గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.... http://www.gotelugu.com/issue341/850/telugu-serials/ nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/
(గత సంచిక తరువాయి).... కులం…మతం… ఇలాంటివన్నీ పక్కన పెడితే అందచందాలలో అతడు చిన్నక్కకేమాత్రమూ సరితూగడు. నల్లని ముఖం, మూతిమీద గొంగళీ పురుగు పాకుతున్నట్లుగా ఉన్న పెద్ద బొద్దుమీసాలు, ముఖం నిండా స్ఫోటకపు మచ్చలు, చిన్నక్క అతడిలో ఏంచూసి ప్రేమించిందో మాకు అర్ధం కాలేదు.
‘కాకి ముక్కుకి దొండపండు’ అనుకున్నారంతా. అతడెళ్లిపోయాక పెద్దప్రళయమే రేగింది మా ఇంట్లో. ఆసన్నివేశాలు సజీవ దృశ్యాల్లా నా కళ్ళముందు కదలాడుతూనే ఉన్నాయి. ఎవరెన్ని విధాల నచ్చచెప్పినా చిన్నక్క తన నిర్ణయం మార్చుకోలేదు. ఎంత రభస చేసినా ప్రయోజనం ఉండదని అనుకున్నారో ఏమో… నాన్నగారు మరి తర్కించకుండా మౌనాన్ని ఆశ్రయించారు. ఆయన గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనంత విస్ఫోటనం జరుగుతోందని మేము ఊహించగలిగాము.
“దీనికి అన్నీ మేనత్త బుధ్ధులే వచ్చాయి…’ సిరి అబ్బకపోయినా చిడుమబ్బడం’ అంటే ఇదే కాబోలు! ఆవిడింకా నయం… మనవాడినే కట్టుకుంది. ఈవిడేకంగా కులమేం ఖర్మ… మతమే దాటేసింది.’’ ఏనాడో ప్రేమ వివాహం చేసుకున్న సావిత్రత్తయ్యతో చిన్నక్కని పోలుస్తూ శాపనార్ధాలు పెట్టింది అమ్మ.
అలా నోరు పారేసుకోవద్దని అమ్మని కోప్పడ్డారు నాన్న. అలా… మా చిన్నక్క సాత్విక తనకి నచ్చినవాడికోసం అయినవారిని కాదనుకుని వెళ్ళిపోయింది. అది చేసిన పనికి అవమానభారంతో, బుర్రెత్తుకుని తిరగలేక మానసిక క్షోభననుభవించారు నాన్నగారెన్నాళ్ళో.
నేనప్పుడే గట్టిగా నిశ్చయించుకున్నాను… నాన్నగారు నాకోసం ఎంపిక చేసిన మనిషి… కుంటైనా, గుడ్డైనా, మూగైనా, చెముడైనా, అసలెలాంటి తలకుమాసిన వెధవైనా కళ్లుమూసుకుని తాళి కట్టించుకోవాలని.
“ఏమిటే ముక్తా… ఆలోచిస్తున్నావు! అసలుసంగతి నీదగ్గర దాచి, నిన్ను తీసుకురావడం తప్పే. కాని, అది మాత్రం అంత మహాపరాధం ఏం చేసిందనీ’’ పెద్దక్క మాటలతో ఆలోచనల నుంచి తేరుకున్నాను.
“అబ్బే… ఎంతమాత్రం తప్పు కాదు… అన్నేళ్లు ప్రాణసమానంగా చూసుకున్న కన్నవారి గుండెల్లో చిచ్చుపెట్టి తన స్వార్ధం తాను చూసుకుంది. ఇదేమంత పెద్ద నేరమనీ!’’ ఉక్రోషంగా అడిగాను. ఆటోకున్న వ్యూ మిర్రర్ లోనుంచి కోపంతో కందగడ్డలా మారిన నా ముఖం కనిపిస్తోంది.
“అది అమ్మ-నాన్నలని కాదని ప్రేమ వివాహం చేసుకున్న మాట వాస్తవమే. కాని, అదేమంత తప్పుపని కాదే…ఈ రోజుల్లో ఇదంతా సర్వసాధారణమైపోయింది. అతడేమీ అప్రయోజకుడు కాదు. మనసులు కలిసిన మీదట మనువాడడం ఘోరం కాదు.’’ పెద్దక్క నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించుతోందని నాకు అర్ధమౌతూనే ఉంది. దాని కళ్లలో అశ్రువులు కదలాడడం చూసి చలించిపోయాను.
