Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ : గంగరాజు డ్రస్సెస్ కావాలని గంగరాజు అందర్నీ అడుగుతూంటాడు. అనిల్, హరిప్రియ ఒకళ్ళనొకళ్ళు అంటుకుపోయి  తిరుగుతుంటారు.......ఆ తర్వాత..

వెనక్కి తిరిగి చూసేరిద్దరూ

లంగా లాంటిది కింద వేసుకుని, ఒక షర్టు పైన వేసుకుని నిలబడ్డాడు గంగరాజు.

“ఈ వేషమేంటి..?” అడిగేడు జీవన్.

“నా లగేజింకా రాలేదు సార్. ఎవర్నడిగినా మోతెక్కువవుద్దని తక్కువ బట్టలు తెచ్చుకున్నాం అంటున్నారు...” అన్నాడు.

“మీ ఒంటి మీద బట్టలెవరివీ..?” అడిగేడు జీవన్.

“కాస్ట్యూమ్స్ బాక్స్ లోవి సార్” అన్నాడు.

“నెగిటివ్ మధ్యాహ్నం నించి రావొచ్చేట. మ్యూనిక్ నించి ప్రొడ్యూసరు సలీం, వేణు ఫోన్ చేశారట”

“అయితే ఇవాళ షూటింగ్ ఉండదేమో...!” అన్నాడు యోగి.

“మధ్యహ్నం నించి ఉండొచ్చట. జార్జి ప్రసాదు గారూ, డైరెక్టరూ, కెమెరామెన్నూ లొకేషన్సు చూడ్డానికెళ్ళేరు సార్” అనెళ్ళిపోయేడు.

బ్రేక్ ఫాస్ట్ అయ్యేకా జీవన్, యోగి న్యూవిర్ట్ హోటల్ దగ్గర్లో ఉన్న సూపర్ మార్కెట్లో కెళ్ళారు. పది యూరోలు ఖర్చు పెట్టి స్పిడ్జ్ చెర్రీ ఫ్రూట్ బ్రాందీ, స్లిప్పర్లూ, వెనిగర్ లో ఊరబెట్టిన పచ్చిమిరపకాయల సీసా కొన్నాడు యోగి.

మధ్యాహ్నం మూడున్నర దాటింది. అంతా షూటింగ్ కెళ్ళిపోయాక కంపోజింగ్ మొదలెట్టాడు యోగి.

టేబుల్ మీద దరువేస్తా ఏదేదో పాడుకుని కాస్సేపటికి పల్లవిలా ఫామ్ చేసుకుని అబద్ద సాహిత్యం రాసుకుని పాడి “ఎలాగుంది సార్...?” అన్నాడు.

“ఇంకోటి చెయ్యి” అన్నాడు జీవన్.

“నా దగ్గర శీను అని ఒక కొత్త కుర్రాడు. వాడితో లిరిక్స్ రాయిద్దాం ఈసారి” అన్నాడు.

“అలాగే” అన్నాడు జీవన్.

“ఒక మంచి పల్లవి రాయండి ట్యూన్ చేస్తాను” అన్నాడు.

“ఆత్రేయ గారు రాసిన పల్లవి చెప్పనా..?” అంటే, “చెప్పండి” అన్నాడు.

చెప్పేముందు ఆ పాట ఆయన ఏ సిట్యుయేషన్ కి రాసేరో చెపుతాను విను... హీరోయిన్ జీవితంలో చాలా దెబ్బతింది. రకరకాల పరిస్థితులు ఆమెని చాలా బాధించాయి. దాంతో ఎక్కడా ఉండలేక క్లబ్బుకొచ్చి బాగా తాగేసి స్టేజి మీద పాడ్తుంది ఆ పాటేంటంటే...

తాగూ...

మనసైతే మధువుతాగు.

వీల్లేకుంటే విషం తాగు.

మధువు మత్తెక్కిస్తుంది.

విషం గట్టెక్కిస్తుంది.

బ్రాందీ విస్కీ రమ్మూ జిన్లూ రకరకాల పానీయాలు.

అన్నా చెల్లీ తల్లీ దండ్రీ రకరకాల అనుబంధాలు.

ఏదైనా నిషా తేరే వరకే.

ఏవైనా రుణం తీరే వరకే.

నిషా తీరాకా ