Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nookaliste

ఈ సంచికలో >> యువతరం >>

అసాధారణం

asaadhaaranam

స్కూల్ నుంచి ఇంటికొచ్చి బూట్లు విప్పుకుంటూ రిలాక్స్ అవబోతున్న నన్ను , మమ్మీ మాటలు ఒక్కసారిగా కుదిపివేసాయి. “ వైషూ...ఈ రోజు డాడీ, ‘మిని’ని డిన్నర్ కి తీసుకొస్తున్నారట. నిన్ను, తమ్ముణ్ణి తొందరగా హోం వర్క్ పూర్తి చేసుకొని ఏడుగంటలకల్లా ఫ్రీగా ఉండమని చెప్పమన్నారు” అంటూ మమ్మీ హడావిడిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న వెంటనే నీరసం ముంచుకొచ్చింది. సన్నగా తలనొప్పి మొదలైంది. నాకు తరచూ ఈ తలనొప్పి వస్తుంది ఆరు నెలలుగా. ‘టెన్షన్ హెడ్ఏక్’ కావచ్చు అన్నారు డాక్టర్. రోజూ మాత్రలు వాడుతున్నాను. “యోగా, మెడిటేషన్ చెయ్యి అదే తగ్గిపోతుంది” అని డాడీ లైట్ తీసుకున్నారు. ‘టెన్త్ చదువుతున్న నాలాంటి పిల్లలకు యోగాలు,మెడిటేషన్ లు చేసే టైం ఎక్కడిది?’

కాస్సేపు పడుకోవాలని అనిపించినా, అంత టైం లేదు కనుక, వేడి పాలు తాగి తలనొప్పి మాత్ర వేసుకుని, ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని, హోం వర్క్ పనిలో పడ్డాను, ఉసూరుమంటూ. కాస్సేపటికి తమ్ముడు ‘వరుణ్’ వచ్చాడు. మిని వస్తుందన్న వార్త వినగానే వాడూ నీరుగారిపోయాడు.

మిని, పూర్తి పేరు ‘సౌదామిని’.  డాడీ బాస్ కూతురు. చాలా తెలివైంది. చాలా అంటే చాలదు. ‘చాలా చాలా’ అన్నమాట. పన్నెండు ఏళ్లకే టెన్త్, పద్నాలుగు ఏళ్లకు ఇంటర్....ఇలా చాలా తొందరగా డిగ్రీ, పిజీలు పూర్తిచేసి ఇప్పుడు ఇంగ్లిష్ లో పి హెచ్డి చేస్తుంది. డాడీ కి మిని అంటే చెప్పలేనంత అభిమానమూ, ఆరాధనా. మమ్మల్ని ఇన్ స్పైర్ చేయించడంకోసం ఆయన అప్పుడప్పుడు మిని ని మా ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. మిని అంటే మాకూ ఇష్టమే. ఆమెకున్న పరిజ్ఞానం చూస్తుంటే మతిపోతూ ఉంటుంది. ఆమె ఒక ‘మూవింగ్ ఎన్ సైక్లోపీడియా’.  అయినా ఆమెకు కొంచెం కూడా గర్వం లేదు. ఆమెతో మాకు ఏ సమస్యా లేదు. మా సమస్య అంతా డాడీ తోనే. మిని వచ్చి వెళ్లిన రెండు,మూడు వారాల వరకూ మాకు వాయింపు ఉంటుంది.

ఎప్పటికైనా నేను, తమ్ముడు ఆమె స్థాయికి చేరాలని, ఇప్పటినుంచే కృషి చెయ్యాలని పదే పదే చెపుతూ ప్రాణం తీసేస్తూ ఉంటారు. ‘కాలం ఎంతో విలువైఒదని, ఒక్క క్షణం వృధా అయినా తిరిగి రాదని’ ఉద్బోధ చెయ్యడం పరిపాటైపోయింది. నిజానికి మేమిద్దరం పనికిరానివాళ్లమేమీ కాదు. నేను, వరుణ్ చాలా సార్లు క్లాస్ ఫస్ట్ వస్తూనే ఉంటాము. అయినా ఆయన మెచ్చుకోరు. “క్లాస్ ఫస్ట్ రావడం విశేషం కాదు, స్టేట్ ఫస్ట్ రావాలి. మిని ని చూడఒడి, టెన్త్ లో, ఇంటర్ లో.... అన్నిట్లోనూ ఫస్టే” అంటూ ఉంటారు. నైంత్ పబ్లిక్ పరీక్షల్లో నేను, నైన్టీ టు పర్సెంట్ తో స్కూల్ ఫస్ట్ వచ్చాను. అయినా డాడీ ముఖంలో వెలుగు లేదు. వరుణ్ కి మేథ్స్ లో ఒకసారి తొంభై తొమ్మిది మార్కులొచ్చాయి. అంతకు ముందు వాడికి తొంభై మార్కులు దాటడం కష్టమయ్యేది. ఎంతో పట్టుదలతో చదివి సాధించాడు. ఆనందంగా  ఇంటికొచ్చిన వరుణ్ నీరుకారిపోయే పరిస్థితి వచ్చింది. “ వెరీ గుడ్ రా. కానీ ఆ ఒక్క మార్కు ఎందుకు పోయిందంటావు? ఇంకా కృషి చెయ్యాలి” అనేసారు డాడీ. మమ్మీ మాత్రం మా పరిస్థితి చూసి బాధ పడేది తప్ప ఏమీ చెయ్యలేకపోయేది.

