Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ : భయంకరమైన కలతో ఉలిక్కిపడి మేల్కొంటాడు హరి....పక్కనే కూర్చున్న తల్లి నాలుగురోజులుగా అపస్మారక స్థితిలో ఉన్నావని  చెప్పగానే విని ఆశ్చర్యపోతాడు. అసలెందుకీవిధంగా తయారయ్యావని అడిగిన తల్లికి చెప్పలేకనే చెప్పడం మొదలుపెడతాడు......                        ఆ తర్వాత......

‘‘మమ్మీ అన్నావంటేనే నీవేదో దాస్తున్నావని తెలుస్తుంది కన్నా... మనసులోని మాట అమ్మ అనే పిలుపు ద్వారానే వస్తుంది. నీవు చెప్పదలుచుకోకపోతే చెప్పవద్దు. విశ్రాంతి తీసుకో.’’ అంటూనే లోపలికి వెళ్లి ఒక కప్పు వేడి వేడి పాలు తెచ్చి హరికి ఇచ్చిందామె.అవి తాగిన తర్వాత నెమ్మదిగా మంచం మీదే లేచి కూర్చున్నాడు హరి.

చలి జ్వరం లాగా అన్పించి దుప్పటి కప్పుకున్నాడు. ఇంతలో... కాలింగ్ బెల్ మోగడం, తీసిన తలుపు తోసుకుంటూ ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలూ లోపలికి రావడం జరిగిపోయింది.

వచ్చిన వాళ్లందరూ హరిని చూసి ఆనందంగా ముఖాలు పెట్టి ‘‘హౌ ఆర్యూ... హౌ ఆర్యూ’’ అంటున్నారు.‘‘వీళ్లందరూ నా రీసర్చ్ స్టూడెంట్స్... నీకు తెల్సు కదా... వంతుల వారీగా డ్యూటీలు వేసుకుని నిన్ను చూసుకున్నారు వీళ్లు.’’ అన్నది సుధారాణి.

కృతజ్ఞతగా ఆ ఐదుగురి వైపూ చూసాడు హరి.

ఇంతలో ఒక స్టూడెంట్ తన మోసుకువచ్చిన అట్టపెట్టని భద్రంగా సుధారాణికి అప్పగిస్తూ అన్నాడు...

‘‘మేడమ్... ఏ ఒక్క స్పెసిమన్ కూడా మిస్ కాలేదు. అన్నీ ఉన్నాయి. మీరొక్కసారి చూసుకోండి కెమికల్ అనాలసిస్ లో మాకు చాలా విషయాలు తెలిసాయి మేడమ్. ఆర్సినిక్ పాయిజన్ అని అనుమాన పడ్డాము కానీ అదేమీ లేదు. నీటిలోని ఫ్లోరిన్ కంటెంట్ వల్ల ఎముకలు పెళుసుబారి, కొద్దిగా మరకయ్యాయి. ఫ్లోరిన్ కూడా హాని చేసేంత మోతాదులో లేదు. కొన్ని చోట్ల ఎముకలు చిట్లినందు వలన రాక్షసంగా ఎవరో కొట్టినట్లు తెలుస్తున్నది. ఎముకలు పరిశీలన బట్టి మేమనుకునేదేమిటంటే జరిగినవి సహజ మరణాలు కావు. హింస, హింసించబడడం ద్వారా జరిగి ఉంచవచ్చు.’’

గడగడా చెప్తున్న సీనియర్ స్టూడెంట్ వాక్ప్రవాహానికి అడ్డువేసింది సుధారాణి...‘‘ఇవన్నీ మనం యూనివర్సిటీలో డిస్కస్ చేద్దాం... ఇప్పుడు కాదు.’’ అంటూ ఆ అట్టపెట్టెను భద్రంగా బీరువాలో పెడుతుండగా జారి కిందపడి ఎముకలు బయటపడ్డాయి. పుర్రెలు, కాలి ఎముకలు, చేతి ఎముకలు, పక్కటెముకలు, రకరకాల సైజులు, షేపుల్లో ఉన్నాయి. వాటిల్లో ఆడవారి ఎముకలు కూడా ఉన్నాయి. తల్లి సాంగత్యంలో చూసీ చూడగానే ఎముకలు స్త్రీకి చెందినవో పురుషునికి చెందినవో కనిపెట్టగల సామర్ధ్యం హరికి అవలీలగా వచ్చింది.

