Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue346/855/telugu-serials/nee -  perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి)....  అనుకున్నట్లుగానే పెళ్ళికి అన్ని ఏర్పాట్లూ చకచక సాగిపోతున్నాయి. చిన్నక్కని నా పెళ్ళికి ఆహ్వానించాలని బలంగా అనిపించింది నాకు. కాని, నాన్న మనసు బాధపడుతుందని  వెనుకంజ వేశాను.  పల్లెలో మాకు మిగిలిన రెండెకరాల పొలాన్ని బేరం పెట్టారు నాన్న. నాకు చాలా బాధనిపించింది. నా పెళ్ళి చేయడం కోసమని ఆయన ఉన్న అతి కొద్ది స్థిరాస్తిని పోగొట్టుకోవడం నన్నెంతో వేదనకి గురిచేసింది.

నాన్నే నన్ను ఊరడించారు. “ అమ్మా ముక్తా… కడుపున పుట్టిన కూతురికి పెళ్ళిచేసి, ఆమె అచ్చట-ముచ్చట తీర్చడం తండ్రిగా నా బాధ్యత. నీ పెళ్ళై నువ్వు అత్తవారింటికి వెళ్ళాక నేను నా బాధ్యతల నుంచి విముక్తుడనౌతాను. ఇంకా నా రెక్కల్లో సత్తువుంది. ఈ లోపు తమ్ముడు ప్రయోజకుడైతే నన్ను, అమ్మని సుఖపెడతాడు.’’ అన్నారు గద్గదమైన స్వరంతో.

‘ఆడపిల్ల పుట్టిందా!’ అంటూ పెద్దవాళ్ళు పెదవి విరిచేదిందుకేనేమో! పుట్టింది మొదలు మట్టిలో కలిసిపోయే వరకు ఆడదానికి ఎన్నో అవసరాలు. మెడలో మాంగల్యం పడబోయే ముందు నేనిలా వేదాంత ధోరణిలో కూరుకుపోవడం నాకే నవ్వు తెప్పిస్తోంది. పెళ్ళికి కావలసిన బట్టలు, నగలు అన్నీ కొనేశారు. ‘ నాకు కావలసిన నగలన్నీ తానే పెడతానని, పుట్టింటివారిగా మీకేమైనా ముచ్చట్లుంటే తీర్చుకోమని’ అమ్మతో చెప్పింది అత్తయ్య.

మూడు కాసులతో సూత్రాల గొలుసు, ఓ జత గాజులు చేయించారు నాన్న. పనిలో పని అమ్మకి కూడా నానుతాడు చేయించమని శతపోరు పెట్టి మరీ సాధించింది బామ్మ. మెడలో కొత్తగా అమరిన హంగుతో ఎంతో విలక్షణంగా ఉంది అమ్మ. ఇంత సంబరం జరుగుతున్నా నన్నో సందేహం పట్టి పీడించడం మాత్రం మానలేదు.

ఇంతవరకూ బావ నన్ను చూడాలని కాని, నాతో మాట్లాడాలని కాని, ప్రయత్నించలేదు. కనీసం ఫోన్ లో కూడా కాంటాక్ట్ లో లేడు. పక్కింటి పరంజ్యోతి వాళ్ళక్కకి పెళ్ళి కుదిరింది మొదలు… ఆమెకి కాబోయేవాడు ఫోన్లమీద ఫోన్లు చేసి ఊదరగొట్టేసే వాడు. తెల్లారి లేచి ఏదో ఒక మిష పెట్టుకుని తనని చూడడానికి పరుగెత్తుకు వచ్చేసేవాడు.

 పెళ్ళయ్యేంతవరకూ కూడా ఆమెను అంటిపెట్టుకు తిరిగే అవకాశం కోసం గోతికాడ నక్కలా కాచుక్కూచునే వాడు. అలాంటిది… నాకు- బావకి నిశ్చితార్ధం జరిగి నెలపైనే కావస్తోంది. పెళ్ళిముహూర్తమూ పెట్టేశారు. అయినా సరే… అతడు నాకోసం తపించకపోవడం నాకు వింతగా అనిపిస్తోంది. ఎన్నోరకాల సందేహాలు మదిని చెద పురుగుల్లా కొరికిపోస్తున్నా… చీరలు నాక్కావలసిన వస్తువులు అమర్చుకునీ సందడిలో ఆ సందేహాలని తాత్కాలికంగా పక్కకి నెట్టేశాను.

పెళ్ళి దగ్గరపడింది.బంధువులందరూ వచ్చారు. చిన్నక్క నాకు యాభైవేల రూపాయలకి చెక్ పంపింది పెళ్లికానుకగా ఏదన్నా కొనుక్కోమని. దాన్ని నా అకౌంట్ లో వేసుకున్నాను. ఆ నాలుగురోజులూ అమ్మలక్కలందరూ కలిసి నలుగు పేరిట నా ఒళ్ళు హూనం చేసి పారేశారు. ఒంటి మెరుపు మాటేమో గాని, వాళ్ళు చేసిన మసాజ్ పుణ్యమా అని ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. పెద్దక్క కూతురు హారతి నా చేతులకి, పాదాలకి గోరింటాకు తీర్చిదిద్దింది.

పెళ్ళికి ముందురోజు నన్ను పెళ్ళికూతురిని చేశారు.తలంటుకున్న జుట్టూ, నువ్వా-నేనా అని  నా ఒంటిరంగుతో పోటీ పడుతున్నట్లుగా పూసుకున్న పసుపు, వదులుగా అల్లిన జడలో తురిమిన కదంబమాల, కోలకళ్లకి తీర్చిదిద్దిన కాటుకరేఖలు, నుదుట కళ్యాణ తిలకం, మెడలో ముత్యాలు- పగడాలతో కలిపి చేసిన అక్క నెక్లెస్,  నా ఒంటిని చుట్టుకున్నానన్న గర్వంతో మిడిసిపడుతూ, మెరిసిపోతున్న ఆరెంజ్ కలర్ పట్టుచీర… అద్దంలో కనబడుతున్న నా ప్రతిబింబం నాకే ముద్దొచ్చింది. ఇంత అందాన్ని ముడుపు గట్టి ఎవరో ముక్కుమొహం తెలియని మగాడికి అప్పగించాలా!

అంతలోనే నా మనసు నన్ను గదిమింది’ ముక్కుమొహం తెలియక పోవడమేమిటీ…నీకు వరసైన వాడేగా!. నీ సొగసుల ఖజానాని అతడికేగా సమర్పించవల్సిందీ… నీ సౌందర్య సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలే వేలుపు అతడేగా!

‘నువ్వూరుకోవే పిచ్చి మనసా! ఎంత వరసైన వాడైనా పరిచయం లేని వ్యక్తేగా!?’అద్దంలో కనబడుతున్న నా ప్రతిబింబంతో మాట్లాడుకుంటూ నాలో నేనే మురిసిపోతూండగా… “అబ్బ! ఎంత ముద్దొస్తున్నావే ముక్తా… మావాడు చూస్తేనా! మరి ఒక్క క్షణం కూడా ఆగడు.’’ పెద్దత్తయ్య అంది నా బుగ్గ గిల్లుతూ.ఏమూలో దాక్కున్న సిగ్గు నేనున్నానంటూ, వచ్చేసి ఒళ్లంతా పాకి గిలిగింతలు పెట్టింది.  కర్ణుడికి కవచకుండల్లాగా ఆడపిల్లలకి  సిగ్గు సహజాభరణమేమో! అసలు… నన్ను చూడగానే బావ ఎలా స్పందిస్తాడు! నవలలలో, కథల్లో వర్ణించినట్లుగా అతడి కళ్లు నక్షత్రాలా మెరుస్తాయా? నన్ను చూడగానే చిలిపిగా నవ్వుతూ, కొంటెగా కన్ను గీటుతాడా! ఏవేవొ ఊహాగానాలు నన్ను భూమ్మీద నిలవనీయడం లేదు. మనసు , తనువు కూడా గాల్లో తేలిపోతున్నట్లుగా ఉన్నాయి. అయినా… ఈ నిరీక్షణ ఎంతసేపు! ఈ సాయంత్రానికే కరిగిపోదూ!సాయంత్రం ఎప్పుడౌతుందా అని… కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూశాను. ఇంట్లో ఉన్న అందరిదీ ఒకరకం హడావుడైతే… నా మనసు చేస్తున్న హడావుడి ఇంకో రకం. నేనెంతగానో ఎదురుచూస్తున్న సాయంత్రం రానే వచ్చింది.

“పార్వతీ… వాళ్లొచ్చే వేళైంది. ఎదురుకోలు సన్నాహానికి అన్నీ సిధ్ధం చేశావా?’’ ఆదుర్దా పడుతోంది అమ్మ. ఎంత ఆడపడుచు కొడుకైనా…వియ్యాలవారికి ఏలోటూ రాకుండా చూసుకోవాలన్న తాపత్రయం ఆవిడది. అత్తయ్య వాళ్ళు పానకం బిందెలు, బుక్క-బలగుండ, పన్నీరుబుడ్డి, పూలదండలు అన్నీ సిధ్ధం చేశారు. ఇంతలో తమ్ముడు పరుగెత్తుకుని వచ్చి” అమ్మా…పెళ్ళివారొచ్చేశారు.’’ అన్నాడు ఆయాసపడుతూ.  వీధివైపునున్న కిటికీలోనుంచి తొంగి చూశాను. సందు మలుపు తిరుగుతూ కనిపించింది అత్తయ్య వాళ్ళొస్తున్న క్వాలిస్. అమ్మవాళ్ళు మంగళ వాయిద్యాలతో ఎదురెళ్ళారు. మా ఎదురింటినే విడిదిగా ఇవ్వడంతో క్వాలిస్ వచ్చి మా ఇంటికెదురుగా ఆగింది.  కారులో నుంచి ముందు అత్తయ్య దిగింది. ఆమె వెనుకాతలే మామయ్య, ఇంకా ఎవరెవరో దిగారు. బావ దిగగానే చూడాలన్న ఆత్రంతో కిటికీ దగ్గర మునివేళ్ళ మీద నిలబడి  ఎగిరెగిరి చూశాను. 

అందరూ చుట్టుముట్టేయడం నుంచి బావ తల తప్ప మరేమీ కనిపించడంలేదు.  ఛీ… వీళ్ళకి బొత్తిగా మానర్స్ లేదు.అలా ఊపిరాడకుండా మొహరించేస్తే ఎలా? పాపం బావ…ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో కదా!

“ఒసేయ్ ముక్తా… తొందరెందుకే…రేపు పెళ్లి పీటల మీద చూస్తావుగా మీ బావని’’ వెనక నుంచి బామ్మ కేకేయగానే లోపలికి తుర్రుమన్నాను.  పెళ్ళి ముహూర్తం వరకు వధూవరులు ఒకరినొకరు చూసుకోకూడదట… బామ్మ చెప్పింది. ఎంతకీ తెల్లారని రాతిరిని తిట్టుకుంటూ గడిపేశాను. చీకటితోనే నన్ను నిద్రలేపి తలంటి, ముస్తాబు చేశారు. గదిలోకి లాక్కెళ్ళి పడేసి “ పెళ్ళికూతురు స్నాతకం చూడకూడదు. పొరబాటున కూడా గదిలోనుంచి బయటకు రాకు…’’ అంటూ దివ్యను నాకు కాపలా పెట్టేసి చక్కాపోయారు.

ఎందుకో…. మనసులో ఏదో తెలియని ఉద్విగ్నత. పెళ్ళంటే ప్రతి ఆడపిల్ల మనసూ… ఇలాగే అల్లకల్లోలంగా ఉంటుందా! ఎన్నాళ్ళుగానో ఒకేచోట పాతుకుపోయిన మొక్కను పెకిలించి తీసుకెళ్ళి ఇంకో చోట నాటితే, అది ఆ కొత్త చోట వేళ్ళూనుకోవడానికి ఎంత సమయం పడుతుంది! అసలలా స్థానచలనం జరిగితే అది బతికి బట్ట కడుతుందా! ఆడపిల్లా అంతే… పుట్టిన దగ్గరనుంచీ అలవాటైన పరిసరాలని విడిచిపెట్టి వేరే ఇంట్లో తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు ఆమె ఎంతగా శ్రమించాలో!

