Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ :  జర్నలిస్టు లహరి, సహస్ర ఒకరేనని ఫోటో చూసి ఇట్టే గుర్తు పట్టేస్తారు సహస్ర, ఆమె తండ్రి ప్రత్యర్థులు...ప్రకటన గురించి తర్జనభర్జనలు పడుతుంటారు...


ఆ తర్వాత.......



‘‘మన వాళ్ళకి ఆత్రం ఎక్కువ.  బుర్ర తక్కువ.  పొరబాటు జరక్కూడదు.  పొరబాటున గురి తప్పిందో........

మన వాళ్ళని విరుచుకు తీనేస్తుందా కుర్ర రాక్షసి.  కాబట్టి వెళ్ళినవాళ్ళు ముందు ఆ లహరిని గుర్తించాలి.  పబ్లిక్ లో గాని ఆఫీసుల్లో గాని దాన్ని చంపే ప్రయత్నం చేసి అల్లరి గాకూడదు.  ఆమెను గుర్తించాక అనుమానం రాకుండా అనుసరించి ఇల్లెక్కడో ఎవరితో ఉంటుందో ఆనుపాన్లు గమనించమను. తర్వాత ఏ ఆర్భాటం లేకుండా ఇంట్లోంచి బయటికి రాగానే కాల్చి పారేసి వచ్చేయమను.  హత్య చేసిన గంటలోపలే మన వాళ్ళంతా చెన్నై బయటికొచ్చేయాలి.  అర్ధమైందా?  ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. ఎంత ఖర్చయినా ఫరవాలేదు.  ఇచ్చి పంపించు.  వెళ్ళి ఆ పని చూడు’’  అంటూ ఆర్డర్  వేసాడు త్యాగరాజన్.

‘‘ఒకె సార్.......’’  అంటూ తీసుకొని బయటికెళ్ళిపోయాడు ఎట్టయ్యప్పన్.  మరో గంట తర్వాత త్యాగరాజన్ మనుషులు పది మంది ప్రత్యేకమైన వ్యాన్ లో బయలుదేరి చెన్నై వైపు ప్రయాణం ఆరంభించారు.

I              I                     I

అదే రోజు ఉదయం...........

కొయంబత్తూరు.............

పాలెస్ వంటి వెంకటరత్నం నాయుడు గారి హౌస్..........

రెండో అంతస్తులోని తమ పడగ్గదిలో ఉదయం ఆరు గంటలకి లేవగానే స్నానాదులు ముగించుకొని ఏడుగంటలకంతా పూజాదికాలు ముగించి తీరిగ్గా బాల్కనీలోని తూగుటుయ్యాలలో కూచొని ఆ రోజు రెండు మూడు దినపత్రికలు చదవటం ఆయన అలవాటు.

అలాగే ఉదయం తన భార్య మంగతాయారు అందించే కాఫీ తాగితే గాని ఆయనకి తృప్తి ఉండదు.  ఇంట్లో ఎందరు పనివాళ్ళున్నా వాళ్ళు వంట వార్పు వరకే పరిమితం. భోజన సమయంలో కూడ భార్య దగ్గరుండి వడ్డించాల్సిందే.

అలవాటు ప్రకారం ఆ రోజు ఉదయం కూడ తూగుటుయ్యాల మీద కూచొని పేపరు చూస్తూ నవ్వుకుంటున్నాడాయన.  ఈ లోపల సిల్వర్ కప్పులో కాఫీ తెచ్చి అందించిన మంగతాయారు అది గమనించి ‘‘మీలో మీరు నవ్వుకుంటున్నారు ఏమైందేమీటి?’’ అనడిగింది.

‘‘పేపరు చూస్తుంటే నవ్వొస్తోందోయ్. రోజులు యిలా మారిపోతున్నాయేమిటి అన్పిస్తోంది’’.  అన్నాడు కాఫీ సిప్ చేస్తూ వెంకటరత్నం నాయుడు గారు.

