Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
udyoga vijayam

ఈ సంచికలో >> యువతరం >>

జీవిత గమ్యం

jeevita gamyam

విశ్వం , బి.ఎ. రిజల్ట్సు వచ్చాయిరా! నువ్వు ఫస్టు క్లాసులో పాసయ్యావు. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? యం.ఎ. చదువుతావా లేక  బి.ఇడి. చేసి నాలా టీచర్ అవాలనుందా?" వస్తూనే పెరట్లో  గాయత్రి చేసుకుంటున్న కొడుకును అడిగారు సోమయాజులు.

" మన విస్సు బి.ఎ. ఫస్టు క్లాసులో పాసయ్యాడా! నా పూజలు ఫలించాయి.వాడి పేరున రేపు గుళ్లో అర్చన చేయిస్తాను. వాడిని ఎప్పుడు చూసినా చేతిలో పంచాంగం, అస్టోత్తరం , వ్రతకల్ప పుస్తకాలు . మా తమ్ముడి దగ్గర్నుంచి  తెచ్చిన వైదిక పుస్తకాలే కనబడేవి.అటువంటి వాడు డిగ్రీ ఫస్టు క్లాసులో పాసయేడంటే నమ్మలేకపోతున్నాను" ఆశ్చర్యాన్ని ప్రకటిస్తు వంట గదిలోంచి హాల్లో కొచ్చింది అన్నపూర్ణమ్మ. 

" వాడు ఎవరి కొడుకంటున్నావే పూర్ణా , హైస్కూల్ హెడ్ మాస్టర్ సోమయాజులు ఏకైక పుత్రుడు.చూడు, వాడు ఇంకా పైకి చదివి కాలేజీ లెక్చరర్ అవుతాడు. నా పేరు నిలబెడతాడు. మా నాన్న ఎలిమెంటరీ స్కూలు మాస్టరైతే నేను బి.ఎడ్.చదివి హైస్కూల్ హెడ్ మాస్టర్నయా" చిద్విలాసం చిందించారు సోమయాజులు.  నుదుటున ఎర్రని కుంకుమ బొట్టు క్రాపింగులో కనీ కనిపించని చిన్న పిలక, తెల్ల లుంగీ మీద బనీనుతో ప్రశాంత వదనంతో హాల్లో కొచ్చి అమ్మా నాన్నల దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు విశ్వనాథం. ఇంతలో అన్నపూర్ణమ్మ పూజ గదిలోంచి పటిక బెల్లం తెచ్చి ఇద్దరి నోర్లు తీపి చేసింది. 

" ఏరా,ఏమిటి నీ భవిష్యత్ ఆలోచన? ఎం.ఎ. చదువుతావా లేక గ్రూప్సుకి  ప్రిపేరవుతావా ? "కొడుకు ఉద్దేశ్యం అడిగారు.

" లేదు నాన్న గారూ! నేను ఇంక ఏ చదువు చదవదలుచుకో లేదు. అగ్రహారంలో ఉన్న పెద్ద మామయ్య శివాలయం అర్చకుడిగా అభిషేకాలు అర్చనలు నిత్య పూజలతో దైవకార్యం చేస్తూ తరిస్తున్నారు. ఆ మామయ్య దగ్గరున్నప్పుడు గుడిలో నిత్య పూజావిధానం నేర్చుకున్నాను. అలాగే చిన్న మామయ్య వెంట ఉండి వ్రతాలు మంత్రాలు , పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు , వైదిక కార్యక్రమాలు కూడా నేర్చుకున్నాను.నేను కూడా మామయ్యల మాదిరి మన వంశ  పారంపర్యంగా వచ్చే వైదిక వృత్తినే శ్వీకరించాలను కుంటున్నాను". నెమ్మదిగా తన మనసులోని మాట బయట పెట్టాడు విశ్వం. కొడుకు మాట విన్న సోమయాజులు గారు నిశ్చేస్టులయారు. కొడుతూ ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడనుకో లేదు. ఆయనకి గతం జ్ఞాపక మొచ్చింది.  అగ్రహారంలో  వారిది పేరున్న వైదిక సంప్రదాయ కుటుంబం. తమ తాత ముత్తాతలు వేదంలో ఘనాపాటీలుగా పేరు సంపాదించారు.అనేక సన్మానాలు  సత్కారాలు పొందారు. సోమయాజులు గారి తండ్రి ఒక్కరే హైస్కూలు వరకూ చదివి టీచర్ గా ఉద్యోగం సంపాదించారు. మిగతా అన్నదమ్ములు గుడిలో అర్చకులుగా, వైదిక పురోహితులుగా స్థిరపడ్డారు. సమాజంలో వస్తున్న మార్పుల్ని గమనించిన సోమయాజులు తండ్రి కొడుకును పట్నం పంపి డిగ్రీ చదివించి బి.ఎడ్. పూర్తి చేయించారు. దగ్గరి బంధువుల వైదిక సంప్రదాయ కుటుంబంలోని అన్నపూర్ణతో వివాహం జరిపించారు. అందువల్ల సోమయాజులు ఉద్యోగరీత్యా అగ్రహారం వదిలినా ఇంట్లో బ్రాహ్మణ సంప్రదాయ ప్రకారమే నిత్య పూజలు జరుగుతూంటాయి.  గతం నుంచి ఇహంలో కొచ్చిన సోమయాజులు " లేదురా విశ్వం! ఈ రోజుల్లో వైదికానికి ప్రాముఖ్యం తగ్గిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.  

పూర్వంలా  సమాజంలో బ్రాహ్మణ వర్గానికి విలువుండటం లేదు. బ్రాహ్మణుడంటే చిన్న చూపు చూస్తున్నారు.వారికి అన్ని రంగాలలో అన్యాయం జరిగి ఆర్థికంగా వెనక బడిపోతున్నారు.పాత రోజుల్లో మహరాజులిచ్చిన అగ్రహార భూముల మీద వచ్చే ఆదాయంతో నిత్య వైదిక పూజా కార్యక్రమాలు గుళ్లలో అర్చకులుగా ఉంటూ భుక్తికి గడిచిపోయేది.ఇప్పుడా పరిస్థితులు లేవు. దేవాలయ భూములు హరించుకు పోయాయి. దేవాలయాలలో నిత్య ధూపదీప నైవేద్యాలకు ఆర్థిక వనరులు కరువయాయి. రాజకీయ జోక్యం పెరిగి పోయింది. అర్చక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అర్చక వైదిక వృత్తి లో ఉన్న బ్రాహ్మణ కుటుంబాల యువకుల పెళ్లికి పిల్లనివడానికి ఎవరూ ఇష్టపడక వారు బ్రహ్మచారులుగా మిగులుతున్నారు. బ్రాహ్మణ యువకులు ఆర్థికంగా ఎంత సంపాదిస్తున్నా అర్చకుడనగానే అమ్మాయిలు ఇష్టపడటం లేదు. నేటి నవనాగరిక సమాజంలో వైదిక అర్చక వృత్తిలో ఉండే యువకుల సంప్రదాయ వేషధారణలో  నెత్తి మీద పిలక నుదుటున విభూతి కుంకుమబొట్టు  చెవులకు తమ్మెట్లు పంచ ధోతీ వస్త్ర ధారణను ఇష్టపడటం లేదు. అబ్బాయి చేసేది చిన్న ఉద్యోగ మైనా అతడి ఆధునిక వేష భాషల మోజులో పడి ఉద్యోగస్తుడే కావాలంటున్నారు నేటి అమ్మాయిలు. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ వనరులతో బ్రాహ్మణ కుటుంబాల అమ్మాయిలు ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు సంపాదించడం  కూడా బ్రాహ్మణ యవకుల పాలిట శాపమవుతోంది. దీంతో వారు వయసు ముదిరి  నిరాశ నిస్ప్రుహలకు లోనౌతున్నారు. కొందరు బ్రాహ్మణ యువకులు ఈ వృత్తిని వదిలి వేరే ఆదాయ మార్గాల కోసం వెతుకుతున్నారు. నువ్వు వైదికంలో స్థిరపడితే నీకు పిల్ల నివ్వడానికి ఎవ్వరూ ఇష్టపడరు. బాగా ఆలోచించుకో. నువ్వు పై చదువులు చదివి భవిష్యత్తులో వృద్దిలో కొస్తావను కున్నాను." ఆవేదనతో మనసులో మాట బయట పెట్టారు  సోమయాజులు గారు. ఎటూ చెప్పలేక మౌనంగా ఉండి పోయింది అన్నపూర్ణమ్మ.  తండ్రి ఉద్దేశ్యం తెలుసుకున్న విశ్వం " లేదు నాన్న గారూ! అందరూ మీలాగే ఆలోచిస్తే పవిత్రమైన అర్చక వృత్తిలో ఉండేదెవరు? తెల్లారింది మొదలు రాత్రి వరకూ బ్రాహ్మణులు అందుబాటులో లేకపోతే ఏ శుభ కార్యమైన జరగదని జగమెరిగిన సత్యం.ఆ పుణ్య పవిత్ర కార్యక్రమాలు మరో వర్గం వారు ఆచరించలేరు. 

తెల్లవారుజామున దేవాలయ గర్భగుడిలో ఆగమ సంప్రదాయంలో దేవుడి పూజలు జరగాలన్నా అర్చకులు ఉండాల్సిందే. శుభకార్యాలు జయప్రదంగా జరగాలంటే పౌరోహితులు ,  నూతన గృహ శంకుస్థాపనకు, గృహ ప్రవేశానిఘకి, నాయకుల పదవీ ప్రమాణ స్వీకరణ శుభ ముహూర్తానికి, నూతన సినిమా చిత్ర ప్రారంభోత్సవానికీ ఇలా ఎన్నెన్ని శుభ కార్యాలు జరగాలన్నా బ్రాహ్మణ దర్సనం జరగాల్సిందే.    అంతెందుకు ఎవరైనా చనిపోయినా అపకర్మలకు పితృదేవతల శాంతికి చేసే పితృ కార్యక్రమాలకు బ్రాహ్మణులుండాల్సిందే. బ్రహ్మ తర్వాత అంతటి బ్రహ్మకార్యం నిర్వహిస్తున్న బ్రాహ్మణ వర్గాన్ని చిన్న చూపు చూడటం శోచనీయం. పూర్వం రాజ్యపాలన సఖ సంతోషాలతో  సాగాలంటే మహరాజు, మహామంత్రి తర్వాత మూడో నేత్రంగా బ్రాహ్మణ పండితులకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చేవారు. బ్రాహ్మణ వర్గం సుఖ సంతోషాలతో ఉంటే ఆ దేశం పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుంది. ప్రస్తుత సమయంలో సామాజికంగా అన్ని కులవృత్తుల్లోను మార్పు లొస్తున్నాయి.పాత సంప్రదాయ పద్దతుల్నెవరు అనుసరించడం లేదు.
అందరు ఉన్నత చదువులు అబ్యసిస్తున్నారు. గ్రామీణ ప్రాంత యువత ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ సదుపాయంతో పట్టణ బాట పట్టి పెద్ద చదువులు అబ్యసించి కులవృత్తులు వదిలి ఉద్యోగాలలో స్థిరపడు తున్నారు.  ప్రపంచ గ్లోబలైజేషన్ కారణంగా ఆధునిక పోకడలు వచ్చి గ్రామీణ సంప్రదాయ కులవృత్తుల వారికి ఆదాయ వనరులు లేక ఆర్థికంగా వెనకబడుతున్నారు. అందువల్ల వారు కూడా వంశ  పారంపర్య కుల వృత్తుల్ని వదిలి పిల్లల్ని చదివించి జీవన భృతికి పట్టణాలకు పంపుతున్నారు. ఒకప్పుడు పల్లెలే దేశానికీ మూల స్తంబాలని, అన్నం పెట్టే అన్నపూర్ణ అని భావించే రోజులు పోయాయి. 

పల్లెవాసులు పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం పట్నాలకు పరుగులు తీస్తున్నారు. పల్లె ప్రజల వత్తిడి పట్టణాల మీద పడి మురికి వాడలు పెరిగి నీళ్లూ,పారిశుద్యం, విద్యుత్ సమస్యలేర్పడి వసతి , ఆహార పదార్దాల కొరత ఏర్పడుతోంది. కొన్నాళ్లకు  పల్లెలు కనుమరుగై నగరాల బాహ్యవలయాలుగా మారే రోజులు దగ్ఢ‌రలోనే ఉన్నాయి. ప్రతి వ్యక్తి లోను మార్పు కలిగి మాతృభూమి  జన్మభూమి అనే అభిమానంతో కృషి చేస్తే గాంధీ గారు కలలు కన్న స్వరాజ్యం చూడవచ్చునేమో. నవనాగరిక మోజులో పడి ఆడంబరాలకు పోకుండా నేటి అమ్మాయిలు వేషభాషలకు ఆకర్షితులు కాకుండా మనిషిలోని వ్యక్తిత్వానికి సబ్యత సౌమ్యతలకు విలువిచ్చి భవిష్య జీవితానికి బాటలు వేసుకోవాలి. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు విచక్షణ జ్ఞానంతో వ్యవహరించాలి."అని సుదీర్ఘ  భాషణ ముగించాడు విశ్వం. కొడుకు సుదీర్ఘ ఉపోద్గాతం విన్న హెడ్ మాస్టర్ సోమయాజులుఆశ్చర్యం కనబరుస్తూ ఇన్నేళ్ల తన సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో తన వద్ద చదువుకున్న ఎంతో మంది  విద్యార్థులు మేధావులుగా సైంటిస్టులుగా అనేకపదవుల్ని అలంకరించిన వారున్నారు. అటువంటిది తన రక్తంతో పుట్టి తన కళ్లముందు పెరిగి పెద్దవాడైన విశ్వంలో ఇంత ఆలోచనాశక్తి, సమాజం మీద అవగాహన, ఉన్నత ఆశయాలు ఉన్నట్లు  గ్రహించలేక పోయానని కొడుకను అభినందిస్తూ తన ఇష్ట ప్రకారమే కావల్సిన వృత్తిలోకి వెళ్లమని అంగీకరించారు. 

మరిన్ని యువతరం