Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....

(గత సంచిక తరువాయి).... “తానేమీ కులం కాని వాడిని కట్టుకోలేదు కదా… వాళ్ళకీ - మనకీ తాతల నాటి కుటుంబ కక్షలు తప్ప, శేఖరంతో వ్యక్తిగత విబేధాలేమీ లేవు. అయినా… ఇన్నేళ్ళ తరువాత కూడా అవన్నీ తవ్వుకుని, తలచుకోవడం వలన మనకి ఒరిగే లాభమేదీ లేదనిపించింది. అందుకే…’’ చెప్పింది పెద్దత్తయ్య నాన్నని ఒప్పించచూస్తూ.

నాన్న ఆలోచనలో పడ్డారన్నదానికి సూచనగా ఆయన నొసలు ముడివడింది. అమ్మ బామ్మ ఆదుర్దాగా ఆయనవైపే చూస్తున్నారు. నాన్న ఏమంటారోనని అందరిలోనూ ఒకటే ఉద్విగ్నత.

“మంచిపనే చేశావు పార్వతీ… నువ్వన్నట్లు ఎల్లకాలమూ పగలు పాతరలు వేసుకుంటామా ఏమిటి! నీ మూలంగానైనా దాన్ని ఓసారి చూసినట్లౌతుంది.’’ అన్నారు నాన్న నింపాదిగా.

అత్తయ్య తేలికగా గాలి పీల్చుకుంది. అమ్మబామ్మలిద్దరూ ఆనందంగా చూశారు నాన్నవైపు. పెద్దత్తయ్య ఆరాత్రికే రాజమండ్రి వెళ్ళిపోయింది.
ఆవిడ ఏమాశించి ఎప్పుడో సమసిపోయిన బంధాన్ని పునరుధ్ధరించుకోవాలనుకుందో గాని, ఆ పెళ్ళికి వెళ్లడం వలన నా జీవితం చిత్రాతి చిత్రమైన మలుపులు తిరిగి, నన్ను అగాధాల అంచులలోకి నెట్టేస్తుందని నేనస్సలూహించలేదు.

--------------------

“ముక్తా జాగ్రత్త... నాన్నగారికి కాస్త ఉప్పు తక్కువేసి వండు. నువ్వు- తమ్ముడు గొడవ పడకండి. ఇల్లు జాగ్రత్త…’’ ఎన్నో రకాల అప్పగింతలు పెట్టి పయమయ్యారు అమ్మ బామ్మలు.

అప్పటికింకా వారం రోజుల టైముంది పెళ్ళికి. అత్తయ్యకి సహాయం చేసేందుకు అమ్మ ముందుగా బయలుదేరింది బామ్మని తీసుకుని. ఎన్నో పెళ్ళిళ్ళు చేయించిన అనుభవం బామ్మదైతే, ఆడపడుచుకి చేదోడు వాదోడుగా ఉండి మంచిపేరు పొందుదామన్న ఆరాటం అమ్మది. అదీగాక… ఈ పెళ్ళికి వెళ్ళాలనుకున్న దగ్గరనుండీ బామ్మ ఒకటే హుషారుగా ఉంది. దానికి కారణం…ఎప్పుడో… ముఫ్ఫై ఏళ్ల కిందట దూరమైన కూతురిని తిరిగి ఇన్నేళ్ళ తరువాత కలుసుకోబోతున్నానన్న ఆనందం కావచ్చు.

చిన్నత్తయ్య పట్ల బామ్మకేం వ్యతిరేకత లేదని, ఆవిడ చిన్నక్కని కలుసుకోవడానికి వచ్చినప్పుడే బోధపడింది. మతాంతర వివాహం చేసుకున్న మనవరాలినే ఆదరించి, అక్కున చేర్చుకున్న బామ్మ…తాను కనిపెంచిన కూతురిని దూరంగా ఎందుకు నెట్టేస్తుంది!? ఆ రోజుల నాటీ పరిస్థితులు, దూరమైన హృదయాలను ఏకం చేసే వారధిగా ఉపయోగపడే ఏ సంఘటనలూ సంభవించకపోవడం, ఇవన్నీ…బామ్మ హృదయంలో ఉప్పొంగే తల్లి ప్రేమని అక్కడే అణచి ఉంచాయి.