‘‘మారుతోంది రోజులు కాదులెండి.  మనుషులు.  ఇంతకీ విషయం ఏమిటి?’’

‘‘ఏమిటంటే ఏం చెప్పనోయ్.  మన కాలంలో పిల్లలు యిలా ఉండేవారా?  కట్టరా తాళి అంటే పెద్దలు చూపించిన పిల్ల మెడలో కళ్ళు మూసుకొని తాళి కట్టేవారు. ఎవరో ఎందుకు?  మన సంగతే చూడు.  పెళ్ళికి ముందు నీ ముఖం కూడ నాకు తెలీదు గదా.......’’

‘‘మన సంగతి వదిలేయండి.  పేపర్ లో విషయం ఏంటో చెప్పండి’’.  అంది నవ్వుతూ మంగతాయారు.

‘‘అక్కడికే వస్తున్నానోయ్.  ఈ ప్రకటన చూడు.  తన ప్రియురాల్ని పట్టిస్తే కొటి రూపాయలిస్తానంటూ పేపరు ప్రకటనిచ్చాడో ప్రబుద్దుడు,  బుద్దుండొద్దూ,  పెళ్ళాం కూడా కాదు, ప్రియురాలట.  అంటే యిద్దరూ ప్రేమించుకొనుండాలి. ఆ పిల్లతో ఏం గొడవపడ్డాడో ఏమిటో.  ప్రియురాలు తన దారిన ఎటో వెళ్ళిపోయింది. తనే పట్టుకోలేకపోయాడు. ఇక జనం పట్టుకుంటారా?

ప్రేమా దోమా అంటూ చెడిపోయి యిలా పేపర్లకెక్కటం పద్దతేనా?’’  అంటూ పేపరు అందించాడు.

‘‘కాని ఈ అమ్మాయిని గమనించారా?  ఎంత లక్షణంగా ఉందో.  మహాలక్ష్మిలా ఉంది గదండీ’’  అంటూ మెచ్చుకుంది మంగతాయారు. ‘‘మన విరాట్ కి చిలక్కి చెప్పినట్టు చెప్పాను.  సాగరికను పెళ్ళిచేసుకోమని.  వూహు,  మేనరికం తన కిష్టంలేదట.  ఢీల్లీకో ముంబైకో పారిపోయి తప్పించుకు తిరుగుతున్నాడు.  ఎంతకాలమో చూస్తాను. చెవి మెలేసి మరీ వాళ్ళిద్దరి పెళ్ళి జరిపిస్తాను’’  అన్నాడు పట్టుదలగా.‘‘అవున్లెండి మీరాపని చేస్తారనేవాడు  ఇంటికి రావటమే మానేసాడు.  రెండేళ్ళు కావస్తోంది.  బిడ్డ ఎక్కడున్నాడో ఎలా వున్నాడో? మీ పంతం మీదే గాని ఈ కాలం పిల్లలు మన మాట వింటున్నారా ఏమన్నానా’’  అంటూ సిల్వర్ కప్పు తీసుకొని లోనకెళ్ళిపోయిందావిడ.

ఇంతలో ఆయన సెల్ ఫోన్ మోగింది

అవతల లైన్ లో ఉంది కూతురి కూతురు తనకు మనవరాలు అయిన సాగరిక

‘‘ఏమిటి పొద్దుటే ఫోన్  చేసావ్,  ఏంటి విశేషం?’’  అనడిగాడు నవ్వుతూ.

‘‘విశేషం ఉంది తాతయ్యా,  మావయ్య విరాట్  ఎక్కడున్నాడో తెలిసి పోయింది.’’  అవతల ఉత్సాహంగా అరిచింది సాగరిక.

ఒక్కసారి ఉద్వేగానికి లోనయ్యాడు వెంకటరత్నం నాయుడు.

‘‘ఎక్కడ........ఎక్కడున్నాడు?’’ ఆతృతగా అడిగాడు.

సాగరిక మౌనం..........