వాటిని చూడగానే హరి మస్తిష్కంలో ఏదో కరెంటు షాక్కొట్టిన్లయ్యి లీలగా ఏవో ఆకారాలు కనుల ముందు సాక్షాత్కరించినట్లయ్యి, మెదడు మొద్దుబారి పోయింది.

‘‘అమ్మా... అమ్మా... ఆ ఎముకలు... ఆ ఎముకలు... అంటూనే దిగ్గున మంచం మీద నుండి లేచి, ఆ అట్టపెట్టను చేజిక్కుంచుకుని, మళ్లీ మంచం మీద కూలబడ్డాడు.ఏ మాత్రం కంగారు పడలేదు సుధారాణి. హరి ప్రవర్తన గత నాలుగు రోజులుగా చూస్తున్నదే... స్టూడెంట్స్ కూడా ఏమీ ఆశ్చర్యపోలేదు. సుధారాణి కనుసైగతో ఇద్దరు స్టూడెంట్లు హరిని శాంతపరుస్తూ నెమ్మదిగా మంచం మీద పడుకోబెట్టారు. ఇద్దరమ్మాయిలు హరికి సపర్యలు మొదలుపెట్టారు. అక్కడున్న అందరికీ ఇదేదో సర్వసాధారణమైన విషయం లాగానే ఉన్నది. ఎవ్వరూ కొత్తగా, వింతగా ఫీల్ కావడం లేదు. అందరూ ఒక ఫ్యామిలీ లాగానే బిహేవ్ చేస్తున్నారు.

కాసేపటి తర్వాత, స్టూడెంట్స్ నుద్దేశించి చెప్పింది సుధారాణి.‘‘మీరందరూ వెళ్లిపోండి. అర్జంటుగా రమ్మన్నానని డాక్టర్ హిమన్షుకు చెప్పండి. ఐయామ్ వెయింటింగ్ ఫర్ హిమ్ ఈగర్లీ’’ అని చెప్పండి.

ఆజ్ఞను శిరసావహిస్తున్నట్లుగా ఇంకెవరూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా బయటికి వెళ్లిపోయారు.‘‘అమ్మా... అమ్మా... నీకో విషయం చెప్పాలి. ఒక విషయం చెప్పాలి’’ అంటున్నాడు హరి గబరాగా.

హరి నుదిటి మీద తన చేతివేళ్లు వేసి నిమురుతూ... ‘‘హరీ... కంట్రోల్ యువర్ సెల్ఫ్... నీవే ఒక ఎక్స్ పీరియెన్స్డ్ సర్జన్ వి. నేను చెప్పాలా నీకు.. రిలాక్స్ మైడియర్... రిలాక్స్.’’ అంటున్నది సుధారాణి.

కొద్ది... కొద్దిగా ప్రశాంతత ఆవరించినట్లుగా అన్పించి హరి కనులు మూతబడ్డాయి.

X                 X                X

‘‘హలో.... డాక్టర్ హరి. హౌ ఆర్యూ..?’’ అంటూ ఎంతో ఉత్సాహంగా తనని విష్ చేస్తున్న నూతన వ్యక్తి వైపు చూసాడు హరి.ఆ విష్ చేసిన తనే మళ్లీ అందుకుని, ‘‘ఐయామ్ డాక్టర్ హిమాన్షు... మీ మదర్ సుధారాణి గారి ప్రథమ పీహెచ్ డీ స్టూడెంట్ ని.’’ అన్నాడు. సాలోచనగా ఆ కొత్త మనిషిని చూస్తూ కరచాలనం చేసాడు హరి. మనిషి కొంచం పొట్టి, చక్కగా నూనె రాసి, దువ్విన జుట్టు, చామనఛాయ, గచ్చకాయ రంగు పాంటు, తెల్లటి షర్ట్, టక్ చేసి ఉన్నాడు. తన వయసే ఉండవచ్చు. సూదంటురాయి వంటి చూపులు.

ఇంతలో అతనే మళ్లీ అందుకున్నాడు... ‘‘హరి గారు... ఇంట్లోనే ఉంటే బోరుగా ఉంటుంది కదా... బయట చక్కని లాన్, గార్డెన్ ఉన్నాయి. రండి వెళ్దాం.’’ అన్నాడు చనువుగా.

