Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> సాగర గోస

sagara gosa

"రోజు ఆరు గంటలకే ఇంటికి వచ్చే మీ ఆయన ఈ మధ్య రాత్రి పది గంటలు దాటాకే వస్తున్నాడు ఏమిటి సంగతి" పొరుగింటి కామాక్షి గౌతమిని అడిగింది. గౌతమి ఏమి మాట్లాడకుండా ఆశ్చర్యంగా చూసింది.

"నువ్వు మొద్దు సుద్దలా ఉన్నావు. మీ ఆయనను ఈ రాత్రికే నిలదీసి అడుగు, లేకుంటే నీ ఖర్మ" విపరీతమైన బాధను ఒలకబోస్తూ కామాక్షి గుచ్చి గుచ్చి అడిగింది.

"మా ఆయన మంచివారు. నువ్వు అనుకున్నట్లు అలాంటి వేషాలు ఆయన వేయడు. నువ్వేమి బాధపడకు" ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది గౌతమి. కాని కామాక్షి ఆమెతో పలు ఉదాహరణలు చెప్పి అనుమాన బీజం నాటింది.  గౌతమి భర్త సాగర్ రెవిన్యూ ఆఫీసులో జూనియర్ సహాయకులుగా పని చేస్తున్నాడు. మొదట్లో సాయంత్రము ఆరు గంటలకే ఇంటికి వచ్చేవాడు. గౌతమి సాగర్ ల దాంపత్యం అన్యోన్యంగానే కొనసాగింది. రెండు నెలల నుండి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. కామాక్షి చెప్పినట్లు సాగర్ చిన్న కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడా? ఏమో? సాగర్ శ్రీరామ చంద్రుడు లాంటి వారు.. ఆయన ఏ తప్పు చేయకపోవచ్చు. మనసు పరిపరి విధాలా అలోచిస్తుంది.

రాత్రి పది గంటలకు ఇంటికొచ్చిన సాగర్ ని అడగాలనుకుంది. సాగర్ ఒక పత్రికను గౌతమి చేతికిచ్చి చూడమన్నట్లుగా సైగ చేసాడు. గౌతమి పత్రికలు తిరగేసింది.

"ఏముంది ఇందులో" అయోమయంగా అడిగింది.

"పదహారవ పేజి చూడు" గర్వంగా చెప్పాడు సాగర్. గౌతమి ఆ పేజిని మొత్తం చూసింది. అందులో "నువ్వు నాకెందుకు" అనే కవిత ప్రచురించబడింది. దాని క్రింద గౌతమి సాగర్ అనే పేరుంది.

"మీరెప్పుడు కవి అయ్యారండి?" ఆశ్చర్యంగా చూసింది గౌతమి. సాగర్ గౌతమిని దగ్గరికి తీసుకుని "రాత్రికి వివరంగా చెపుతాను" అన్నాడు. రాత్రి పదకొండు గంటల సమయం. గౌతమి సెల్ రింగయింది. ఎవరా అని చూసింది. కామాక్షి చేస్తుంది.

"గౌతమి, మీ ఆయన్ని అడిగావా, లేదా?"

"ఇంకా లేదు" ముక్తసరిగా జవాబిచ్చింది.

"త్వరగా అడిగి చెప్పు" ఆత్రుతుగా అడుగుతుంది కామాక్షి. కాల్ కట్ చేసింది.

"ఇదొకతి, దీనికి నిద్ర కూడా రావడం లేదు. ఎప్పుడూ ఇతరుల గురించే సోది" గౌతమి విసుక్కుంది. సాగర్ చెప్పడం ప్రారంభించాడు.

"గౌతూ, రెండు నెలల క్రితం నేను ఒక సాహితీ సంస్థలో సభ్యత్వం తీసుకున్నాను. ప్రతి రోజు సాయంత్రం సాహితీ మిత్రులతో బాతాఖానీ, సాహిత్యం లో  మెరుగులు దిద్దుకునేందుకు కవి సమ్మేళనాలు, సదస్సులకు హాజరు అవుతున్నాను. ఇప్పటి వరకు చాలా కవితలు వ్రాసి పత్రికలకు  పంపాను. ఈ రోజు అచ్చయింది, నా మొదటి కవిత. నా మొదటి కవిత ప్రచురించాకే నీకు చెప్పాలనిపించింది. నా కలం పేరు కూడ నీదే..."  సాగర్ చెబుతూనే ఉన్నాడు. గౌతమి బిత్తర చూపులు చూస్తుంది. రెండు నెలలు ఆలస్యంగా వచ్చింది ఈ కవిత వ్రాయడానికా? రాత్రి ఎప్పుడు పూర్తయిందో గౌతమికి తెలియలేదు.  గౌతమికి సాగర్ పరిస్థితి వింతగా తోచింది. తెల్లవారు జామున నాలుగు గంటలకే లేస్తున్నాడు. ఏవేవో వ్రాస్తున్నాడు. పేజీలకు పేజీలు వ్రాస్తూ మంచి ఆలోచన తట్టినపుడు చిన్న పిల్లాడిలా ఎగిరి గంతులేస్తున్నడు. మరొకసారి పేపర్లు చింపి దిగాలున కూర్చుని ఏదో ఆలోచనల్లో పడి వింతగా ప్రవర్తిస్తున్నాడు. ప్రతి రోజు కవితలు వ్రాస్తూ బలవంతంగా చదివి వినిపిస్తున్నాడు. మొహమాటానికి బాగుంది అనంటే శైలి బాగుందా, వస్తువు బాగుందా, ఎత్తుగడ బాగుందా, శీర్షిక బాగుందా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. బాగోలేదని అంటే అలిగి అన్నం కూడ తినడం లేదు.అవేవి అర్థంగాని గౌతమి బిక్కమొహం వేయడం నేర్చుకుంది.  బందువులు ఇంటికొస్తే వారిని తన కవితలతో వేధిస్తున్నాడు. ఇరుగు పొరుగు వారు రావడమే మానుకున్నారు. ఆఫీసులో సాగర్ తో ఎవరు మాట్లాడడం లేదు.

"నేను కవిగా ఎదగడం చాలా మందికి అసూయగా ఉంది. నేను ప్రముఖ కవినయ్యాక వారందరు నాతో సెల్ఫీ దిగిడానికి పోటీ పడతారు" విజయ గర్వంతో సాగర్ చెబుతుంటే, జాలిపడాలో, బాధ పడాలో గౌతమికి అర్థం కావడం లేదు.  రోజురోజుకు సాగర్ కి కవిత్వం పట్ల ఆసక్తి ఎక్కువయింది. ఆఫీసుకు వెళ్ళకుండా సమావేశాలు, సాహిత్య సదస్సులంటూ ఊర్లు తిరుతుతున్నాడు. డబ్బులన్ని వృధాచేస్తూ, అప్పులు చేయడం ప్రారంభించాడు. ఎవరో సలహా ఇచ్చారని వ్రాసిన వంద కవితలన్ని కలిపి పుస్తకంగా తీసుకురావాలని కంకణం కట్టుకొని వేలకు వేలు ఖర్చు చేసాడు. సాగర్, గౌతమిల మధ్య దూరం పెరుగుతుంది. పుస్తకం రూపొందించే పనిలో పడి అధికారుల చేత  చీవాట్లు తినే స్ధాయికి దిగజారాడు.

"సాగర గోస" పేరిట కవితల పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించాడు. వ్రాయడం మొదలెట్టిన ఆరు నెలల్లోనే పుస్తకం ప్రచురించే స్థాయికి ఎదిగాడని భజన పరులు పొగుడుతూ సాగర్ ని నిలువునా ముంచారు. సాగర్ కనపడిన వారందరికి పుస్తకాలు ఇచ్చి బలవంతంగా చదివిస్తున్నాడు. కొందరికి డబ్బులిచ్చి మరీ చదవండని ఒత్తిడి చేస్తున్నాడు. గౌతమి తల్లిదండ్రులు అల్లుడిని మార్చడానికి మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళారు. తన పుస్తకం చదివితేనే ట్రీట్ మెంట్ కు అంగీకరిస్తానని పట్టుపట్టాడు. డాక్టర్ రెండు కవితలు ఇలా చదివాడో లేదో పేషెంటుగా మారాడు.

"సాగర్ గోస" చదివిన పాఠకులలో చాలా మంది ఆస్పత్రి పాలయ్యారు. కొందరు వృద్దులు ముందే తనువులు చాలించారు. చాలామంది విద్యార్థులు పరీక్షలు తప్పి, రోడ్లపై తిరగసాగారు. కొందరు సాగర్ పే పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు విచారణ జరిపారు. విచారణలో భాగంగా పుస్తకాలను చదివిన నలుగురు పోలీస్ అధికారులు మతితప్పి పిచ్చిగా ప్రవర్తించారు.

'సాగర్ గోస ' తో సంచలనం సృష్టించిన సాగర్ ను జైలు లో బంధించి, భవిష్యత్తులో కవితలు వ్రాయకుండా, తన పుస్తకాన్ని ప్రభుత్వం నిషేధించింది. తనను ఎదగకుండా చేస్తున్నారని సాగర్ వాపోతున్నాడు. తన బలహీనతను తెలుసుకోనంత పాతాళానికి దిగజారిన సాగర్ ని చూసి గౌతమి బోరున విలపిస్తుంది. ఉలిక్కిపడి లేచింది గౌతమి. "ఇది కలా...!"

"అమ్మో, ఈ కల నిజం కాకుడదు" ధృడంగా నిశ్చయించుకుంది. పక్కకు తిరిగి చూసింది. సాగర్ లేడు. హాలులోనికి వచ్చి చూసింది. సాగర్ కవితలు వ్రాస్తూనే ఉన్నాడు. గౌతమి గడియారాన్ని చూసింది. సమయం నాలుగు గంటలు..

మరిన్ని కథలు
amtaratma