Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

అన్యాయం

anyaayam

నగరంలోని ప్రముఖ జూనియర్ కళాశాలల్లో ఒకటైన ప్రజ్ఞా జూనియర్ కళాశాల ప్రాంగణం అంతా చాలా సందడిగా, కోలాహలంగా ఉంది, పిల్లలందరూ సాయంకాలం జరగబోతున్న కళా ప్రదర్శనలకు కాలేజి క్యాంపస్ ను ముస్తాబు చేస్తున్నారు, టీచర్లు వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు, ఈ సందడి అంతా ఆ కాలేజి స్థాపించి, మూడు సంవత్సరాలు పూర్తి అయ్యింది కాబట్టి. ఆ కళాశాల వార్షికోత్సవం ఒకరోజు కార్యక్రమం అంటే కానే కాదు, మొత్తం మూడు రోజులు చేస్తారు అక్కడ, మొదటి రోజు, విజ్ఞాన ప్రదర్శనలు, రెండవ రోజు, వ్యక్తిత్వ వికాస సదస్సు, మూడవ రోజు, పిల్లల ఆట పాటల ప్రదర్శనలు, ఇలా మూడు రోజుల పాటు చాలా సందడిగా చేస్తారు. ఈ వేడుకను తిలకించడానికి పిల్లలతో పాటు, వారి తల్లిదండ్రులు కూడా వస్తారు. ఆ నగరంలో ఎన్ని జూనియర్ కళాశాలలు ఉన్నా, ఒత్తిడి లేని విధానంతో బోధిస్తారు, కాబట్టే, పిల్లలు ఇక్కడ చేరడానికి ఆసక్తి చూపిస్తారు.

ప్రతీ సంవత్సరం అడ్మిషన్ టెస్టులో పాస్ అయిన వారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఆ ప్రవేశాలలో కూడా యాభై నిరుపేద విద్యార్థులకు ప్రతీ సంవత్సరం ఉచితంగా చదువు చెప్తారు. ఆ వార్షికోత్సవ పండగలో రెండు రోజులు చాలా సంతోషంగా ముగిసిపోయాయి, పిల్లలందరూ మూడవ రోజైన నాటక ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నారు, కారణం తమకెంతో ఇష్టమైన రామకృష్ణ అనే ఉపాధ్యాయుడు "గజేంద్ర మోక్షం" అనబడే నాటకం వెయ్యబోతున్నారు, కాలేజి స్థాపించిన రెండో సంవత్సరంలో అక్కడ జాయిన్ అయ్యాడు రామకృష్ణ, చదువులో గోల్డ్ మెడలిస్టు, పిన్న వయసులోనే పి.హెచ్.డి కూడా పూర్తి చేసాడు, ఎన్నో పెద్ద కంపెనీలు ఉద్యోగం ఆఫర్ చేసినా తనకు ఎంతో ఇష్టమైన టీచింగులో జాయిన్ అయ్యాడు. ప్రజ్ఞా జూనియర్ కాలేజిలో జాయిన అయిన కొన్ని నెలలలోనే విద్యార్థుల అభిమానాన్ని చూరగొన్నాడు, అ కాలేజిలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, రామకృష్ణ అభినయించే నాటకం ఉండాల్సిందే. పిల్లల సంతోషం కోసం తనే కొన్ని పాత్రలు సృష్టించి, వారిని కథలా మలిచి, పిల్లలతోనే నాటకం వేయించేవాడు, కేవలం ఆ కళాశాలలోనే కాదు, బయట ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా రామకృష్ణ అధ్వర్యంలో నాటకం వేసేవారు పిల్లలు, అలా పిల్లలకు మరింత దగ్గరయ్యాడు రామకృష్ణ. 

సమయం ఉదయం పదకొండు గంటలు, మూడవ రోజున నాటక ప్రదర్శనలకు కాలేజి ఇండోర్ ఆడిటోరియంను సిద్దం చేసారు, మైకులో కార్యక్రమం మరికొద్ది సేపట్లో మొదలవుతుంది అని అనౌన్సుమెంట్ ఇవ్వగానే, ఎక్కడెక్కడ ఉన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇండోర్ ఆడిటోరియంలోకి వచ్చి కూర్చున్నారు, ముందుగా పాత్రదారులు వచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు, గజేంద్రుడిగా ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న వర్ష ఏనుగు వేషంలో తనను పరిచయం చేసుకుంది, మకరుడిగా కాలేజీ అటెండర్ వాసు, ఇక గజేంద్రుడిని కాపాడిన శ్రీ మహావిష్ణువుగా రామకృష్ణ అని తమను తాము పరిచయం చేసుకున్నారు. నాటకానికి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ లో త్రికూట పర్వతంలా అనిపించే కర్టెన్లు తగిలించారు, పాత్రధారుల పరిచయాలు ముగిసాక, వినాయకుని శ్లోకంతో నాటకం మొదలుపెట్టారు, గజేంద్రుడిగా వేషం వేసుకున్న వర్ష, తన మందతో వచ్చి అక్కడి ఉద్యానవనంలో అటు ఇటు తిరుగుతోంది, అలా తిరుగుతూ, పరిగెత్తుతూ, అలసిపోయి, దగ్గరలో ఉన్న కొలనులోకి దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది, అయితే ఆహారం కోసం ఎదురుచూస్తున్న మకరుడు గజేంద్రుడిని తన నోటితో హఠాత్తుగా పట్టేసింది, తన శాయశక్తులా విడిపించుకోవడానికి ప్రయత్నించాడు గజేంద్రుడు, ఎంత ప్రయత్నం చేసినా, ఆ మకరుడి బారి నుండి విడిపించుకోవడం తన వలన కాలేదు, ప్రాణం విడవకుండా అక్కడే, ఆ కొలనులోనే అలా కూలబడిపోయింది,