ఆ ఆనకట్టలన్నీకుప్పకూలిపోగానే… ఉరకలెత్తే నదీ ప్రవాహంలా… హృదయాంతరాలలో అంతర్వాహినిగా ప్రవహించె అనురాగగంగ ఫెటిల్లున కిందికి దుమికి… జలజలా ప్రవహించదూ!

మేమందరమూ పెళ్లికి ఒకర్జు ముందర వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అమ్మ- బామ్మ లు వెళ్ళాక ఇల్లంతా బోసిపోయింది. నాకు- తమ్ముడికి మధ్యన గిల్లికజ్జాలు తలెత్తడాలూ, నాన్న మా ఇద్దరినడుమా రాజీలు కుదర్చడాలూ… వీటితో నాలుగురోజులూ నాలుగు క్షణాల్లా గడిచిపోయాయి.

పెళ్ళికి ముందు రోజు మేము రాజమండ్రి చేరుకున్నాం. అత్తయ్య వాళ్ళిల్లు గోదావరి పరిసర ప్రాంతాల్లోనే ఉంది. వాళ్ళింటి డాబా మీద నుంచి కనుచూపు మేరలో కనిపిస్తూంటుంది పవిత్ర గోదావరి.

ఈ గౌతమినే కదా… అనేక మంది కవులు, రచయితలు తమతమ రచనల్లో వర్ణించేది. సుందరమైన స్త్రీ నడుము ఒంపుని మలుపు తిరిగిన గోదారిపాయలా ఉంటుందంటారు ఒకరు… ఆమె జఘనం గట్టు తెగి ప్రవహించే గోదారి తాకిడికి ఒరుసుకుపోయిన ఇసుక తిన్నెల్లా ఉందంటారు మరొకరు. మనుషుల హర్షాతిరేకాన్ని ఉప్పొంగే వరదగోదారితో పోలుస్తారు మరొకరు. అటువంటి సుందర గోదావరిని కళ్ళారా దర్శించుకోగానే  నామది ఆ గోదారమ్మలాగానే పరవళ్ళు తొక్కి, పొంగి పులకించిపోయింది.

నిజంగా...  మన భారతదేశం ఎన్నో పుణ్యనదులకి జన్మనిచ్చిన రత్నగర్భ కదా… అనిపించింది. అనిర్వచనీయమైన ఆత్మతృప్తి నాలో నిండిపోయింది. ఇక పండువెన్నెల్లో నిండుగా పారే ఈ గోదావరి సౌందర్యం కాంచితే…ఓహ్! అదెంత అత్యద్భుతంగా ఉంటుందో కదా!

‘వెన్నెల్లో గోదారి అందం’ అంటూ నాలో నేనే చిన్నగా హం చేసుకుంటూంటే… “రావే ముక్తా…’’ గోదావరి అందాలను చూసి మైమరచిపోయిన నన్ను అత్తయ్య పిలిచింది.

అప్పటికే అత్తయ్య అత్తవారింటి తరఫు బంధువులతో ఇల్లు కళకళలాడిపోతోంది. వాళ్ళిల్లు బాగా పెద్దది కావడంతో ఎంతమందిమి ఉన్నా ఇబ్బంది కాలేదు. ఇల్లంతా సున్నాలు వేయించి, ద్వారబంధాలకి, కిటికీలకి, తలుపులకి పెయింట్స్ వేయించారు. తెల్లటి వార్నిష్ తో గచ్చులమీద రకరకాల ముగ్గులు పెట్టారు. ఇల్లంతా పచ్చని మామిడాకుల తోరణాలతో కళకళలాడిపోతోంది. 

తెల్లవారితే నవ్యను పెళ్ళికూతురిని చేస్తారు. పెరట్లో నీళ్ళు కాచుకునే పొయ్యిమీద పెద్ద కాగు పెట్టి పనిమనిషి చేత మంట పెట్టించింది పెద్దత్తయ్య, అమ్మ పెద్దత్తయ్య గుసగుసలాడుకుంటూ ఉంటే, ఆసక్తిగా చెవులు అటు పడేశాను.

“శుభలేఖతో పాటు పెద్ద ఉత్తరం రాసి పోస్ట్ చేశాను వదినా… అంతేకాదు… పర్సనల్ గా ఫోన్ చేసి కూడా చెప్పాను.  అయినా సావిత్రి రాలేదంటే…. నాకెందుకో బాధగా ఉంది.’’ కళ్లొత్తుకుంది పెద్దత్తయ్య.

