారని మాటిమాటికి అడుగుతుంది.. ఇక తట్టుకోలేక ఆనంద్ కి ఫోన్ చేశా.

“ మనం కళ్యాణం చేయించి  రెండు నెలలైంది ఇంకా ఫలితం రాలేదు... మీ చెల్లెమో అక్కడకి వెళ్ళి శర్మ గారిని కలుద్దాం అని రోజు గొడవ. ఏం చేయాలో అర్ధం కావాట్ల.. అసలు వీటి  మీద నా కైతే నమ్మకం లేదు.... చివరకి నేను అనుకున్నట్లే జరిగింది కదరా” అన్నాను

“ఏం కాదులే..... నేను శర్మగారికి ఫోన్ చేస్తా... వర్రీ కావొద్దు” అని ఫోన్ పెట్టేశాడు... ఆనంద్...

ఆ సాయంత్రం ఆనంద్ ఫోన్ చేశాడు... ఇక్కడ ఎన్ని పూజలు చేసినా రిసల్ట్ రాకపోతే... అమ్మవారి జన్మస్థలం వెళ్ళి నిద్రచేసి మొక్కొని రావాలని శర్మగారు చెప్పారని చెప్పాడు...నేను ఎక్కడికి రాను అని ఖరాఖండిగా చెప్పేశాను... ఆనంద్ నా మాట వినకుండా చెప్తునే ఉన్నాడు...

“అరె, అమ్మవారి జన్మస్థలం పేరు వింటే నువ్వే వస్తావ్.. అమ్మవారు పుట్టింది మనఊళ్లోనే  ఇప్పుడే శర్మగారు చెప్పారు... అదే రా మన పాండురంగా పురం లోనే సిద్దమ్మ తల్లి  వెలిశారంట..నాకు ఇప్పటి దాకా తెలీదు... ఇప్పుడే తెలిసింది... నాకు పరమ సంతోషం గా ఉంది... సిద్దమ్మకోసం కాకపోయినా మన ఊరి ని చూడ్డానికైనా రావాలి నువ్వు... మనం ఆ ఊరు వదిలి చాలా కాలం  అయింది... నాకూ ఊరు చూడాలనిపిస్తుంది... ఇద్దరం ఖాళీగా ఉన్నాం.. ఇద్దరం కలిసెళ్దాం ఏమంటావురా..” అన్నాడు...

ఒక్కసారిగా పాండురంగాపురం పేరు విని ప్రాణం లేచోచ్చింది... సిద్దమ్మ సంగతి ఎలా వున్నా. ఒక్కసారి చూసొద్దామనిపించింది... నా బాల్యమంత అక్కడే గడిచింది...

“మానూళ్ళో మనకి తెలీకుండా ఎక్కడ వెలిసిందిరా... మనకు ఊరి సంగతులు ఇప్పుడేమీ తెలియవు...మనం ఊరు వదిలి వచ్చాక వెలి సిందేమో... సరే రా సిద్దమ్మ కోసం కాకపోయిన ఊరుకోసం వెళ్దాం” అన్నాను...నాకైతే అయోమయం గా ఉంది... మా ఊళ్ళో సిద్దమ్మ గురించి ఎప్పుడు వినలేదు... ఈ ట్విస్ట్ ఎందో అస్సలు అర్దం కాలేదు... నా ఆలోచన పసిగట్టి మా ఆవిడ...

“అర్దం కాకవడానికేముంది..... ఒకసారి వెళ్తే అన్నీ తెలిస్తాయి... మీ గుంజులాట మాని అక్కడికి వెళ్ళి రండి... ఇప్పటికే అమ్మాయి పెళ్లి బాగా లేట్ అయింది”....అంది.

అన్ని చర్చలు, ప్రయత్నాలు తరువాత నెల రోజులకు ఇద్దరం ఇండియాకు బయలుదేరాం... సిద్దమ్మ కు అమెరికా లో  చాలా భక్త సమాజాలు  ఏర్పడ్డాయి.  ఆంధ్రా లో కూడా ఎక్కువ మంది భక్తులు ఉన్నారని అర్దమయింది... ఊరు చూడాలన్న తపన మా ఇద్దరికీ ఎక్కువైంది... మా 15 వ యేట వరకు అక్కడే ఉన్నాం..... కలిసి చెరువు గట్టుపై ఆడుకున్నాం... సాయంత్రం అయ్యేసరికి అందరం అక్కడికి చేరుకునే వాళ్ళం... అసలు ఆదివారాలైతే  సాయంత్రం  దాకా ఇంటికి వచ్చేవాళ్లం కాదు. .. ఆ చెరువు, పొలాలు, మట్టి వాసన మా కింకా గుర్తే.... ఆ ఊరి గురించి అక్కడి స్నేహితుల గురించి మాట్లాడుకుంటూ ఇండియా చేరాం. నిజానికి ఆ ఊరికి మేము ఇప్పుడు పూర్తిగా కొత్త . ఫ్రెండ్స్  గుర్తుపట్టలేరు ... ఇక బంధువులున్నా, వాళ్లెవరో ఇద్దరికీ తెలియదు   ఎందుకంటే మా పేరెంట్స్ కే బంధువులతో రాక పోకలు లేవు... ఇక మా కేలా తెలుస్తాయి....

