Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : విరాట్ ఇచ్చిన పత్రికా ప్రకటన తాలూకూ ప్రకంపనల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.. విరాట్ తండ్రి చూస్తాడు..ఆయన గుర్తించకముందే పేపర్ తీసుకుంటుంది విరాట్ తల్లి...ప్రకటన చూసిన ఏ.ఎస్. పి. జర్నలిస్ట్ లహరి, ఈ సహస్ర ఒకటేనని గుర్తించి, ఆమె తనదే అన్నంతగా ఊహల్లో తేలిపోతాడు....   

....................................................................... ఆ తర్వాత....



 ‘‘యు ఆర్ గ్రేట్ సర్.  వెంటనే చెన్నై కమీషనర్  గారితో మాట్లాడండి’’  అంటూ చల్లగా బయటికి జారుకున్నాడు వన్నాట్ ఫోర్.

ఎ యస్ పి ప్రకాష్  వెంటనే తన సెల్  అందుకొని చెన్నైకి ఫోన్  చేసాడు.I

ఈ కోయంబేడు మార్కెట్ కు కూతవేటు దూరంలోనే ఒక స్లమ్  ఏరియా ఉంది.  అక్కడ పిక్ పాకెట్  బేచ్ పది మంది ఉన్నారు. అంతా పాతికలోపు కుర్రాళ్ళు ఉదయం లేవగానే కోయంబేడు మార్కెట్  బస్టాండ్  ప్రాంతంలో సంచరిస్తూ చేతివాటం చూపిస్తుంటారు.  ఈ బేచ్  నాయకుడి పేరు మురడన్ ముత్తు. ఆ బేచ్ లోఅందరి కన్నా వీడికే కాస్త వయసెక్కువ.  మనిషి చూడ్డానికి మొరటుగా మొండి బండ వెధవలా కన్పిస్తాడు.  ఆ పైన వీళ్ళు చేసే వెధవ పనులు కూడ అలాంటివే. వీళ్ళ గురించి ఆ లొకాలిటి వాసులకు బాగా తెలుసు.  చాలా సార్లు పోలీస్  స్టేషన్లకి జైళ్ళకి వెళ్ళొచ్చిన వాళ్ళు.ఆ రోజు ఉదయం మురడన్  ముత్తుకాలనీ సెంటర్ కొచ్చే సరికి తమ కుర్రాళ్ళంతా కాకా హోటల్ కి కాస్త దూరంగా తిన్నెమీద తిష్టవేసి ఆ రోజు న్యూస్  పేపర్ కింద పరిచి చూస్తూ తమలో తాము గుసగుసలు పోవటం కన్పించింది.

విషయం ఏమిటో తెలీక హోటల్  నుంచి టీ గ్లాసు అందుకొని వెళ్ళి వాళ్ళ పక్కన కూచుంటూ  ‘‘ఏంటి రా కాకుల్లా గుంపు చేరి పోయారు. ఏముందీ పేపర్లో?’’ అంటూ అడిగాడు.ఒక్కసారిగా అంతా తలతిప్పి ముత్తును చూసారు

‘‘వచ్చావా అన్నా?  ఇంకా రాలేదేమిటాని నీ కోసమే ఎదురు చూస్తున్నామన్నా,’’  అన్నాడొకడు.

‘‘ఈ రోజు పేపర్లో నిధి వుందన్నా.

పట్టుకుంటే కోటి రూపాయలు మనవే.’’  ఉత్సాహంగా అరిచాడు మరొకడు.

‘‘రాను రాను మీరంతా కుమ్మరిపురుగుల్లా తయారువుతున్నారు.  ‘‘మీ కంటికెట్టా కనబడుతున్నారా?  పొద్దునే ఎదవజోకులూ మీరూను’’  అంటూ కసురుకున్నాడు ముత్తు.

‘‘అయ్యో............. ఇది జోక్ కాదన్నా’’ అన్నాడొకడు.

‘‘జోకు గాకేమిట్రా పేపర్లో నిధేమిటి కోటి రూపాయలేమిటి?’’  అంటూ తాగిన టీ గ్లాసు పక్కనపెట్టాడు ముత్తు.