‘‘చెప్పు......... .చెప్పవే తల్లి’’

‘‘నేను చెప్పను’’

‘‘అదేమిటే మవాడ్ని చేసుకోవటం నీ కిష్టం లేదా?’’

‘‘నా యిష్టం సంగతి పక్కనపెట్టు తాతయ్య.  మేనరికం మావయ్య కిష్టం లేదు గాబట్టి నాకూ ఇష్టం లేదంతే.  మావయ్యకు నచ్చిన పిల్లతోనే పెళ్ళి జరిపిస్తానంటే చెప్పు. ఎక్కడున్నాడో చెప్తాను.’’

‘‘ఓకే అలాగే చేద్దాం.  చెప్పు’’

‘‘ఆహా ఉత్తినే చెప్పేస్తారు పాపం,  ప్రామిస్ చెయ్యి. చెప్తాను’’

‘‘సరి ప్రామిస్  చేస్తున్నాను.  చెప్పవే తల్లీ ఎక్కడుంటున్నాడు?  నీగ్గాని ఫోన్ చేసాడా?’’

‘‘చేయలేదు గాని తాతయ్య ఇవాళ పేపర్  చూసావా?’’

‘‘ఇప్పుడా పనిమీదే ఉన్నాను’’

‘‘అన్ని పేపర్లలోనూ ఒక ప్రకటనుంది’’  ‘‘నా ప్రియురాల్ని పట్టిస్తే కోటి రూపాయలు’’  అని చదివావా?

‘‘ఏమిటే పొద్దుటే నాతో వాదులాట. ఆ ప్రకటనతో మనకి సంబంధం ఏమిటి?’’

‘‘తాతయ్యా చదివావా లేదా ముందు చెప్పు’’

మనవరాలి మాటలు వెంకటరత్నం నాయుడి గారిలో అనుమానం రేకెత్తించాయి.  గుండెల్లో బాంబు పేలినట్టయింది.  గుండె కొద్ది క్షణాలు టకటకా కొట్టుకుంది.

‘‘మాట్లాడవేంటి తాతయ్య. చదివావా?’’  అవతలి నుంచి సాగరిక దబాయింపుతో ఆలోచనల నుంచి బయటపడి ‘‘ చదివానమ్మ కాని....’’ అన్నాడు.

‘‘కానీ లేదు గీనీ లేదు.  ఆ ప్రకటనిచ్చింది ఎవరో కాదు విరాట్  మావయ్య’’ అంది.

‘‘విరాటిచ్చాడా... నేన్నమ్మను. ఎలా చెప్పగలవ్?’’  షాక్  తింటూ అడిగాడు

‘‘ఎలా ఏంటి తాతయ్య ఓ సారి ఆ ఫోన్ నెంబర్ గమనించు. మావయ్య పర్సనల్  నంబరది. కోయంబత్తురులో ఉండగా తీసుకుంది. ముఖ్యమైన వాళ్ళకి తప్ప ఈ నెంబరు ఎవరికీ యివ్వడు.  అప్పట్లో ఒకటి రెండు సార్లు నాకు ఫోన్  చేయగా నోట్  చేసుకున్నాను.  అనుమానం వచ్చి చెక్  చేస్తే అదే నంబరు. అంటే మావయ్య చెన్నైలో ఉంటూ ఎవరో సహస్రనే అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి ఫోటో చూసావ్గా చాలా బాగుంది.  ఇదంతా ఎందుకు చెప్పానంటే ప్రామిస్  చేసాక మాట తప్పకూడదు.  ఫోన్ చేసి మావయ్యను రప్పించి వాళ్ళిద్దరికీ పెళ్ళిచేయాలి సరేనా?’’

‘‘సరిసరి విషయం చెప్పావ్గా.  ముందు వాడు దొరకనీ తార్వత చూద్దాం.’’ అంటూ లైన్ కట్ చేసాడు.

