Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jeevana madhuryam

ఈ సంచికలో >> కథలు >> ఆశ మూరెడు-మోసం బారెడు

aasha mooredu-mosam baaredu

కాఫీ తాగుతూ దినపత్రిక తిరగేస్తున్నాను... నాలాంటి విశ్రాంత ఉద్యోగులు చేసే పనే అది.

మెయిన్ పేపర్ చదవడం పూర్తయింది. హైద్రాబాద్ ఎడిషన్ తిప్పుతూ శేరిలింగంపల్లి వార్తలు చదువుతుంటే ప్రతీ మంగళవారం మియాపూర్ లో మరిగే సంతలో 'తూనికలు కొలతల అధికారి హల్ చల్ ' అనే వార్త నన్ను ఆకర్షించింది. మళ్లీ మళ్లీ చదివాను. చదువుతున్న కొద్దీ నా మనసు ఆనంద డోలికల్లో ఉప్పొంగ సాగింది.

సంతలో తూనికలు కొలతల అధికారి తన అనుచరులతో మెరుపు దాడి సలిపి తప్పుడు తూనికలు కల్గిన వారిపై కేసులు నమోదు చేశాడని ఎంతో అభినందిస్తూ వచ్చిన వార్త అది.

నా కొడుకుకు ఆ వార్త చూపించాను. వాడు చదివాడే గానీ, స్పందించలేదు. కోడలు చదివి 'ఇందులో వింత ఏముంది?' అన్నట్లుగా రియాక్షన్ ప్రదర్శించింది. నా భార్య వుంటే నాలాగే ఎంతగానో సంబరపడేది. ఇక మిగిలింది నా ముద్దుల మనవరాలు సుమేధ. దానికి నాలుగేండ్లు. దాన్ని నా ఒళ్లో కూర్చోబెట్టుకుని వార్త చదివి వినిపించసాగాను. నా పిచ్చి గానీ దానికేం అర్టమవుతుంది...? నా మనసులో ఉబలాటమే తప్ప.

"ఏం జలిగింది తాతయ్యా?" అని అడిగింది. గబుక్కున లాక్కున్న పేపర్లో దాని ముద్దు ముఖాన్ని దాచుకుంటూ... నాలోని సంతోషాన్నంతా నా మనవరాలి బుగ్గలపై చూపించాను. నా కళ్లల్లో ఆనందాశ్రువులు...

పేపరు చదువుతున్నప్పుడల్లా సాంబయ్య గుర్తుకు రావడం నాకు మామూలే... కానీ, ఈరోజు నన్ను గత స్మృతుల్లోకి లాక్కెళ్లింది.

ఆదివారం...

"పేపార్ కొంటాం... పాత పేపార్ కొంటాం..." అంటూ కేకేసుకుంటూ సైకిలుపై వెళ్తున్న పాత పేపర్లు కొనే అబ్బాయిని నేనూ కేకేసి పిలిచాను.
సైకిలు వెనక్కి త్రిప్పుకొని వచ్చి గేటు ముందు స్టాండ్ వేశాడు.

వాడు తక్కెడ తీయభోతుంటే "కిలో ఎంత?" అని అడిగాను.

"ఆరు రూపాయలు సార్"

"ఏడు గదా..."

"సరే సార్..."

"వామ్మో!... ఈమధ్య పేపర్లు అమ్మక చాలా రోజులవుతోంది. రేట్లు పెరిగాయో ఎమిటో...! తెలియక ఠక్కున ఏడు అనేశాను. ఏనిమిది అంటే బాగుండేది అని నా మనస్సులో ఎనిమిది నృత్యం చేయగానే "ఇదిగో బాబూ... నాకు తెలియక ఏడన్నాను. మా ఆవిడ ఇంట్లో నుండి ఎనిమిది రూపాయలంటూ అరుస్తోంది. ఎనిమిది అయితే తీసుకో... లేదంటే వెళ్లిరా..." అంటూ నిర్మొహమాటంగా అనేసరికి వాడు దానికీ "సరే" అన్నాడు.

నాకు ఆశ్చర్యమేసింది. "అదేంటి... నువ్వు మొదలన్న ఆరు రూపాయలకు, ఎనిమిది రూపాయలజి చాలా తేడా వుంది గదా! మరి మొదలే ఆరు అని అనకుండా ఎందుకు మమ్మల్ని మోసం చేస్తావు... నాతో తమాషా చేస్తున్నావా?..." అంటూ కొంచెం కోపం ప్రదర్శించాను.  
"మీరు పెద్దవారు... మీతో తమాషాలాడుతూ మాలాంటి అల్ప జీవులం బ్రతగ్గలమా సార్... నిజమే చెప్తున్నా... కాకపోతే, రేటును బట్టి తూకముంటుంది" అని ఠక్కున నాలుక్కర్చుకున్నాడు.

