Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

చివరి మజిలీ

chivari majili

"అబ్బా... అంత అద్భుతంగా ఉంటుందా ఆ ప్రదేశం?"  అని అడిగాను. "అవునురా, అదొక  వింత లోకంలా ఉంటుంది, ఈసారి నువ్వు కూడా నాతో రారా ప్లీజ్!!! అలాంటి దృశ్యాన్ని చూసావంటే ఆ చోటుకు మరల మరల వెళ్లకుండా ఉండలేవు "  అన్నాడు ప్రాణ మిత్రుడు ఉదయ్. చెబుతున్నపుడు వాడి కళ్ళలో ఆనందం, నేను వాడితో కూడా రావాలనే తపన గమనించాను, కానీ మిత్ర తో బ్రేక్ అప్ అయ్యి ఆ బాధలో ఉండడంతో ఖరాకండీగా రాను అని చెప్పేసాను. నేను లేకుండా అయిష్టంగానే వెళ్ళాడు ఆ లోకానికి, అక్కడినుండే తిరిగి రాలేని లోకానికి కూడా....

సంవత్సరంలో కేవలం కొన్నిరోజులు మాత్రమే రెండు కొండల మధ్యలోనుండి అలాంటి అద్భుతమయిన సూర్యోదయం చూడడానికి వీలవుతుందట, అలాంటి సూర్యోదయాన్ని చూడడానికి వెళ్లిన వీడి బ్రతుకు ఆ రాత్రి చీకటిలో కలిసిపోయింది. మరి ఎవరిని అడగను నా స్నేహితుడు ఏడని? వెలుగునా  లేక చీకటినా?

మిత్ర, మిత్రుడు .. ఇప్పుడు ఇద్దరూ లేరు. మిత్ర కి ఆస్థి, అంతస్తు రెండూ కావాలి,నాదగ్గర లేవు గనక వద్దని పోయింది. కానీ నా స్నేహితుడికి కేవలం నేను కావాలి, కేవలం నేనే కావాలి. మిత్ర అడిగింది ఎలాగు ఇవ్వలేను, కనీసం స్నేహితుని (చివరి)కోరిక అయినా  తీరుద్దామని సంవత్సరం ఓపిక పట్టాను, ఆరోజు రానేవచ్చింది. వెళుతూ వెళుతూ వాడు పంపిన ఫొటోస్, షేర్ చేసిన లొకేషన్ వివరాలు అన్నీ జాగ్రత్తగా మొబైల్ లో దాచుకున్నాను. వాడు ఎలా అయితే ప్రయాణం చేశాడో నేను కూడా అలాగే ప్రయాణం చేశాను, అచ్చం వాడిలానే. ఎక్కడెక్కడ ఫోటోలు దిగాడో, ఏ హోటల్ లో గది తీసుకున్నాడో,  ఏమేం తిన్నాడోతాగాడో అన్నీ అన్నీ అచ్చం తనలాగానే చేసుకుంటూ వెళ్ళాను, తాను గూగుల్ మ్యాప్స్ లో గీసిన చివరి గీత కదా అది, దానిని అనుసరిస్తూ తన దగ్గరకి వెళ్లిపోవాలని నా స్వార్ధం. మొదటి స్వార్ధం తనని నానుండి దూరం చేస్తే కనీసం ఈ రెండో స్వార్థం అయినా తనదగ్గరకి నన్ను తీసుకెళుతుందేమో అని ఆశ.

తనతో  ఆరోజు ట్రావెల్ చేసిన అదే  గైడ్ సాయంతో అడవిలో కొన్ని కిలోమీటర్లు నడుచుకంటూ చీకటి పడేసరికి చేరుకోవలసిన క్యాంపు కి చేరాను. స్నేహితుని ఆలోచనలతో గుండె బరువెక్కి భారంగా ఉంటే  కనీసం కలలో అయినా కనపడతాడేమో  అని నిద్రలోకి ప్రయాణం అయ్యాను. చిటిక వేసినంత సేపటిలోనే తెల్లవారిపోయింది. గైడ్ నా టెంట్ లోకి వచ్చి బుజం తట్టి లేపగా మెలుకున్నాను. "సాబ్ దేఖియే సుభేయ్ హానెవాలా హే, తయ్యార్ హాజయియే" అని వెళ్ళిపోయాడు. వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని గైడ్ తో పాటు మరికొంత దూరం చీకటిలో ప్రయాణం చేసి సూర్యోదయం కోసం వేచిచూసాను.  తూరుపువైపు చూస్తూ ఉండిపోయాను ఆ సూర్యుడు ఉదయించే వేళ నా మిత్రుడు ఉదయ్ కూడా ఉదయిస్తాడేమో అని ఆశతో. సూర్యుడు మెల్లగా  పైకి లేచాడు, నీలంగా ఉన్న ఆకాశం పసుపు,గోధుమ, బంగారు రంగులోకి మారింది . అడవిలో హుషారు పెరిగింది. అంతవరకు ఉన్న చీకటి క్రమంగా తొలగిపోయి అడవి హరిత వర్ణం పూసుకుంది. కళ్లెదుట ఆ అద్భుతాన్ని చూస్తూ  మిత్రుడు చెప్పిన ఆ వింత ఇదేనా, చెప్పడానికి భాషే చాలదే, అందుకేనా వర్ణించలేక ఇక్కడే ఉండిపోయాడు పాపం. స్వచ్చమయిన గాలి, బంగరు రంగులో సూర్య కాంతి, పక్షులు ఎగురుతూ కనువిందు చేస్తుండగా చూస్తున్న నాకు ఒకటే వెలితి, పక్కన నా ప్రియనేస్తం లేడే, పాపం వాడు కూడా ఇలాగే అనుకుని బాధపడి  ఉంటాడు.