ఈ లోపల జరిగిందేమంటే లోనకు వెళ్ళినట్టే వెళ్ళిన ఆయన భార్య మంగతాయారు తిరిగి వెనక్కి వచ్చి గడప వెనకనుంచే ఆయన మాటలు వినేసింది. ప్రకటనిచ్చింది తమ చిన్న కొడుకు విరాట్ . ఈ ఫోటోలో అమ్మాయిని ప్రేమించాడని అర్థమైపోయింది.  కాని ఏమీ తెలీనట్టు అప్పుడే వస్తున్నట్టుగా తిరిగి బాల్కనీ లోకి వస్తూ ‘‘ఎవరితోనండీ ఫోన్ లో ఇంత సేపు మాట్లాడుతున్నారూ?’’ అనడిగింది.

‘‘ఇంకెవరు?  మనవరాలు సాగరిక’’ అన్నాడాయన.

‘‘ఏమంటుందేమిటి?’’

‘‘దాని ముఖం అదేమంటుంది?  మావయ్య అడ్రస్ తెలిసిందా, ఎప్పుడు మా పెళ్ళి చేస్తారూ అనడుగుతోంది.  ఏం చెప్పాలి చిన్న కొడుకుని నెత్తినెత్తుకున్నావ్ గా. చూడు ఎన్ని సమస్యలో’’

‘‘చూసి ఏం చేస్తాంలెండి.  పిల్లలు వాళ్ళిష్టం.  మనం వాళ్ళననుసరించిపోవాలిగాని మనల్ని వాళ్ళు అనుసరించరు.  డైలీ సీరియల్  చదివిస్తాను. ఓ సారివ్వండి’’ అంటూ పేపరు తీసుకొని తిరిగి లోనకెళ్ళిపోయిందావిడ.

మంగతాయారు తమ సంభాషణవిందని వెంకటరత్నం నాయుడు సందేహించ లేదు.  భార్య వెళ్ళిపోగానే మొదట ఆ నంబర్ కు ఫోన్ చేసి కొడుకుని చెడామడా తిట్టి ఇంటికి రమ్మని చెప్పాలనుకున్నాడు.  కాని అలా చేస్తే వాడు చెన్నై వదిలి వెళ్ళిపోవచ్చు. ఆ పైన చెన్నైలో వాడు ఎక్కడ ఉంటున్నాడో అడ్రసేదీ ప్రకటనలో ఇవ్వలేదాయే. ఇలా కాదు గాని ముందు ఈ సెల్ నంబరు వాడిదో కాదో ఎంక్వయిరీ చేయించి వాడిదేనని తేలితే అప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ముఖ్యంగా పెద్ద కొడుకు విక్రాంత్ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి.సాగరికతో వాడి పెళ్ళి జరగాలంటే వాడు కోయంబత్తూరుకు రావాలి.  వాడు ఎలాగు రాడు. ఇక్కడ్నుంచి చెన్నైకు మనుషుల్ని పంపించి వెదికించి కాళ్ళు చేతులు కట్టి తీసుకురావాలి.  ఇందుకు తమ ఫ్యాక్టరీలో పని చేసే మునిసామి కరక్టు.  పదిమందితో వెళ్ళి పని ముగించుకొచ్చేస్తాడు.  విరాట్ ను తెచ్చి కాళ్ళ దగ్గర పడేస్తాడు. అనుకొంటూ లేచాడు వెంకటరత్నం నాయడు.

I              I                     I

మధురై పోలీస్  కంట్రోల్  రూమ్....

ఎయస్పి ప్రకాష్  చాంబర్....

ఆ రోజు న్యూస్ పేపర్  చూడగానే ఎ యస్ పి ప్రకాష్  ఆనందం ఆపుకోలేక ఒక్కసారిగా  ‘హుర్రే’ అనరిచాడు. ఆ అరుపు విని అదిరిపడి బయట పోలీసులు కింద పడబోయి ఎలాగో నిదొక్కుకుని ముఖముఖాలు చూసుకున్నారు.