ఇండియా చేరుకున్నాక ఆలోచిద్దాం అనుకున్నాం... హైదరాబాద్ చేరాం  ..హోటల్ లో రూమ్ తీసుకొని రిలాక్స్ అయ్యి  పాత ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేశాం..    పెద్దగా ఎవరు రిసీవ్ చేసుకోలేదు... ఇక మేము ఆ ప్రయత్నం ఆపేశాం. రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాక  పాండురంగ పురానికి బయలుదేరాం...ఇప్పుడు ఊరు ఎలాగుందో నని ఇద్దరికీ ఒకటే ఆతృత..

కార్లో 4 గంటలు పట్టింది... మాకు రోడ్లు చూసి అబ్బురమనిపించింది. అప్పట్లో  హైదరాబాద్ వెళ్లడానికి రోజంతా పట్టేది. ఇప్పుడు 4 గంటల్లో చేరుకున్నాం. ఊరు ముందు చింత చెట్టును గుర్తుపట్టాం. ఊర్లోకి వెళ్ళగానే సిమెంట్ రోడ్లు, చెట్లు ఇంకా   పెద్దపెద్ద బిల్డింగులు కనిపించాయి... పెద్ద వీధి స్వరూపమే మారిపోయింది. మొగిలయ్య హోటల్ స్థానం లో ఒక డాబా వెలిసింది.. మొగిలయ్య ఫోటో తో కూడిన  బోర్డ్ దానికి తగిలించి ఉంది... మొగిలయ్య కొడుకులనుకుంట హోటల్ నడిపేది... అక్కడ ఉన్న చాలా షాపులకు సిద్దమ్మ తల్లి పేరు పెట్టారు... ఫోటో కూడా పెట్టారు.. మెరక వీధిలోని సినిమా హాల్ స్థానం లో కళ్యాణ మంటపం దాని ముందు కొన్ని షాపులు వెలిశాయి.. ఇంటర్నెట్ దెబ్బ అనుకుంటా.. సినిమా హాలు స్థానం లో కళ్యాణ మండపం వచ్చింది... మేము చదివిన స్కూల్  అప్పట్లో చాలా చిన్నది... దాని స్థానం లో పెద్ద స్కూల్ ఇంకా డిగ్రీ కాలేజి వెలిసింది...  ఎవరో NRI పేరు తో స్కూల్ ఉంది.  పూర్వం లాగానే  రోడ్ పక్కన టిఫిన్ బండ్లు ఉన్నాయి... వాటిల్లో కూడా సిద్దమ్మ తల్లి ఫోటో ఉంది.  ఊరు మునుపటి కంటే బాగా పెరిగింది. పెద్ద వీధిలో షాపులు బాగా వెలిశాయి.. ఇంతకి సిద్దమ్మ గుడి ఎక్కడ కనబడలేదు...

“ఆనంద్ గుడెక్కడో అడగరా” అన్నాను...

“ ఆ పూల దుకాణం దగ్గర ఆపు.”.. అని డ్రైవరుకి చెప్పాడు ఆనంద్

డ్రైవరు పూల దుకాణం దగ్గర కారు ఆపాడు....

“బాబు సిద్దమ్మ గుడెక్కడా” అడిగాడు ఆనంద్...

“గుడా ... చెరువు దగ్గర ఉంది... నేరుగా పోయి కుడివైపుకు తిరగండి..... అక్కడ పెద్ద ఆర్చ్  ఉంటుంది..ఆర్చిలోంచి వెళ్ళండి గుళ్లోకి వెళతారు....పూలు కావాలా బాబు” అడిగాడు వాడు... పూలు తీసుకొని గుడివైపుకి కదిలాం.. “చెరువు  అంటే ..మా ఇంటి పక్క చెరువే కదరా.... వేరే చెరువు లేదుగా” అన్నాను .