"వద్దురా ఉదయ్ ఇక బాధపడకు, నేను నీ దగ్గరకి వచ్చాను, నువ్వు చెప్పిన ఈ చోటుకి వచ్చాను. నీ మాట సంవత్సరం తరువాత నిలబెట్టుకున్నాను,  కాస్త లేట్ అయ్యింది ఏమీ అనుకోకు. అయినా ఏమనుకుంటావ్ లే!! నువ్వు కూడా "లేటు" అయిపోయావుగా. ఒరేయ్ రారా ... నేను వచ్చాను రా ప్లీజ్ ఒక్కసారి కనపడు, కనీసం వినపడు. ఉదయ్...  ఉదయ్.. ఉదయ్.........." అని బిగ్గరగా రోదిస్తున్న నాకు దూరం నుండి ఎవరో పిలిచినట్లు అనిపించింది.

"కిర్రూ... కిర్రూ..." అని ... లీలగా వినపడుతున్న ఆ పిలువు వస్తున్న వైపు అడుగులు వేసాను. దగ్గరయ్యేకొద్దీ అర్ధం అయ్యింది అది కోకిల కిలకిలారావాలు అని. కానీ మనసు ఊరుకోదుగా "అది నీ పేరే, నీ స్నేహితుడు పిలుస్తున్నాడు" అని రెచ్చగొట్టింది. ఇంకా తీక్షణమయిన పొదల్లోకి వెళ్ళాను. అక్కడ ఒక చెట్టుకింద ఒక పర్సు లాంటిది కనపడింది. చూస్తే అది నా మిత్రుడిదే ... ఆశగా తీసి చూశాను. మూడే మూడు కాగితాలు ఉన్నాయి. ఒకటి వెళ్ళడానికి, ఇంకొకటి రాడానికి టికెట్, మూడోది ఒక లేఖ. మట్టి పట్టి ఉన్న దానిని బాగా దులిపి లేఖ తీసి చదివాను. 

"కాన్సర్ చివరి దశలో ఉన్న నాకు బహుశా ఇది ఆఖరి ప్రయాణం ఏమో!! మన ఇద్దరికీ రిజర్వేషన్ చేయించాను, కానీ నా బర్త్ మాత్రమే కంఫర్మ్ అయ్యి నీది వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. నిన్ను అడిగితే రాను అన్నావ్, అందుకే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. నా మాట మీద ఉన్న నమ్మకం నిన్ను ఇక్కడిదాకా రప్పిస్తుంది అని నమ్మకంతో ఈ పర్సు ఇక్కడ పడేస్తున్నాను. ఈ నిజం ఇక్కడే సమాధి అయిపోవాలి... సరేనా" అని కింద ఉదయ్ ఫ్రెండ్ అఫ్ వెంకట సాయి కిరణ్ అని సంతకం చేసి ఉంది. లేఖ చదివి తల ఎత్తి ఎదురుగా చూడగానే నా మిత్రుడు ఉదయ్ చెయ్యి చాచి పిలుస్తున్నాడు, అప్రయత్నంగానే నేను కూడా చెయ్యి చాపాను. ఇద్దరి చేతులు కలిసాయి. ఆ అనందానికి  అవధులు లేక, అది తట్టుకునే ఓపిక లేక నా గుండె అచేతనంగా మారిపోయింది. ఇంతలో వెనక ఏదో నేలను తాకిన శబ్దం, బహుశా అచేతనం అయిన శరీరం అనుకుంటా!!! 

మరిన్ని యువతరం
navodayam