ఆ సందర్భంలో తనకు కలిగిన నొప్పి వలన, తన నిస్సహాయత వలన, తన ప్రాణం, భవిష్యత్తు జీవితం అన్నీ నేటితో అంతం అవుతోంది అన్న బాధతో చిన్నగా కన్నీరు కారుస్తూ, సహాయం కోసం అర్థిస్తోంది, ప్రార్థిస్తోంది. అప్పుడే పెద్ద శబ్ధంతో, మేఘాలు తొలగించుకుంటూ, వచ్చారు శ్రీమహావిష్ణువు, శ్రీమహావిష్ణువు వేషంలో ఉన్న టీచర్ రామకృష్ణ అడుగుపెట్టగానే, ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది, ఆయన కనపడగానే, కొలనులో ఉన్న తామర పువ్వును భక్తితో అందించాడు గజేంద్రుడు, గజేంద్రుడి కన్నీటికి కారణం తెలుసుకున్న విష్ణువు, చేతిలో ఉన్న చక్రాయుధాన్ని మకరుడి మీదకు విసిరాడు, ఆ చక్రం మకరుడికి తగలగానే, పెద్దగా అరుస్తూ, గజేంద్రుడిని వదిలేసాడు. గజేంద్రుడి వేషంలో ఉన్న వర్ష, భక్తితో నమస్కారం చేస్తూ అక్కడే కూర్చుంది, మకరుడి వేషంలో ఉన్న అటెండర్ వాసు తన శరీరం నుంచి వస్తున్న రక్తం చూసుకుని ఆర్తనాదం చేస్తున్నాడు. శ్రీమహావిష్ణువు వేషంలో ఉన్న టీచర్ రామకృష్ణ, వర్షకు అభయం ఇస్తూ, "మకరా, ఈ సృష్ఠిలో ఉన్న ప్రతీ ఆడపిల్ల మనకు తల్లి లాంటిది, వారిని వేధించడం క్షమించరాని తప్పు, అందుకు తగిన శిక్ష నీకు పడాల్సిందే" అంటూ మరోసారి తన చేతిలో ఉన్న చక్రాయుధాన్ని ప్రయోగించాడు. నాటకానికి సంబంధం లేని డైలాగులు చెప్తూ ఉండడంతో, అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది, రామకృష్ణ అభినయం గూర్చి తెలిసిన వారు కూడా ఆశ్చర్యంతో అలాగే చూస్తున్నారు.

నాటకం సమాప్తం అన్నట్టు పాత్రధారులు రామకృష్ణ, వర్ష ప్రేక్షకులకు నమస్కారం చేశారు, అందరూ పాత్రల నుంచి బయటకి వచ్చారు కానీ, వాసు మాత్రం , అలాగే నొప్పితో కొట్టుమిట్టాడుతూ, ఊపిరి వదిలాడు, అతను చనిపోగానే, ఆడిటోరియం అంతా ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు, వారికి ఏం జరుగుతోందో అర్థం అవ్వడం లేదు. పోలిసులకు ఫోన్ చెయ్యమని తన తమ్ముడి వరసైన ఆనందుకు సైగ చేసాడు రామకృష్ణ, వాసు భార్యకు, కూతురు కరుణ దగ్గరికి తనను క్షమించమని వేడుకున్నాడు, అక్కడ రామకృష్ణకు తప్ప ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్నది ఎవ్వరికీ తెలియదు, ఓ పది నిమిషాల్లో, పోలీసులు వచ్చి రామకృష్ణను అరెస్టు చేసి, స్టేషనుకు తీసుకెళ్ళారు. అక్కడి వారికి అంతా వింతలా తోస్తోంది, అక్కడి సంఘటన నుంచి తేరుకున్న విద్యార్థులు మాత్రం, తమ టీచరును స్టేషనుకు తీసుకెళ్ళకుండా అడ్డుకున్నారు, అందరికీ రామకృష్ణనే సర్ది చెప్పాడు. రామకృష్ణ టీచరును పోలీసులు తీసుకెళ్ళగానే, కాలేజి ఫౌండర్ అండ్ ఛైర్మన్ గారు ముఖ్యమైన వారిని సమావేశపరచి, "మన కాలేజీలో ఇటువంటి సంఘటన జరుగుతుందని నేను ఊహించలేదు, మృదు స్వభావి, సౌమ్యుడు అయిన రామకృష్ణ హత్య చేస్తాడు అని నేను అనుకోలేదు. నేను ఈ హత్యను ఖండిస్తున్నాను, అతని కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ, అతని భార్యకు ఈ కాలేజీలోనే ఉద్యోగం ఇస్తున్నాను", అంటూ తన అభిప్రాయం చెప్పగా, సభ్యులందరూ సమ్మతించారు. అలాగే, రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించి కళాశాలకు సెలవు ఇచ్చారు.

ఇదిలా ఉండగా, రామకృష్ణను ఉంచిన పోలీసు స్టేషన్ బయట విద్యార్థులు అందరూ ధర్నా చేస్తున్నారు, తమకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్న రామకృష్ణను అరెస్టు కావడం, తమకు బాధగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. స్టేషన్ బయట ఉన్న కానిస్టేబుళ్ళకు ఆ విద్యార్థులను ఆపడం చాలా కష్టంగా ఉంది, పరిస్థితి అదుపు తప్పుతోంది, పిల్లలకు సర్ది చెప్పడానికి బయటకు వచ్చాడు రామకృష్ణ, "ప్రియమైన నా విద్యార్థులారా, నేను హత్య చేసాను అన్నది వాస్తవం, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న నేను శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, దయచేసి శాంతించి మీ ఇళ్ళకు వెళ్ళిపోండి, బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు తెచ్చుకుని, సమాజానికి ఉపయోగపడండి, ఇక శెలవు", అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. రామకృష్ణ మాటలతో శాంతించిన విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోగా, ఓ పది మంది మాత్రం అక్కడే ఉండిపోయారు. వారే చివరి సంవత్సరం ఇంటర్ పిల్లలు, అందులో వర్ష కూడా ఉంది, తనకు మాత్రమే వాసు ఎందుకు చచ్చింది చూచాయగా తెలుసు. తన బాబాయి వర్మ లాయర్ కావడంతో, కానిస్టేబుల్ ద్వారా ఫోన్ చేసి రమ్మని పిలిచింది. వచ్చీ రాగానే రామకృష్ణ స్వభావం ఎలాంటిదో పిల్లల ద్వారా తెలుసుకున్నాడు వర్మ, స్వభావం మంచిదే అన్న అభిప్రాయం కలగడంతో కేసును టేకప్ చేయడానికి ఒప్పుకున్నాడు వర్ష బాబాయి వర్మ, కానీ తన కేసును తానే వాదించుకుంటాను అని, ఏదైనా సహాయం అవసరమైతే తప్పక అడుగుతానని సున్నితంగా తిరస్కరించాడు రామకృష్ణ. రామకృష్ణకు డాక్టర్ చెకప్ పూర్తి అయిన తరువాత కోర్టులో ప్రొడ్యూస్ చేసారు, ఆరోజు కోర్టు హాల్ మొత్తం పిల్లలతోనూ, వారి తల్లిదండ్రులతోనూ నిండిపోయింది. అందరిలోనూ ఒకటే సందేహం, ఇప్పటివరకు తన ఉద్యోగ జీవితం ఒక్కసారి కూడా ఏ ఆడపిల్లతోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు, ఏ పిల్లవాడి మీద కూడా చెయ్యి వెయ్యలేదు, అలాంటి ఒక్క మచ్చ కూడా లేని రామకృష్ణ హత్య ఎలా చేశాడా అని?.

జడ్జి గారు హాలులోనికి ప్రవేశించారు, అందరూ లేచి జడ్జిగారికి నమస్కరించిన తరువాత వాదనలు మొదలయ్యాయి, ముందుగా వాసు భార్య తరపు లాయరైన విశ్వ మొదలుపెట్టాడు,

*విశ్వ:- యువరానర్, నా క్లయింటు భర్త అయిన వాసును ఈ బోనులో ఉన్న ముద్దాయి రామకృష్ణ అన్యాయంగా చంపాడు, రామకృష్ణ వాసును చంపుతుండగా ఆడిటోరియం మొత్తం చూసింది యువరానర్. మీరు అనుమతిస్తే సాక్షులను ప్రవేశపెడతాను....

*జడ్జిగారు:-సాక్షులను ప్రవేశపెట్టడానికి అనుమతిస్తున్నాను, కాలేజీలో పనిచేస్తున్న స్వీపర్ భీముడు వచ్చి వినయంగా బోనులో నిలబడ్డాడు.....