ఆ ప్రయత్నంలో ఆమె మనుగడే ప్రశ్నార్ధకమైతే!? అర్ధం పర్ధం లేని ఆలోచనలు వేధిస్తున్నాయి గుబులు నిండిన నా మనసుని. ఆ రాత్రికే ముహూర్తం కాబట్టీ, భోజనాలైనాక నాకు మళ్ళీ మంగళాస్నానం చేయించి, అలంకరణ ప్రారంభించారు. నేను తయారవ్వగానే పంతులుగారు గౌరీ పూజ చేయించారు. బజారంతా గాలించి మరీతెచ్చుకున్న ఎర్రని పట్టుచీర- జాకెట్ కట్టుకుని, చేతులనిండా ఎర్రని పెట్టెగాజులతో పాటు నాన్న చేయించిన బంగారు గాజులు వేసుకుని, జాజిపూల జడతో, బుగ్గన కాటుక చుక్కతో, నుదుట కల్యాణ తిలకం దిద్దుకుని, చేతిలో కొబ్బరిబోండాంతో, మనసులో శతకోటి ఆశలతో కల్యాణ వేదికపైకి అడుగుపెట్టాను. ఇంటిముందున్న ఖాళీ జాగాలోనే పందిరి వేసి వేదికను నిర్మించారు. నాకు మేనమామలు లేకపోవడం నుంచి మామయ్య వరసయ్యేవాళ్ళందరూ కలిసి నన్ను బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి పందిరిలోకి తీసుకొచ్చారు. 

బంధువుల ఛలోక్తులు, కేరింతలు… అన్నింటి మధ్యనా, అవ్యక్తానుభూతి ఏదో మదినిండగా అతడికెదురుగా పీటమీద కూర్చున్నాను .  చిన్నక్క కొని ఇచ్చిన నీలం పట్టుచీర, మెడలో కొత్త నానుతాడుతో అమ్మ కుందనపుబొమ్మలా ఉంది. పక్కనే పట్టుపంచే- ధోవతి లో నాన్న వెలిగిపోతున్నారు. పురోహితుడు పెళ్ళి మంత్రాలు చదువుతున్నాడు. సుముహూర్తం సమీపించింది. మా ఇద్దరి చేతుల్లో ఉన్న జీలకర్ర –బెల్లాన్ని ఒకరి తలమీద ఒకరం ఉంచుకున్నాం.

మా నడుమ ఉన్న తెరసెల్లా తొలగిపోయింది. సిగ్గు-బిడియాల తాకిడికి కనురెప్పలు భారంగా వాలిపోతూండగా… అతికష్టం మీద మెల్లగా కళ్ళెత్తి బావను చూశాను. అంతే…నా గుండె లయతప్పింది.ఎదురుగా బావ…నేనిన్నాళ్ళుగా చూడాలని ఎంతగానో తపించిన నా ప్రాణ నాధుడు.అతడు జగన్మోహనాకారుడు.నారీజన హృదయాలను అమాంతం కొల్లగొట్టే సుందరుడు.నాలాగే బావ కూడా నాకేసి దొంగచూపులు చూస్తూ ఉంటాడని అనుకున్నాను. కాని, బావ తలవంచుకుని కూర్చున్నాడు. అతడి ముఖంలో కదలాడే భావాలు నాకు తెలియడంలేదు. ఆ తరువాత కూడా నన్ను తాకితే ఎక్కడ మైల పడిపోతాడో… అన్నట్లుగా కూర్చున్నాడు. 