నేను నివ్వెరబోయాను. "మాటలు బాగానే నేర్చావుగానీ... పేపరమ్మేవాళ్లంతా దద్దమ్మలనుకుంటున్నావా...?" అంటూ నాలుగు చీవాట్లు పెడదామనుకున్నాను. కానీ, దాతో నాకొరిగేదేముంది? చీవాట్లు పెట్టే బదులు వాడిని మచ్చిక చేసుకొని తూకం రహస్యమేంటో కూపీ లాగుదామనే ఉత్సుకత రేగింది.

"సరే... అయితే, నువ్వు మొదలన్న ఆరు కాదు, నేనన్న ఎనిమిది కాదు... ఏడు రూపాయలు చేసుకో..." అంటూ ఇంట్లోని పాత పేపర్నంతా తెచ్చి పేపరబ్బాయి ముందు పడేశాను.

వాడు ఒక్కొక్క కిలో తూకమేస్తూంటే నా ఒళ్లంతా కళ్లు భూతద్దాలై చూడసాగాయి. పదునాలుగు కిలోలైంది. వాడిచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుంటూ తక్కెడను తీసుకొని పరీక్షించాను. కోర్టులో న్యాయదేవత చేతిలో వున్నట్టే అంతా సవ్యంగానే వుంది.

"మరి, ఆరయినా, ఎనిమిదయినా యిదే తూకంతో తూస్తావా?" అంటూ కుతూహలంగా అడిగాను.

"ఔను సార్"

"మరైతే ఇప్పుడు కిలో ఎనిమిది రూపాయల చొప్పున పేపర్లను మళ్లీ తూకం వేయి" అన్నాను.

"కుదర్దు సార్... యీముక్క నాకు ముందే చెప్పాల్సింది" అంటూ పేపర్ నంతా గోనె సంచీలో సర్దుకోసాగాడు.

నా అభ్యర్థనను తిరస్కరించినందుకు నాలో అహం పొడుచుకొచ్చింది. రోషంతొ "అంతా దొంగలు" అని తిట్టాను.

వాడు తల వంచుకొని "ఇది మా వ్యాపార రహస్యం. మీరు అడగ్గూడదు, నేను చెప్పగూడదు. సారీ సార్..." అంటూ చకచకా అన్నీ సర్దుకొని సైకిలెక్కి వెళ్లిపోయాడు. "పీపార్ కొంటాం..." అంటూ దీర్ఘాలు తీస్తూ...

మధ్యాహ్నం భోంచేసి అలా కాసేపు నడుం వాల్చానో లేదో... కాలింగ్ బెల్ మ్రోగింది. విసుక్కుంటూ వెళ్లి తలుపు తీశాను.

ఎదురుగా ఉదయం పాత పేపర్ కొనుక్కు వెళ్లిన అబ్బాయి. ఆశ్చర్యపోయాను. మనసు మార్చుకొని తన వ్యాపార రహస్యం చెబుదామని వచ్చాడేమోనని కాస్తా చిరునవ్వును పెదవులపై పులుముకొని వ్యంగ్యంగా "ఏం బాబూ, నాకేమైనా డబ్బులెక్కువిచ్చావని అనుమానమొచ్చి వచ్చావా?..." అంటూ అడిగాను.

"లేదు సార్... మీరు పొద్దున అమ్మిన పేపర్లలో యీ సర్టిఫికెట్లున్న కవరొచ్చింది. ఇచ్చిపోదామని వచ్చాను" వాడు చాలా సౌమ్యంగా జవాబిచ్చాడు.

నా గుండె ఝల్లుమంది. ఆతృతగా వాడి చేతిలోని కవరు తీసుకొని చూశాను. మా బాబు రేపు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కై సర్దుకున్న ఒరిజినల్ సర్టిఫికెట్లు. ఒక్కసారిగా ఉద్వెగంతొ "సందీప్" అంటూ అరిచాను.

వాడు ఉన్నపళంగా ప్రత్యక్షమయ్యాడు. "ఏరా... నీ ఒరిజినల్ సర్టిఫెక్ట్లేవి?" అంటూ గద్దించాను.

వాడు బిక్కమొహంపెట్టి "రాత్రి అన్నీ చెక్ లిస్ట్ ప్రకారం ఒక కవర్లో సర్దుకున్నాను నాన్నా... కానీ, ఉదయం నుండీ ఆ కవర్ కనబడ్డం లేదు. దాని కోసమే వెదుకుతున్నా..." అంటూ భోరున ఏద్వసాగాడు.

