Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
green signal

ఈ సంచికలో >> కథలు >> సంస్కృతి వైపుగా

samskruti vaipuga

ఎందుకో ప్రతి సంవత్సరం ఒకసారైనా మనసు పీకేస్తుంది.  . నిజానికి ప్రతి వ్యక్తికి బాల్యం,కౌమారం, యవ్వనం , వృద్దాప్యం అనే నాలుగు దశలుంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే మొదటి మూడు దశలు నా చిన్ననాటి మిత్రుల మధ్య గడపటమే కాకుండాఇప్పుడు  నాల్గవ దశ కూడా వాళ్ళతో వుండటం  నా అదృష్టంగా  భావిస్తాను.

"అక్కడ మీకు  ఇల్లూ, వాకిలీ అంటూ కూడా  ఏమీ లేదు. మాకు  తెలిసి చుట్టాలు కూడా ఉండి వుండరు అయినా కూడా  ఎందుకు మీరలా   గెంతుకుంటూ ఆ వూరు పోతూ వుంటారు " అంటూ ఇలా అనని వాళ్ళు  లేరు . చాలా మందికి వాళ్ళ పుట్టిన వూళ్లతో ఎలా అనుబంధం వుంటుందో  నాకు కూడా అంతే .

ఆ వూళ్ళో నాకిష్టమైన వాడ రామగూళ్ళు   

ఒకనాడు రామ గూళల్లోకి  అడుగుపెట్టాలంటే నడుములు విరిగిపోవాల్సిందే. ఇప్పుడు ఆధునికీకరణంలో భాగంగా రోడ్లు బాగుపడ్డాయి . చక్కటి గాలి ప్రాణం ఇచ్చే మనుషులు మధ్య రెండు రోజులు గడిపితే అన్ని సమస్యలు దూరం అవుతాయి. . సిటీలో కాలుష్యం నడుమ అనేక రోగాలతో మేము బాధపడుతున్నాం కానీ ఈ వూళ్ళో ఎవరిని చూసినా రాళ్లులాగా వున్నారు .జుట్టు నెరిసిందే కానీ శరీర ధారుడ్యం ఏమాత్రం తగ్గినట్టుగా కనిపించదు. ఇంకో ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రాంతంలో తలకు రంగు వేసే వాళ్ళు మచ్చుక్కి ఒక్కళ్ళు కూడా కనిపించరు .ఎంతో ఆత్మ విశ్వాసంతో సహజంగా  వుండాలని కోరుకుంటూ వుంటారు   ప్రస్తుతం మేము బ్రతుకుతున్న జీవితాలకు ఇక్కడ జీవిస్తున్న వారికి       ఎక్కడా పోలిక లేదు . వూళ్ళో వున్న మిత్రులలో  ముఖ్యమైన వాళ్ళం నారాయణ ఇంట్లో కలుసుకున్నాం. నారాక వాళ్ళందరికీ ముందే తెలుసు కనుక ఎవరూ ఆశ్చర్య పోలేదు అయితే ఆప్యాయతగా  లోపలికి తీసుకెళ్లారు .

మిత్రుడు భాస్కరం సంభాషణలో  కలిపించుకుని  “ఒకరకంగా మాది వాడకట్టు అనుకో. మా చుట్టాలు కూడా దాదాపు చాలా వరకు ఇక్కడే వున్నారు. పెళ్లిళ్లు , పేరంటాలైనా వేలకు వేలు పోసి ప్రయాణాలు చెయ్యాల్సిన అవసరం లేదు. ఏ విషయమైనా మాకు బాగా దగ్గర చుట్టాలతో సంప్రదించకుండా  ఏమీ చేయం. దానివల్లే మా రిలేషన్స్  ఇప్పటికీ చెక్కు చెదరలేదు  “ అన్నాడు.   

