Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

మెగాస్టార్ తో సినిమా నా కోరిక - నిర్మాత బండ్ల గణేష్

Interview with  Bandla Ganesh

బండ్ల గణేష్.. ఒక్కో పిరియడ్ లో ఒక్కో నిర్మాత, ఒక్కో నిర్మాణ సంస్థ లైట్ లో వుంటాయి. ఆ సంస్థ నుంచి, ఆ నిర్మాత నుంచి వరుసపెట్టి చెప్పుకోదగ్గ సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఈ సీజన్ బండ్ల గణేష్ ది. వరుసపెట్టి సినిమాలు తీస్తూవస్తున్నాడు గణేష్. నటుడు అవ్వాలని సరదా పడి, చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, నలుగురితో మంచి అనిపించుకుంటూ నిర్మాతగా మారాడు. అక్కడ నుంచి విజయాలు, అపజయాలు రెండూ చూస్తూ, ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా మారాడు. మరో పదిరోజుల్లో రాబోతున్న 'గోవిందుడు అందరివాడేలే' సినిమాకు ఆయనే నిర్మాత. త్వరలో ఎన్టీఆర్ తో మరో సినిమా రెడీ అయిపోతోంది. ఇలా సినిమా మీద సినిమా చేయడం, అది కూడా ముందుగానే విడుదల తేదీ ప్రకటించడం గణేష్ స్పెషాలిటీ. ఆయనతో  గో తెలుగు ఇంటర్వూ.

ప్ర. చాలా బిజీగా వున్నట్లున్నారు?
జ. అవునండీ. విడుదల తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. ఒక్క సాంగ్ బ్యాలెన్స్ వుంది. మరోపక్క పూరి-ఎన్టీఆర్ సినిమా షెడ్యూల్ మరో రెండుమూడు రోజుల్లో ప్రారంభిస్తున్నాం.

ప్ర. ఇంత హడావుడి అవసరమా.. ముందుగా విడుదల తేదీలు ప్రకటించడం వల్లనే కదా ఇదంతా?
జ. లక్ష్యం అన్నది ఒక్కలాగే వుండదు. మంచి సినిమా తీయాలి.. హిట్ సినిమా తీయాలి. ఇవన్నీ కామన్ లక్ష్యాలు. కానీ ఇన్ టైమ్ లో తీయాలి. ఫలానా తేదీకి విడుదల చేయాలి. ఇవన్నీ ఛాలెంజ్ తో కూడుకున్న లక్ష్యాలు. అవి నాకు ఇష్టం.

ప్ర. లెక్కలేసుకుని చెబుతారా? లేక పండగ సీజన్.. ఓ డేట్ అనేసుకుని చెప్పేస్తారా?
జ. రెండూ కరెక్టే. సీజన్ లేకుండా సినిమా వ్యాపారం వుండదు. అలాగే సినిమాకు ఇన్ని రోజులు సరిపోతాయి అన్న అనుభవం తెచ్చిన అంచనా.

ప్ర. గోవిందుడు ఎలా వుంటాడు?
జ. ప్రతి ఉమ్మడి కుటుంబంలో మనిషిలా వుంటాడు. చూడాలనిపించేలా వుంటాడు.

ప్ర. రామ్ చరణ్ లాంటి మాస్ హీరో దొరికితే మీరు ఇలాంటి ఫ్యామిలీ సినిమా తీయాలని అనుకోవడానికి కారణం.
జ. కేవలం ఓ మంచి సినిమా తీయాలి. మా బ్యానర్ గుర్తుండాలి అనుకోవడమే.

ప్ర. ఈ రోజుల్లో ప్రేక్షకులు చూస్తారా?
జ. తప్పకుండా. సీతమ్మ వాకిట్లో...చూడలేదా? మంచి కుటుంబ కథా చిత్రాలు రాకనే ప్రేక్షకులు టీవీల దగ్గర వుండిపోతున్నారు. చూడదగ్గ సినిమా వస్తే, ఫ్యామిలీ ఫ్యామిలీ థియేటర్లకు వస్తారు.

ప్ర. పవన్, బన్నీ, చరణ్ తో సినిమాలు అయ్యాయి. ఎన్టీఆర్ తో వరుసగా మళ్లీ చేస్తున్నారు. ఇంక తరువాత?
జ. మెగాస్టార్. చిరంజీవి గారితో తీయాలని కోరిక. ఆయన తో తీస్తే, ఫ్యామిలీ అందరితో తీసినట్లు అవుతుంది.