నో... అనాలన్పించలేదు హరికి... ‘‘ఓకే..’’ అన్నాడు.క్యాంపస్ లో నడుస్తుండగానే బుడబుడా మాట్లాడుతున్నాడు హిమాన్షు... అతని మాటలు వినాలన్పిస్తున్నాయి తప్ప విసుగనిపించడం లేదు.

‘‘నా గురించి మీకు చెప్పలేదు కదా... నేను.. మొట్టమొదటిసారిగా ఆర్కియాలజీ స్టూడెంట్ గా మేడమ్ సుధారాణి గారి దగ్గర చదువుకున్నాను. నేను ఎంతో బీద కుటుంబానికి చెందినవాడిని. కొంతమంది ఇదే ఆర్కియాలజీ డిపార్టుమెంట్ లో నన్ను తక్కువ చేసి, వీడికేం వచ్చు అన్నట్లుగా చూసారు. కాని మేడమ్ సుధారాణి గారు నన్ను, ఏదో సాధించాలన్న నా తపనను గమనించి బిడ్డ అభిరుచి, ఆకాంక్షలను కనిపెట్టే తల్లిలాగా నాకు ధైర్యం నూరిపోసి, ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ లోకి ప్రవేశపెట్టి, బయో ఆర్కియాలజీ చదివించారు.  పురాతన మానవ అవశేషాలను పరిశోధించడంలో అనేక వ్యాసాలను రాయడానికి ప్రేరణ కలిగించారు మేడం గారు. నా ప్రతిభను మెచ్చి, అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వారు ‘గ్రాంట్’ మంజూరు చేసారు. ప్రస్తుతం ‘మిషిగాన్ స్టేట్ యూనివర్సిటీ ’లో మార్చురీ ఆర్కియాలజీ ప్రొఫెసర్ గా బోధనలు చేస్తున్నాను. నా తల్లిదండ్రులిద్దరూ కూలిపలి చేసుకునేవారే. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. కొద్దిగా బెల్లం, కొద్దిగా టీపొడి అంగట్లో కొని నీళ్లు కలిపిన పాలతో టీ పెట్టేది మా అమ్మ.

అటువంటి నన్ను ఈ రోజు ఉన్నత స్థితిలో నిలబెట్టారు మేడం సుధారాణి గారు.’’ ‘‘హిమాన్షు గారూ... మీ లైఫ్ ఇంట్రెస్టింగ్ గానూ, ఇన్ స్పైరింగ్ గానూ ఉంది. కానీ నేనడగకుండానే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు?’’ అన్నాడు హరి.

‘‘నా టర్నింగ్ పాయింట్ మేడమ్ సుధారాణి గారు. తల్లి, గురువు, దైవం అన్నీ నాకు మేడం గారే. కొన్నిసార్లు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో మేడం గారే సహాయం చేసారు.’’ ఎంత ఈజీగా చెపుదామని ట్రై చేసినా గానీ హిమాన్షు గొంతులోని కృతజ్ఞతాపూర్వకమైన డగ్గుత్తికను కనిపెట్టగలిగాడు హరి.  ఈ రోజు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నానంటే కారణం మేడమ్ గారే... అని పూర్తి చేసాడు హిమాన్షు. టాపిక్ మారిస్తే బాగుంటుందనుకున్నాడు హరి.

‘‘మార్చురీ ఆర్కియాలజీ కొంచం విచిత్రంగా ఉంది మీ సబ్జక్ట్...’’ అన్నాడు.

‘‘మనిషి బత్రికి ఉన్నంత కాలం ఆరోగ్యంగా బతకాలనీ, పదవులు సంపాదించాలనీ, డబ్బు సంపాదించాలనీ ఇంకా ఇంకా రకరకాల కోరికలతో వీలయితే ఎదుటివాడి రక్తాన్ని, జీవాన్నీ, గుండెని, కిడ్నిని, లివర్ని ఏది దొరికితే అది ఉపయోగించుకుని చిరకాలం బతకాలని ఆరాటపడతాడు.

అదే మనిషి చనిపోయాక, ఇంకేమీ లేదని భావిస్తాడు. కానీ బతికి ఉన్న మనిషి కంటే సమాజానికి ఉపయోగపడే వాడు చనిపోయిన మనిషి. ఎన్నో మృతదేహాలను కోసి పరిశీలించిన మీకు మృతదేహం ఎంత విలువైనదో తెలుసు. వాటి మీద నేర్చుకుని ఈరోజు మీరు గొప్ప సర్జన్ గా సమాజ సేవ చేస్తున్నారు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్