“ అవును నిజమే . ఈ రోజుల్లో అందరికీ సాధ్యమయ్యే విషయం కాధు . మేము , మా బ్రదర్స్ , చుట్టాలు చాలా మంది ఒకే వూళ్ళో వున్నా కూడా ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ వుంటే తప్ప  ఒకళ్ల ఇళ్లకు ఒకళ్ళు వచ్చే దాఖలాలు లేవు. మీ విషయం వేరు .  మీలో చాలా మంది టీచర్లుగా పని  చేసి రిటైరైన వాళ్ళే అవడంతో వూరు కూడా మారాల్సిన అవసరం లేకుండా అందరూ ఒకే చోట ఇళ్ళు కట్టుకుని వుండటం, ఒకరిమీద ఒకరు మానసికంగా  ఆధారపడ్డ వాళ్ళే. మీకు మాలా పెద్ద ఆర్భాటాలు కూడా తక్కువే.  ఎప్పుడూ హోటల్లో కూడా భోజనం చేసి ఎరగరు. చక్కగా హాయిగా ఇంటి  భోజనం చేస్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా కాపాడుకుంటున్నారు.” అన్నాను.  .

మా ఇద్దరి  సంభాషణ ఆసక్తిగా వింటున్న  నారాయణ  కలిపించుకుంటూ నీకు తెలుసుగా . మా పిల్లల పెళ్లి సంబంధాల కోసం మేము కాళ్ళు అరిగేలా  తిరిగే పరిస్తితి లేదు ఇక్కడే అల్లుళ్లు , కోడళ్ళు దొరికేస్తారు . అలాగే మా కుటుంబంలో  ఎవరో ఒక పెద్ద వ్యక్తి మాత్రమే  ముందుగా వెళ్ళి బాగా విచారణ చేశాక కానీ  పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు తల్లి తండ్రులను సమాయత్తం చేసే వారు కారు. ఒక పెళ్లి జరుగుతోంది అంటే ఆ వూళ్ళో లేదా ఆ ఇంట్లో  ఎంతో మంది కనుసన్నల్లో జరుగుతుంది .  ఇంకా మాకు ఆ పూర్వ సంప్రదాయాలే కొనసాగుతున్నాయి .పెళ్లిళ్లు కలకాలం నిలిచాయంటే అదే కారణం. ఇప్పుడు మీ సిటీలలో  పరిస్తితిలు మారిపోయాయి. పెళ్లి సంబంధాలు తల్లి తండ్రులే వెతుక్కోవాలి. మధ్యలో ఎవరూ కలిపించుకోవడానికి వీల్లేదు. కలిపించుకుంటే పెళ్లయ్యాక ఆ సంసారం ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్తితులు వచ్చినా  వాటికి పూర్తి భాద్యత వహించాల్సి వుంటుందని గమ్మునుంటున్నారు.అందుకే ఇప్పటి తల్లి తండ్రులు చడీ చప్పుడు కాకుండా పెళ్లి సంబంధాలు వెతుక్కుంటున్నారు. ఆ కుటుంబానికి తప్ప మరో మనిషికి పెళ్లి శుభలేఖ ఇచ్చే అంతవరకు పొరపాటున కూడా తెలియదు. అందుకే ఏమీ తెలియానట్టు పెళ్లి రోజు వెళ్ళి నాలుగు  అక్షింతలు వేసి వస్తున్నారు. ఇప్పటి పెద్దరికాలు ఎలా అఘోరించాయో , పెద్దరికానికి ఎంత విలువలు ఇస్తున్నారో, కుటుంబాలలో సామాజిక భాద్యత  కనుమరుగవడంతో  సరైన అవగాహన లేకుండా దుందుడుకుగా కుదుర్చుకున్న  పెళ్లి సంబంధాలు ఎలా బెడిసి కొడుతున్నాయో మా టీచర్ల కుటుంబాలలో కూడా కొన్ని ఈ మద్య కాలమో నేను కళ్ళారా చూశానులే. ఏదో మాలాంటివారు ఇంకా కొంతవరకు కట్టుబాట్లు సింగినాదం అంటూ వేలాడటం వల్ల ఏదైనా అటూ ఇటూ అయినా కూడా గుట్టు చప్పుడు కాకుండా సంసారాలు లాగించేస్తున్నాం “ అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు నారాయణ . . ఒక రచయితకు కావలసిన భావుకత  అతనిలో ఎంతో వుంది. ఏదో  నూతిలో కప్పలా  రోజులు లాగించేస్తున్నాడు అనుకున్నా కానీ సమాజం పట్ల ఇంత అవగాహన , ఆలోచన వుందని అనుకోలేదు.

