Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
maargadarsakudu

ఈ సంచికలో >> యువతరం >>

చిన్న ఆశ

chinni aasa

ఆఫీసుకు వచ్చి నా కేబిన్ లో కూర్చొన్నాను. ఏసీ నుండి చల్ల గాలి తాకుతూ ఉంది. అయినా నా మనసు ఆందోళనగానే ఉంది. ఆఫీసులో పని ఒత్తిడి. బ్రాంచ్ మేనేజర్ హోదాలో ప్రతిరోజూ ఎన్నో సవాళ్లు. వీటన్నిటికీ అలవాటు పడ్డాను కానీ, రాత్రి ఇంట్లో  జరిగిన సంఘటన నా మనసును కలచి వేస్తూ ఉంది. “సార్! కాఫీ!” కాఫీ కప్పు టేబుల్ పై పెట్టి వెళ్ళిపోయాడు సుబ్బారావు.కాఫీ కప్పు అందుకొన్నా! వేడి కాఫీ నుండి పొగలు  సుడులు తిరుగుతూ పైకి లేస్తోంది.  నా మనసు  రాత్రి జరిగిన సంఘటన చుట్టూ తిరుగుతూ ఉంది.నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడిపై ఎన్నో ఆశలు పెట్టుకొన్నా. వాడి చదువుకై ఎంతో ఖర్చును వెచ్చిస్తూ ఉన్నా. వాడికి  మంచి కాలేజిలో ఇంజనీరింగు సీటు రాలేదు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోమని చెప్పా. డొనేషన్ కట్టి చేర్పించమని అడిగాడు. వాడు  అడిగినట్టే వాడికి నచ్చిన ఒక పేరు మోసిన కాలేజ్ లో లక్షలు ఖర్చు పెట్టి వాడికి సీటు కొనిచ్చా. నిన్ననే వాడి మొదటి సంవత్సరం పరీక్షల పలితాలు వచ్చాయి. నాలుగు సబ్జెట్లు తప్పాడు. నిలదీసి అడిగితే కాలేజీ నచ్చలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఈ మద్య వాడ్ని గమనిస్తూనే ఉన్నా. చెడు స్నేహాలవైపు, చెడు అలవాట్ల వైపు అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. వాడు చక్కగా చదువుకోక పొతే జీవితంలో ఎలా స్థిరపడగలడు? భవిష్యత్తును ఎలా నిర్మించుకోగలడు? నలుగురిలో గౌరవం ఎలా పొందగలడు?? ఆలోచిస్తూ ఉండగానే మా ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్ వచ్చాడు. ఈ రోజు కలవాల్సిన బాకీదారుల లిస్టు నా ముందు ఉంచాడు.“మనం ఈ రోజు వెళ్ళాల్సింది  కొత్త గూడెం వైపే కదా!”“అవును సార్!”“మరైతే ఆ చిరు రైతు అమాసయ్య పేరు ఈ  లిస్టు లో లేదు?” ఈ రోజు కలవాల్సిన బాకీదారుల లిస్టు చూస్తూ అడిగాను మా ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్ ను.“అతని ఇంటికి మరోసారి వెళ్దాం సార్! ఇప్పుడు వద్దు!” కాస్త ముక్తసరిగా చెప్పాడు ప్రసాద్.

“క్రితంసారి వెళ్ళినప్పుడు పొలాన్ని జప్తు చేస్తామని వాళ్లకు చెప్పాము కదా! అయినా వాళ్ళు ఇప్పటివరకు లోను కట్టనేలేదు. దెట్ రికవరీ డాక్యుమెంట్లు తీసుకో. వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని పొలాన్ని జప్తు చేద్దాం.” మేనేజర్ హోదాలో దృడంగా పలికాను నేను.
“మనం వెళ్ళిన సరిగ్గా రెండు రోజులకు ఆ అమాసయ్య చనిపోయాడు సార్. ఇలాంటి పరిస్థితిలో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం బాగోదు. “ తగ్గిన స్వరంతో చెప్పాడు ప్రసాద్.“చనిపోయాడా? ఎలా జరిగింది??” అతని చనిపోయాడన్న బాధ కన్నా, అప్పు కట్టకుండా చనిపోయాడన్న బాధే నా ప్రశ్నలో ఎక్కువగా ప్రస్పుటించింది.“కరెంట్ షాక్ తో చనిపోయాడు. కొందరు ఆక్సిడెంట్ అంటున్నారు. మరికొందరు సూసైడ్ అంటున్నారు.”
“సూసైడా? ఎందుకు??”  అప్రయత్నంగా కంగారు ప్రదర్శించాను.“అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తు చేస్తారని, పొలాన్ని జప్తు చేస్తే పరువు పోతుందని. పరువు కన్నా ముందే ప్రాణం పోవడం మంచిదని అతను కరెంటును ముట్టుకొని ఆత్మహత్య చేసుకొన్నట్టు కొందరు అంటున్నారు.”