“ఇందులో తమరి పాత్ర ఏమిటో!’’ అనుమానంగా బామ్మవైపు చూశాను.“అబ్బే…నేనేం చేశాను మధ్యలో. చిన్నప్పటి నుంచీ పిల్లదాన్ని ఎత్తుకుని పెంచిన మమకారంతో ఓమారు చూసొద్దాం అని బయలుదేరాను. మీ నాన్నతో చెప్పకేం?’’ అంది బామ్మ భయంభయంగా చూస్తూ.
బామ్మ కంగారు చూస్తే నవ్వొచ్చింది. ఆటో హోటల్ ముందు ఆగింది. మేము లోపలికి వెళ్లాం. పెద్దక్క రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి చిన్నక్క ఉండే రూమ్ గురించి వాకబు చేస్తోంది. రెండు నిముషాల తరువాత వచ్చి “ పదండి వెళ్దాం” అంది.
“నేనిక్కడే ఉంటాను. మీరెళ్లండి.’’ అన్నాను అయిష్టంగా ముఖం పెట్టి. అక్క నాకళ్ళలోకి సూటిగా చూసి “ముక్తా…ప్లీజ్… అనవసరంగా బెట్టుచేసి సీన్ క్రియేట్ చేయకు.’’ అంది బతిమలాట ధోరణిలో. కాదనలేక కదిలాను.మనసు మాత్రం నచ్చనిపని చేయనని మొరాయిస్తోంది. చిన్నక్క రూమ్ థర్డ్ ఫ్లోర్ లో ఉంది. లిఫ్ట్ రిపేర్ లో ఉంది.బుధ్ధిగా కాళ్లకు బుధ్ధిచెప్పాం. ఆ రూమ్ ని మూడోఅంతస్తులో ప్లాన్ చేసిన ఇంజనీర్ ని, కట్టిన కాంట్రాక్టర్ ని…వంతులవారీగా తిట్టిపోస్తోంది బామ్మ ఆపసోపాలు పడుతూ మెట్లెక్కుతూ. అంత రాలేనప్పుడు ఈవిడ రావడమెందుకు? వచ్చినా వీళ్లందరికీ శాపనార్ధాలు పెట్టడమెందుకు!? ఆవిడ ధోరణికి చిరాకు కలగడమే కాదు నవ్వు కూడా వస్తోంది. మెల్లగా మూడోఫ్లోర్ కి చేరుకుని రూమ్ నంబర్ త్రీ జీరో సిక్స్ ముందు నిలబడ్డాం. పెద్దక్క తలుపుమీద తట్టింది. చిన్నక్క… ఒక క్రిస్టియన్ ని పెళ్ళాడిన ఇప్పుడెలా మారిపోయుంటుంది! అత్యాధునికంగా…లాంగ్ స్కర్ట్- స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని , జుట్టు కత్తిరించుకుని,పెదాలకి లిప్‌స్టిక్ పూసుకుని, బోసి నుదుటితో…ఉండి ఉంటుందా!