‘‘ఈ మెంటల్ గాడి తో చచ్చి పోతున్నాంరా బాబు.  పొద్దుటే ఏమైంది వీడికి?’’ గొణిగాడో పోలీసు.

‘‘ఏయ్ వన్నాట్ ఫోర్  ఆయన పర్సనల్  అసిస్టెంట్ నువ్వేగదా. పోయి ఏమైందో చూడు. పొద్దుటే కుక్కచేత కరిపించుకొచ్చాడో ఏమోఖర్మ.  ఇంకోసారి అరిస్తే గుండాగి ఛస్తాం. పోయిచూడు’’ వన్నాట్ ఫోర్ కి సలహా ఇచ్చారు మరొకరు.

అతను ఎ యస్ పి చాంబర్ లోకి అడుగుపేట్టేసరికి ఆయన ఆ రోజు న్యూస్ పేపర్ కి తెగముద్దులిస్తు కన్పించాడు.

ముఖం నిండా నవ్వు పులుముకొని ‘‘ సార్...  ఏంటి సార్ విశేషం?  చాలా హుషారుగా వున్నారు’’  అనడిగాడు.

పేపర్ లోంచి తలెత్తి చూసాడు.  ఎ యస్ పి ప్రకాశ్  చాలా వుత్సాహంగా కన్పిస్తునాడు మనిషి.

‘‘ఎయ్ వన్నాట్ ఫోర్ !  రా రా రా ఇవాళ చాలా ఆనందంగా ఉందిరా ఎందుకో తెలుసా?’’  అన్నాడు ఛేర్ లోంచి లేస్త్తూ.‘‘ఎందుకు సార్?’’  అమాయకంగా అడిగాడు వన్నాట్ ఫోర్.

‘‘దొరికిపోయిందిరా!’’

‘‘ఎవరు సార్?’’

‘‘నా కలల రాణి.  జాడ తెలిసిపోయిందిరా.  ఇక దొరికిపోయినట్టే’’

వన్నాట్  ఫోర్ కి ఏమీ అర్థంగాక`

బుర్రగోక్కుని చూసాడు.

‘‘మీరు ఏ రాణి గురించి చెప్తున్నారు సార్?’’  అన్నాడు అమాయకంగా.

‘‘ఈ ఫోటో చూడరా తెలుస్తుంది.’’  అంటూ పేపర్  టేబుల్ మీద పరిచి ప్రకటన చూపించాడు.  అంతవరకు ప్రకాశ్  ముద్దులిచ్చింది ప్రకటనలోని సహస్ర ఫోటోకి. ఫోటో చూసి గుడ్లుమిటకరించాడు వన్నాట్ ఫోర్.

‘‘ఈ సహస్ర ఎవరు సార్? ఈ ప్రకటన మీరే యిచ్చినారా?’’ అనడిగాడు.

‘‘నేనివ్వలేదురా.  చెన్నైలో ఈవిడ చేతిలో మోసపోయిన ఎవరో ఒక బకరాగాడిచ్చాడు.  ఇచ్చి మంచి పనిచేసాడు.  సహస్ర చెన్నైలో ఉందని తెలిసిపోయింది. ఇన్ని రోజులూ దీని కోసం గాలిస్తునే ఉన్నారా.  ఇప్పటికి జాడ తెలిసింది.’’

‘‘నాకేమీ అర్థంగావటం లేదు సార్.  ఇంతకీ ఈ సహస్ర ఎవరు?’’

‘‘ఇంకా గుర్తుపట్టలేదా?  కొంత కాలం కిందట ఇదే సమయంలో ఇక్కడికొచ్చింది.  త్యాగరాజన్ కి వ్యతిరేకంగా ఓ ఫైలు తయారుచేసి తెచ్చి నా చేతికిచ్చింది.  రిపోర్టు రాసిచ్చి కేసు ఫైల్  చేయమని చెప్పి వెళ్ళింది..’’