“ఊరుకో పార్వతీ… ఇంట్లో శుభకార్యం పెట్టుకుని నువ్విలా కంటతడి పెట్టవచ్చునా? తప్పు కదూ! ఏంచేస్తాం చెప్పు… నీ తప్పులేకుండా నువ్వు పిలిచావు. తరువాత ఆమె ఇష్టం.’’ అమ్మ ఓదారుస్తోంది.

అవునుమరి… చిన్నత్తయ్య నాన్నకి తోడబుట్టినది కదా! ఆయనకెంత పంతం, పట్టుదల ఉన్నాయో… ఆవిడకీ అంతే ఉంటాయి. ఆమె భర్త కూడా ఆవిడని పెళ్ళికి పంపడం తన గౌరవానికి భంగం అనుకుని ఉండచ్చు కదా!

రకరకాల ఊహలు నా మెదడులో అడ్డుఆపు లేకుండా విహరించాయి. అయితే… మా అందరి ఆలోచనలకి తెరపడే తరుణం రానే వచ్చింది.
తెల్లతెల్లవారుతూండగా వాకిట్లో క్వాలిస్ ఆగింది. అందరం ఉత్సుకతతో వాకిట్లోకి పరుగుదీశాము.

క్వాలిస్ లోనుంచి నలభై ఐదు- యాభై మధ్య వయసున్న ఓ స్త్రీ మూర్తి, గంభీరంగా కనిపిస్తున్న ఓ నడివయసు పురుషుడు దిగారు. ఆమెలో నాన్న పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆమే ‘సావిత్రత్తయ్య’ అని గ్రహించడానికి నాకాటే సమయం పట్టలేదు. వాకిలినిండుగా బొమ్మల కొలువు పేర్చినట్లుగా నిలబడిన తన వారందరినీ చూసుకుని కళ్ళనీళ్ళ పర్యంతమైంది చిన్నత్తయ్య. మా అందరి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. మొదటగా తేరుకున్న నాన్న “అమ్మా సావిత్రీ’’ అంటూ పలకరించారు స్వరం నిండా అంతులేని మమతను నింపుకుని. అంతే… అత్తయ్య ఒక్క ఉదుటున నాన్న పాదాలమీద వాలిపోయింది భోరుమని ఏడుస్తూ.

నాన్న ఆమెని మీదకి లేవనెత్తుతూ “ ఊరుకోమ్మా… ఇప్పుడేమైందని…చెడ్డకాలమంతా పోయింది. ఇక రాబోయేవన్నీ మంచిరోజులే.’’ అన్నారు లాలనగా.

బామ్మ  నోటమాటలేకుండా కన్నులపండుగగా కూతురిని తిలకిస్తోంది. ముఫ్ఫైయేళ్ళ సుదీర్ఘమైన ఎడబాటు తరువాత జరిగిన మధురమైన కలయిక అది. పేగుబంధం ఎంత బలమైనదో,,,కడుపుతీపి ఎంత విలువైనదో బామ్మ ముఖ కవళికలను బట్టి తెలుస్తోంది.ఇంట్లో మిగిలిన అత్తయ్యలు, బంధువులు అందరూ చిన్నత్తయ్య చుట్టూ చేరి ప్లకరింపులు, పరామర్శలు ప్రారంభించారు.ఆమె వారందరితోటీ కరువుదీరా మాట్లాడుతూ ఉప్పొంగిపోతోంది.

“అన్నయ్యా… ఇదిగో మీ బావగారు…’’ చెప్పింది చిన్నత్తయ్య కాస్త దూరంగా నిలబడి మా అందరివైపు నవ్వుతూ చూస్తున్న ఆయన వైపు చూపిస్తూ.నాన్న ఆయనతో చేయికలిపి” బాగున్నావా శేఖరం? నిజానికి మన మధ్యన ఏ పొరపొఛ్ఛాలు లేవు. అంతా కాల మహిమ.’’ అన్నారు ఆత్మీయంగా.మామయ్య కూడా క్షణాల మీద అందరితోనూ కలిసిపోయారు. అత్తయ్య మామయ్య ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. అందరు అత్తయ్యలలోకీ చిన్నత్తయ్యే స్మార్ట్ గా ఉంది. ఉప్పాడ పట్టుచీర, ఒంటినిండా నగలతో నడిచివస్తున్న మోడ్రన్ మహాలక్ష్మిలా ఉంది… మామయ్య కాంట్రాక్టులు చేసి బాగానే సంపాదించినట్లుగా ఉన్నారు. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్