“అవును..ఒక్కటే ఉంది... చిన్నప్పుడు అక్కడే చాలాసేపు ఆడుకునేవాళ్లం...మన ఫ్రెండ్స్ ఒక్కరూ కనబడలేదు...... ఒకవేళ కనబడ్డా గుర్తుపట్టలేం” అన్నాడు ఆనంద్...

కొంత దూరం వెళ్ళాక పెద్ద ఆర్చ్ వచ్చింది... అది సిద్దమ్మ తల్లి ఆలయ ఆర్చి.... దానిపై అమ్మవారి బొమ్మ అందంగా చెక్కారు....
ఆర్చ్ లోకి ప్రవేశించిన కొద్ది నిముషాలలో పెద్ద గుడి... వసతి గృహాలు,… షాపులు అన్నీ కనబడ్డాయి... చెరువు మాత్రం కుంచించుకు పోయింది... చెరువు ను చాలా మటుకు పూడ్చి షాపులు, వసతి గృహాలు కట్టారు... హోటల్స్ కూడా బాగానే వెలిశాయి...మేము చిన్నప్పుడు ఆడుకున్న స్థలం ఇదే... మేము సులభంగానే గుర్తుపట్టాం... మాకు చిరపరిచితమైన పెద్ద వేపచెట్టు మాకు దర్శనమిచ్చింది.. దీని కిందనే ఎక్కువసేపు ఆడుకునేవాళ్లం...ఆ చెట్టుని చూసి మాకు ఆశ్చర్యమనిపించింది... అది గుడి   లోపల ఉంది.. దాని కిందనే సిద్దమ్మ వెలిసిందని అక్కడి వాళ్ళు  చెప్పారు... చెట్టు వరకు వదిలి పెద్ద గుడి కట్టారు... ఆ గుడి చాలా పెద్దది.. ఆంత్రాలయయం దాటిన తరువాత గర్భాలయం ఉంది... అక్కడే పెద్ద వేపచెట్టు దాని కింద అమ్మవారు ఉన్నారు...

విగ్రహమంతా బంగారుమయం...  నలుగురు అర్చకులున్నారు...పబ్లిక్ రష్ ఎక్కువగా ఉంది... మేము గర్భాలయానికి చేరుకోడానికి రెండు గంటలు పట్టింది..... సిద్దమ్మ తల్లిని దర్శించుకున్నాం. ....

అంతే........

అమ్మవారి విగ్రహాన్ని చూడగానే ఇద్దరం మ్రాన్పడిపోయాం..  ఇద్దరం ముఖముఖాలు చూసుకున్నాం...ఒక్కసారిగా విపరీతమైన ఆశ్చర్యం వేసింది...సిద్దమ్మ అంటే ఈ విగ్రహమా... ఇన్నాళ్ళు దీనినా  పూజించింది, జపం చేసింది....అని షాక్ లో క్యూలో అలా నిలబడిపోయాం... లైన్లో జనం నెడుతుంటే ఆ షాక్ లో నుండి కోలుకోకుండానే బయటపడ్డాం.

“ఇదేందిరా ఆనంద్... మనం చిన్నప్పుడు పెట్టిన బొమ్మే కదరా ఇది”...అన్నాను. నీరసంగా..

“అవును అలాగే ఉంది”....అన్నాడు హీన స్వరంతో.

“చిన్నప్పుడు నీకు గుర్తుందారా ... ఆ రోజుల్లో ఊరి జనం ఆషాఢ మాసం లో ముత్యాలమ్మ కు నైవేద్యం పెట్టేవాళ్ళు... ఊరంతా  పండగలా చేసేవాళ్ళు... దీనిని అనుకరిస్తూ నువ్వు నేను, నారాయణ గాడు, లక్ష్మి, తిరుపతమ్మఅందరం కలిసి మా ఇంటి పెరట్లో ఉన్న నాలుగు విగ్రహాల్లో పెద్దగా ఉన్న విగ్రహాన్ని తెచ్చి పెట్టాం... ఈ వేపచెట్టు క్రింద బండరాయి మీద పెట్టి ఏవేవో పూజలు చేసినట్లు ఆడుకునేవాళ్లం  గుర్తుందారా.. అదే రా ఇది, ఇప్పుడు సిద్దమ్మ గా మారింది.”.. అన్నాను  ఆయాసంతో ...