అసలు…మెడలో తాళి, వగైరాలుంటాయా? నా పిచ్చిగాని, క్రిస్టియన్ ని పెళ్ళి చేసుకున్న ఆవిడకి తాళితో పనేముంది? మెడలో సింపుల్ గా ఓ సన్నని చైన్, దానిలో వేలాడే క్రాస్ ఉంటాయి. నా మనసు ఊహల వీధిలో ఊరేగసాగింది. మరోసారి బెల్ కొట్టింది పెద్దక్క. ఓ నిముషానికి తలుపు తెరుచుకుంది. ఎదురుగా జోసెఫ్. నేను అతడివైపు చూడలేనట్లుగా ముఖం తిప్పుకున్నాను. మమ్మల్ని చూడగానే అతడు ఆనందంగా “సాత్వికా… సాత్వికా… ఎవరొచ్చారో చూడు?’’ అన్నాడు. బెడ్ మీద పక్కకు తిరిగి పడుకున్న చిన్నక్క అమాంతం లేచి కూర్చుంది. మమ్మల్ని చూడగానే దాని వదనంలోకి వింతకాంతి దూసుకొచ్చింది. ఆనందాతిరేకంతో పులకించిపోతూ మమ్మల్ని తన చేతులతో చుట్తేసింది. చిన్నక్క చేతి స్పర్శ తగలగానే…దానిమీద నేను పెంచుకున్న ద్వేషమంతా పటాపంచలైపోయింది. ‘ రక్త సంబంధం’ అన్న పదానికి అర్ధమిదేనేమో! చిన్నక్కని పరికించి చూస్తూనే తెల్లబోవడం నా వంతైంది. తను అల్ట్రా మోడ్రన్ గా మారిపోయి ఉంటుందని నేనెన్నో ఊహలల్లేశాను. కాని, వాటికి విరుధ్ధంగా…
మావి చిగురు రంగు గద్వాలచీర, నుదుట ఎర్రని బొట్టు, చేతులకి బంగారు గాజుల మధ్యన ఎర్రగా మెరిసిపోతున్న మట్టిగాజులు, గట్టిగా బిగించి వేసిన జడా, అన్నింటినీ మించి హిందూస్త్రీకి సుమంగళీ చిహ్నమైన తాళిబొట్టు. చిన్నక్క పదహారణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. ఎందుకో… నా మనసు నిండిపోయింది.
“రా బామ్మా… రా అక్కా… రావే ముక్తా…’’ పేరుపేరు వరసనా ఆహ్వానిస్తూ అక్కడే ఉన్న సోఫా చూపించింది చిన్నక్క. అందరం కూర్చు న్నాం . కాస్సేపు మాటలేం కదలలేదు. గాలి కూడా మా సంభాషణను వినాలన్న కుతూహలంతో స్థంభించిపోయిందా గదిలో. “జోసెఫ్… ఎ.సి. ఆన్ చేయి” అని అతడితో చెప్పి “ఇందాక కాస్త చలిగా అనిపిస్తే ఆపేశాం” చెప్పింది మా వైపు తిరుగుతూ. జోసెఫ్ వెంతనే ఎ.సి. ఆపేసి, రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసి కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు.
“అమ్మా’’ అంటూ రాగం తీస్తూ లేచాడుఓ పిల్లాడు. వాడికి రెండేళ్ల వయసుంటుంది. చిన్నక్క చిన్నతనంలో ఫోటోల్లో ఎలా ఉండేదో అచ్చం అలాగే ఉన్నాడు.
ముద్దుగా- బొద్దుగా హెల్దీగా ఉన్నాడు. చిన్నక్కలాగానే ఉంగరాల జుట్టు, లక్కపిడతలాంటి బుల్లి నోరు, భలే అందంగా ఉన్నాడు. చిన్నక్క లేచివెళ్ళి ఏడుస్తున్న వాడిని సముదాయించి తీసుకొచ్చింది. అప్రయత్నంగా చేతులు చాచాను. కొత్తవ్యక్తిని చూసిన కంగారులో వాళ్ళమ్మని మరింతగా హత్తుకుని, ఆమె మెడ చుట్టూ తన రెండు చేతులూ పెనవేసి మెడవంపులో ముఖం దాచేసుకున్నాడు వాడు.
“ఒరేయ్ విద్యా… పిన్నిరా… చూడు ఎలా పిలుస్తుందో! వెళ్లు…’’ అంది చిన్నక్క వాడిని బుజ్జగిస్తూ.
“విద్యానా… అంటే… వీడిపేరు!’’ సంధిగ్ధావస్థలో కొట్టుకుంటూ ప్రశ్నించింది బామ్మ.
“నాన్నగారి పేరే బామ్మా…’’ చిన్నక్క చెప్పింది మురిపెంగా వాడి తల నిమురుతూ.
నాకు షాకులమీద షాకులు తగులుతున్నాయి. ఇంకా వాడికి ఏ పీటర్ అనో, డేవిడ్ అనో…లేకపోతే కులమతాలతీతంగా ఏ విభిన్నమైన పేరో పెట్టి ఉంటారని అనుకున్నాను. |