ప్ర. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది. గోవిందుడు.. ఆడియో ఫంక్షన్ లో మరీ అంతలా గాలిలోకి ఎత్తేసారు మెగా ఫ్యామిలీని.
జ. గాలిలోకి ఎత్తడ మేమిటి? ఉన్నదే చెప్పాను.. నా మనసులో భావాలు ఓపెన్ గా చెప్పాను. బండ్ల గణేష్ కు లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం రాదు. ఆ ఫ్యామిలీ సినిమాలు నన్ను ఈ స్థాయిలో నిల్చో పెట్టాయి. చెప్పడం తప్పా?

ప్ర. బాద్ షా మీరు అనుకున్న రేంజ్ చేరలేదు. మళ్లీ పూరితో ఎన్టీఆర్ సినిమా ప్లాన్ చేసారు. పైగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్లాప్ ల్లో వున్నారు.
జ. హీరో హిట్ ఫ్లాపులు నాకు అనవసరం. మంచి డైరక్టర్, మంచి సబ్జెక్ట్ దొరికిందా లేదా? బాద్ షా కు ముందు ఎన్టీఆర్ ఏమిటో నాకు అనవసరం. మంచి డైరక్టర్, మంచి హీరో, మంచి కథ. అంతే చేసాను. అది కూడా డిస్సపాయింట్ మెంట్ కాదు. కాస్ట్ కాస్త ఓవర్ బడ్జెట్ అయిందంతే. ఈసారి కూడా అంతే ఎన్టీఆర్ కు ఎన్ని హిట్ లు వచ్చాయి అని కాదు. నేను హిట్ సినిమా తీయాలి ఆయనతో అదే లక్ష్యం.

ప్ర. పూరి మీద కూడా మీకు ప్రత్యేక మైన అభిమానం వున్నట్లుంది?
జ. నాకు పరిచయమై, మనసుకు దగ్గరైన ప్రతి ఒక్కరిని అలాగే అభిమానిస్తాను. అది నా నైజం. అంతే.

ప్ర. నటుడు కావాలని వచ్చారు. నిర్మాత అయిపోయారు. ఇంక నటన వదిలేసినట్లేనా?
జ. అలా అని ఏమీ లేదు. తీరు బాటైనా.. లేదా ఏదైనా కథ విన్నపుడు ఇందులో మంచి పాత్ర వుంది. అది నాకు బాగుంటుంది అని అనిపించినపుడైనా..చేస్తాను.

ప్ర. మీరు బొత్స సత్యనారాయణకు బినామీ అని.. ఇలా రకరకాల రూమర్లు మీపై...
జ. రూమర్లు అని మీరే అంటున్నారు కదా. నేను ఆయనను కలిసి ఏళ్లు దాటుతోంది. ఆయన పెద్దాయన. నాలాంటి చిన్నవాడితో ఆయనకేంటి చెప్పండి. ఇది నాకష్టం. నా వ్యాపారం. నా వ్యాపకం. అంతే. అయినా అలాంటివి నేను అస్సలు పట్టించుకోను.

ప్ర. పవన్ తో రెండు సినిమాలు చేసారు. మళ్లీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదా?
జ. కోరిక వుండకుంటా వుంటుందా?.. కథ, డైరక్టర్ కుదిరితే పవన్, బన్నీ, ఇలా ఎవరితోనైనా సినిమాలు చేస్తూనే వుండాలని వుంటుంది. ఇప్పుడు అన్న చిరంజీవి ఒప్పుకుంటే ఆయన 150 సినిమా చేయాలని వుంది. ఇంకా చాలా చాలాప్లాన్ లు వున్నాయి.

ప్ర. మీ ఒకప్పటి స్థాయి.. ఇప్పటి స్థాయి ఎప్పుడైనా బేరీజు వేసుకుంటూ వుంటారా?
జ. మరిచిపోతే కదా బేరీజు వేసుకోవడానికి. నేను నిన్నటిని ఎప్పటికీ మరవను. బండ్ల గణేష్ గురించి తెలిసిన హీరోలంతా నేను అప్పటికీ ఇప్పటికీ ఒక్కలాగే వున్నాననే అంటారు. మొన్న మెగాస్టారే స్టేజీ మీద అదే మాట అన్నారు.

ప్ర. గో తెలుగు పాఠకులకు ఓ మంచి మాట
జ. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి. భగవంతుడ్ని నమ్మండి.. అంతా శుభమే జరుగుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు. నా ఫిలాసఫీ.

ప్ర.థాంక్యూ
జ.ధాంక్యూ

 
మరిన్ని సినిమా కబుర్లు
Aagadu Movie Review