Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కురుక్షేత్రం

kurukshetram telugu story

సార్!! ఒక సెన్సేషనల్ న్యూస్...అంటూ చీఫ్ ఎడిటర్ గోపాలం గారి గది లోనికి పరిగెత్తుకుని వచ్చినాడు దివాకర్.

రేపటి పత్రికలో ఏ వార్తలు మొదటి పేజీ లో రావాలో ఏవి తరువాత రావాలో వరుస క్రమంలో పెడుతున్నాడు. అదే సమయం లో ప్రతి వార్తని క్షుణ్ణం గా పరిశీలించి ఏమైనా తప్పులు వుంటే వాటిని సరిజేసి ఒకదాని తరువాత ఒకటి అమరుస్తున్నాడు.

నిజం పత్రిక కి గోపాలం వ్యవస్థాపకుడు, నిక్కచ్చైన మనిషి, ఆ పత్రిక స్థాపించి 30 ఏళ్ళు అయినా ఏ ఒక్కనాడు ఏ ఒక్క వార్తా పత్రికా ధర్మం వీడి అచ్చు వేయలేదు.. పత్రికా విలువలని అంత ఖచ్చితం గా పాటిస్తాడు. అందువల్లనే ఎన్ని పేరున్న పత్రికలున్నా తన నిజం పత్రిక లో ఏదైనా వార్త వస్తే అది నిజం అని ప్రజలు నమ్మే స్థాయిలో వుంది ఈ రోజు. దివాకర్, ఆ పత్రికలో కొత్తగా చేరిన రిపోర్టర్ మంచి తెలివి, జర్నలిజం లో యం. గోల్డ్ మెడలిస్ట్ కొత్తగా చేరినందుకు కాబోలు తనని తాను నిరూపించుకోవటానికి శతవిధాల కష్టపడుతునాడు. ఈ మధ్యనే ట్రాఫిక్ కూడళ్ళలో బిక్షగాళ్ళపై అతని పరిశోధనాత్మక వ్యాసం అందరినీ విస్మయపరిచే విధం గా వుండి అందరి మన్ననలు పొందింది అంతే కాకుండా దానికి గాను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ కు ఎంపికైనాడు.

గోపాలం ఒక్కసారి దివాకర్ వైపు చూసి ఏమిటా సెన్సేషనల్ న్యూస్ అన్నట్టు అడిగినాడు.

దివాకర్ వెంటనే... సార్! వర్ధమాన సినీనటి తార పోలీస్ రైడ్ లో దొరికింది, ఆమెతో పాటు ఒక ఎం.పి కొడుకు, ఒక వ్యాపారవేత్త వున్నారు. నా దగ్గర ఎవరికి లభించని ఫోటోలు వున్నాయి. ఆమెని ఒక వెల్ ఫేర్ హోం లో పెట్టినారట, అక్కడికి కూడా వెళ్ళి మరిన్ని ఫోటోలు తీసుకువస్తాను.

ఈ వార్త గాని మనం మొదటి పేజీ లో ఫోటో లతో సహా అచ్చు వేస్తే మన పత్రిక సర్క్యులేషన్ ఒక్క సారిగా పెరుగుతుంది, ఇంకా మన పత్రిక కూడా పేరున్న పత్రికలకి ధీటుగా మార్కెట్లో వుంటుంది... ఏమంటారు? అని ఎంతో ఉత్సాహం గా అన్నాడు..

గోపాలం తాను చేస్తున్న పనిని ఆపేసి దివాకర్ పై చెయ్యి వేస్తూ పద అలా టీ తాగుతూ మాట్లాడుదాం అని బయటకు తీసుకువెళ్ళి ఒక హోటల్ లో కూర్చున్నారు. కాసేపటికి సర్వర్ తెచ్చిన టీ తాగుతూ గోపాలం మొదలుపెట్టినాడు. చూడు దివాకర్ నేను పత్రిక పెట్టినప్పుడు చాలా తక్కువ పత్రికలు వుండేవి, తరువాత చాలా పత్రికలు వచ్చినాయి. అందులో చాలా మటుకు పెట్టుబడి దారులు లేక రాజకీయ నాయకుల అండతో నడుస్తున్నవే. ఏ పత్రికలో వార్త గమనించినా నీకే తెలుస్తుంది అవి ఎంత ఉపయోగకరమైనవో... ఒక పత్రిక ఒక రాజకీయ నాయకుడి కోసం పనిచేస్తే ఇంకోటి ప్రభుత్వం కోసం పనిచేస్తుంది.. మరొకటి  ఊహాగానాలతో వార్తలు వ్రాసి ప్రజల మొహాన పడేస్తాయి... అంతేకానీ ప్రజల కోసం పనిచేసే పత్రికలుఎన్ని వున్నాయో వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

ఒక వార్త ప్రచురిస్తున్నాం అంటే అది ప్రజలకి ఎంత ఉపయోగం వుండాలో ఆలోచించాలి, అది ఒక్కసారి పత్రికలో వచ్చిన తరువాత సమాజం లో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలి, అసలు ఆ వార్త ప్రజల సమస్యలని తెలియజేస్తుందా అని చూడాలి.మన పత్రిక గొంతుక ద్వారా ప్రజల ఇక్కట్లని బయట ప్రపంచానికి తెలియజేయాలి.