‘‘ఓ.... గుర్తొచ్చిందిసార్. మీరుకేసుబుక్ చేయించలేదుగా. కోర్టు దగ్గర త్యాగరాజన్ గారి మనుషులు చంపబోతే చావగొట్టి తప్పించుకుపోయిందని విన్నాను. అంటే... ఈ ఫోటోలో అమ్మాయే ఆ అమ్మాయా సార్?  కాని ఆ పిల్ల జర్నలిస్టు లహరి అని...’’‘‘అవును లహరి.  ది గ్రేట్  లేడీ జర్నలిస్ట్.  డేరింగ్ డాషింగ్  అండ్ డైనమిక్..  కుంభ కోణాల గుట్టు రట్టు చేసే వీరనారి..  భయపడి పారిపోయింది’’ అంటూ పగలబడి నవ్వాడు ఎ యస్ పి.

అయినా వన్నాట్ ఫోర్ కి డౌట్లు క్లియరవలేదు.

‘‘అంటే ఈ ఫోటోలో సహస్ర జర్నలిస్టు లహరి ఒకరే అంటారా సార్?’’ అనడిగాడు.

‘‘డౌటా..’’ అంటూ వన్నాట్ ఫోర్ ని దగ్గరకు పిలిచి చెవిలో చెప్పాడు.

‘‘ఎవరకీ చెప్పక.  ఈ అమ్మాయి అసలు పేరు లక్ష్మీ సహస్ర. మహాదేవనాయకర్  గారి ఒక్కగానొక్క కూతురు’’ అన్నాడు. వింటూ ‘ఆఁ!’’ అంటూ తెరిచిన నోరుమూయటం మర్చిపోయాడు వన్నాట్ ఫోర్.

‘‘అవును జర్నలిస్టు లహరి తనే. రచయిత్రి సహస్ర తనే. ఈ రోజుకీ అసలు విషయం తెలీక త్యాగరాజన్ మనుషులు జుత్తు పీక్కుంటున్నారు.  నాకీ విషయం తెలుసు. అయినా త్యాగరాజన్ కి చెప్పలేదు. ఎందుకో తెలుసా?  ఆయన ఈ పిల్లని చంపించాలని చూస్తున్నాడు.  నేను రక్షించి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు మొదట చూపులోనే తానే నా భార్య అని డిసైడయిపోయాను. మల్టీ మిలియనీర్   మహాదేవనాయకర్కి కాబోయే అల్లుడ్ని నేనే’’  అంటూ నవ్వాడు.

ఆ మాటలు వింటున్న వన్నాట్ ఫోర్ కి మాత్రం నవ్వాలో ఏడ్వాలో తెలీక వికారంగా  చూసాడు.

‘ఓరినీ..  ఈ తిరుగుబోతు తిప్పడికి బంగారు బొమ్మలాంటి లహరి కావాలా?  మోజు పిల్ల మీదా మహాదేవనాయకర్  కోట్ల మీదా? మహాదేవనాయకర్ తలుచుకుంటే వీడ్ని నలిపి చెప్పు కిందవేసి తొక్కేస్తాడు. నిన్ను కాదురా నీకీఉద్యోగం యిచ్చిన వాళ్ళననాలి’  అని మనసులో తిట్టుకుంటూనే పైకి నవ్వులు చిందిస్తూ `

‘‘అబ్బో మీరు చాలా గొప్పవారు సార్.  మీ ఆలోచనలూ అంత గొప్పగా వున్నాయి.  కాని ఈ ప్రకటన బట్టి చూస్తే ఆ అమ్మాయికి ఆల్ రెడీ ఒకడున్నాడని అర్థమవుతోంది....’’ అర్థోక్తిలో మాటలు మింగేసాడు.

‘‘ఉండనీరా..  తప్పేముంది?  పెళ్ళికి ముందు లైఫ్  ఎంజాయ్ చేయటం ఈ రోజుల్లో కామన్.  నేను చేయటంలా పెళ్ళి తర్వాత నుంచి నమ్మకంగా ఉంటే చాలు’’

మనసులో ఉడుక్కొంటూ పైకి`

‘‘కరక్ట్ సర్ . మీరు చెప్పిందే కరక్ట్.  ఇంతకీ లహరిని ఎలా పట్టుకుంటారు సార్? చెన్నై వెళ్ళి వెదుకుతారా?’’ అనడిగాడు.