పెళ్ళికూతురు తనా? నేనా! సందేహం కలిగింది. వఠ్ఠి పప్పుసుద్ద! అసలు పీటల మీద కూర్చున్న పెళ్ళికొడుకెలా ఉంటాడో నేను చాలా సినిమాల్లో చూశాను. పుస్తకాలలో కూడా చదివాను. ఏ కాస్త సందు దొరికినా వధువువైపు ఓరచూపులు చూస్తాడని, అవకాశమొస్తే చాలు ఆమెను తాకడానికి తహతహలాడతాడని నేనంతగానో విని ఉన్నాను. కాని, బావేమిటీ…ఇలా బుధ్ధావతారంలా? మా ఫ్రెండ్ సుబ్బలక్ష్మి పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆమె భర్త వాలకం చూసి మొద్దబ్బాయిలా ఉన్నాడంటూ మేము తెగ ఏడిపించేశాము.  ఆ తరువాత సుబ్బలక్ష్మి చెప్పింది… అతడు చూపులకి మాత్రమే మొద్దబ్బాయి… చేతల్లో యమా ఫాస్టనీ.

బావ కూడా అంతేనా! దొరికిపోతే అందరూ ఆటపట్టిస్తారేమోనన్న భయంతోనే నాకు దూరంగా మసలుకుంటున్నాడా? ఇలా ‘బుధ్ధావతారం’లా కనిపించి, ఆ పైన కవ్వించి, మా తొలిరాత్రి నాడు విజృంభిస్తాడా? ఆ ఊహకే ఒళ్ళు ఝల్లుమంది. నేనిలా ఆలోచనల్ దొంతరల నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతూండగానే బావ నా మెడలో మూడుముళ్ళూ వేసేశాడు. అలా… నా పెళ్ళి అత్యంత నాటకీయమైన పరిస్థితులలో జరిగిపోయింది.

-------------------------

“ఏమిటమ్మా… సావిత్రీ… నువ్వనేది?” నాన్న అడిగారు కాస్త అయోమయంగా.

“అవునన్నయ్యా… వెంటనే రమ్మనమని ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. అందుకే వాడు హడావుడిగా బయలుదేరాడు.’’ సంజాయిషీ చెప్పుకున్నట్లుగా అంది చిన్నత్తయ్య.పెళ్ళికి ముందు ఆమె స్వరంలో చిందులేసిన ఉత్సాహం ఇప్పుడు చప్పబడినట్లనిపించింది.

 “పెళ్లవ్వగానే ముక్తను మీ ఇంత గృహప్రవేశం చేయించి, అక్కడ సత్యనారాయణ వ్రతం, శుభకార్యం వగైరాలన్నీ జరిపించాక, మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చి, ఇక్కడకూడా ఆమూడునిద్రల తతంగం అయిందనిపించాక ముక్తను కాపురానికి దిగబెడదామనుకున్నాం కదమ్మా…’’ అనుకున్న కార్యక్రమంలో మళ్ళీ ఈ మార్పేమిటో అర్ధంకాని నాన్న వదనం వెలవెలబోయింది.

“నిజమే అన్నయ్యా… అందరం అలానే ప్లాన్ చేసుకున్నాం.కాని, ఉన్నట్లుండి రమ్మనమని వాళ్ళ మానేజర్ ఫోన్ చేశాడు మరి! వెళ్ళకపోతే వాడి ఉద్యోగానికే ఎసరొచ్చే ప్రమాదంఉంది. అసలే… రెసిషన్ పిరియడ్ కూడానూ!’’ చెప్పింది అత్తయ్య. ఆ సాఫ్ట్‌వేర్ రంగం గురించి అసలేమీ తెలియని నాన్న తెల్లముఖం వేశారు చెల్లెలి మాటలకి.

“ మరో పదిరోజులలో భాద్రపదమాసం వచ్చేస్తోంది. అంత ఆదరాబాదరా మనం అన్నీ జరిపించుకోవలసిన అవసరం ఏముంది? చక్కగా ఆశ్వయుజ మాసం రాగానే అనుకున్న ప్రకారం కార్యక్రమాలన్నీ జరిపించుకుందాం. ఈ లోపు రోహిత్ సెలవు పక్కాగా ఏర్పాటు చేసుకుంటాడు .’’ అత్తయ్యే అంది మళ్ళీ. ఈ విషయంలో అన్నీ అత్తయ్యే మాట్లాడుతోంది గాని, మామయ్య గాని, బావ కానీ, నోరు  మెదపడంలేదు. నాన్న నిస్సహాయంగా చూశారున్ అమ్మవైపు. అమ్మ ముఖం కూడా వాడిపోయింది. బామ్మ మనవడి వైపు కొరకొరా చూసింది.” అవునొరేయ్ …మీ మానేజర్ కి ఇల్లు-పెళ్ళి , పెళ్ళాం- పిల్లలు వగైరాలేమీ లేవట్రా?అలా ఫోన్లు చేసేస్తున్నాడూ… అయినా నాకు తెలియకడుగుతాను…పెళ్ళికి ఇన్ని రోజుల సెలవు కావాలని ముందే అడుక్కోరట్రా!?’’ దులిపేసింది.