నేను ఈ  వూరికి ఎప్పుడు వచ్చినా  బయట లాడ్జింగ్ తీసుకున్నా , భోజనం మాత్రం నారాయణ ఇంట్లోనే .నేనుండే రెండు మూడు రోజులు నాతో పాటు భాస్కరం  కూడా నారాయణ ఇంట్లోనే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే వాళ్ళం. మా కబుర్లలో చెప్పుకున్నవే మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం పరిపాటే. .  .

“ఒకసారి మా పెరట్లోకి వచ్చి  చూడు గోపాలం . మీ చెల్లెలుకు పూల చెట్లు అంటే ఇష్టం. అవిగో ఆ రాధామనోహరం, మల్లెలు, కనకాంబరాలు, పారిజాతం ఇవన్నీ తను వేసినవే. నేనైతే దొండ, చిక్కుడు , తోటకూర కాడలు లాంటి మొక్కలంటే ఆసక్తి చూపుతాను. . చీటికీ మాటికీ కూరల కోసం టౌనుకు పరిగెత్తను. మా ఇంట్లో పొద్దున్నే టిఫిన్ లు  వుండవు. చక్కగా పదకొండు గంటలకల్లా భోజనం, తిరిగి రాత్రి ఆరున్నర , ఏడు కల్లా డిన్నర్ . మధ్యలో ఒకటి రెండు సార్లు టీలు, స్నాక్స్ అంతే...´అన్నాడు నారాయణ .

“అయితే డబ్బు బాగా కూడబెట్టి వుండాలే ఈ పాటికి ? . తమాషాగా అంటున్నానులే  ఏమీ అనుకోకు ..”అన్నాను. మా మధ్య చనువుగా మాట్లాడుకోవడం మొదటి నుండి అలవాటే. దెబ్బలాడుకుని మొహమొహాలు చూసుకోకుండా  వుంటే ఇన్నేళ్లుగా మా బంధాలు కొనసాగే అవకాశాలే లేవు.

“ ఏరా గోపాలం  మా ఆవిడ అన్నం వండి  రెడీ చేసేలోపు మనం ఒకసారి అలా మా పంట పొలం వైపు వెళ్లొద్దాం పదా” అన్నాడు నారాయణ .
“అవును అన్నయ్యగారు.చక్కటి పంట పొలాలు.మీకు సిటీలో కనపడవు. ఒకసారి చూసి రండి .మీరు వచ్చేటప్పటికి నేను భోజనం రెడీ చేసి వుంచుతాను.” అంది నారాయణ భార్య వేదవతి.

“ఏమిటోనమ్మా వచ్చినప్పుడల్లా మీకు అనవసరమైన శ్రమ ఇచ్చేస్తున్నాను.ఒక్కోసారి నాకే సిగ్గుగా వుంటుంది తల్చుకుంటూ వుంటే “ అన్నాను. “భలే వారు  ఇష్టమైన వ్యక్తుల కోసం మేము పడే శ్రమ ఒక శ్రమ కాదు. మీ ఎత్తు ధనం పోసినా అసలు మీరు మా ఇంటికి ఎందుకు వస్తారు ? మీ స్నేహం అలాంటిది. “ అంది వేదవతి . ఆమె గొంతులో ఆప్యాయత  కొటోచ్చినట్టు కనిపిస్తోంది. . 

మేము మాట్లాడుకుంటూ వుండగానే  నారాయణ చిన్న కొడుకు లోపలికి వచ్చాడు. అతను ఇంజనీరింగ్ పూర్తి చేసి పక్క వూళ్ళో కాంట్రాక్ట్ బేసిస్ లెక్చరర్ వుద్యోగం చేస్తున్నాడుట .మంచి వుద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా అది సానుకూలం కాలేదుట . బయటకు వెళ్తూ దారిలో అడిగాను నారాయణను” అదేమిటిరా  నీకు పొలం వున్నట్టు   ఎప్పుడు మాట వరసకైనా చెప్పలేదు  ఇన్నిసార్లు ఫోనులో మాట్లాడుకుంటూ వుంటాం కదా !” అన్నాను ఆశ్చర్యంగా.