“రికవరీకు రేపు వెళ్దాం!” మనసులో మొదలైన అలజడి పైకి కనబడకుండా చెప్పాను. ప్రసాద్ నా కేబిన్ నుండి వెళ్ళిపోయాడు.

*********

అమాసయ్య చనిపోయాడన్న విషయం నాకు బాధను, అసౌకర్యాన్ని కలిగించింది. మనసు మూలల్లో తప్పు చేసానన్న భావనను మొలకెత్తించింది. కొందరు బ్యాంకు రుణాలను కావాలనే ఎగ్గొడుతున్నారు. వారిని చూసి మిగిలిన వారు  కూడా అప్పు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చే రుణమాఫీ హామీల వలన కూడా కొందరు  రుణాలు చెల్లించడం లేదు. ఇక మా పైఅధికారుల సంగతి చెప్పనక్కర్లేదు. విరివిగా రుణాలు ఇవ్వమని వారే మాకు టార్గెట్లు నిర్దేసిస్తారు. రుణాలు ఇచ్చాక వసూళ్లు చెయ్యమని వారే మాపై ఒత్తిడి పెంచుతారు. అమాసయ్య ప్రమాదవశాత్తు చనిపోయి ఉండవచ్చు. లేక అప్పు కట్టమని నేను చేసిన ఒత్తిడి తట్టుకోలేక  ఆత్మహత్య చేసుకొనికూడా చనిపోయి ఉండవచ్చు. అతడు నా కారణంగా చనిపోయాడేమో అనే  ఆలోచన నన్ను నిలువునా దహించి వేస్తూ ఉంది. నా ఆలోచనలు క్రమంగా గతం లోకి ప్రయాణించాయి. 

*********

సరిగ్గా నెల రోజుల క్రితం అప్పు వసూళ్ళలో భాగంగా కొత్త గూడెం దగ్గరలోని అమాసయ్య అనే సన్నకారు రైతును కలిసాను. మూడేళ్ళ క్రితం క్రాప్ లోన్ పేరుతో బ్యాంకు నుండి డెబ్బై వేలరూపాయలు తీసుకొన్నాడు అతను. ఒక్క రూపాయి తిరిగి చెల్లించలేదు. అదే విషయాన్ని గట్టిగా అడిగాను అతన్ని. “ఆ సారి పంట చేతికి రాగానే ఎంతో కొంత అప్పు కడతాను సార్!” వినమ్రంగానే అభ్యర్ధించాడు అతడు.
“ఈ సారి పంట చేతికి రావడానికి మరో ఆర్నెల్లు పడుతుంది. అప్పటిదాకా మా పై అధికారులకు ఏం చెప్పమంటావ్?” నిలదీసాను నేను.
“ఎలాగోలా పెద్ద మనసు చేసుకోండి సార్! మరికొంత సమయం ఇవ్వండి!” బతిమాలాడు అతను.