*విశ్వ:- భీముడూ, ఆరోజు నువ్వేమి చూసావో కోర్టువారికి చెప్పు....

*భీముడు:- నమస్కారమండి, ఇదిగో రామకృష్ణ సారు నాటకం మధ్యలోనే వాసును చంపడం నేను కళ్ళారా చూసానండి, నేనే కాదండీ, అక్కడున్న ప్రతీ ఒక్కరు చూసారండీ....

*రామకృష్ణ:-జడ్జి గారు, ఆ హత్య నేనే చేసాను అని అంగీకరిస్తున్నాను, పూర్తిగా స్పృహలో ఉండే నేను హత్యను చేసాను, నాకు ఏ శిక్షను విదించినా నేను ఆనందంతో స్వీకరిస్తాను

*జడ్జిగారు:- నేరం రుజువు అయినందున ముద్దాయికి ఐదేళ్ళు కఠిన కారాగార శిక్షను విధిస్తున్నాను, కానీ.......అంటూ రామకృష్ణ వైపుకు తిరిగి, "రామూ, నేను మీ కాలేజిలో జరిగిన ఓ సదస్సుకు న్యాయనిర్ణేతగా వచ్చాను, అప్పుడే మీ పనితనం విన్నాను, చూశాను కూడా, మీరు ఆ కాలేజీలో టీచరుగా బాద్యతలు తీసుకున్నఫ్ఫటి నుంచి పిల్లలు క్రమశిక్షణగా ఉన్నారు, ఇలాంటి స్వభావం ఉన్న మీరు ఈ హత్య ఎందుకు చేసారో కారణం వివరించగలరా??" అని అడిగారు.

*రామకృష్ణ:- తప్పకుండా వివరిస్తాను జడ్జిగారు, నేను వాసును హత్య చేయడానికి కారణం లైంగిక వేధింపులు, నా పిల్లలను వాసు లైంగికంగా వేధించాడు, నేను కాలేజికి వచ్చిన కొత్తలో కొంతమంది పిల్లలు ముభావంగా ఉండడం గమనించాను, ఎప్పుడూ బాధగా, ఏదో ఆలోచిస్తూ, అప్పుడప్పుడూ ఏడుస్తూ ఉండే పిల్లలను చూడలేకపోయాను. వాసు గురించి తెలుసుకున్న నేను యాజమాన్యానికి ఫిర్యాదు చెయ్యగా, తనకు తెలిసిన వారు ఉండడంతో విషయం బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు, ఫిర్యాదు తరువాత ఆడపిల్లలకు వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి, తనకు కొంతమంది టీచర్లు తెలుసునని, నేను చెప్పినట్టు వినకుంటే ఫెయిల్ చేస్తానని, ఇలా రకరకాలుగా వేధించి, మానసికంగా ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు, ఇక్కడ ఎవ్వరికీ తెలియని విషయం, వాసు ఇంతకుముందు పనిచేసిన కాలేజీలో కూడా ఇలాగే వేధించగా, వారు దేహశుద్ధి చేసి, పొలీసులకు అప్పగించారు, మూడేళ్ళు శిక్షను అనుభవించి బయటకువచ్చిన వాసు ఏ మాత్రం మారలేదు. తనకు తెలిసిన మనుషుల ద్వారా ఇక్కడ జాయిన్ అయిన వాసు తన పాత నీచపు బుద్ధితో పిల్లలను ఏడిపిస్తూ, వేధిస్తూ రాక్షస ఆనందం పొందేవాడు. వాడి ఆగడాలు అలానే కొనసాగితే, వికసించి సమాజానికి ఎంతగానో ఉపయోగపడవలసిన పిల్లలను తన నీచపు బుద్ధితో చిదిమేస్తాడు. నేను వాసు బుద్ధిని మార్చడానికి ప్రయత్నించాను, కానీ అతని బుద్ధి మారలేదు, అందుకే యువరానర్ నా జీవితం పోయినా ఫరవాలేదు, నా పిల్లల జీవితమే నాకు ముఖ్యమని ఈ హత్య చేయవలసి వచ్చింది. అంతే కాదు యువరానర్, వాసు కూతురు కరుణ చదువుకయ్యే ఖర్చు నేనే ఆనందంగా భరిస్తాను అని కోర్టువారికి హామీనిస్తున్నాను. 

టీచర్ రామకృష్ణ మాటలు విన్న కోర్టు హాల్ మొత్త నిశబ్దంగా ఉండిపోయింది, తమ పిల్లల భవిష్యత్తు కోసం రామకృష్ణ జీవితాన్ని తాకట్టు పెట్టాడని అర్థమైంది పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు.

మరిన్ని యువతరం
parivartana