"నీ తెలివి తెల్లారినట్టే వుంది. యింత నిర్లక్షమైతే ఎలారా... ఏడ్చింది చాలు గానీ, తీసుకో... కవర్లో గాదు, అన్నీ ఒక ఫైల్లో సర్దుకో..." అంటూ అప్పటివరకూ నా వెనకాల దాచి వుంచిన కవరు యిచ్చాను.

నేను అమాంతంగా వెళ్లి పేపర్ అబ్బాయిని హృదయానికత్తుకున్నాను. ఆ హఠాత్పరిణామానికి వాడు "సార్!" అంటూ నిర్ఘాంతపోయాడు.

"మా బాబు జీవితాన్ని కాపాడావు. నేనీ మేలు యీ జన్మలో మరచిపోను... నీ పేరేంటి బాబూ..."

"సాంబయ్య సార్..."

"సాంబయ్యా... యింతకూ ఆ సర్టిఫికెట్లు మావే అని ఎలా గుర్తుపట్టావ్?"

"పొద్దున మీ యింటి ముందున్న నేం ప్లేట్ చూశాను సార్. సర్టిఫికెట్ల మీద సన్ ఆఫ్ దగ్గర అదే పేరు వుంది."

"వెరీ ఇంటిలిజెంట్... ఏంచదువుకున్నావ్? మీ నాన్నగారు ఏంచేస్తుంటారు?"

"మా నాన్న నా చిన్నతనంలోనే కాలం చేశాడు సార్... మా అమ్మ, చెల్లీ, నేనే వుంటాం. అమ్మ ఇంట్లో కుట్టు మిషన్ కుడుతుంది. నేను మా వాడలో అందరికీ ఉదయం పాల పాకెట్లు, పేపర్లు వేస్తాను. చెల్లి పదవ తరగతి చదువుతోంది. కాలేజీలో చదవాలంటే మాలాంటి వాళ్లకు సాధ్యమా సార్?... డిస్టేన్స్ ఎడ్యుకేషన్ ద్వారా బి.కాం. చదువుతున్నాను."

సాంబయ్య నిరంతర పరిశ్రమకు మదిలోనే హాట్సాఫ్ చెప్పాను.

"వెరీగుడ్... అయాం వెరీ వెరీ సారీ సాంబయ్యా... ప్రొద్దున నీ మనసును కష్టపెట్టాను. తూకం సంగతి తెలుసుకుందామనే కుతూహలం కొద్దీ నోరు జారాను. రా... అలా వచ్చి కూర్చో... టీ త్రాగి వెళ్దువు గానీ..." అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాను.

"సారీ సార్... యీరోజే కోచింగ్ సెంటర్లో చేరుదామనుకుంటున్నాను. వెళ్లాలి..." అంటూ రెండు చేతులతో నమస్కరించాడు. డబ్బులిస్తే తీసుకోడని అతని మాటల్లో అభిమానం ప్రస్ఫుటిస్తోంది. అయినా, ఏదైనా సాయం చేయాలి. ఎలా?...

"ఉండు సాంబయ్యా... ఒక్క నిమిషం. నువు ఏ కోచింగ్ సెంటర్లో చేరనవసరం లేదు. నేను కామర్స్ లెక్చరర్ని. నీకు కోచింగ్ నేనిస్తాను. ఇంక నువ్వేమీ అలోచించకు. నువ్వు బి,కాం. పాసయ్యేలా నా శాయశక్తులా ప్రయత్నిస్తాను" అంటూ సాంబయ్యను మరో మాట మాట్లాడకుండా అడ్డుకున్నాను.

సాంబయ్య వెంటనే నా రెండు కాళ్లను స్పృశించి కళ్లకద్దుకున్నాడు. ఈ కాలంలో యిలాంటి శిష్యుడు దొరకడం... నా కళ్లల్లో ఆనంద బాష్పాలు దొర్లాయి...

మా సందీప్ యింగనీరింగ్ లో జాయినయ్యాడు.

అదంతా సాంబయ్య చలవే అనుకుంటూ సాంబయ్యకు పక్కా ప్రణాళిక ప్రకారం నా వంతు కృషి చేస్తున్నాను. కానీ, మరో వంక నా మనస్సులో తూకం రహస్యం తెలుసుకోవాలనే ఉబలాటం అలాగే వుండిపోయింది.