“క్రితం సారి పంటరాబడి బ్యాంకుకు కట్టి ఉండచ్చు కదా! అప్పు తీసుకొనేటప్పుడు ఉండే శ్రద్ద తిరిగి జమచేయాల్సి వచ్చినప్పుడు ఉండదు మీకు.” మాటలో వాడి పెంచాను నేను. “అలా అనకండి దొరా! మా అబ్బాయిని ఇంజనీరింగు చేర్పించాను. పొలంలో వచ్చే ఆదాయం, పశువుల నుండి వచ్చే ఆదాయం  సరిపోక నేను, మా ఇంటి ఆడది ఇద్దరం కూలికి కూడా పోతా ఉన్నాము. మా కష్టం అంతా వాడి చదువుకే తగలేస్తా ఉన్నాము. అందుకే బ్యాంకులో లోను కట్టడానికి కష్టమైపోతా ఉంది. ఈ సారి పంట రాగానే అప్పు తీర్చేస్తా.” అభ్యర్ధించాడు అతడు.
“అసలు నీకు అప్పుకట్టే ఉద్దేశ్యమే లేదు. ఉంటే నీ కొడుకును ఏ డిగ్రీలోనో చేర్పించే వాడివి. అయినా నీ కొడుకు ఇంజనీరింగు చదివితే నాకేంటి? వీధులమ్మిట అడుక్కొంటే నాకేంటి? అప్పు ఎగ్గొట్టడానికి  ఏవేవో కాకమ్మ కబుర్లు చెబుతున్నావు నువ్వు!”  “మేము పేద వాళ్ళమే కానీ, నీతి తక్కువ వాళ్లము కాదు సార్! ఈ సారి పంట చేతికి రాగానే అప్పు కడుతాం.” అప్పటిదాకా మౌనంగా ఉన్న అమాసయ్య భార్య నన్ను సూటిగా చూస్తూ చెప్పింది. ఆమె వైపు చూసాను. ముఖానికి నిండుగా పసుపు పూసుకొని, నుదిటిన రూపాయి బిళ్ళంత కుంకుమ పెట్టుకొని, తలనిండా చేమంతులు పెట్టుకొని పల్లెటూరి ఇల్లాలికి ప్రాతినిధ్యం వహించే సగటు స్త్రీ పాత్రను ధరించినట్టు అనిపించింది ఆమె రూపం. 
“నేను మాట్లడతావున్నాను కదా! నువ్వు నోరు మూసుకొని లోనికెల్లు.” తన భార్యను గద్దించాడు అమాసయ్య.

“అయ్యా! దాని మాటలు పట్టించుకోకండి. అది ఒట్టి ముక్కుసూటి మడిసి. ఇంతకాలం ఎలాగూ ఆగారు. మరో ఆరు మాసాలు గడువు ఇవ్వండి.” కాళ్ళపై పడినంత పనిచేసాడు అమాసయ్య. “నీకు ఒక్క నెల టైం ఇస్తున్నాం. ఈ లోగా కట్టలేదంటే నీ పొలాన్ని జప్తు చేస్తాం. “ కఠినంగా   చెప్పి వచ్చేసాను నేను. నా వెంటే మా ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్ కూడా వచ్చేసాడు.