‘‘అయ్యో, నీ కర్ధం కావటంలేదన్నా. ఇది చూడు నీకే తెలుస్తుంది’’. అంటూ న్యూస్ పేపర్ చేతికిచ్చాడు మరొకడు.పేపర్లో నా ప్రియురాల్ని పట్టిస్తే కోటి.  ప్రకటన చూడగానే వాడి కళ్ళు విచిత్రంగా మెరిసాయి.  ఉత్సాహం పొంగు కొచ్చింది. కాని అంతలోనే చప్పున చల్లారిపోయింది. పెదవి విరిచాడు.

‘‘ఒరే ఏదో జేబులు కొట్టి హేపీగా బతికేస్తున్నాం.  మనకెందుకు రా యిది.  ఇలాంటివి మనకి కలిసి రావటం లేదుగాని వదిలేయండి’’  అన్నాడు.

‘‘అలాగంటే ఎలాగన్నా? మన బతుకులెప్పుడూ యిలా తెల్లారి పోవాల్సిందేనా?’’ అన్నాడొకడు.

‘‘కొడితే యిలాంటి జాక్ పాట్  కొట్టి లైఫ్ లో సెటిలయి పోవాలన్నా’’  అన్నాడు మరొకుడు.

‘‘అవునన్నా మనకి ఎంత కాలమిలా జేబులు కొట్టే బతుకు?  ఇంకెప్పుడు మనం బాగుపడేది? ’’ ‘‘ముత్తన్నా మా మాట వినన్నా.  ఎందుకో గాని యిది వర్కటవుతుందనిపిస్తోంది.  ఈ పిల్లదాన్ని పట్టిచ్చి కోటి రూపాయలు కొట్టేద్దామన్నా.’’

వాళ్ళంతా చెప్తుంటే కాదనలేక మరోసారి ఆ ప్రకటనని,  అందులో ఫోటోని చూసాడు.  అతడి చూపులు సహస్ర ఫోటో మీద నిలిచిపోయాయి.‘‘పిల్ల కత్తిలా వుంది గదన్నా’’?  ముత్తు కళ్ళలో కాంతి చూసి అడిగాడొకడు.  తల వూపాడు మురడన్  ముత్తు.‘‘అవున్రా,  సినీ హీరోయిన్ లా ఉంది.  కాని........  మన టైమ్ వేస్ట్  చేసుకోవటం తప్ప మనకిది కలిసొస్తుందన్న నమ్మకం కలగటం లేదు.  మనలో ఒక్కడిదీ లక్కీ జాతకం లేదు.  వదిలేయండి రా’’  అన్నాడు.

‘‘అది కాదన్నా’’...........  ముక్త కంఠంతో నచ్చజెప్పబోయారంతా

‘‘ఏది కాదురా’’? అనరిచాడు కోపంతో ముత్తూ.

‘‘దయ్యం ముఖాలేసుకొని,  చెప్తే వినరేంటి?  గతం మర్చిపోయారా?  ఎన్నో చేసాం ఒక్కటన్నా వర్కవుటయిందా? అప్పట్లోనే కుక్క పిల్లని పట్టిస్తే ఏభై వేలు బహుమతి అని ఓ ప్రకటన చూసాం.  ఎగరేసుకుంటూ పనులు వదిలి వీధి వీధి తిరిగి ఎక్కడో రెడ్ హిల్స్  దగ్గర ఆ కుక్క పిల్లను పట్టితెచ్చాం.  ఏమైంది?  అడ్రసుకెళ్ళి చూస్తే అది యస్ పి గారిల్లు.

మనల్ని జూడంగానే నవ్వి, చాలా కష్టపడి వెదికి తెచ్చారు.  థాంక్స్ రా.  అక్కడ కట్టేసిపొండి అన్నాడు,  బహుమతి అడిగితే ఏమన్నాడు?  మీ గురించి తెలుసురా, మీకు బహుమతి కావాల్నా?  ఇంకో సారి ఆ మాటంటే డబ్బు కోసం మీరే మా కుక్క పిల్లను ఎత్తుకెళ్ళారని కేసు పెట్టిలోన పడేసి కుమ్మించేస్తాను. పోండి అన్నాడు. చివరికి దూల తీరి తల కాయలు చంకలో బెట్టుకొచ్చాం,  అదలా అయిందంటేఆపై నెల్లో ఏమైంది?