“ అబ్బే అటువంటిదేమీ లేదురా . ఫోనులో చెప్పే అవకాశం రాలేదు .  .ఈ మధ్య  నాకు తెలిసినాయన పిల్ల పెళ్ళికి డబ్బు అవసరం అయ్యి  పొలం బేరం పెడితే ధైర్యం చేసి కొనేశానులే. పిల్లలకు ఏమీ ఇవ్వలేదని అనుకోకుండా అంత్య కాలంలో వాళ్ళకు రాసేస్తే మన భాద్యత తీరిపోతుంది .  మీ సిటీలలో లాగా బాంకుల్లో డబ్బులు వెయ్యడం , తీయడం ఇవన్నీ మేము మానేజ్ చెయ్యలేంరా. అయినా మనం వెళ్ళి చేసేది ఏమీ లేదు. తెలిసిన వాళ్ళకు అప్పుడే కౌలికి ఇచ్చేశాను. “ అన్నాడు నారాయణ ఏమీ దాచకుండా .

“బాగానే వుంది మొత్తానికి టీచర్గా వుంటూ కూడా డబ్బు బాగానే కూడబెట్టావు అన్నమాట. “ అన్నాను .డబ్బు కూడబెట్టడం గురించి నా నోటి వెంట రెండు సార్లు రావడం నాకే ఇబ్బందిగా అనిపించింది .

“ భలేవాడివే టీచర్ల పరిస్తితి పూర్వం లాగా వుందనుకున్నావా ? నాతో పాటు హెడ్ మాస్టర్లుగా చేసిన ప్రతి వాడికి రిటైరైన నాటికి లక్ష రూపాయలకు తక్కువ జీతం లేదు . ఇక పెన్షన్లు కూడా అదే స్తాయిలో వస్తున్నాయి .  నువ్వు ఆశ్చర్య పోతావు కానీ లుంగీ పంచెలు కట్టుకుని అతి సాధారణంగా  బ్రతికేస్తున్నట్టుగా  బయట కనపడే ఇక్కడ ప్రతి ఒక్కడి దగ్గర కోటి రూపాయలకు తక్కువ లేదు. పెద్దగా ఖర్చులు లేవు. భగవంతుడి  దయవల్ల  ఆరోగ్యాలు బాగానే వున్నాయి. వేళకు తిండి కనీసం రెండు కిలోమీటర్ల వాకింగ్.. హాయిగా నిద్ర. ఏదో ఇలా గడిచి పోతోందిలే ..”´అన్నాడు నారాయణ  . నాకు అతని మాటల్లో ఎటువంటి భేషిజమ్ కానీ దర్పం  కానీ కనిపించలేదు.

“నారాయణా ఈ వూళ్ళో మంచి ఫిల్టర్ కాఫీ దొరికే చోటు వుంటే చెప్పు. తాగాలని నోరు పీకేస్తోంది. పాపం మీ ఇంట్లో మంచి టీ ఇస్తున్నారనుకో .. అదేమిటో కానీ మా ఇంట్లో అందరికీ కాఫీ పిచ్చి “ అన్నాను.

“ వుంటాయిలే .. నేను పెద్దగా హోటల్లో టిఫ్ఫెన్ లు కానీ కాఫీలు కానీ తీసుకోనని నీకు తెలుసుగా . అయినా పర్వాలేదు ఒకసారి వూరంతా తిరిగేద్దాం పద. ఎక్కడో అక్కడ  దొరక్కపోదు . “ అన్నాడు నారాయణ . నేను ఆటొ ని పిలవబోతే , “ ఎందుకు గోపాలం చక్కగా చల్లగాలిలో వాకింగ్ చేసినట్టుంటుంది. వూరికె డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం ?మేము పుట్టి బుద్దెరిగాక ఆటోలు కానీ, రిక్షాలు కానీ ఇంతవరకు ఎక్కలేదు . ఎక్కడికెళ్లినా నడకే. అందుకే అరవై ఏళ్ళు దాటినా ఇంత

ఆరోగ్యంగా  వున్నాం “ అన్నాడు నారాయణ. .మర్నాడు పక్క వూళ్ళో వుంటున్న నారాయణ కూతురు, అల్లుడు వస్తే “వాళ్ళతో సరదాగా గడపండి. నేను ఒకసారి అలా అన్ని గుళ్ళు  చుట్టేసి వస్తాను” అని చెప్పి బయట పడ్డాను .