******

“సార్! ధనుంజయ వర్మగారు వస్తున్నారు!” పరిగెత్తుకొంటూ నా క్యాబిన్ లోకి వచ్చి చెప్పాడు సుబ్బారావ్.  ఆలోచనల నుండి తేరుకొని నా కేబిన్ కు ఉన్న గాజు అద్దం నుండి బయటకు చూసాను. ధనుంజయ వర్మ వస్తోంటే బ్యాంకు సిబ్బంది తో పాటు, బ్యాంకు కు వచ్చిన కస్టమర్లు సైతం అతన్ని చూసి గౌరవ సూచకంగా నిల్చుంటూ ఉన్నారు. కొందరు పలకరిస్తూ ఉన్నారు. మరికొందరు అతని దృష్టి లో పడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. బ్రాండెడ్ బట్టలు, ష్యూ , మెడలో బరువైన బంగారు గొలుసు, చేతికి డైమండ్స్ బ్రాస్లైట్. అతని లాప్టాప్ , సెల్ ఫోన్స్ మోయ్యడానికి పి.ఎ, అతని కార్ నడిపే డ్రైవర్, అతని వెంట ఉన్నారు. వర్మ ప్రయివేట్ ట్రాన్స్ పోర్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ అతను. చాలా మంది పార్టనర్స్ ఉన్న వారి వ్యాపారానికి ఇతనే పెద్ద ఇన్వెస్టర్, మేనేజింగ్ డైరెక్టర్. వర్మ కంపెనీ వాళ్ళు ఐదు సంవత్సరాల క్రితం మా బ్యాంకు నుండి కోటి రూపాయలు అప్పు తీసుకొన్నారు. మొదట్లో కొంత కాలం వాయిదాలు చెల్లించి ఆ తరువాత ఆపేశారు. సుమారు ఆరు నెలలనుండి వర్మ గారికి ఫోన్ చేసి వాయిదాలు చెల్లించమని చెప్పాను. రెండు మూడు సార్లు వారిని స్వయంగా కలసి అభ్యర్ధించాను కూడా. వారు నా మాటలు పెడచెవిన పెట్టారు. పైఅధికారుల ఒత్తిడి వల్ల నోటీసు పంపక తప్పలేదు. బహుశా ఆ విషయం గూర్చి మాట్లాడడానికి వారు  స్వయంగా  వచ్చారేమో.“నమస్కారం వర్మ గారు! రండి, కూర్చోండి!” నేను లేచి, వారికి ఎదురెళ్ళి  మరీ నా కేబిన్ లోకి ఆహ్వానించాను.
సుబ్బారావు పరిగెత్తుకొంటూ వెళ్లి కాఫీ తీసుకొని వచ్చాడు. కుశల ప్రశ్నలు, షేర్ మార్కెట్, రాజకీయాలపై కొంత సేపు మా  మధ్య చర్చ జరిగింది. ఆ తరువాత నెమ్మదిగా అసలు విషయం లోకి వెళ్లాం. పై అధికారుల ఒత్తిడి వల్ల నోటీసు పంపాల్సి వచ్చిందని, తప్పుగా భావించ వద్దని ప్రాధేయపడ్డాను వారిని. వారు మహా విష్ణువు లాగా నా మాటలు నవ్వుతూ విన్నారు. బ్యాంకులు ఉన్నది తమ బోటి వారికి అప్పు ఇవ్వడానికే అన్నట్టు మాట్లాడారు. అప్పు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ల గురించి గొప్పగా ముచ్చటించారు నాతో.
“బిజినస్ సరిగా నడవడం లేదు. కంపెనీ నష్టాల్లో ఉంది. కొత్త బ్రాంచిలు మార్కెట్ లో ఇంకా నిలదోక్కులేదు. ఇప్పట్లో అప్పు చెల్లించడం వీలుపడదు. మా లోన్ రీ షెడ్యూల్ చేసుకోండి. వచ్చే ఫైనాన్సియల్ ఇయర్ లో చూద్దాం. మీ పై అధికారులతో నేను మాట్లాడుతాను. మీకు పైఅధికారుల ఒత్తిడి లేకుండా చూసుకొంటాను.” అంటూ నవ్వుతూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.  నేను నిస్సహాయంగా అతడ్నే చూస్తూ ఉండిపోయాను. వేలల్లో అప్పులు తీసుకొన్న పెదవారిపై చర్యలు తీసుకోగలిగిన మేము, కోట్లలో  అప్పులు తీసుకొన్న ఇలాంటి ఖరీదైన  పారిశ్రామికవేత్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేని నిస్సహాయులం. వీరికి సమాజంలో ఉన్న విలువ, సంపద, పలుకబడి, రాజకీయనాయకుల అండదండలు మా చేతులకు సంకెళ్ళు వేస్తున్నాయి.  ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును లోన్ల రూపంలో తీసుకొని వారి వ్యక్తిగత ఆస్తులు పెంచుకొంటూ సమాజంలో హోదాను, గౌరవాన్ని అనుభవించే ధనుంజయ వర్మ లాంటి పెద్ద మనుషులను ఏమీ చెయ్యలేని మేము అమాసయ్య లాంటి అల్పులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడడం లేదు.  ఆలోచిస్తూ ఉంటే తల తిరిగినట్టు అనిపించింది. కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకోన్నాను. నా ఆలోచనలు అమాసయ్య కుటుంభం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇంటి పెద్ద అకస్మాత్తుగా చనిపోతే ఆ కుటుంభం ఎంతటి క్షోభను అనుభవిస్తుందో నేను ఊహించగలను.

*********

“సార్! అమాసయ్య భార్య వచ్చింది. లోన్ కట్టడానికి!”  ప్రసాద్ నా కేబిన్ లోకి వచ్చి చెప్పాడు. కళ్ళు తెరిచాను. కేబిన్ కు ఉన్న గాజు అద్దం నుండి బయటకు చూసాను. లోన్ కట్టి స్లిప్ చేతికి తీసుకొంటూ కనబడింది ఆమె. మనిషి బక్క చిక్కి పోయి ఉంది. మునుపటిలా ముఖానికి పసుపు, నుదిట కుంకుమ లేక బోసిగా కనబడింది. ఆమె కళ్ళలో శూన్యం, చేతల్లో నిర్లిప్తత కనబడుతోంది. ఆమెను చూడగానే బాధనిపించింది. కష్టపడి  సంపాయించే భర్త చనిపోయాడు.  మరి, లోన్ కట్టడానికి డబ్బులు ఎలా సర్దుకొందో నన్న సందేహమూ వచ్చింది నాకు. 

“ఆమెను నా కేబిన్ కు పిలవండి!” ప్రసాద్ కు చెప్పాను. ప్రసాద్ ఆమెను నా కేబిన్ కు పంపి తన సీట్ కు వెళ్ళిపోయాడు. “నమస్కారం సార్!” ఒక ఇరవైయేళ్ళ యువకుడిని వెంటబెట్టుకొని తడబడుతూ వచ్చింది ఆమె. బహుసా అతడు వాళ్ళ అబ్బాయి అనుకొంటా. మా అబ్బాయి వయసు ఉంటుంది వాడికి. “నమస్తే అమ్మా! మీరు?” “లోన్ కట్టడానికి వచ్చాము సార్!”

“అమాసయ్య చనిపోయాడని తెలిసింది. మరి.................!”నా ప్రశ్న పూర్తి కాలేదు. కానీ, తన కళ్ళ నుండి కన్నీటి సంద్రం పొంగింది.
“మా నాన్న గారు చనిపోవడం తో, ఆక్సిడెంటల్ డెత్ క్రింద వారి పేరు మీద ఉండే   ఇన్సూరెన్స్ డబ్బులు చేతికి వచ్చాయి. ఆ డబ్బుతో అప్పు కట్టేసాం సార్!”

నా మనసును చదివిన వాడిలా వాళ్ళ అబ్బాయి కల్పించుకొని నాకు చెప్పాడు. 

“నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావు కదా!” ఆ కుర్రాడి వైపు లాలనగా చూస్తూ అడిగాను. అతడు మౌనంగా తల దించుకొన్నాడు. “వాళ్ళ నాన్న చనిపోవడంతో, వాడు కాలేజీ మానేసాడు సార్! పొలం పనులకు వెళ్తున్నాడు. వాడ్ని చదివించే శక్తి నా ఒక్కదానికి ఎక్కడిది?” కన్నీటికి అడ్డు కట్ట వేస్తూ చెప్పింది ఆవిడ. నేను మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాను.

“మా పొలం కాగితాలు ఇస్తే వెళ్లిపోతాము సార్!” చేతులు జోడించింది. “నీ పేరేమిటి?” ఆ అబ్బాయిని చూస్తూ అడిగాను.“లోకేష్ సార్!”
“ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఎంత పర్సంట్ వచ్చింది?” “డిస్టంక్షణ్ వచ్చింది  సార్!” “మీ పొలాన్ని తాకట్టు పెట్టుకొని మీ అబ్బాయికి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాను. అతడ్ని చదివించండి.” ఒనుకుతున్న స్వరంతో చిన్నగా చెప్పాను. వాడి కళ్ళలో వెలుగు కనబడింది. కానీ ఆమె కళ్ళలో భయం కనబడింది. “ఒకసారి అప్పు తీసుకొని నా పెనిమిటిని పోగొట్టుకొన్నాను. మరోసారి అప్పు తీసుకొని .............” ఆమె పూర్తి చెయ్యలేక పోయింది.

“మీ అబ్బాయికి సరస్వతీదేవి దేవి కటాక్షం ఉంది. చదివిస్తే వృద్దిలోకి వస్తాడు. మీ లోన్ కు నేను పూచీ వహిస్తాను. లోన్ తీసుకొని వాడ్ని చదివించండి.” ఈ సారి స్థిరంగా చెప్పాను నేను. ఆమె కళ్ళలో భవిష్యత్తు పై ఆశ కనబడింది. వాడి కళ్ళలో ఆనందం కనబడింది. 
నేను వారికి చేస్తున్న ఈ చిన్న సాయం అమాసయ్య ఆత్మకు శాంతిని, అమాసయ్య భార్యకు ధైర్యాన్ని, అమాసయ్య కొడుకుకు భరోసాను, నా మనసుకు ప్రసాంతను కలిగిస్తుందని చిన్న ఆశ.

మరిన్ని యువతరం