టేబ్లెట్ వేసుకున్నా తలనొప్పి పూర్తిగా తగ్గలేదు.  ఏం చెయ్యాలా?  అని చూస్తున్న సమయంలో అప్పుడే నిద్రలేచిన ‘రెక్సి’ నా దగ్గరకు తోకాడించుకుంటూ వచ్చింది. అదొక జర్మన్ షెప్పర్డ్ కుక్కపిల్ల. దాని వయస్సిప్పుడు నలభై ఐదు రోజులు. ఎంతో ముద్దుగా ఉండే రెక్సి తో కాస్సేపు ఆడుకునేసరికి నా మైండ్ చాలా రిఫ్రెష్ అయినట్లైంది. రెక్సి ని కొనితెచ్చిన వారం రోజులకు కాబోలు మిని మా ఇంటికొచ్చింది. “ అబ్బా !! ఈ జర్మన్ షెప్పర్డ్ పప్పీ ఎంత బాగుందో!” అంటూ దాన్ని మురిపెంగా ఎత్తుకున్న మిని తో డాడీ అన్నారు “ అది అల్సేషియన్ బ్రీడమ్మా, జర్మన్ షెప్పర్డ్ కాదు” అని. “ఎవరు చెప్పారంకుల్? నవ్వుతూ అడిగింది. “ దానిని అమ్మిన షాప్ వాడే చెప్పాడు” అన్నారు. మళ్ళీ నవ్వింది మిని.

రెండూ ఒకటే అంకుల్. జర్మనీలో గొర్రెల మంద కాపలాకు ఇలాంటి కుక్కలను మొట్టమొదట వాడారు కాబట్టి, వీటికి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత అన్ని దేశాల్లోనూ వీటిని కాపలా కుక్కలుగా పెంచడం అలవాటైంది. రెండో ప్రపంచ యుద్ద సమయంలో జర్మని, ఇంగ్లండ్ కి శత్రు దేశమైంది కాబట్టి, జర్మన్ షెప్పర్డ్ అనే పేరు వాడడం వాళ్లకు ఇష్టం లేకపోయింది. అందుకు వాళ్ళు ఈ బ్రీడ్కి  అల్సేషియన్ అనే కొత్త పేరు పెట్టుకున్నారు. అయితే ఇంగ్లండ్ లో కూడా 1977 నుంచి దీన్ని  జర్మన్ షెప్పర్డ్  గానే పిలవడం మొదలుపెట్టారట” అని చెప్పగానే డాడీ ఇంకేమీ మాట్లాడలేదు.  అపుడే మిని మరో కొత్త విషయాన్ని కుడా చెప్పింది.

