Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
vaidyanath dham

ఈ సంచికలో >> శీర్షికలు >>

పుస్తకసమీక్ష - మంజు

book review
 ఓ గుప్పెడు గుండె సవ్వడే ఈ మనసాక్షరాలు...!! " " పగిలిన అద్దాన్ని కూడా అతికించే సాంకేతికతను అన్వేషిస్తున్న మనిషి.. పగిలిన తన గుండెను అతికించుకునే నైపుణ్యతను కనుగొనలేకపోతున్నాడెందుకో!? "ఈ మాటలు అక్షర సత్యం. గుప్పెడు గుండె సవ్వడులకు మల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీ గారి ముందుమాటలో చివరి మాట ఇది. ఇరు మనసుల సవ్వడులు అందించిన మానసాక్షర భావాలివి. గుండె  గాయాలను మాన్పుకోవడానికి, తనను తాను ఓదార్చుకోవడానికి అక్షరాన్ని ఊతంగా అందుకున్న రెండు గుండెల చప్పుడు, జంట కవిత్వమైన  ఈ " గుప్పెడు గుండె సవ్వడులు " మంజువాణి మనోభావాలు లో ఓ గుండె సవ్వడి సరస్వతీ మానసపుత్రిక ఎందరికో సుపరిచితురాలు, అలవోకగా అక్షరాలు వెదజల్లి, అందరి మనసులను ఆకట్టుకునే భావాల సంపద మెండుగా కలిగిన వాణి వెంకట్ గారిది వినండి.

 నా కూతురుగా నిన్ను కాదు

 నీ తండ్రిగా నన్ను గుర్తించాలని " ఆరాటపడిన ఓ తండ్రి ప్రేమను, కూతురికి పంచిన ఆత్మీయతను, ఓటమికి వెరవని మనోధైర్యాన్ని, నడకను, నడతను నేర్పిన నాన్న దూరమైనా ఆయన నేర్పిన అక్షరాలే తనకు ఆసరా అంటూ " నిన్ను ప్రత్యేకంగా స్మరించడం కాదు నాన్నా నా కలం కదలికలన్నీ నీవు నడిపిస్తున్న దారులే..! !" అని చెప్పడంలో నాన్నంటే తనకు ఎంత ఆరాద్యమో తెలుస్తుంది నాన్న కవిత చదువుతుంటే. అమ్మ ఎంత రాసినా ఇంకా మిగిలున్న కావ్యమైతే నాన్న బాధ్యతల పర్వంలో తలమునకలౌతున్నా కూడా అక్షయపాత్రలా మమకారాన్ని పంచే ప్రేమలాలసుడు. చేతికందిన బిడ్డ దూరమైతే ఆ తల్లి వేదన వర్ణింప శక్యం కాదు.

 " పొత్తిళ్ళు ఖాళీ అయ్యాక
 కన్నీళ్ళ కొక్కానికి వేలాడుతూ
 వెక్కిరించే ఒడి
 ఓడిన ఛాయలకు
జ్ఞాపకాల జాడలకు
ఋజువుకు

ఋణంగా మిగిలిపోయింది "  హృదయవిదారక వేదనకు అక్షర సాక్ష్యంగా ఊహకు ఊపిరాగాక కవిత నిలుస్తుంది. సంఘర్షణల అవశేషాలను స్వప్నాల వేటలో వ్యామొహాలు వెదుకుతూ పోవడమే ఈ అనంత జీవనయాత్ర అంటూ తుదిలేని ఆశయం కవితలో జీవిత తత్వాన్ని బోధిస్తారు. బాధల భారాన్ని మోయలేక మనసు మౌనాక్షరాలను ప్రసవిస్తోందంటారు మౌనాక్షరాలు కవితలో. గాయాల జ్ఞాపకాల క్షణాలన్నీ తన అక్షరాల రాసుల అంతఃసంఘర్షణకు అలంకారాలే అంటారు అక్షరమై కవితలో. నవ మాసాల భారం బరువుగా మారిన ఖేదంలో బిడ్డ ఆయువు అర్దాయువు ఎలా అయ్యిందని ప్రశ్నిస్తూ విధి పరిహాసానికి విరుగుడుగా భావాలకి తన బాధలు చెప్పుకుంటూ అక్షరాలను ఆలింగనం చేసుకుంటున్నా అంటారు నిలదీసి అడగాలని వుంది కవితలో.

" ఆగిపోదు కాలం సంఘర్షణతో చెలిమి చేసినా..

 భావమై ప్రకటించాక
     అక్షరమే వెలుగుతుంది విజేతగా.." అంటూ గాయం నేర్పిన విజయాన్ని గర్వంగా ప్రకటిస్తారు.
         తడి మనసులో తల్లడిల్లే దృశ్యాలను, రాలిపడే కన్నీళ్ళలో చిట్లిపోయిన పసి చిందులను తల్చుకుంటూ, కరిగిపోని జ్ఞాపకం స్పర్శకందనిదైనా స్మృతిలో పదిలమేనంటూ ఓటమి గుర్తుని, వేదనకు సాక్ష్యమూ అయిన పచ్చి గాయం మరో గమ్యం చేరే వరకు మనసుకు ఎదురుచూపేనంటారు. కాలానికి కన్నీళ్ళు అంకితమిచ్చినా ఆరిపోని గుండె తడిని మోసుకుంటూ అంతేలేని ఆశలతో అంతుచిక్కని జీవన పోరాటం చేయాల్సిందేనని అంతచ్ఛేతన కవితలో ఆర్ద్రంగా వినిపిస్తారు. మనసుగది దాల్చిన  మౌనంలో దాగిన బాధను, కంటి చెమ్మకు రూపాన్నిచ్చిన అక్షరాన్ని కన్నీళ్ళు గెలిచిన నమ్మకమంటారు. భావాల కౌగిలిలో బంధించుకున్న క్షణాలనన్నింటిని నిత్యమైన తన కన్నీటికి కారణమేనంటారు స్పర్శించే అక్షరాన్నై కవితలో. నిత్య నివేదనను నివేదిస్తారు రెప్ప మూయలేని దుఃఖపు రేయిలో, బాధ్యతల ఉలికిపాటు వేకువలో.  అక్షరాల సమక్షంలో ఆర్పుకుంటున్న ఘాటైన గాయాన్ని కూడా అక్షరాలకు అందమద్దడమేనంటారు. కెరటం వెదజల్లిన నీళ్ళలో తన కన్నీటిని కలిపేశాననుకుంటే , ఆ సంద్రపు పలకరింపు హోరు తన మనసులోనిదేనంటారు తీరంతో స్నేహం కవితలో. సమాధానం దొరకని ప్రశ్నలన్నీ భావాలుగా పేర్చుతూ అక్షరాలు నవ్వాయంటారు మరో కవితలో. గుండెనొదలని గాధలు, జ్ఞాపకం కార్చిన కన్నీళ్ళు, అక్షరాలొలికే అమ్మ ప్రేమతో, మౌనం పలికే భావాలెన్నో అంటూ అనిశ్చితం కవితలో చెప్తారు. తిమిరాలలో తడిసిపోయే తనకు కాంతి కావాలనిపిస్తుందంటారు ఓ కవితలో. మనసు ప్రశ్నల వర్షాన్ని ప్రశ్నగా సంధిస్తారు. కాయం మట్టి ఒడి చేరేదాకా భావాలు బాధనే పలకరిస్తాయంటారు. చీకటి ఆశ మౌన సంగీతాన్ని వినిపిస్తూనే ఉంటుంది తుది దుప్పటి కప్పుకునే వరకు అనడంలో ఎంత దుఃఖ ఘాడత ఉందో చీకటి ఆశ కవిత చదివితే తెలుస్తుంది. మౌనం తనతో సంభాషించడం మొదలెట్టాక బాధ భాష్యమై పులకరించిందంటారు నిశీధి భాష్యం కవితలో. మనసు రాగాన్ని ఆత్మ పయనంలో వినిపిస్తారు. వెలుతురు ఉనికిని వెదుకుతూ పయనిస్తున్నాయి నా అక్షరాలు ఏమిటిది అంటారు. ఎదలోని గాయపు ఆనవాళ్ళు మౌనపు మరకలుగా మిగిలిపోతుంటే, దుఃఖపు కుంభవృష్టి కురుస్తూనే ఉంది, అక్షరాలెన్ని కుప్పబోసినా అనడం ఒక్క వాణి గారికే చెల్లింది. గాయం గుచ్చుకుంటున్నా మౌనం మహాభాగ్యమైంది భావాల పల్లవితో అక్షర ప్రయాణం అంతిమం వరకు ఆగని కవిత్వమై ప్రకాశించాలని తన కోరికగా చెప్తారు. నిశ్శబ్దాన్ని నేనై, నా హృదయ నివేదనలన్నీ అక్షరాలలో అనంత మౌనాలై ప్రవహిస్తూ, భావాలలో ప్రకాశిస్తున్నాయని వేదనను కూడా అందంగా చెప్పడం వాణి గారి ప్రత్యేకత. శోకం శ్లోకమైనప్పుడు మౌన నివేదన తన మనసాక్షరాలంటారు మౌన నివేదన కవితలో. తన మనసు గాయానికి  అక్షరమైత్రి ఆత్మీయమైందంటారు. గత గాయపు గాలివానకు మనసు చెరపలేని దుఃఖమైతే, ఆరిపోయిన ఆశలు ఆనందశిఖరం చేరుకోవాలన్న తపనను ఒక ఆశగా చెప్తారు. తన అంతరంగ మధనాన్ని పదాలలో పదిలపరుస్తున్నానంటారు. పదిలంగా జ్ఞాపకాన్ని దాచుకుంటూ, అక్షరాల రెక్కల్లో స్వప్న చిత్రాలను కలగంటున్నానంటారు. కొన్ని కవితలలో గాయమై మిగిలిపోతున్నా, గుండె లోతును స్పర్శిస్తూ, అసంపూర్ణ చిత్రాన్ని అక్షరాల అనునయాలతో ఆత్మవిశ్వాసాలు అలంకరించుకుంటున్నానంటారు. నిర్వేదం నిండిన మదిలో నవ్వు కావాలన్న ఆశను, నిన్నల్లో మిగిలిన హాసాల మెరుపు స్మృతిగా కాకుండా తనతో రమ్మని బతిమాలడం, మరచిపోలేని గాయమైనా ఎలా చెప్పను అంటూ చెప్పిన తీరు ఎంత బావుందో. కన్నీటి గురుతులు, అంతులేని అంతర్మథనాలు చివరికి చేరని ఆలోచనలంటూ మన ఆలోచనలను తట్టి లేపుతారు. కడుపుకోత కంటతడి పెట్టిస్తుంటే " నన్ను నేను ఓడిపోతున్నా, ధరహాసమై దరిచేరవా " అన్నా,  విషాదాలు రోషంగా వెళిపోతే చిరునవ్వై మిగిలిపోతా అన్న ఆశను కలవరాల కలకలాన్ని వెలువరిస్తారు. అమ్మకు నలతగా ఉంటే బిడ్డగా తన మనసుని అమ్మతో అపుడు కవితలో ఇలా చెప్తారు.
  " నన్ను చూడగానే వెలిగిన చిరునవ్వు
     పారాడిన పసిపాపగా
     నా బిడ్డ బోసి నవ్వు కనిపించింది.."  ఈ పోలిక కన్నా గొప్ప పోలిక ప్రపంచమంతా దుర్భిణి వేసి వెదికినా కనిపించదు. నిజంగా వాగ్దేవి వర ప్రసాదినే వాణి గారు.
వేదనను కన్నీటి వర్షంలో మనసు ఒలికిన మౌన తడిగా చెప్పినా, చిగురించని చెట్టు, చిరునవ్వు మరచిన మనసు, చిగురై చిందించాలని ఆశ పడుతున్నానని, ఆత్మీయ మాధుర్యాన్ని కోరుకుంటున్నానని చెప్పడం చాలా ఆశావహ దృక్పధం.
             పెద్దగా కష్టపడకుండా తన అక్షరాలతో అందరిని ఆలోచింపజేసే వాణి వెంకట్ గారి గురించి
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు భాషలో ఏ ప్రక్రియలోనైనా అందె వేసిన చేయి. తేలికైన పదాలతో, సున్నితమైన పదబంధాలతో పాఠకుల మనసులు తడి చేయడమే వాణి గారి కవిత్వంలోని గొప్పదనం. బాధను, కన్నీటి గాయాలను హృద్యంగా చెప్పడంలో నిష్ట్నాతులు. తేట తెనుగు పదాలతో, తన గుండె చప్పుడును అక్షరాలకు అందించి, అందరి మన్ననలను అందుకున్న వాణి గారికి హృదయపూర్వక అభినందనలతో....
 

  
మరిన్ని శీర్షికలు
naaneelu