ఇప్పుడు చెప్పు నువ్వు తెచ్చిన సో కాల్డ్ సెన్సేషనల్ న్యూస్ ఎంతమందికి ఉపయోగపడుతుంది?

ఆ సినీ తార ఎన్ని కష్టాల్లో వుందో ఏ పరిస్థితుల్లో ఆ ఆ పని చేసిందో , పైగా ఆ ఫోటో లు వున్నాయి కాని ఆమెతో పాటు వున్న పెద్దవారి మాటేమిటి?

వాళ్ళు తప్పుచేయలేదంటావా?

ఆమెని తీసుకువెళ్ళి వెల్ఫేర్ హోం లో పెడితే మరి ఆ పెద్దమనుషులని ఏ హోం లో పెట్టాలి?

ఇవన్నీ నువ్వు ఆలోచించావా?

నువ్వు తెచ్చిన వార్త వల్ల మన పత్రిక సర్క్యులేషన్ పెరుగుతుందేమో కానీ సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడుతుంది.. అది నాకు ఇష్టం లేదు.

నీకు నా పద్దతి నచ్చకపోతే బయట చాలా పత్రికలు నీలాంటి వారి కోసం, నువ్వు ఈ రకమైన వార్తల కోసం ఎదురుచూస్తూ వుంటాయి, నిరభ్యంతరం గా వెళ్ళు,

ఆ తరువాత దివాకర్ కొన్ని రోజులు కనపడలేదు.. ఫోన్ చేసినా తీయలేదు.. వేరే పత్రికలో చేరి వుంటాడు అని గోపాలం మిన్నకుండిపోయాడు.

ఒక నెల తరువాత గోపాలం గదిలో యధావిధిగా తన పని చేస్తుంటే సర్ అనే పిలుపు వినిపించింది తల పైకెత్తి చూసాడు ఎదురుగా దివాకర్.ఏయ్ దివాకర్ ఎక్కడికి వెళ్ళినావు ఇన్ని రోజులు, ఫోన్ చేస్తే కూడా తీయలేదు అని అన్నాడు.

సార్ ఒకసారి ఈ వార్త చూడండి అని ఒక చిన్న బుల్లెట్ లాంటిది ముందుంచినాడు.

అది చదివి గోపాలం మొహం లో సంతోషం, కంట్లో కన్నీరు,, అది ఏజెన్సీలో వున్న ఆదివాసీ ల గురించి వారి కష్టాల గురించి వారికి సరైన మంచినీరు దొరకదు, మంచిగా చదువుకుందామంటే పాఠశాలలు లేవు, సరైన రహదారులు లేవు, వారి జీవితం దుర్భరం గా వుంది.దివాకర్ ఒక నెల అక్కడ వుండి అవన్నీ పరిశోధించి ఒక చిన్న రిపోర్ట్ తయారుచేసి గోపాలం ముందు వున్నాడు.

మొత్తం రిపోర్ట్ చదివిన గోపాలం ఆనందానికి అవధుల్లేవు, ఒక్క సారి దివాకర్ ని హత్తుకుని ఇలాంటి వార్తలే కావాలి.

మనకి, మన పత్రికకి...

ఆదివాసీ ల జీవితాలని కళ్ళకి కట్టినట్టు వ్రాసినావు. ఇలాంటి మార్పే నేను కోరుకున్నడి, రేపే దీన్ని అచ్చువేద్దాం అని అన్నాడు.దివాకర్ సంతోషం తో వెళుతుంటే గోపాలం అతనిని పిలిచి నీకు ఇంకో శుభవార్త బిక్షగాళ్ళపై ఎంతో కష్టపడి పరిశోధించి వ్రాసిన వార్తకి గాను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ కి నీ పేరే ఖరారైంది... చూద్దాం ఈ ఆదివాసీల కథనానికి ఇంకేం వస్తుందో అని అన్నాడు..

అంతా మీ ఆశీర్వాదం సార్, మీరు ఆ రోజు నాతో అలా మాట్లాడక పోయుంటే అలా హితబోధ చెయ్యకుంటే నాలో ఈ మార్పు వచ్చేది కాదు, మీ విలువలనీ నేను ఎప్పుడు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను అని సంతోషం గా బయటకి వెళుతుంటే గోపాలం చూడు దివాకర్ ఇప్పుడు వున్న పత్రికా కురుక్షేత్రం లో యుద్ధం గెలవగలగనే కాంక్ష వుండడం మంచిదే కానీ నువ్వు పాండవుల వైపా కౌరవుల వైపా అనేది బాగా ఆలోచించాలి అని అన్నాడు. దివాకర్ ఏమీ అర్ధం కానివాడిలా చూస్తుంటే... అదేనయ్యా.. మనం ధర్మం వైపా అధర్మం వైపా ఎటువైపు వుండి పోరాడాలో నీలాంటి విధ్యావంతులకి, తెలివిమంతులకి చెప్పాల్సిన అవ్సరం వుందా? అని అనగానే అర్ధం అయింది సార్? అని కళ్ళు చేమర్చుకుంటూ బయటకి వెళ్ళినాడు... ఇంకో ధర్మ యుద్ధానికి సమాయ్త్తం కావటానికి...  

మరిన్ని కథలు
avakasavadam telugu story