ఈ చెరువుకి దగ్గర్లోనే మా ఇల్లు ఉండేది. మా తాత విగ్రహాలు చెక్కేవాడు. ఈ ఏరియా లో ఎక్కడ గుడి కట్టినా మా తాత చెక్కిన శిల్పాలే పెట్టేవారు. మా ఇంట్లో చాలా శిల్పాలు, రాళ్ళు ఉండేవి.. అసంపూర్తిగా ఉన్న శిల్పాలు, రాయి లో దోషం ఉన్న శిల్పాలు, అందంగా రాని శిల్పాలు మా దొడ్లో పడేసి ఉంచేవాడు మా తాత.. అవి దేనికి పనికిరావని మా తాత పక్కనపెట్టేవాడు. అందులో పెద్దగా ఉన్న ఈ శిల్పాన్ని  మేము  తెచ్చి ఇక్కడ పెట్టాం.... అదే ఇది... పనికి రాదనుకొని వదిలేసిన శిల్పమే  సిద్దమ్మ దేవత గా మారింది..

“మనం పెట్టిన శిలకి  చేతిలో కత్తి, గుర్రం ఉండేవి...బొట్టుగా సూర్యుడ్ని చెక్కాడు మా తాత. ఇప్పుడు చూడు బొట్టుగా సూర్యుడేఉన్నాడు  అయితే బంగారు బొట్టు ఉంది...”అన్నాను ఉద్వేగంగా

“అవును రా, మనం ఈ బొమ్మను మీ ఇంట్లో  నుండి తెచ్చి ఈ వేపచెట్టు కింద పెట్టి ఆడుకున్నాం..ఈ బొమ్మ పెట్టిన రెండు యేళ్ళ తరువాత ఈ ఊరు వదిలి వెళ్లిపోయాం...అసలు ఆ బొమ్మఎవరిదో, యే దేవుడోకూడా తెలీదు.... ఏదో గుర్రం మీద బొమ్మ ఉండేది.. చేతిలో ఏదో ఆయుధం  ఉండేది.. కళ్ళు భయంకరం గా ఉండేవి... ఇందాక సరిగా మనం చూడలేదు,,, మనం స్పెషల్ టికెట్ తీసుకొని మళ్ళీ చూద్దాం రా” అని టికెట్ తేవడానికి వెళ్ళాడు ఆనంద్...నేనింకా  షాక్ నుండి కోలుకోలేదు...

300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం.. ఈ లైన్ లో జనం లేరు..డైరెక్ట్ గా విగ్రహానికి దగ్గరగా నిలబడి చూశాం... డౌట్ లేదు... విగ్రహం,,దాని కింద ఉన్న బండరాయి అన్నీ అవే... ..... సమస్యే లేదు ఆ బోమ్మే ఇది... మేము ఆడుకుంటూ తెచ్చి పెట్టిన బొమ్మే ఇది. మాకు ఏమి చేయాలో  అర్ధం కాలేదు. .. మాకు ఆశ్చర్యమేస్తుంది... ఎందుకంటే.. ఆ శిల్పం  లో ఉన్న   దేవత ఎవరో తెచ్చిపెట్టిన మాకే  తెలీదు, అది పూర్తిగా చెక్కబడిన శిల్పం కాదు..అసంపూర్తి శిల్పం . అది పురుష దేవతా  లేక  స్త్రీ దేవతా  అన్న విషయం  విగ్రహాన్ని చెక్కిన మా కుటుంబానికే తెలీదు... మరి ఈ జనం ఈ శిల్పానికి సిద్దమ్మ అని పేరుపెట్టి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు.. ..ప్రజల అమాయకత్వానికి మాకు జాలేసింది..

ఇంతలో ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చాడు.....

“నువ్వు కాశిచారి మనవడు రవి వి కదూ” అన్నాడు..

“అవును.... మీరెవరు”  అన్నాను...

“నేను., రోశయ్యను... వెంకట రత్నం మాష్టారి కొడుకును” అన్నాడు...

ఇద్దరం వెంటనే గుర్తుపట్టాం.. కుశలప్రశ్నలు. జీవిత విశేషాలు పూర్తి అయ్యాక సిద్దమ్మ గురించి అడిగాం...

“నిజమే.. ఇది మీ ఇంట్లో నుండి తెచ్చిన విగ్రహమే... మీరు ఊరోదిలి వెళ్ళాక కూడా ఇది ఇక్కడే వుంది... దారిన పోయే రైతులు, కూలీలు అందరూ ఇదేదో దేవుని బొమ్మ అని మొక్కడం ప్రారంభించారు... పంటలు వేసేటప్పుడు కొబ్బరికాయలు కొట్టి పాలు పొంగించేవాళ్లు..  ఫలసాయం రాగానే  ఇక్కడికి వచ్చి మేకపోతుల్ని బలిచ్చేవారు..... ఇలా చాలా కాలం గడిచింది... రైతులు,  దారిన పోయే జనం విగ్రహానికి సాగిలపడి మొక్కేవాళ్లు... కొంతకాలానికి ఊళ్ళో పెద్దలు  ఆలోచించి చిన్న శ్లాబ్  వేశారు... ఇలా ఓ మూడేళ్లు ఉన్నాక.  గుడి,  ధ్వజస్తంభం  నిర్మించి ఓ పెద్ద ప్రతిష్ట చేశారు... ప్రతిష్ట చేసిన అయ్యగారు దీనికి సిద్దమ్మ అని పేరుపెట్టాడు...  కోరికలను సిద్దింపజేస్తుంది కాబట్టి సిద్దమ్మని, ఈమె లక్ష్మి దేవి అవతారమని  చెప్పాడు... అప్పటి నుండి మీరు పెట్టిన శిల్పం సిద్దమ్మ గా మారింది.. క్రమంగా కమిటి ఏర్పడింది ...తర్వాత పెద్ద గుడి, సత్రం.. అన్నీ వచ్చాయి... ఇప్పుడు సిద్దమ్మ మనవాళ్ళకు ఆరాధ్యదేవతైంది..భక్తుల సంఖ్య  అపరిమితం.   నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పనికి రాదనుకొని వదిలేసిన శిలకు ఈ పూజలేంది , గుడి ఏంది అని.. అసలు ఆ శిల్పం లో ఉన్న దేవత ఎవరో ఎవ్వరికీ తెలీదు...

కొంతమందికి  కి చెప్పి చూసా ..నన్ను నాస్తికుడన్నారు... విచిత్రమేమంటే మన ఫ్రెండ్స్ కూడా వచ్చి పూజలుచేస్తారు... తిరపతమ్మ మనవడికి  కొడుకు పుడితే ఇక్కడే అన్నప్రాసన చేసింది.. ...మేకపోతుని బలిచ్చింది... మనం పెట్టిన ఈ పనికిరాని శిల్పం ఎంతోమందికి మనశ్శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది.... భారం అంతా ఈ రాయి మీద వేసి ప్రశాంతగా పనిచేసుకుంటున్నారు... కొంతమంది అయితే  నిష్టగా పూజలు చేస్తూ కొంత కాలం పాటు దురలవాట్లను మానుతున్నారు...  అందుకనే దీనిని గురించి విచారించడం మానేశా. నమ్మకాన్ని మించిన తృప్తి ఏముంటది?..నమ్మకమే కొంతమందికి ధైర్యాన్ని ఇస్తున్నప్పుడు..మనమెందుకు ఎదురు తిరగాలి అని గమ్ముగా ఉన్నా..” అన్నాడు రోశయ్య..

రోశయ్య మాటలకుఇద్దరం నవ్వాము.... మేము ఎందుకొచ్చామో చెప్పలేదు..  చెపితే మమల్ని  కూడా పిచ్చోళ్ళు అనుకుంటాడనిపించింది .....  ఊరు చూడడం కోసం వచ్చాం అని  చెప్పా. ఆ రోజు అక్కడే రూమ్ తీసుకొని గడిపి, తిరుగు ప్రయణమయ్యాం... నా సమస్య మాత్రం అంతే ఉంది... నేను తెచ్చిపెట్టిన మా తాత శిల్పం ఇంతమందికి ధైర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుందన్న విషయం నాకు  కొంత  మానసిక తృప్తిని  కలగజేసింది....

ఇంతలో నా భార్య నుండి ఫోన్..

“ఏమండీ అమ్మవారిని  చూసారా... మొక్కారా..”.

నాకు నవ్వాగలేదు... “ఆ మొక్కాం  మేము వస్తున్నాం”  అని ఫోన్ పెట్టేశాను...

నేను తెచ్చిపెట్టిన శిల్పం జగత్ విఖ్యాతి పొందిందని గర్వపడాలో,,,  ప్రజల అమాయకత్వానికి  బాధపడాలో అర్ధం కాలేదు...
ఇన్ని రోజులుగా సిద్దమ్మ గురించి, సిద్దమ్మ మహిమలు గురించి ఊదరగొట్టిన ఆనంద్ గాడు ఒక్క మాట మాట్లాడితే ఒట్టు..... అమెరికా చేరిందాకా నా ముఖం వైపు చూడకుండా  పక్కచూపులు చూస్తూనే ప్రయాణించాడు...

మరిన్ని కథలు