వలసరవాక్కం అయ్యంగారి ప్రకటన.  మా నాయనమ్మ అంబుజం తప్పిపోంది.  వయసు డెబ్బై అయిదు.  ఎర్రగా వుంటుంది.  కొంచెం గూని,  మతిస్థిమితం లేనిది. అప్పుడప్పుడు మంచిగా మాటాడుతుంది. ఉత్తప్పుడు తిట్టిపోస్తుంది. అడయారు, కెకెనగర్, అన్నానగర్ పరిసరాల్లో సంచరిస్తుండొచ్చని అనుమానం. ఈమెను పట్టిచ్చిన వారికి లక్ష రూపాయలు బహుమతి.

లక్ష రూపాయలు తలో పది వేలు బాగుంది గదాని వెధవది డబ్బు కాశపడి వీధి కుక్కల్లా గల్లిగల్లీ గాలించాం. వారం రోజులు చెడదిరిగి చివరకు వండలూరు జూ దగ్గర ఓ పిచ్చిదాన్ని పట్టుకున్నాం.  అదే అయ్యంగారి బామ్మ అనుకున్నాం.  తీరా అడ్రసుకు తీసుకెళ్తే ఏమెంది?  గుర్తుందా? అయ్యంగారో వెర్రి నవ్వు నవ్వి ఓరి పిచ్చి మాలోకంలారా ఈ పిచ్చిది మా నాయనమ్మేంట్రా,  మా నాయనమ్మ తప్పిపోయిన మూడో రోజే కొంపకి తిరిగొచ్చింది. అదిగో ఆవిడే అంటూ అరుగు చివర కూచుని తనలో తను మాటాడేసుకుంటున్నా ఓ ములసమ్మను చూపించాడు.ఏంటిరా ఖర్మానుకుని వచ్చేస్తుంటే మనం పట్టుకున్న పిచ్చిది మన వెంటపడిరది.  దాన్ని వదిలించుకోడానికి రైలెక్కి గుమ్మిడి పూండి తీస్కెళ్ళి వదిలేసొచ్చాం, ఇంత జరిగినా మనకి బుద్ది రాలేదు.  మూడు నెల్లక్రితం ఏమైంది?’’

‘‘అదంతా ఇప్పుడెందుకులే గాని  అన్నా...........గతం వదిలేయ్. ఇప్పడి సంగతి చూడు’’  అంటూ ముత్తూ మాటలకి అడ్డం వచ్చాడొకడు.‘‘అవునన్నా, గతం మర్చిపోదాం. ఇదే చివరి ప్రయత్నమనుకుందాం.

‘‘అది కాదురా........’’

‘‘ఇంకేం చెప్పకన్నా.  పోనీ ఓ పని చెయ్యి.  ముందు ఈ నంబర్ కి ఫోన్ కొట్టు.  పట్టుకుంటే నిజంగా కోటి రూపాయలు ఇస్తాడు లేదా పక్కాగా తెలుసుకో.  ఇస్తానంటే ఒకె. అడ్రసు అడిగి తీసుకో. ఈ రోజే గాలింపు ఆరంభిద్దాం. ఇవ్వకుంటే వదిలేద్దాం’’ అంటూ మరొకడు సలహా ఇచ్చాడు.‘‘కాని...............  కోటి రూపాయల్రా.  ఇందులో ఏదో పెద్ద రిస్కుందని నా అనుమానం’’.........నసిగాడు ముత్తు

‘‘రిస్కుతో మనకి పనేందన్నా.  డబ్బు కావలంటే ఇంకేం సందేహంచకు.  ఫోనుకొట్టు’’  ముక్తకంఠంతో అరిచారంతా.

అంతగా వాళ్ళు చెప్తుంటే కాదనటం బాగుండదని ఫోన్ అందుకున్నాడు ముత్తు.

ఈ విధంగా ఆ రోజు విరాట్  ఇచ్చిన పేపరు ప్రకటన నిజంగానే చీమల పుట్టను కదిపింది.

అనాలోచినతంగా తను చేసిన పని సహస్రనే కాదు తననూ రిస్క్ లో పడేయనుందని ఆ క్షణంలో విరాట్ కు తెలీదు.  కేవలం సహస్ర కన్పిస్తే చాలని అలా ప్రకటించాడు. అ ప్రకటన చూడగానే అంకాళమ్మా మహంకాళి నూకాలమ్మ అందరూ తననే పట్టుకున్నట్టు చిందులేస్తూ పేపరు పుచ్చుకొని విరాట్  యింట్లో అడుగుపెట్టింది గదా.........

సరాసరి తన ముందుకొస్తూన్నసహస్రని సంభ్రంతో అలా నిలబడి చూస్తూండిపోయాడు విరాట్.  సహస్ర వస్తూనే తన చేతిలోని న్యూస్ పేపర్ని అతడి ముందుకు విసిరికొట్టి చేతులు రెండూ నడుం మీద ఉంచుకొని ఉరిమి చూసింది.  ఆమె కొస్తున్న కోపంలో వెంటనే నోట మాట రాలేదు.ఆ లోపల స్కూటీ లాక్ చేసి లోనకు దూసుకొచ్చిన దీక్ష వాళ్ళిద్దర్నీ చూస్తూ అక్కడే ఆగిపోయింది.

‘‘ఏంటండీ యిది.  ఎవరు మీరు?’’  అనడిగాడు తనను తాను కంట్రోల్ చేసుకొంటూ విరాట్.  అతడి ప్రశ్న సహస్రనే కాదే,  దీక్షనూ విస్తుపోయేలా చేసింది.

‘‘నేనెవర్నా........ నిజంగా తెలీదా? నాటకాలాడుతున్నావా?’’ నిలదీసింది సహస్ర.

‘‘భలేవారండీ..... నిజంగానే తెలీదు.  ఎవరు మీరు?  నాకోసం శ్రమపడి ఈ రోజు న్యూస్ పేపర్స్ తెచ్చినట్టున్నారు,  వేస్ట్.  మా యింట్లో చాలా పత్రికలున్నాయి.’’

‘‘ఒరేయ్..........’’ అంటూ పిచ్చి పట్టినట్టరిచింది సహస్ర.

‘‘నేనెవరో తెలీకుండానే నా ఫోటోలు బెడ్రూంలో అంటించుకున్నావా?’’  నిలదీసింది.

‘‘ఏదీ..........  సహస్ర ఫోటోల గురించా?  అది నా ప్రియురాలు.  నా ప్రాణం.  నా సర్వం.  కాబట్టి బెడ్రూంలో అతికించుకుంటాను.  ఏమైనా చేసుకుంటాను. అడగటానికి మీరెవరు?  అసలా ఫోటోల గురించి మీకెలా తెలిసింది?’’

‘‘అయిపోయావ్.  ఇవాళ నా చేతిలో అయిపోయావ్  రా కోతి........  కుక్క ........ .పిల్లి.......... నేనెవరంటావా?’’ అంటూ అవేశంతో ముందొకొస్తున్న సహస్రను చూస్తూ మూడడుగులు వెనక్కి వేసాడు విరాట్.

‘‘ముసుగు వీరుడిలా ముఖాన్ని చున్నీతో కప్పుకొస్తే నాకెలా తెలుస్తుంది.  ఇదిగో అమ్మాయ్  ఈ పిల్ల ఎవరో పొద్దుటే నా మీద పోట్లాట కొచ్చింది.  నువ్వయినా చెప్పు, నా లాంట మాయకుడ్ని యిలా భయపెట్టడం ఏం బాగోలేదు.’’ అన్నాడు దీక్షను చూస్తూ.

విరాట్  ఓవరాక్షన్  దీక్షకు అర్ధమైపోయింది.  వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ కిచెన్ లో ఉన్న చందూ వద్దకెళ్ళిపోయింది.‘‘ఏంట్రా దాన్ని పిలుస్తావ్.  తెలివిగా మాట్లాడుతున్నావనుకుంటున్నావా?  నా ముఖం చూడాలి,  అంతేగా.........  చూడు....... ఇప్పుడు చెప్పు.  నేవర్ని?’’ అంటూ ముఖానికి చుట్టుకున్న చున్నీ తీసేసింది సహస్ర.

కోపంలో కూడా ఎర్రకలువలా మెరిసిపోతున్న సహస్రను అలా కాస్సేపు మయిమరచిపోయి చూస్తూండిపోయాడు విరాట్.‘‘ఇప్పుడు ఒప్పుకుంటాను, నువ్వు నా సహస్రవని.’’ అన్నాడు నవ్వుతూ

సహస్రకి ఒళ్ళు మండిపోయింది. చేయాల్సిందంతా చేసేసి ఏమీ తెలీని అమాయకుడిలా ఎలా నవ్వుతున్నాడు చూడు అనుకొంటూ కళ్ళు పెద్దవి చేసి ఉరిమిచూసింది. ‘‘నేన్నీ సహస్రనా? చెప్పు, నేన్నీ సహస్రనా?’’ నిలదీసింది.