అతడి పార్ట్ టైం జాబ్ పాత పేపర్ల వ్యాపారం సాగుతూనే వుంది. అడిగితే, సాంబయ్య కాదనడేమో గానీ, కోచింగ్ యిస్తూ ప్రతిఫలంగా అతడి వ్యాపార రహస్యం అడుగుతున్నాననుకుంటాడని అభిమానం అడ్డొస్తోంది. కానీ, నా మనస్సులో పితలాటకం మానలేదు.

సాంబయ్య బి.కాం. డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. సాంబయ్యకంటే నేనే ఎక్కువగా సంతోషించాను. సర్వీసు కమీషన్ పరీక్షలు రాయమని సలహా ఇచ్చి ప్రోత్సహించసాగాను.

ఓరోజు "సార్... నా తూకం రహస్యం చెప్పమంటారా...?" అని అడిగాడు.

నేను కాస్త బెట్టుగా నాకంతా తెలుసన్నట్టుగా "ఆ ఏముంటుంది... త్రాసులోనో, లేక తూకంలోనో ఏవో గిమ్మిక్కులుంటాయి" అన్నాను.

"కాదు సార్... మీరన్నవి పాత పద్ధతులు. పైగా, అందరికీ తెలిసినివఏ... యిప్పుడు కొత్త కొత్త ట్రిక్కులు వాడుతున్నారు."

నేను చెవులు చేటంత చేసుకున్నాను.

"తూనికల్లో రెండు రకాల మోసాలు... కొనుగోలు దగ్గర, అమ్మకం దగ్గర మోసపోయేది వినియోగదారుడే సార్... వినియోగదారుడు ఏ వస్తువులైనా కొందామని మార్కెట్టుకి వెళితే తూకం రాళ్లు చూడ్డానికి ప్రామాణిక రూపంలోనే కనబడినా వాటి అడుగు భాగంలో కొంత మేరకు తొలిచి వుంటాయి. ఇది మొదటి రకం.

ఇక రెండవ రకం... వినియోగదారుడు తన వస్తువులేవైనా అమ్ముదామని అంగడికి వెళితే అక్కడా తప్పుడు తూకం రాళ్లనే వాడతారు.
నా దగ్గర మూడురకాల తూకం రాళ్లున్నాయి సార్... అన్నింటి మీద ఒక కిలో అనే తూనికలు, కొలతల శాఖవాళ్లు నిర్ధారించిన సీలు వుంటుంది. కానీ, వాస్తవానికవి ఒకటి ఒక కిలో... యింకోటి కిలోంబావు. మరొకటి కిలోన్నర వుంటాయి"

'అదెలా సాధ్యమ 'ని అడిగాను.

"ఇదే విషయాన్ని తూకం రాళ్లు అమ్మేవారినడిగాను సార్... మానవుడి మేధాశక్తి పెరిగిన కొద్దీ మంచికి బదులు యిలా మోసాలకు వినియోగిస్తున్నారు. కిలో బాటు అడుగు భాగాన్ని తొలిచి అధిక బరువు కలిగిన ఉక్కు గుండ్లను అమర్చి యథావిధిగా పూడ్చేస్తారట. వీటిని పాత సామానులేవైనా కొనే వ్యాపారులంతా వాడుతున్నారు" అంటూ సాంబయ్య చెప్తూంటే నేను నివ్వెరబోయాను.

"సార్... యిలా మోసగించడం గూడా నాకిష్టం లేదు. నా మనసు చంపుకొని యీ వ్యాపారం చేస్తున్నాను" సాంబయ్య కళ్లు చెమ్మగిల్లాయి.
"సాంబయ్యా... దీంట్లో నీ తప్పేమీ లేదు. నువు చేస్తున్న మోసం అత్యల్పం. ప్రజలు మార్కెట్ విలువకు పోకుండా అత్యాశకు వెళ్లి బేరసారాలు చేయడం... 'శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు " అన్నట్టు వినియోగదారుడికి అత్యాశ వున్నంతకాలం ఇలాంటి మోసాలు జరుగుతూనే వుంటాయి. అలాంటి ఆశల వలయాలతో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీల్లో, బ్యాంకుల్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు. యిత్తడిని పుత్తడని నమ్మించే దగాకోరుల కోరల్లో బలైపోతున్నారు. 'ఆశ మూరెడైతే మోసం బారెడన్నట్టు ' మనలో అత్యాశ వున్నంత వరకు మోసాలు సజీవంగా మనతోనే కాపురం చేస్తూంటాయి" అంటూ నేను సాంబయ్యను సముదాయిస్తూంటే అతడి కళ్లల్లో భవి విప్లవాత్మక మార్పులకు కృషి చేయాలనే ఆశయ జ్యోతులు వెలగడం చూశాను...

మరిన్ని కథలు