Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Taanu Teesina Gotilo - Bommala Katha

ఈ సంచికలో >> కథలు >> పెత్తనం

pettanam

హోరాహోరీగా కేసు వాదించేసి, జడ్జీ గారు ఇచ్చే తీర్పు వినడానికి ఉత్సుకతతో నిలబడ్డ లాయర్లలా రాధాకృష్ణ ఎదుట నిలబడ్డారు అనసూయమ్మ గారూ, అపర్ణా ఆరోజు ఉదయం. ఒకరు అతడిని కన్నతల్లి. మరొకరు అతడిని కట్టుకున్న ఇల్లాలు. ఇద్దరూ రెండు వర్గాలకి ప్రతినిదుల్లా నిలబడి వున్నారు.

అప్పటికే అతడు ఇద్దరి వాదనలూ వినడం చాలా సార్లు అయిపోయింది. ఇంక నిర్ణయం తీసుకోవడమే తరువాయి.

ఇంతకీ అసలు సమస్యేమిటంటే, పది రోజుల క్రితం వాళ్ళింటికి పోస్టులో ఒక పెళ్ళి శుభలేఖ వచ్చింది.

శుభలేఖలన్నాక పోస్టులో వస్తుంటాయి, కొరియర్లో వస్తుంటాయి. వీలుని బట్టి ఈ మధ్యన ఈ - మెయిల్లోనూ, చివరాఖరికి సెల్ ఫోన్లో సంక్షిప్త సందేశాలుగానూ కూడా పంపిస్తున్నారు. అందువల్ల శుభలేఖ రావడం పెద్ద సమస్యా అని మీరనచ్చు. నిజమే - శుభలేఖ రావడం సమస్య కాదు. అది పోస్టులో రావడమూ సమస్య కాదు. రాధాకృష్ణ కూడా మీలాగే అనుకున్నాడు మరో వారానికి మరో శుభలేఖ అదే పోస్టులో వచ్చేంత వరకూ. ఆ రెండో శుభలేఖ వచ్చాకే శుభలేఖ రావడం కూడా సమస్యేనన్న విషయం తెలిసివచ్చింది అతడికి.

విషయమేమిటంటే మొదటి శుభలేఖ వచ్చింది తూర్పునుంచి. విశాఖపట్నంలో వున్న అతడి తల్లి వేలు విడిచిన మేనమామ దగ్గరనుంచి. రెండో శుభలేఖ పడమర నుంచి. అంటే అమెరికా నుంచి. అపర్ణ 'కజిన్ బ్రదర్' దగ్గర నుంచి.

రెండు పెళ్ళిళ్ళూ ఒకే ముహూర్తానికి. ఇప్పుడు తూర్పుకి వెళ్ళాలా, పడమరకి వెళ్ళాలా అన్నది సమస్య. తూర్పుకి ప్రతినిధి తల్లి. పడమరకి ప్రతినిధి భార్య. ఇంటికి యజమానీ, పెత్తనం వున్నవాడూ కనుక నిర్ణయించాల్సింది రాధాకృష్ణ. అతడి నిర్ణయం తిరుగులేని నిర్ణయం. అతడు చెప్పే తీర్పు ఇంట్లో అందరికీ శిరోధార్యం.

అత్తగారి తరపు బంధుత్వం దూరపు బంధుత్వం అన్నది అపర్ణ వాదన. దూరపు బంధుత్వమైనా వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు అంటుంది అనసూయమ్మ గారు. విడి విడిగా వింటే ఇద్దరి వాదనా నిజమే అనిపిస్తుంది రాధాకృష్ణకి.

రెండు వైపుల నుంచీ ఒత్తిడి ఎక్కువైపోవడంతో రాధాకృష్ణకి నిర్ణయం తీసుకోవడం కష్టమైపోతోంది. అందుకే ఎటూ చెప్పకుండా తాత్సారం చేస్తున్నాడు. అ తాత్సారం ఆడవాళ్ళలో ఆదుర్దాని మరింత పెంచుతోంది. ఎలాగైనా తీర్పు తమవైపు వుండేలా చేసుకోవాలని ఆఖరి అస్త్రంగా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి కూడా దిగారు.

"ఆయన బ్రతికున్నాళ్ళూ ఆయన చెప్పినట్టు నడుచుకున్నారు. ఇప్పుడు నీ హయాం కనుక నువ్వు చెప్పినట్టు వినాల్సిందే. కానీయ్ ఏం చేస్తావో - నీ ఇష్టం" అని కొడుకు ఎదుట ముక్కు చీదింది అనసూయమ్మగారు.

"కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకు లోకువే అని బామ్మ చిన్నప్పుడే చెప్పింది. ఆడదాని ఇష్టాలూ కోరికలూ ఎలా వున్నా సంసారంలో చెల్లుబాటయ్యేది మగాడి నిర్ణయమే కదా? చెప్పండి. మీరెక్కడికి సర్దమంటే అక్కడికి సర్దుతాను బట్టలు" అంది శ్రీమతి.

ఎక్కడికైనా సర్దాల్సింది ఒకే బట్టలు కదా అన్న ఆలోచన రాధాకృష్ణకా క్షణంలో రాలేదు. ఇద్దరి మీదా సానుభూతిగా అనిపించింది. ఎవరివైపు తీర్పు చెప్పాలన్నా భయంగా అనిపించింది. 'పెత్తనం చెలాయించడం' లో కూడా ఇంత కష్టం వుంటుందా అనుకున్నాడు.

***

ఆఫీసుకు చేరుకున్నా ఆలోచన వదల్లేదు రాధాకృష్ణని. ఎవరో ఒకరితో చర్చించకపోతే లాభంలేదనుకున్నాడు. హాజరు పట్టికలో సంతకం చేసేసి తోటి ఉద్యోగి సుబ్బారావుని తీసుకుని క్యాంటిన్కి కాఫీకి వెళ్ళాడు. సుబ్బారావు ఎలాంటి విషయంలోనైనా సలహాలివ్వడంలో దిట్ట.

క్యాంటీన్ కుర్రాడు కాఫీలు తెచ్చేదాకా మౌనంగా వుండి, కాఫీలు వచ్చాక పైకప్పుకేసి చూసి నిట్టూరుస్తూ జనాతికంగా అన్నాడు రాధాకృష్ణ "ఒక్కోసారి నిర్ణయాధికారం వుండడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోవడమంత కష్టమైన విషయం మరొకటుండదు".

సుబ్బారావు విచిత్రంగా చూసాడు రాధాకృష్ణ మాటలకి. "నువ్వు చేసే బోడి గుమస్తా ఉద్యోగానికి నిర్ణయాలు తీసుకునేంత సమస్యలేమున్నాయి?' అన్నట్టుగా చూస్తూ 'ఆఫీసులో ఏదైనా సమస్యా?' అన్నాడు.

రాధాకృష్ణ తల అడ్డంగా ఆడిస్తూ "ఆఫీసులో కాదు - ఇంట్లో" అన్నాడు. విషయం మొత్తం సుబ్బారావు కి వివరించి "ఇంట్లో పెత్తనం అంతా నాదే. నా మాటకి తిరుగుండదు. కానీ, నేనేం చెబితే అది చెలామణీ అవుతుంది కదా అని ఏది పడితే అది చెప్పడం నాకిష్టం లేదు. అందుకే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కావడం లేదు" అన్నాడు.

అతడి మాటలకి సుబ్బారావు పకపకా నవ్వాడు. "నువ్వొట్టి అమాయకుడివి గురూ" అన్నాడు కాఫీ ఆఖరి గుటకని ఆస్వాదిస్తూ. రాధాకృష్ణకి ఒళ్ళు మండింది. అవమానంగా అనిపించింది. 'ఇరవై రూపాయలు ఖర్చుపెట్టి అతడ్ని కాఫీకి పిలిపించి ఈ మాట అనిపించుకోవడానికా?' అనుకున్నాడు.

సుబ్బారావు అతడి మనోభావాలనేమాత్రం పట్టించుకోకుండా "నువ్వే కాదు - ఈ ప్రపంచంలో వున్న మగాళ్ళంతా నీలా అమాయకులే" అన్నాడు నవ్వుతూనే.

"ఇంతకీ ఏమిటి నువ్వనేది?" కాఫీ కప్పు బల్లమీద పెడుతూ అడిగాడు రాధాకృష్ణ ఆశ్చర్యంగా.

"మీ ఇంట్లో పెత్తనం అంతా నీదేనని నువ్వనుకుంటున్నావు గానీ అది శుద్ధ అబద్దం. ఒట్టి భ్రమ!"

రాధాకృష్ణ అర్ధం కానట్టుగా చూసాడు అతడి వంక. సుబ్బారావు నవ్వుతూ తన లెక్చర్ని మొదలుపెట్టాడు. "మీ ఇంట్లో నీ పెత్తనం, నిర్ణయాధికారం పేరుకు మాత్రమే. నిజానికి మీ ఇంట్లో పెత్తనమంతా ఆడవాళ్ళదే. చిన్న ఉదాహరణ చెబుతాను విను. ఆదివారం సాయంత్రం సరదాగా నువ్వు కుటుంబంతో కలిసి సినిమాకెడదామనుకుంటావు. మీ అమ్మగారు ఒక సినిమా పేరు చెబుతారు. వెంటనే మీ ఆవిడ కల్పించుకుని అదికాదని మరొక సినిమా పేరు చెబుతుంది. ఏ సినిమాకెళ్లాలన్న ప్రశ్న వచ్చినప్పుడు ఇద్దరూ నీ ఇష్టం అంటారు. నిర్ణయాధికారం నీకు బదలాయిస్తారు.

నువ్వు నీకిష్టమైన సినిమాలన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళు చెప్పిన రెంటిలో ఏదో ఒకటి ఎంచుకుని నువ్వు పెత్తనం చెలాయిస్తున్నాననుకుంటావు. ఆ మాత్రం ఎంపిక చేసినందుకే రెండో వాళ్ళ నిరసనలూ, అలకలూ సహనంగా భరిస్తావు. ఏ విషయమైనా ఇంతే. నువ్వు అయితే మీ శ్రీమతి చెప్పినట్టు వినాలి, కాకపోతే ఆమె అత్తగారు చెప్పినట్టైనా వినాలి. కాని నీ సొంతనిర్ణయం తీసుకునే వీలు కానీ, సావకాశం కాని నీకు వుండవు. దీన్నే నువ్వు 'పెత్తనం' అని అనుకుంటుంటే అది అమాయకత్వం కాక మరేమిటి?!'

రాధాకృష్ణ బుర్ర తిరిగిపోయింది ఆ మాటలకి. సుబ్బారావు ఎప్పుడూ అంతే. ఏ విషయాన్నైనా ఎవరూ చూడని మూడో కోణం లోంచి చూస్తాడు. "ఇప్పుడు ఈ సమస్యనే తీసుకో - వాళ్ళ వాదనలని పక్కన పెట్టి చెప్పు? రెండు పెళ్ళిళ్లలో నీకే పెళ్ళికి వెళ్ళడం ఇష్టం?" అని ప్రశ్నించాడు.

రాధాకృష్ణ ఆలోచనలో పడ్డాడు. నిజానికిప్పుడు అతడికే పెళ్ళికీ వెళ్ళడం ఇష్టం లేదు. నెలాఖరులో వున్నాడు. క్రిందటి నెల పండగ బట్టలకి తీసుకున్న అప్పు ఇంకా తీర్చలేదు. అసలు తనా కోణంలో ఆలోచించనే లేదు! అతడి బుర్ర వేడెక్కిపోయింది. మరో కప్పు కాఫీ తెప్పించుకుని గటగటా తాగేశాడు.

"ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే బాగా ఆలోచించి నీకిష్టమైన నిర్ణయాన్ని తీసుకుని ఈసారి నీ నిర్ణయాధికారాన్ని సరీగ్గా వినియోగించు" అన్నాడు సుబ్బారావు ముక్తాయింపుగా.

అప్పటికే రాధాకృష్ణ ఒక 'నిర్ణయానికి' వచ్చేసాడు!

***

కొసమెరుపు : ఆ సాయంత్రం రాధాకృష్ణ ఇంటికి వచ్చేసరికి ఇల్లు పెళ్ళి వారిల్లులా వుంది. అనసూయమ్మ గారు, అపర్ణా మతాబుల్లా వెలిగిపోతున్న ముఖాలతో ఎదురొచ్చారు. పిల్లలు గబుక్కున వచ్చి అతడి చెయ్యి పట్టుకుని కుదుపుతూ "నాన్నా... నాన్నా... మనం పెళ్ళికి వెడుతున్నాం" అన్నారు.

"ఎవరి పెళ్ళికీ?" హడలిపోతూ ఆశ్చర్యంగా అన్నాడు.

"నే చెబ్తానుండరా..." అంటూ అనసూయమ్మగారు ముందుకు వచ్చింది. "నువ్వు ఆఫీసుకి వెళ్ళాక నాకెందుకో బుద్ధి పుట్టి ఆ అమెరికా వాళ్ళ శుభలేఖ అడిగి తీసుకుని చూసాను. తీరా చూద్దును కదా? ఆశ్చర్యం... రెండూ ఒక పెళ్ళివే! విశాఖపట్నం వాళ్ళ అమ్మాయినే అమెరికా వాళ్ళ అబ్బాయికి చేసుకుంటున్నారు!! ఇంకేముందీ? కాగల కార్యం గంధర్వులే తీర్చేసారు. మనం ఇన్ని రోజులూ అనవసరంగా మల్ల గుల్లాలు పడ్డాం అనుకుని వెంటనే కోడలికి చెప్పి బట్టలు సర్దించేశాను" అంది.

"ఏవండోయ్... ఇద్దరూ ఒకటే కదా అని చదివింపులు ఒకళ్ళకే ఇచ్చి చేతులు దులిపేసుకుందామనుకుంటున్నారేమో? అదేం కుదరదు. అసలే అవతలి వాళ్ళు అత్తయ్యగారికి బాగా కావాల్సిన వాళ్ళు కూడాను" కాఫీ కప్పుతో వచ్చిన అపర్ణ అంది నవ్వుతూ.

తూర్పు - పడమర ఏకం కావడమంటే ఏమిటో మొదటిసారిగా అర్ధమైంది రాధాకృష్ణకి!!

***

మరిన్ని కథలు
Software Engineer