మేము ముప్పై నలభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో వున్నప్పుడు  అప్పటికే గుళ్ళు  చాలా పురాతనంగా వుండేవి. వూడలు దిగిపోయిన మర్రి చెట్లు, వాటితో పాటు మొదలునుండి అల్లుకుపోయిన వేప చెట్లు , వాటి మధ్య పెద్ద పాము పుట్టలు ఒంటరిగా గుడికి రావాలంటేనే భయమెసేదీ.  , . ఈ మధ్య కాలంలో చాలా సార్లు ఈ వూరు వచ్చినా ఎందుకో గుళ్ళ మీద అంతగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు వెళ్ళి చూస్తూంటే గుళ్ళన్నీ పూర్తిగా జీర్ణోద్దారణ చేసినట్టుగా కనిపిస్తున్నాయి.అందమైన ప్రాకారాలతో అచ్చెరువు పొందే శిల్పసంపదతో చూపు మరల్చుకోలేని పద్దతిలో వున్నాయి. ఒక్కో గుళ్ళో ఒక అరగంటసేపైనా .. కూర్చోవాలని నిర్ణయించుకున్నాను. అన్ని గుళ్ళల్లోనూ నన్ను చాలా ఆశ్చర్య పరిచిన విషయం ఏమిటంటే ఈ గుళ్ళన్నీ శిధిలావస్థ నుండి ఇంత గొప్పగా వెలిగిపోవడానికి కారణం జీర్ణోద్దారణకు  పూనుకున్న వాళ్ళల్లో ముఖ్యులు నారాయణ , భాస్కరం , మరో మిత్రుడు కృష్ణ మూర్తి అని ప్రస్తుతం వూళ్ళో లేడు . , వీళ్ళందరూ ఒక్కొక్కరు రెండు లక్షలకు పైగా  వితరణ చేశారని, కనీసం వాళ్ళ పేర్లు  గుడి ప్రాంగణంలో ఎక్కడా రాయించుకోవడానికి కూడా  ఇష్ట పడలేదని అక్కడ పాలక వర్గ సభ్యులు, పూజారులు చెప్తూ వుంటే నాకు నోట మాట రాలేదు.  ఒకనాడు మేము చదువుకున్న  స్కూలుకు కూడా వీళ్ళంతా  ఇతోధికంగా సహాయం చేసి వాళ్ళ ధాతృత్వాన్ని నిరూపించుకున్నారు అని వాళ్ళ మాటల ద్వారా వింటూ వుంటే  నా మనసంతా కలవరంతో నిండి పోయింది. . ఎంతమటుకు డబ్బు ఖర్చు పెట్టరని, బయటకు వెళితే డబ్బు వృధా అయిపోతుందని, పొద్దున్నే టిఫిన్లు మానేసి పదింటికే అన్నం తినేసి , బయట నుండి కూరలు కూడా కొనకుండా దొడ్లో వేసిన మొక్కలతో లాగించేస్తూ వుంటారని  ఒక అపోహ నాకు అంతర్గతంగా బలీయంగా  వుంటూనే వుంది.  మరి నేను ఒక రాష్ట్రానికి పెద్ద అధికారిగా పని చేసి ఎప్పుడూ కూడా ఒక గుడికొ, బడికో, అనాధులకు , అవసరార్ధులకు ఒక్క రూపాయి కూడా  ఇచ్చినట్టు గుర్తు లేదు.  .  పోయాక మన కీర్తి మిగిలి పోతుందని, నలుగురు చెప్పుకుంటారన్న వాటితో నాకు ఎందుకో నమ్మకం వుండేది కాదు. మీ తల్లి తండ్రుల జ్ఞాపకార్ధం  గుడికి ఏదైనా చదివించండి.

మీ పేరుమీదట అన్నదానాలు, నిత్య పూజలు   చేయిస్తాం అంటూ చాలా గుళ్ళల్లో ధర్మకర్తలు అడిగే వారు. తప్పకుండా అని చెప్పి మళ్ళీ ఆ విషయం మర్చిపోయే వాడిని.  నేను ఎన్నో ప్రవచనాలు వినే వాడిని.  “మనం మన కోసం బ్రతకటం అది  ప్రకృతి, మనకు కావలసిన దానికన్నా ఎక్కువ అనుభవించడం అది వికృతి, కానీ మనతో పాటు ఇతరులకు కూడా పంచడం అది సంస్కృతి” అని ప్రవచనాకారులు చెప్తూ వుంటే పెద్దగా స్పందించలేదు . ఏదో మా తల్లి తండ్రులు చేసిన పుణ్యం వల్ల మంచి వుద్యోగం , డబ్బు సంపాదించుకోగలిగాను  .అలా అని వాళ్ళ  జ్ఞాపకార్ధం  చేసిందంటూ ఏమీ లేదు .  జీవితంలో మనకున్న దానిలో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తే అనారోగ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో తీసుకునే అవస్థ తప్పుతుందని పుస్తకాలలో చదివాను.. కానీ అటువంటి వాటి వైపు మనస్సు పెట్టకపోవడం , ఏ విషయానికి సరైన టైంలో స్పందించక పోవడం ఎందుకు నాలో కలగలేదో తల్చుకుంటూ వుంటే ఆశ్చర్యంగా వుంటుంది., విధి రాత కావచ్చు , కాకతాళీయం కావచ్చు  మూడేళ్ళ క్రితం  అత్యవసరంగా బైపాస్ ఆపరేషన్కు  పది లక్షల రూపాయల వరకు దారపోయాల్సి వచ్చింది. .  బరువైన గుండెలతో అక్కడనుండి కదిలాను .

ఒక రకంగా  అంధకారం నుండి  వెలుగు బాట వైపు వెళ్తున్నట్టుగా అనిపించింది. నా కళ్ల ముందు నారాయణ, భాస్కరం  తదితరులు  మెదులుతున్నారు .నేను ఇన్నాళ్ళు వాళ్ళకు ఏమీ చేయలేక పోయాను. నిజానికి నేను ఎంతో పెద్ద వుద్యోగంలో వున్నా నారాయణ వాళ్ళ అబ్బాయికి ఎక్కడైనా వుద్యోగం చూసి పెట్టమని మాట వరసకైనా  ఎప్పుడూ అడగలేదు . నేనే కనీసం పిల్లల కోసం , పెద్ద వాళ్ళ కోసం మర్యాదకైనా ఒక స్వీటు  పాకెట్ అయినా తెచ్చి ఇవ్వాలని అనుకోలేదు. ఏదో నాకు ఈ వూళ్ళో హక్కు వుందని  ప్రతి సంవత్సరం టంచన్గా వాలి పోతూండే వాడిని.  నిజమైన ప్రేమ మొదటి కలయిక నుండి  చివరి వూపిరి  తీసుకునే వరకు వ్యక్తులను కలిపే వుంచుతుంది . మనిషి వున్న స్తితి నుండి వున్నత స్తితికి, వున్నత స్తితి నుండి మహోన్నత స్తితికి ఎదగాలంటే  సహజ సిద్దమైన మంచితనం , నలుగురిని కలుపుకు పోవడం, స్పందించగలిగే సుగుణం  చాలా ముఖ్యం. ఈ సమాజంలో వివిధ వ్యక్తిత్వం గల మనుష్యుల మధ్య  బ్రతుకుతున్నా నేను ఎందుకో చాలా విషయాలలో వెనుకబడి వున్నాను. ఎన్నోసార్లు  మనశ్శాంతి కరువవుతూ వుండేది.  లోపల వ్యక్తపరచే వీలు కాని  అలజడి . అలా ఎందుకు అవుతోందో   అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ రోజు భగవన్ సాన్నిద్యంలో  నాకు ఎన్నో విషయాలు భోదపడ్డాయి . నా కర్తవ్యాన్ని గుర్తుచేశాయి . మనసు వుత్సాహంగా నారాయణ ఇంటివైపు వడివడిగా అడుగులు వేయించింది .   బయట వరండాలో తెల్లటి లుంగీ కట్టుకుని కూర్చుని వున్నాడు నారాయణ .

“. ఏమిటి గోపాలం . ఒక్కడివే ఎక్కడికి వెళ్లావ్  ? పది నిమిషాలు ఆగితే నేను కూడా వచ్చే వాడినిగా . నువ్వు అంత దూరం నుండి మా కోసం వస్తే నిన్ను ఒంటరిగా  వదిలేస్తే మాకు ఎంత బాధగా వుంటుందో ఆలోచించావా ? నీ కోసం భాస్కరాన్ని  పంపించాను మొహమాటంతో ఎక్కడ తిరుగుతున్నావో చూసి రమ్మని “. నారాయణ మొహంలో ఏదో తప్పు చేసినట్టుగా గిల్టీ ఫీలింగ్ కనిపిస్తోంది .నారాయణ, భాస్కరం  మంచి తనాన్ని నేనిక ఏ మాత్రం తట్టుకునే పరిస్తితిలో లేను. మా స్నేహం కలకాలం గుర్తుండిపోయేటట్టుగా ఏదో ఒక మంచి పని చెయ్యాలి .లేకపోతే ఈ జీవితానికి నిస్కృతి లేదు అనుకుంటూ వుండగానే నారాయణ చిన్న కొడుకు కిషోర్ అప్పుడే లోపలకు వస్తున్నాడు .

“ నారాయణా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా తమ్ముడు ఈ మధ్య ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాడు . నిన్న వాడికి ఫోన్ చేసి చెప్పాను . మన నారాయణ కొడుక్కి అందులో ఏదైనా ఫ్యాకల్టీ చూడమని . వాడు వుత్సాహంగా ఒప్పుకున్నాడు .నువ్వు కిషోర్ తో ఆ కాంట్రాక్ట్ వుద్యోగం మానెయ్యమని చెప్పు. నీ కొడుకు భాద్యత మేము తీసుకోవాలని అనుకుంటున్నాం “ అన్నాను నారాయణ కళ్ళల్లోకి చూస్తూ. నారాయణ కళ్ళల్లో కృతజ్ఞతతో కూడిన  సంతోషం  కనిపించింది.

పాకెట్ లోంచి అయిదు వేల రూపాయల నోట్లు తీసి వంటగదిలో పని చేసుకుంటున్న నారాయణ భార్యను పిల్చి “ ఎప్పుడొచ్చినా హడావిడిలో నేను నీకు ఏమీ ఇవ్వలేక పోయాను. ఈ అన్నగారు పసుపు కుంకాల కింద ఇస్తున్న చిన్న అమౌంట్  “ అంటూ  సిగ్గుపడిపోతూ దూరం జరిగిపోతున్న నారాయణ భార్య చేతిలో బలవంతాన వుంచాను  . ఈ లోపు భాస్కరం ఆయాసపడుతూ లోపలికి వచ్చాడు. “ ఎక్కడున్నావయ్యా బాబూ మొత్తం గుళ్లూ, గోపురాలు , సందులూ, గొందులూ నీ కోసం తిరిగేశాను. చాలా కంగారు పడిపోయాననుకో.” అంటున్నాడు.

“భాస్కరం! నా గురించి మీరంతా  ఇంతగా  ఆలోచిస్తున్నందుకు మీ ఋణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడం లేదు. “ పద ఒకసారి మీ  ఇంటికి వెళ్లొద్దాం.  చెల్లెల్ని పలకరించాలి. రేపు పొద్దున్నే నా ప్రయాణం కదా. “ అన్నాను.

ఒక రెండు గంటల క్రితం నాకు కలిగిన  జ్ఞానోదయం దరిమిలా  నారాయణ భార్యకు పసుపు కుంకాలు పేరు చెప్పి ఇచ్చినట్టుగానే ఎంతో మొహమాటం పడిపోతున్నా బలవంతాన భాస్కరం భార్య చేతిలో  కవరు వుంచాను. అన్నట్టు మేము హైదరాబాద్లో వున్నామని మీరు మరిచి పోకండి . మాతో కొన్నాళ్లు గడిపి వెళ్ళండి. ఇది మీకు ఓపెన్ ఇన్విటేషన్ . నేను ఏ చనువుతో మీ ఇళ్లకు వస్తున్నానో అంతే చనువుతో మీరు కూడా రావాలి “ అని చెప్పి అక్కడనుండి కదిలాను. ఇన్నేళ్లుగా నాలో ఎప్పుడూ కలగని ఆనందం, సంతోషం , తృప్తి , నా చిన్ననాటి  మిత్రులతో గడిపిన జ్ఞాపకాల ఝరుల వుక్కిరిబిక్కిరిల మధ్య 

మరిన్ని కథలు