Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

కొందరు భక్తులు సింహాచలానికి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న 'భైరవస్వామి' ని దర్శించుకోవడానికి భైరవవాక వెళ్తారు. 'సింహాద్రి అప్పన్న' ఆలయాన్ని పరిరక్షించే దేవతల్లో 'కాలభైరవస్వామి' ఒకరు.

అదే రోజు - అర్ధరాత్రి -

సింహాచలంలోనే మారుమూల ఉన్న విజినిగిరిపాలెం, సింహాచలానికి ఉత్తరాన కూతవేటు దూరంలో వుంది. మూడొందల గడపలు ఉన్న చిన్న గ్రామం. సింహాచలం పుణ్యక్షేత్రం చేరువలో ఉన్నందునే వేరే గ్రామంగా ఎవరూ తలచరు. సింహాచలంలో భాగంగా మారిపోయిందా పాలెం. ఊరు ఊరంతా నిద్రావస్థలో వుంది.

ఊర్లో అందరూ వ్యవసాయదారులు. ఇప్పుడిప్పుడే యువత అంతా చదువుల పేరుతో, ఉద్యోగాలు, ఇతర ఉపాధి వెదుక్కుంటూ నగరాన్ని చేరుకుంటున్నారు. రోజూ ఉదయాన్నే 'నగరం' చేరి తమ వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు నిర్వహించుకుని ఏ రాత్రికో అపరాత్రికో ఇల్లు చేరుకుంటారు.

సరిగ్గా మూడుగంటలు కావస్తోంది. ఎక్కడినుండో కోడికూతలు... కొక్కొరొకో..." అంటూ ఉండుండీ ఊర్ని నిద్ర లేపుతున్నాయి.

ఆ ఊర్లో ఓ మోస్తారుగా వున్న ఇంటిముందు నిలబడి ఇద్దరు కుర్రాళ్ళు అరుస్తున్నారు. తమ 'అరుపు' ఎవరికీ వినపడకూడదన్నట్టు లోగొంతులో అరుస్తూ లోపల ఉన్న వ్యక్తిని పిలుస్తున్నారు.

"ఏకాంబర్... ఒరేయ్ ఏకాంబర్" గొంతు పెగల్చి అరవాలన్నా గట్టిగా అరిస్తే వూరువూరంతా ఉలిక్కిపడి లేస్తుందన్న భయంతో చాలా గమ్మత్తుగా అరుస్తూ పిలుస్తున్నారు వాళ్లు.

ఇంతలో ఆ ఇంటి ప్రధాన ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది ఓ ఆకారం అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చింది. చీకట్లోనే తడుముకుంటూ ఒంగి ఒంగి పాక్కుంటూ వస్తోందా ఆకారం.

చీకటిగా వుందా ప్రాంతం అంతా. ఆ చీకట్లోనే తడుముకుంటూ ఎలుగుబంటిలా ఉన్న ఓ నల్లటి ఆకారం తమ వైపే నెమ్మదిగా వస్తుంటే అరుస్తున్న కుర్రాళ్ళు క్షణం భయంతో జడుసుకుని కర్రల్లా బిగుసుకుపోయారు.

"అరేయ్! ఆ వస్తోన్న ఆకారం మన ఏకాంబర్ గాడేనా లేదా...?!" ప్రక్కవాడి చెవిలో భయంగా అన్నాడొకడు.

"ఏమోరా! వాడైతే చీపురుపుల్లలా పొడుగ్గా కొరివిదెయ్యంలా ఉంటాడు కదరా! ఇదెవర్రా! పొట్టిగా... చీకట్లోనే దొర్లుకొస్తున్న గుండ్రాయిలా కనిపిస్తోంది ఎవరో...?" ఆ కుర్రాడు కూడా మొదటి కుర్రాడ్ని గట్టిగా పట్టుకుంటూ భయంగా అన్నాడు.