“సింథటిక్ రబ్బర్ కుడా అప్పుడే కనిపెట్టారు. అంత వరకూ ప్రపంచం మొత్తానికి నేచురల్ రబ్బర్ ఎక్కువగా జర్మనీ నుంచే సరఫరా చేయబడేది. అప్పట్లో రబ్బర్ తోటలు జర్మనీలోనే ఎక్కువగా ఉండేవి. రెండో ప్రపంచ యుద్ద సమయంలో జర్మనీ, ఇంగ్లండ్ కి దాని మిత్రదేశాలకు రబ్బర్ సరఫరా ఆపేసింది. అప్పటికే రబ్బర్ వాడకానికి బాగా అలవాటు పడిపోయిన ఇంగ్లండ్ వంటి దేశాలకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. అప్పుడు అప్పటి ఇంగ్లండ్ ప్రధాన మంత్రి ‘చర్చిల్’  దేశంలోని సైంటిస్ట్ లతో మీటింగ్ పెట్టి, రబ్బర్ కి ప్రత్యామ్న్యాయం కనిపెట్టి తీరాలని ఒత్తిడి చేసారట. దాంతో సైంటిస్ట్ లంతా పగలు రాత్రి కష్టపడి, నేచురల్ రబ్బర్ లో ఉన్న ‘ఐసోప్రీన్’ అనే మోలిక్యుల్ ని కృత్రిమంగా ల్యాబ్ లో తయారు చేసారట. అలా తయారైన రబ్బర్ నే  మనం ఇప్పుడు సింథటిక్ రబ్బర్ అనే పేరుతో వాడుతున్నాం” అని చెప్పేసరికి మేమంతా ఆశ్చర్యపోయాం.  “ఇప్పుడు మన దేశంలో అస్సాంలోను, కేరళలోనూ చాలా రబ్బర్ తోటలున్నాయి కదా? ఇప్పటికీ మనం సింథటిక్ రబ్బర్ నే వాడాల్సిన అవసరం ఏమిటి ?”  అని అడిగారు డాడీ.

“ అయ్యో అంకుల్....మన దేశంలో ఏడాది మొత్తంలో తయారయ్యే నేచురల్ రబ్బర్, ఒక రోజు వాడకానికి కూడా సరిపోదు. ఇప్పుడు మనం వాడేది అంతా సింథటిక్ రబ్బరే” అని చెప్పింది.  మిని వెళ్లిపోయాక, నిజానిజాలు తెలుసుకుందామని నేను, మమ్మీ గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తే, అక్కడ దొరకని విషయాలు కుడా మిని బుర్రలో ఉన్నట్లు తెలుసుకొని ఆమె మేధస్సుకు జోహార్లు అర్పించాం.

******

అనుకున్న టైంకే డాడీ మిని ని తీసుకొచ్చారు. “హాయ్ వైశాలీ, హాయ్ వరుణ్”అంటూ ఆప్యాయంగా పలకరించింది. మేము కూడా సాదరంగా విష్ చేసాం. మమ్మీ మినికి  ఇష్టమైన వంటకాలన్నే రెడీ చేయడానికి  హడావిడి పడుతుంది. డాడీ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది, ఎప్పటిలాగే. మిని దృష్టి ఈ సారి గోడమీద ఉన్న ఫోటోల మీద పడింది. ఆసక్తి గా వాటిని చూస్తుంటే, డాడీ చెప్పడం మొదలు పెట్టారు. “ మొదటి ఫోటోలో ఉన్నది మా తాతయ్య, నానమ్మ. మా తాతయ్య అప్పట్లో మా జిల్లాకే మొట్టమొదటి పోస్ట్ గ్రాడుయేట్. తర్వాత ఫోటో మా అమ్మా, నాన్నలది. మా నాన్నగారు మా కేస్ట్ లో మొట్టమొదటి డాక్టర్” అని డాడీ గర్వంగా చెప్పి,

“ నేనే ఏ ప్రత్యేకత సాధించలేకపోయాను” అన్నారు డాడీ దిగులుగా.

“ అలా అంటారేమిటి అంకుల్? మీరు కుడా చాలా బ్రైట్ అని, ఇంజినీరింగ్  డిస్టింక్షన్ లో పాస్ అయ్యారని మా డాడీ చెపుతూ ఉంటారు?  మీరెందుకు అలా ఫీల్ అవుతున్నారు?” అని అడిగింది. ‘మిని బాగా అడిగింది’  అనిపించింది నాకు. “లేదమ్మా...అది సాధారణమైన విషయం. అప్పట్లో మా క్లాస్ లో ఆరుగురికి డిస్టింక్షన్ వచ్చింది. ఆ ఆరుగురిలో నేనొక్కడిని. అంతే” అంటుంటే, తనొక సాధారణ వ్యక్తిలా మిగిలిపోయానని బాధపడుతున్నారని, మమ్మల్ని మిని లా తీర్చిదిద్దాలని డాడీ ఎంతగానో తాపత్రయ పడుతున్నారని  నాకు అర్ధమైంది. డాడీ మూడ్ మార్చడానికి, మిని టాపిక్ మార్చింది. “ అంకుల్ అన్ని ఫోటోలలోను ఆడవాళ్ళు ఎడమ పక్కనే నిలబడి ఉన్నారు కదా? ఎందుకంటారు?” అని ప్రశ్నించింది. సమాధానం చెప్పడానికి డాడీ ఇబ్బంది పడ్డారు.  “ అది మన సాంప్రదాయం. దేవుళ్ళ ఫోటోలు చూడు. అన్నిట్లోనూ అలాగే ఉంటాయి” అన్నారు.

అదే ఎందుకంటారు? ఏదో కారణం ఉండే ఉంటుంది కదా?” అని అడిగింది నవ్వుతూ. డాడీ తలగోక్కున్నారు. ఈ సాంప్రదాయాలన్నీ ఎన్నో వందల ఏళ్లనుంచి వస్తున్నవే కదా? అప్పట్లో భార్యను రక్షించవలసిన భాద్యత భర్త మీద చాలా ఎక్కువగా ఉండేది. మొలలో ఎడమ వైపున కత్తితో మగవాడు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. భార్య ఎడమవైపు ఉంటే ఆమెను పక్కకు నెట్టి, కుడిచేత్తో కత్తి తీసి శత్రువుని ఎదుర్కోవడానికి  వీలుగా ఉండడం కోసం ఆమెను ఎడమ వైపు ఉంచడం అలవాటైంది. ఇప్పుడా అవసరం లేకపోయినా మనం విధిగా పాటిస్తున్నాం” అంటూ ముగించింది. “ అబ్బ ...ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుస్తాయమ్మా?” ఆశ్చర్యంతో తలమునకలవుతూ ప్రశ్నించారు డాడీ. “ చదివితే తెలుస్తాయి అంకుల్. యఒడమూరి వీరేంద్రనాథ్ నవలొకటి చదివినప్పుడు ఈ విషయం తెలిసింది” అనగానే, “ ఏమిటి? నువ్వు తెలుగు పుస్తకాలు కుడా చదువుతావా?” అని అడిగారు డాడీ.

“ అదేమిటి అంకుల్? తెలుగు మన మాతృభాష  కదా? దాన్నెలా వదిలేస్తాను? మల్లాది, చలం సాహిత్యాలు కూడా చదివాను. విశ్వనాథ వారి వేయిపడగలు  కుడా చదవాలని ఉంది. కానీ ఆ పుస్తకం దొరకడం లేదు” అంది.

“ రీసెర్చ్ తోనే టైం గడిచిపోతుంది కదా? ఈ తెలుగు, సైన్సు, జికే ...ఇవన్నీ చదవడానికి నీకు టైం ఎక్కడిదమ్మా?” అంటే  “ నేను టివి సీరియళ్ళు చూడను, క్రికెట్ లాంటి మేచ్ లూ చూడను. సినిమాలు తక్కువగా చూస్తాను. దానివల్ల నాకంతగా టైం సమస్య ఉండదు” అంది. “ బాగుందమ్మా నీ పద్ధతి. అందుకే చాలా విషయాలు తెలుసుకుంటున్నావు. నిన్ను ‘మిని’ అని పిలవడం కన్నా ‘మెని’ అని పిలవాలి” అఒటూ డాడీ ఆమెను అభినందించారు.

***

ఆ సంఘటన జరిగి మూడు నెలలు అయిపోయినా మిని మళ్ళీ మా ఇంటికి రాలేదు. ఆశ్చర్యంగా డాడీ కూడా ఆమె ప్రస్తావన తేలేదు. పరీక్షల హడావిడిలో నేనూ అంతగా పట్టించుకోలేదు. ఒక రోజు, మిని ఈ రోజు డిన్నర్ కి వస్తుందని మమ్మీ, డాడీ కి చెప్పింది. “ నిజమా? ఎందుకొస్తుంది? నువ్వుగానీ పిలిచావా?” కోపంగా అడిగారు.

మమ్మీ ఆశ్చర్యపోలేదు గానీ, నేనూ వరుణ్ ఆశ్చర్యపోయాం ఆయన కోపం చూసి. “వచ్చేవారం లండన్ వెళ్ళిపోతుందట. వెళ్లేముందు మీ చేతి వంట తినాలని ఉంది. ఈ రోజు డిన్నర్ కి వద్దామనుకుఒటున్నాము, రావచ్చా? అని అడిగింది. ఏమంటాను? సరే అన్నాను” అంది మమ్మీ సంజాయిషీ చెపుతున్నట్లు. డాడీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చిందో కాసేపటి తర్వాత గాని మాకు తెలియలేదు.

