Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

కాబోయే రాజ‌మౌళి వినాయ‌క్‌ల‌ను వెదికి ప‌ట్టుకొంటున్నా - నిఖిల్‌

interview with nikhil

యువ‌త‌రం హీరోల బ్యాచ్ ఎక్కువే ఉంది. రోజుకో కొత్త హీరో వ‌స్తున్నాడు. ప్రేక్ష‌కులు ఎవ‌రిన‌ని గుర్తుపెట్టుకొంటారు....??  అంత‌మందిలో సెప‌రేట్‌గా క‌నిపించాలంటే ఓ స్పెషాలిటీ ఉండాలి. ఫోక‌స్ పెట్టాలంటే సమ్‌థింగ్ స్పెష‌లై ఉండాలి. ఆ ప్ర‌త్యేక‌త నిఖిల్ లో ఉంది. కుర్రాడు చూడ‌గానే న‌చ్చేసే టైప్‌. అత‌ని జోరు.. భ‌లే ముచ్చ‌ట‌గా ఉంటుంది. కాస్త చిక్కిన చిన్న‌ప్ప‌టి ర‌వితేజ‌లా ఉంటాడు. తెర‌పై అత‌ని క్యారెక్ట‌ర్లు అంత జోవియ‌ల్‌గా సాగిపోతుంటాయి. మ‌రీ సూప‌ర్ హిట్లు కొట్ట‌క‌పోయినా.. త‌న ఖాతాలోనూ ఓ రేంజు సినిమాలున్నాయి. స్వామి రారాతో డిఫ‌రెంట్ జర్నీ మొద‌లెట్టాడు. ఇప్పుడు కార్తికేయ‌తో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా కార్తికేయ గురించి నిఖిల్ ఏమంటున్నాడు, త‌న కెరీర్‌పై ఎలాంటి ఆలోచ‌న‌లున్నాయి..??  ఈ విష‌యాల‌పై ఆరా తీసింది గో తెలుగు.

* దీపావ‌ళి శుభాకాంక్ష‌లు..
- థ్యాంక్సండీ. మీక్కూడా...

* ఏంటీ పండ‌గ స్పెష‌ల్‌..
- నా కార్తికేయ సినిమానే. రిలీజ్ డే క‌దా.. గుండెల్లో దీపావ‌ళి ట‌పాసులు మోగుతున్నాయి.. (న‌వ్వుతూ)

* ఈ సినిమాపై కాస్త పాజిటీవ్ గాలి వీస్తోంది ముందు నుంచీ..
- ఔనండీ. అది మా అదృష్టం. టైటిలే పిచ్చ పాజిటీవ్‌. పైగా స్వామి రారా త‌ర‌వాత వ‌స్తున్న మూవీ. ట్రైలర్స్‌, పాట‌లు ఇప్ప‌టికే జ‌నానికి న‌చ్చేశాయ్..

* స్వామి రారా త‌ర‌వాత ఎందుకింత లేట్‌..
- స్వామి రారా మంచి హిట్ట‌య్యింది. నేనెంత‌కాలం నుంచో ఎదురుచూస్తున్న విజ‌యం అది. విజ‌యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త నామీద ఉంది. డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ డీల్ చేస్తే క‌చ్చితంగా చూస్తార‌న్న హోప్ ఇచ్చిన సినిమా అది. దాన్ని కాపాడుకోవాల‌ని శ్ర‌మించాం. కేవ‌లం స్ర్కిప్ట్ కోసం తొమ్మిది నెల‌లు ప‌ట్టింది. అన్నీ ప‌క్కాగా పూర్తయ్యాకే సెట్స్‌పైకి వెళ్లాం.  గ్రాఫిక్స్ కూడా టైమ్ తీసుకొంది. ఆ త‌ర‌వాత రిలీజ్ డేట్ కోసం ఆగాం. అన్ని విధాల మాకు అనువైన స‌మ‌యంలోనే సినిమా విడుద‌ల చేస్తున్నాం..

* స్వామి రారా లానే ఇందులోనూ థ్రిల్లింగ్ విష‌యాలున్నాయా?
- చాలా. అది క్రైమ్ కామెడీ. ఇందులో కొంచెం హార‌ర్ అంశాలు మిక్స‌యి ఉంటాయి.

* ఇంత‌కీ కాన్సెప్ట్ ఏంటి?
- ద‌య్యం, దైవం.. వీటిలో మీరు దేన్ని న‌మ్ముతారు...??  న‌మ్మ‌కం వెనుక మూఢ‌న‌మ్మ‌కాలుంటాయి. ద‌య్యం, దైవం, సైన్స్ వీటి చుట్టూ తిరిగే క‌థ ఇది. కార్తికేయ స్వామి ఆల‌యాన్ని మూసేస్తారు. దాన్ని తెర‌వ‌డానికి ప్ర‌య‌త్నించేవాళ్లంతా అనుకోకుండా చ‌నిపోతుంటారు. దాని వెనుక ఉన్న మిస్ట‌రీ ఏమిట‌న్న‌దే క‌థ‌.

* ఇంత‌కీ మీరు దెయ్యాల్ని న‌మ్ముతారా?
- దేవుడ్ని, దయ్యాల‌నూ రెండింటినీ న‌మ్మాల్సిందే. దాంతో పాటు సైన్స్ ని కూడా.

* వ‌రుస‌గా రెండోసారి స్వాతితో సినిమా చేస్తున్నారు.. ఏంటి స్పెష‌ల్‌..
- (న‌వ్వుతూ) అది అనుకోకుండా కుదిరిందండీ. స్వాతితో చాలా కంఫ‌ర్ట్‌. తెలుగమ్మాయి. సెట్లో ఎలాంటి గంద‌ర‌గోళం ఉండ‌దు. పైగా మా ఇద్ద‌రి ఎన‌ర్జీ లెవిల్స్ మ్యాచ్ అవుతాయి.

* కానీ బ‌య‌ట మీ ఇద్ద‌రికీ ల‌వ్ ఎఫైర్ ఉందంటున్నారు..?
- అదంతా ఒట్టి పుకారేనండీ. మేం జ‌స్ట్ కో ఆర్టిస్ట్స్ అంతే. క‌నీసం ఫ్రెండ్స్ కూడా కాము. సెట్లో మా సీన్ అయిపోగానే ప‌క్క‌కు వెళ్లిపోయి ఎవ‌రి ప‌నుల్లో వాళ్లం ప‌డిపోతాం. మ‌రెందుకు ఇలాంటి పుట్టాయో నాకైతే అర్థం కావ‌డం లేదు.

* ఇంత‌కీ కెరీర్ ఎలా సాగుతోంది..?
- బాగుందండీ. ప‌ది సినిమాలు చేశా. అందులో రెండు మూడు హిట్స్ కూడా ఉన్నాయి. న‌న్ను న‌మ్మి ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు. వాళ్ల న‌మ్మాకాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి నూటికి నూరుపాళ్లూ కృషి చేస్తా. మ‌రోటి నా సినిమా వ‌స్తుందంటే జ‌నాలు ఎలాంటి అంచ‌నాలూ లేకుండా థియేట‌ర్ల‌కు వ‌స్తుంటారు. అది నాకు బాగా క‌లిసొస్తోంది. కొత్త‌గా ఏం చేసినా ఇప్పుడే చేయాలి అని ఫిక్స‌య్యాను. ఇమేజ్ లేక‌పోవ‌డం నాకే మంచిద‌వుతోంది. అందుకే స్వామి రారా, కార్తికేయ లాంటి క‌థ‌లు చేసేందుకు థైర్యం వ‌స్తోంది.

* మాస్ సినిమాల్ని ఇక ప‌క్క‌న పెట్టేసిన‌ట్టేనా?
- యువ‌త‌, క‌ళావ‌ర్ కింగ్‌.. అలాంటి సినిమాలే క‌దా.

* పెద్ద ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసే అవ‌కాశాలు రావ‌డం లేద‌ని ఫీల‌వ్వ‌డం లేదా?
- అదేం లేదండీ. మ‌న‌కున్న పెద్ద ద‌ర్శ‌కుల జాబితా తీస్తే ఆరేడు మంది క‌నిపిస్తారు. రాజ‌మౌళి, వినాయ‌క్ మ‌న‌తో సినిమాలెందుకు చేస్తారు చెప్పండి. అందుకే కాబోయే రాజ‌మౌళి, వినాయ‌క్‌లు ఎక్క‌డున్నారో ప‌ట్టుకొంటున్నా... (న‌వ్వుతూ)

* ప‌రిశ్ర‌మ‌లో వాతావ‌ర‌ణం ఎలా ఉంది?
- చాలా బాగుందండీ. నాకైతే అంద‌రితోనూ మంచి సంబంధాలున్నాయి. ఎవ‌రి అండా లేకుండా, గాడ్ పాధ‌ర్ లేకుండా ప‌ది సినిమాలు చేశానంటేనే ఇక్క‌డి వాతావ‌ర‌ణం ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. టాలెంట్ ఉంటే స‌రిపోతుందండీ. ఎవ‌రైనా నిరూపించుకోవ‌చ్చు.

* త‌ర‌వాతి సినిమా?
- ప్ర‌స్తుతం కార్తికేయ రిజ‌ల్ట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. ఆ త‌ర‌వాతే కొత్త సినిమా సంగ‌తులు..

* ఆల్ ది బెస్ట్ 4 కార్తికేయ‌...
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌..

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
pooja movie review