‘‘కాదా? , నేను నిన్ను ప్రేమించాకా నువ్వు నా లవర్  గాక పక్కవాడి లవరవుతావా?’’  మొండిగా బదులిచ్చాడు విరాట్.‘‘షటప్................. అసలు నా గురించి ఏమనుకుంటున్నావ్?  నువ్వు ప్రేమిస్తే చాలా? నేను ప్రేమించక్కర్లేదా?  నా యిష్టా యిష్టాలతో నీకు పని లేదా? నాకు నీకు ఏమిటి సంబంధం? నీ వెంట తిరిగానా?  ఐ లవ్ యూ చెప్పానా? నీ సహస్ర నెలా అవుతాను?  నీకు నువ్వే డిసైడయితే అయిపోతుందా?’’ ఆమె దూరుసుగా మీది కొచ్చేస్తుంటే నాలుగడుగులు వెనక్కి వేసాడు విరాట్.

‘‘ఏంటి మీది మీది కొస్తున్నావ్? కొట్టేస్తావా?’’ అనాడిగాడు.

‘‘కొట్టడం కాదు. చంపేస్తాను.’’

‘‘అది నీ వల్ల కాదు.  ఏమన్నావ్?  నేను డిసైడయితే అవదా?  అయిందిగా.........’’

‘‘ఒరేయ్...........  ఏమైందిరా?’’

‘‘నువ్వు నన్ను ప్రేమించటమయింది.’’

‘‘నెవ్వర్..............  నువ్వంటే కోపం.........  అసహ్యం.......’’

‘‘అబద్దం............. నీ మాటలు అబద్దం.  అంత కోపం వుంటే అంతగా అసహ్యించుకొంటే ఇంతకు ముందే ఓ సారి నువ్వు నా యింటి కోచ్చుండేదానివి కాదు.’’

ఉలికిపడి చూసింది సహస్ర

దీక్షకి తనకీ తప్ప ఎవరికీ తెలీని ఈ విషయం.  విరాట్ కెలా తెలిసిందో అర్ధంగాక బిత్తర పోయి చూసింది.

‘‘అవునా కాదా?  నా యింటికి దొంగతనంగా వచ్చావ్.  నా పడగ్గదిలో కొచ్చావ్. నా గురించి తెలుసుకున్నావ్.  నా బెడ్  ఎక్కి కూచుని నీ ఫోటోల్ని చూసుకు మురిసిపోయావ్. నేను పడుకునే బెడ్ మీద దోర్లావ్.’’

‘‘నేనేమీ కావాలని దొర్లలేదు.  తూలిపడ్డాను’’  అరిచింది సహస్ర.

‘‘ఎలా పడ్డానా మీద ఇష్టంతోనేగా పడ్డావ్?  ప్రత్యేకించి నువ్వు నాకు ఐ లవ్యు చెప్పాలా?  నువ్వు నా యింట్లో ఆ రోజు ఇష్టంగా భోంచేసి వెళ్ళావంటే నా మీద ప్రేమతో కాదా?’’ అంటూ ఒక్కో ప్రశ్న అడుగుతూ విరాట్  ముందుకొస్తుంటే ఈ సారి సహస్ర అయిదడుగులు వెనక్కి వేస్తూ ఆలోచనలో పడిపోయింది.

‘ఇన్ని విషయాలు వీడికెలా తెలిసాయి?  ...........ఎలా? ........  సి సి కెమెరా ఏమన్నా ఇంట్లో పెట్టాడా?  అదేం లేదే......... అయినా తను ఇదే కాలనీలో ఉంటున్నట్టు తెలిస్తే ఎప్పుడో అక్కడి కొచ్చేసే వాడు గదా.........  ఇప్పటికిప్పుడు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి?’

ఆలోచనల్లో కూరుకు పోయిన సహస్ర ఉన్నట్టుండి ఉలికిపడిరది

ఇదేమిటి?

తనెందుకొచ్చింది. ఇక్కడఏంజరుగుతోంది?

 

సహస్ర....విరాట్ మనసు దోచుకున్న అద్భుత సౌందర్యరాశి మాత్రమే కాదు... అనేకమంది టార్గెట్ ఇప్పుడు....ఏం జరగబోతోంది......?????
వచ్చేవారం

[email protected]
www.suryadevararammohanrao.com

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్