లండన్ నుంచి విజిటింగ్ ప్రొఫెసర్ గా వచ్చిన విల్సన్ మేధస్సుకు ఎట్రాక్ట్ అయి మిని అతనితో  ప్రేమలో పడిపోయిఒది. అతని వయస్సు మిని వయస్సు కన్నా రెట్టింపు కన్నా ఎక్కువయినా, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా,  మినికి అవేమీ అడ్డంకి అనిపించలేదట. ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, ఓడిపోయిన మిని తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చినా, మిని తన మనసు మార్చుకోలేదు. తను ఇక్కడే ఉంటే, తండ్రి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుఒదని, లండన్ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది. ఎంతో అసాధారణమైన మిని ఇలాంటి అసాధారణమైన పని చేస్తుందని డాడీ ఎప్పుడూ ఊహించి ఉండరు. అందుకే ఆయన తట్టుకోలేక పోయారు. మిని మా ఇంటికి రావడం ఆయనకు ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతూనే ఉంది. ఇకపైన ఆమె నీడ కూడా మా మీద పడకూడదనే ఆలోచన ఆయనకు వచ్చిందనే విషయం మాకు బాగా అర్ధం అయింది.

ప్రొఫెసర్ విల్సన్ తో మా ఇంట్లో అడుగుపెట్టిన మిని ని అందరం మామూలు పద్దతిలోనే ఆహ్వానించాం. డాడీ, మమ్మీ నటించక తప్పలేదు. విల్సన్ బాగా పెద్దవాడిలా కనిపించాడు. అతనికన్నా మా డాడీ యే చిన్నగా అనిపించారు. ‘మిని ఇలాంటి పనిచేసిందేమిటి?’ అనుకుంటూ అందరం బాధ పడ్డాం. మిని వెళ్ళిపోయాక, డాడీ ఎవరితోనూ మాట్లాడకుండా తన రూమ్  లోకి వెళ్ళిపోయారు.

ఆ రాత్రి, బాత్ రూమ్ కి వెళ్ళడం కోసం సగం నిద్రలో లేచిన నాకు, మమ్మీ డాడీలు మాటలు వినిపించాయి. అర్ధరాత్రయినా వాళ్ళింకా పడుకోకపోవడం, ఎన్నడూ లేనిది డాడీ గొంతులో బాధ ధ్వనించడం నాలో ఆసక్తి రేపాయి. జాగ్రత్తగా వాళ్ళ మాటలు వినడం మొదలు పెట్టాను.

“తప్పుచేసాను రాధా...పెద్ద తప్పే చేసాను. మిని అసాధారణమైనది  అనుకున్నాను గానీ సాధారణ బాధ్యతలను సైతం  విస్మరిస్తుందని కలలో కూడా అనుకోలేదు.  తండ్రికి ప్రాణం మీదకొచ్చినా తన తీరు మార్చుకోలేని మిని ని ఇన్నాళ్ళూ ఒక పెద్ద రోల్ మోడల్ అనుకొని, మన పిల్లలూ అలాగే అవ్వాలని, వాళ్ళ మీద ఎంతో ఒత్తిడి పెంచాను. వాసన లేని పువ్వు, వెండిదయితేనేమి? బంగారందయితేనేమి? యువత స్వేచ్చను హరిస్తూ, అందరు తండ్రులూ చేసే తప్పే నేనూ చేసాను. నా ఆశలు, అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దాను” అంటున్న డాడీ కంఠం దుఖంతో పూడుకుపోవడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చాను. వెంటనే వెళ్లి డాడీని కావలించుకొని ఏడవాలన్న ఆలోచనను విరమించుకున్నాను, ఆ పని డాడీ దుఖాన్ని మరింత పెంచుతుందనే ఉద్దేశ్యంతో. ఆ తర్వాత ఎప్పుడూ మిని ప్రస్తావన తేలేదాయన. అంతే కాదు. మమ్మల్ని ఎవరితోనూ పోల్చలేదు.  చదువు విషయంలో, ఇతర విషయాల్లోనూ పూర్తి  స్వేచ్చ ఇచ్చారు. నేను, వరుణ్ ఇంకా బాగా చదవగలుతున్నాఒ.  మాకిప్పుడు ఏ ఒత్తిడి లేదు. మమ్మీ, మేము ప్రశాంతంగా ఉన్నాం. అన్నట్లు నేను తలనొప్పి మాత్రలు వాడాల్సిన అవసరం లేదిప్పుడు. డాడీ కోరిక తీర్చడానికి  విశ్వప్రయత్నం చేస్తున్నాను ఏ ఒత్తిడి లేకుండా, కష్టపడుతూ కాదు,ఇష్టపడుతూ.

మరిన్ని యువతరం