Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Bhogaraju Pattabhi Sitaramayya biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

పుస్తక సమీక్ష: తెలుగు పద్య మధురిమలు - సిరాశ్రీ

Telugu Padya Madhurimalu - book review
పుస్తకం: తెలుగు పద్య మధురిమలు
ప్రచురణ: తెలుగు అకాడమి 
వెల: 105/-
ప్రతులకు: తెలుగు అకాడమి పుస్తక విక్రయ శాలలు

తెలుగు సాహిత్యానికి కీర్తి కిరీటం పద్యం. ఎందుకంటే తెలుగు భాషలోని పదసంపద పద్యాల్లోనే కొలువు తీరి ఉంది. కావ్య రచనా యుగంలో అప్పటి ప్రభువుల ఆదరణ వలన కొంత, స్వతస్సిద్ధంగా పద్య రచన పట్ల మక్కువ వలన ఇంకొంత అనేకమంది కవులు శతాబ్దాలుగా తెలుగు భాషను సుసంపన్నం చేసారు. ఛందస్సులో ఒదుగుతూ, భావ దారిద్ర్యాన్ని అధిగమిస్తూ పద్య రచన చేయడానికి ఒకే అర్థానికి అనేక పదాలు ప్రవేశపెట్టారు.


అప్పటి వ్యవహారంలో లేకపోయినా సంస్కృతం నుంచి కొంత, అచ్చ తెలుగు నుంచి కొంత లక్షలాది పదాలను పరిచయం చేసారు. వ్యాకరణానుసారంగా ఎన్నో కొత్త పదాలనూ సృష్టించారు. తెనాలి రామకృష్ణుడు 'పాండురంగమహాత్మ్యం' లో ప్రయోగించిన 'దిగ్వాసుండు (దిక్కులే వస్త్రములుగా కలవాడు=దిగంబరుడు)', 'పయోముచ్ (నీటిని విడిచిపెట్టేది=మేఘము)' మొదలైన పదసృష్టి తెలుగు భాషకు పరిపుష్టి.

భాషలోని ఆ గరిమను, సాహిత్యంలోని ఆ మహిమను రుచి చూడాలంటే పద్య సాహిత్యాన్ని దర్శించక తప్పదు. ఆధునిక కాలంలో ప్రాచీన కావ్యేతిహాస ప్రబంధాలని చదివే ఓపిక, తీరిక పెక్కుమందిలో లేవు కనుక ఆ సారాన్ని 100 నుంచి 200 పేజీల్లో నిక్షిప్తం చేస్తూ అనేకమైన పుస్తకాలు వస్తున్నాయి. తాజాగా తెలుగు అకాడమీ వారు "తెలుగు పద్య మధురిమలు" అనే 258 పేజీల పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇందులో 10 శతకాలకు చెందిన కొన్ని పద్యాలు, 4 పురాణేతిహాసాల్లోని  కొన్ని పద్యాలు, 10 కావ్యాల్లోని పద్యాలు పొందుపరిచారు.వీటిన్నటినీ సంకలనం చేసి వివరణ అందించిన వారు శ్రీ బాలాంత్రపు వేంకట రమణ. వీరి కృషి నిజంగా అభినందనీయం. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం లోని "నిష్ఠావర్షదుదార..." వంటి పద్యాలు అంత సులువుగా దొరకవు, దొరికినా అర్థం కావు. అటువంటి అపురూపమైన పద్యాలను కూడ ఏర్చి కూర్చడమంటే మామూలు విషయం కాదు. 

పద్యాల పట్ల ఆసక్తి ఉన్నవారు ఇది చదివితే ఆయా కావ్యాలు, ప్రబంధాలు, శతకాల మీద మక్కువ పెరిగి వాటిని ఆసాంతం చదివే అవకాశం ఉంది. లేదా మచ్చుకు కొన్ని పద్యాలు అన్నట్టుగా ఇందులోని పద్యాలు కంఠస్థం చేసినా చాలు.

ఇదంతా చెప్పాక "పెద్దబాలశిక్ష" లో ఇంచు మించు ఈ మాత్రం పద్యాలు ఉంటున్నాయి కదా. తేడా ఏమిటనిపించొచ్చు. కానీ ఇది పూర్తిగా పద్య పిపాసుల కోసం. మరీ తేలిగ్గా ఉన్నవాటికి కాకుండా, ఏ మాత్రం అర్థవివరణ అవసరం అనుకున్నా, పద్యం కిందే తాత్పర్యం కూడా ఉంది.

శతకం అనగానే వేమన, సుమతి, భాస్కర, కాళహస్తీశ్వర...మొదలైన నీతి, వైరాగ్య, భక్తి శకతాలు గుర్తుకురావడం సాధారణం. కానీ పక్కివేంకట నరసింహ కవి రాసిన "కుమారీ శతకం" చాలా మందికి తెలియకపోవచ్చు. ఇందులోని నీతులు కొన్ని ఈ కాలానికి వర్తించవనుకున్నా చాలా వరకు ఆచరించదగ్గవి. ముఖ్యంగా ఇవి స్త్రీలకోసం. తల్లిగా, భార్యగా, కోడలిగా ఎలా ఉంటే ఆమెకు, కుటుంబానికి, సంతానానికి శ్రేయస్కరమో చెప్పే శతకం. అలాగే 2006 ఆలూరు శిరోమణి శర్మ "మాతృభాష తెలుగు మరువకన్న" మకుటంతో రాసిన "మతృభాషా శతకం" కూడా అవశ్య పఠనీయం అనిపించింది.

ఇక పోతన భాగవతం, కవిత్రయ భారతం, మొల్ల రామాయణం, విశ్వనాథ రామాయణం, శ్రీనాథుని చాటువులు, అల్లసాని "మనుచరిత్ర", నంది తిమ్మన "పారిజాతాపహరణం", రాయల "ఆముక్తమాల్యద", రామరాజభూషణుని "వసు చరిత్ర", చేమకూర వేంకటకవి "విజయవిలాసం"...ఇలా ఎన్నో ప్రాచీనాంధ్రకావ్యప్రబంధాల సారమెంతో ఇందులో ఉంది.

ఇక మీ ఇష్టం. 

మరిన్ని శీర్షికలు
weekly horoscope December 13 - December 19