బావ ఆమె వైపు చిరాగ్గా చూశాడు. అసలే… అతడికి మేమందరం కొత్త. ఉన్న కొద్దిపాటి పరిచయానికి తనని పట్టుకుని ఝాడించేస్తోంది… ఈముసల్ది అనుకుంటున్నాడేమో!

“మనం సడన్ గా ముహూర్తాలు పెట్టుకున్నాం కదమ్మా… ఆ ప్రోజెక్ట్ లేవో ముందునుంచీ ప్లాన్ చేసుకున్నవి. అసలు పెళ్ళికే సెలవిచ్చేది లేదని మానేజర్ భీష్మించుకుని కూర్చుంటే…ఈయన వెళ్ళి కాళ్ళ-వేళ్ళ పడి ఒప్పించుకొచ్చారు.అయినా … అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయా ఏమిటి!?’’ సమర్ధించుకొచ్చింది చిన్నత్తయ్య. బావేమన్నా మూగవాడా! అన్నింటికీ ఈవిడే సమాధానం చెబుతోంది. లేకపోతే… అతడింకా తల్లి చాటు బిడ్దేనా!? ఎంత తల్లిచాటు పిల్లాడైనా… తన జీవితం గురించిన చర్చ జరుగుతున్నప్పుడు కూడా… అలా బెల్లం కొట్టినరాయిలా…ఉలకక-పలకక నిలబడతాడేమిటి? నాన్న అలా నిస్త్రాణంగా కుర్చీకి చారబడిపోయారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది.ఇలా అనుకోని అవాంతరాలెదురైతే మాత్రం ఆశాభంగం కలుగుతుంది.

 “నెలరోజుల కాలం ఎంతలో తిరగాలి బావగారూ…అంతా సవ్యంగానే జరుగుతుంది. మీరు అనవసరంగా బెంగపడకండీ.’’ అనునయించారు మామయ్య. నాన్న ముఖంలోకి కాస్త వెలుగొచ్చింది. చేసేదేం లేనట్లుగా వాళ్ళని సాగనంపారు. వెళ్తున్నప్పుడు బావ నావైపు చూశాడు తొలిసారిగా. ఆ చూపుల్లో నా పట్ల ప్రేమ కనబడలేదు. ఆత్రం అంతకన్నా లేదు. ఎవరో… అపరిచిత వ్యక్తిని చూస్తున్నట్లుగా నిర్లిప్తంగా, అభావంగా… గతంలో నాకు- అతడికి పరిచయం లేనిమాట వాస్తవమే అయినా… ఇప్పుడు నేనతడికి అర్ధాంగిని. అతడి జీవితంలో పాలు పంచుకోబోతున్న సహధర్మచారిణిని. అటువంటి భార్యతో జరపబోయే ముద్దుముచ్చట్లకి ఆటంకం ఏర్పడబోతున్న బాధగాని, నిరాశ గాని అతడి ముఖంలో మచ్చుకైనా కనబడలేదు నాకు.అది నా చిత్తభ్రమా! లేకా…

అటుపైన ఆలోచించలేకపోయాను. వాళ్ళ కారు వెళ్ళేదాకా చూసి లోపలికి నడిచాం అందరం. కనీసం బావ నా ఫోన్ నంబరైనా అడిగి తీసుకోలేదని, మనసుకేదో వెలితిగా అనిపించింది. నా జీవితనౌక ఎటువైపు పయనించనుందో!

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్