ఇంతలో ఆ ఆకారం వాళ్ళకు అతి సమీపంలో వచ్చేసింది. ఆ కుర్రాళ్ళు ఇద్దరూ నెమ్మది నెమ్మదిగా... భయం... భయంగా... "ఒ..రే..య్... ఏకాంబర్... ఏకాం.. బర్..!" అని నీళ్ళు నములుతున్నట్టు అంటూ గజగజ వణికిపోతూ పారిపోవడానికి కాళ్ళు కదలకపోయేసరికి బిక్కమొహం వేసుకుని చూస్తూండిపోయారు.

"ఎందుకురా! అలా అరుస్తారు. ఇంకో అరగంటలో నేనే వచ్చేవాడ్ని కదా! మీరెందుకు వచ్చారు" ఆ ఆకారం వాళ్ళ దగ్గరకు చేరుకుని అంది.

"ఒరేయ్. ఏకాంబర్ నువ్వేనా! ఏదో అనుకుని జడుసుకు చచ్చేం కదరా!" అన్నారిద్దరూ ఒక్కసారే.

ఆ ఇద్దరూ ఎదురుగా నల్లటి రగ్గు కప్పుకుని బుట్టలా ఒంగిపోయి నడిచి వచ్చిన ఏకాంబరాన్ని చూసి ఉలిక్కిపడ్డారు.

"ఇంట్లో అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు కదరా! మీరిలా అరిస్తే లేచిపోరా?!" వాళ్ళిద్దరితో గుసగుసగా అంటూ "పదండి! పదండి!" అంటూ వాళ్ళిద్దరి భుజాల మీద చేతులు వేసాడు ఏకాంబర్ నిటారుగా నిలబడి.

నిటారుగా నిలబడి ఏకాంబర్ అలా వాళ్ళ భుజాల మీద చేతులు వేసేసరికి ఇద్దరూ ఒక్కసారే ఏకాంబర్ కేసి తల ఎత్తి చూసారు.

ఏపుగా ఉన్న కరెంటు స్తంభంలా కనిపించాడు. వాళ్ళిద్దరూ ఏకాంబర్ ప్రక్కన చిన్న సైజు టెలిఫోన్ స్తంభాల్లా కనిపిస్తున్నారు. ఏకాంబర్ చంకలోకి రాలేదు ఇద్దరూ.

"ఏకాంబర్ గాడు పక్కనుంటే చెట్టు ఎక్కక్కరలేకుండా మామిడి కాయలు కొసెయ్యవచ్చు" అనుకున్నారిద్దరూ మనసులోనే.

"రండిరా! మొన్నే చెప్పారు కదరా! చెరువుగట్టు దగ్గరకు రావాలని. ఈ రోజు శనివారం కదా! అదీ డోలా పౌర్ణమి" గబగబా నడుస్తూ అన్నాడొక కుర్రాడు.

"నేనే వస్తాను కదా! మీరెందుకొచ్చారు?" నడుస్తూ అన్నాడు ఏకాంబర్.

"అవును! మూడైనా నువ్వు రాలేదు. అక్కడ యాత్ర చూస్తేనా..." ఆ ఇద్దర్లో ఒకడన్నాడు.

"అవున్రా! ఏకాంబర్! ఈ రోజు మనందరి పంట పండిపోద్ది తెలుసా!" ఆనందంగా అన్నాడు రెండోవాడు.

 అదే సమయంలో -

దూరంగా... ఎవరెస్టు శిఖరంలా కనిపిస్తున్న కొండ మీద 'మిణుగురు' పురుగుల్లా వెలుగులు జరజరా ప్రాకుతున్నట్లు కనిపిస్తున్నాయి. సింహగిరి శిఖరం చివరి మలుపులో ఉన్న శంఖచక్రాలు, నామాలు విద్యుత్ కాంతులతో ధగధగా మెరిసిపోతున్నాయి.

సింహగిరి శిఖరం పైన కట్టిన 'టీవీ టవర్' పైనున్న ఎర్రలైటు దేవాలయమంతా పహారా కాస్తున్నట్టూ గిర్రున తిరుగుతూ వెలుగుతోంది. ఆ వెలుగు కొండ దిగువకు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇంతలో కొండమీద నుండి గాల్లో తేలుతూ సింహాద్రి అప్పన్న సుప్రభాతం శ్రావ్యంగా ప్రారంభమయింది.

"అదిగోరా! అప్పుడే గుడి కూడా తెరిచేసారు. కొండ బస్సులు కూడా యాత్రీకుల్ని కొండకు తీసుకుపోతున్నాయి. అదిగో చూడు" మొదటి వాడు ఏకాంబరానికి చూపిస్తూ అన్నాడు.

"అవునవునురా! పదండి! మనవాళ్లు అక్కడ మనకోసం ఎదురు చూస్తూంటారు" అంటూ వడివడిగా నడిచాడు ఏకాంబర్.

సింహాచలానికి ఉత్తరాన ఉంది విజినిగిరిపాలెం. ఈరెండు ఊర్ల మధ్య రహదారిలోనే వుంది వరాహపుష్కరిణి. వూర్లోవాళ్ళు చెరువు అంటారు... భక్తులు కోనేరు అంటారు. అయితే, ఆ కోనేరు పేరు వరాహపుష్కరిణి.

పాలెం నుండి అరమైలు దూరంలోనే ఉంది దేవుడి కోనేరు.

ముగ్గురూ మాట్లాడుకుంటూ చెరువు గట్టు దగ్గరకు చేరుకున్నారు.

అక్కడంతా కన్నుల పండుగలా ఉంది. 'వరాహ పుష్కరిణి' ఘాట్ దగ్గర వందలమంది యాత్రీకులు స్నానాలు చేస్తున్నారు. చెరువుకు నైరుతీ మూలన ప్రవేశ ద్వారం ఉంది. పెద్దగేటు. అందులో నుండే పుష్కరిణీ గట్టుకు చేరుకోవాలి.

పుష్కరిణిలోకి దిగడానికి మెట్లు ఉన్నాయి. అర్ధచంద్రాకారంలో చుట్టూరా మెట్లు కట్టారు. ఆ మెట్ల మీద నిలబడి భక్తులు స్నానాలు చేస్తున్నారు. స్త్రీలు స్నానాలు చేసి తడి వస్త్రాలు మార్చుకోవడానికి ఓ మూల వరుసగా గదులు కట్టి ఉన్నాయి. అయితే, ఎక్కువమంది భక్తులకు అవి చాలక రద్దీగా ఉండడంతో ఆడవాళ్ళంతా అక్కడక్కడే నానా యాతనా పడుతూ బెరుగ్గానే పాపం చీరలు మార్చుకుంటున్నారు. ఎవరైనా మగాళ్ళు గమనిస్తారని సిగ్గు పడ్డా చేసేది లేక చాలామంది స్త్రీలు అలాగే చీరలు మార్చుకుంటున్నారు. వయసులో ఉన్న అమ్మాయిలు మాత్రం ఆ గదుల దగ్గరకు వెళ్తున్నారు. ఆలస్యమైనా అక్కడే ఎలాగో చీరలు మార్చుకుని వస్తున్నారు.

పాలెంనుండి మిత్రులు ముగ్గురూ అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న కుర్రాళ్లు 'ఏకాంబర్'ని చూస్తూనే 'ఏందన్నా! నువ్వే ఇంత ఆలస్యంగా వస్తే ఎలా' అంటూ ఏకాంబర్ ని ఓ మూల కూర్చోమని చెప్పారు.

ఏకాంబర్ ని పిలవడానికి వచ్చిన కుర్రాళ్ళు కూడా తమ ఒంటి మీద వున్న బట్టలు విప్పేసి ఓ మూల గుట్టగా ఉన్న బట్టల మీద పడేసారు. ఆ ప్రక్కనున్న బండ మీద కూర్చున్నాడు ఏకాంబర్.

ఆ కుర్రాళ్ళంతా చెరువులో దిగి ఈత కొడుతూ భక్తులు నీళ్ళల్లో విసిరిన డబ్బులు ఏరుకుని ఒడ్డుకు వచ్చి ఏకాంబర్ చేతికి ఇస్తున్నారు.

భక్తులు స్నానాలు ముగించి చెరువు మధ్యలో ఉన్న 'రాతి మండపం' కేసి చూస్తూ దండాలు పెట్టుకుని పళ్ళు, చిల్లర డబ్బులు నీట్లోకి విసురుతున్నారు. ఎవరి స్థోమతకు తగ్గట్టు వాళ్లు చెరువులోకి దిగి దండం పెట్టుకుంటూ రెండు చేతుల్తో అరటిపండ్లు, చిల్లర నాణేలు విసురుతూ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఆ రాతిమండపంలో దేవుడు దేవేరులతో వివాహానికి వచ్చినప్పుడు సేదతీరుతాడు. ఆ రోజే తెప్పోత్సవం పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు.

ఏకాంబర్, అతని మిత్రులు ప్రతి 'శనివారం' ఇలా తెల్లారగట్లే చెరువుకు రావడం భక్తులు విసిరేసిన 'నాణేలు' మిగతా మిత్రులు ఏరి తీసుకువస్తే 'ఏకాంబర్' దగ్గర భద్రపరచడం అలవాటు. ఎందుకంటే ఏకాంబరానికి ఈత రాదు.

కోనేట్లో అందరితో పాటు ఎప్పుడన్నా స్నానం చేసినా మెట్ల మీద నిలబడి మునిగి బయటకు వచ్చేస్తాడు.

కోనేటినిండా తామరపూలు ఎక్కువ. చెరువు మధ్యలో ఉన్న రాతి మండపం చుట్టూ తామరాకులు, తామర పూవులతోనే నీరంతా నిండి ఉంది. ఆ పుష్కరిణిలో నేలబావులు ఎన్నో ఉన్నాయి. తామరాకుల వలన చెరువంతా నాచు పట్టి ఉంది. అందుకే ప్రవేశద్వారం దగ్గర మాత్రమే ప్రమాదం లేని చోట 'ఘాట్' ఏర్పాటు చేసారు దేవస్థానం అధికారులు.

'వరాహ పుష్కరిణి' ఘాట్ దగ్గర నీరు స్వచ్చంగా కనిపిస్తుంది. భక్తులు స్నానాలు చేసే ప్రాంతం అంతా బాగానే ఉంది. మిగతా ప్రాంతం అంతా తామరాకులు, తామరపూవులతో నిండిపోయింది.

తెల్లవార్లూ చెరువు దగ్గర ఉన్న ఏకాంబర్ మిగతా భక్తులు రద్దీ తగ్గేక అక్కడే ప్రక్కనున్న వేపచెట్టు పుల్లలు విరిచి పళ్ళు తోముకున్నారు. అతనితో ఉన్న మిగతా మిత్రులు యాత్రీకుల రాక తగ్గిపోగానే ఏకాంబర్ దగ్గర పోగైన డబ్బులు లెక్క కట్టి తమతో సమానంగా ఏకాంబరానికి కూడా వాటా క్రింద ఏభై రూపాయలు ఇచ్చారు.

స్కూలుకెళ్ళాలని ఏకాంబర్ ఆ పిల్లల్ని అక్కడే వదిలేసి ఇంటి ముఖం పట్టాడు. ఆ కుర్రాళ్ళు దుంపలబడిలో చదువుతున్న కుర్రాళ్ళు. వాళ్ళు ఉండేది కూడా చెరువుగట్టు ప్రక్కనే కనుక ఏకాంబరాన్ని పంపేసి తాము అక్కడే కబుర్లాడుకుంటూ ఉండిపోయారు.

ఏకాంబర్ చెరువులో స్నానం చేసి ఇంటికి చేరేసరికి వీధిలోనే కుర్చీ వేసుక్కూర్చున్న 'పీతాంబరం' పెద్ద కర్ర పట్టుకుని కొడుకు వీపు మీద నాలుగు బాదాడు.

"నాన్నా! చెరువుకి స్నానానికి వెళ్ళాన్నాన్నా!" అంటూ తండ్రి పీతాంబరానికి దొరక్కుండా పరిగెత్తాడు ఏకాంబర్.

అప్పటికే శుచిగా తయారయి స్కూలుకు బయలుదేరుతున్న ఏకాంబర్ అన్న నీలాంబర్ తండ్రికి సహాయంగా నిలబడి ఏకాంబరాన్ని పట్టుకున్నాడు.

"వెధవా! పోరంబోకు వెదవల్తో తిరిగి ఇప్పుడా ఇల్లు చేరేది? ఎన్నిసార్లు చెప్పాన్రా! చెరువు గట్టుకు ఆ వెధవల్తో కూడి వెల్లొద్దని అర్ధరాత్రి... అందరూ లేవకముందే వెళ్ళి ఇదా రావడం" అంటూ ఏకాంబరాన్ని ప్రక్కనే స్తంభానికి కట్టి కర్రతో దబదబా బాదేసాడు పీతాంబరం.

"చంపేస్తారా! ఏదో తెలీక వెళ్ళాడు. అంతమాత్రానికే ఇంతలా దొంగని బాదినట్టు బాదాలా?" అంటూ ఏకాంబరానికి అడ్డుగా నిలబడి కట్లు విప్పేసింది ఏకాంబర్ తల్లి పర్వతాలు.

"వెధవ పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. వీధిబడిలో ఆరో తరగతి, ఏడో తరగతి చదివే ఆ గుంట వెధవలతో స్నేహం చెయ్యద్దురా అంటే వింటున్నాడా! ఎద్దులా ఎదిగాడు. వీడికంటే చిన్నపిల్ల నయం. అప్పుడే వీడ్ని దాటి కాలేజీకి వెళ్ళిపోయింది. వీడింకా పదో తరగతి మూడోసారి చదువుతున్నాడు." చేతిలో కర్ర విసురుగా నేలకేసి కొట్టి రుసరుసా ఇంట్లోకి వెళ్లిపోయాడు ఏకాంబర్ తండ్రి పీతాంబరం.

"ఏరా నాన్నా! నాన్న కోప్పడేది నిజమే కదా! చదువుకోకుండా ఈ తిరుగుళ్ళేమిట్రా!" అంటూ ఏకాంబరాన్ని బెదిరించింది పర్వతాలు.

ఏకాంబర్ మారుమాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి స్కూలు బట్టలు మార్చుకుని బ్యాగ్ భుజాన తగిలించుకుని జేబులో ఉన్న చిల్లర తల్లి చేతికిచ్చాడు ఏకాంబర్.

"తప్పు నాన్నా! ఈ చిల్లర కోసం వాళ్ళతో వెళితే నిన్ను చిల్లర వెధవని అంటారు. వెళ్ళు. వెళ్ళి బుద్ధిగా చదువుకో" అంటూ ఏకాంబర్ తల్లి తనకి ఏకాంబర్ ఇచ్చిన ఏభై రూపాయల్లో అయిదు రూపాయలు ఏకాంబర్ చేతికి ఇచ్చింది.

అప్పటికే ఏకాంబర్ అన్న నీలాంబర్ కాలేజీకి వెళ్ళిపోయాడు. అన్నతోపాటు ఏకాంబర్ చెల్లి కూడా కాలేజీలోనే చదువుతోంది. వాళ్ళిద్దరూ గోపాలపట్నం వెళ్ళాలి. ఏకాంబర్ మాత్రం సింహాచలంలోనే ఉన్న హైస్కూల్లో చదువుతున్నాడు.

ఆ ఏడాది ఎట్టకేలకు పదవతరగతి పాసయ్యాడు ఏకాంబర్. తల్లి ఎంతగానో పొంగిపోయింది. కాలేజీలో సీటు ఎక్కడా దొరకలేదు. ఏకాంబర్ సాధించిన అత్తెసరు మార్కులకి పేరున్న  కాలేజీల్లో సీటు దొరకడం కష్టమయింది.

గోపాలపట్నంలో ఉన్న ప్రైవేటు కాలేజీలో జాయిన్ అయ్యాడు ఏకాంబర్. అన్నా, చెల్లి ఇద్దరూ మరో కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళది కార్పోరేట్ కాలేజి.

తండ్రి పీతాంబరం తన డిపార్ట్ మెంటల్ స్టోర్ కు వెళ్ళేముందు ఏకాంబరాన్ని తీసుకుని వెళ్లి కాలేజీలో దించి తన షాపుకి వెళ్ళిపోతాడు. పీతాంబరం కూడా వ్యాపారం బాగా సాగుతుందని గోపాలపట్నంలోనే షాపు తెరిచాడు.

రాత్రి అయ్యేసరికి అందరూ ఇల్లు చేరుకుంటారు.

నగరానికి దూరంగా ఉన్నా ఉన్న ఊరు కన్నతల్లి ఒక్కటంటారు. విజినిగిరిపాలెం నుండి రోజూ కాలినడకన సింహాచలం వెళ్లి అక్కడనుండి ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళడం కొంచెం కష్టంగా ఉందని పీతాంబరమే పెళ్ళాన్ని ఒప్పించి సింహాచలంలో మంచి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అదీ ఏకాంబరం కాలేజీలో చేరాక. తండ్రి పిల్లలు నలుగురూ సింహాచలం దాటి వెళ్లాలని పాలెం నుండి రావడం కష్టమని చెప్పి పెళ్ళాన్ని ఒప్పించాడు పీతాంబరం.

ఎంత అపరాత్రి వచ్చినా సింహాచలం లో బస్సు సౌకర్యానికి ఇబ్బంది లేదు. రాత్రీ పగలూ బస్సులు తిరుగుతాయి. పుణ్యక్షేత్రం కావడం వలన నిత్యం సింహాచలం నిత్యనూతనంగానే ఉంటుంది.

***

ఇంటర్ లో జాయిన్ అయిన ఏకాంబర్ కూడా రోజూ కాలేజీ ఉన్నా లేకపోయినా ఉదయాన్నే తల్లి చేతికందించిన కేరియర్ పట్టుకుని బయలుదేరుతున్నాడు. తండ్రి పీతాంబరం తనతో దగ్గరుండి తీసుకువెళ్ళి ఏకాంబరాన్ని కాలేజీ దగ్గర దించేసి షాపు తెరవడానికి వెళ్ళిపోతున్నాడు.

కాలేజీలో జాయిన్ అయిన నెల్లోనే స్టూడెంట్ పాస్ తీసుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణం మొదలుపెట్టాడు ఏకాంబర్. ఉదయం అయితే తండ్రితో వెళ్ళగలిగినా తిరుగు ప్రయాణంలో తండ్రి షాపు కట్టేసే వరకూ అక్కడ ఉండడం ఏకాంబరానికి ఇష్టం లేదు. అందుకే తండ్రితో వాదించి బస్ పాస్ తీసుకున్నాడు.

ఏకాంబరానికి బస్సులోనే పరిచయమయ్యారు ఎంతోమంది. బస్సు కోసం బస్ స్టాండ్ లో ఎదురుచూస్తూ నిలబడి ఉన్నప్పుడు ఏకాంబర్ లాగే నగరంలో నలుమూలలా ఉన్న కాలేజీలకు వెళ్ళాల్సిన ఆ ఊరి విద్యార్ధులు మాటా మాటా కలిపి ఏకాంబరానికి మిత్రులయ్యారు. అందులో నలుగురు మాత్రం బాగా సన్నిహితులయిపోయారు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
o college drop out gadi prema katha