‘‘మనం వెదకటం ఏమిట్రా పిచ్చి మొగమా?  మనది ఏ జాతి?  పోలీసు జాతి.  ఇండియా అంతా విస్తరించిన జాతి. నేరస్తుల్ని పట్టుకోడానికి మనమే వెళ్తున్నామా?  ఇన్ఫర్మేషనిస్తే చాలు పనైపోతుంది.  ఇదీ అంతే.  చెన్నై కమీషనరాఫ్  పోలీస్  ఎవరనుకుంటున్నావ్. నా మేనమామ.  ఫోన్  చేస్తే చాలు ఆర్డర్  వేసేస్తాడు.  లహరి ఎక్కడ కన్పిస్తే అక్కడ పోలీసులు అరెస్టు చేసి ఏదో కేసులో ఇరికించి లోన పడేస్తారు.

అప్పుడు నేను రంగప్రవేశం చేస్తాను.  లహరిని కేసును ఉపసంహరించుకొనేలా చేస్తాను. త్యాగరాజన్ కి నచ్చచెప్పి ఆమెను చంపకుండానే కాపాడుకొని పెళ్ళి చేసుకుంటాను.’’

ఎ యస్ పి మాటలు వింటుంటే పిచ్చెక్కినట్టయి బుర్ర బరుక్కోవాలనిపించింది వన్నాట్ ఫోర్ కి.  ఇది సాధారణమైన కేసు కాదు.  త్యాగరాజన్ అక్రమాస్తులకు సంబంధించింది.  అతని ఇల్లీగల్  కార్యక్రమాలకు సంబంధించింది.  సెంట్రల్  గవర్నమెంట్ నే షేక్ చేసింది. కేసు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది.  కేసు మీద ఎంక్వయిరీ కమీషన్  నడుస్తోంది.  ఇవాళో రేపో సిబిఐ రంగంలోకి దిగొచ్చని, సుప్రీంకోర్టు ఆదేశించనుందని చెప్పుకుంటున్నారు.  ఈ పరిస్థితుల్లో లహరి తన కేసును ఉపసంహరించుకుంటే అయిపోతుందా? అసలు అంత నిజాయితీ గలిగిన అమ్మాయి ఉపసంహరించుకోడానికి అంగీకరిస్తుందా?.

ఆ పైన పది మంది గుండాల్ని చితగొట్టి పారిపోయిన డాషింగ్  లేడీ లహరి.  ఆమెను వీడు తట్టుకోగలడా? ఇక మీడియా విషయం చూస్తే రోజుకో కథనం పేపర్లలో వస్తోంది.  జర్నలిస్టు లహరి ఎక్కడా అనే హెడ్డింగ్ తో ఆ మధ్య కొన్ని పేపర్లలో వచ్చిన కథ నంసంచలనం సృష్టించింది. లహరి లేదని త్యాగరాజన్ మనుషులు ఆమెను చంపి అడ్రస్ గల్లంతు చేసారని జనం సందేహిస్తున్నారంటూ వచ్చిన ఆ వార్తను ఖండిస్తూ లహరి తను బ్రతికే ఉన్నానంటూ స్టేట్ మెంట్  ఇస్తే గాని ఆ గొడవ సద్దుమణగదు. ఓ పపక్క వాస్తవాలు యిలా ఉంటే ఈ ఎ యస్ పి పగటికలలు కంటున్నాడు అనుకొంటూ పిచ్చి నవ్వు నవ్వి`

 

సహస్రని పట్టుకోవడానికి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న ఇంతమందిలోఎవరు ఆమెను ముందుగా చూడబోతున్నారు...? వచ్చేవారం.....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana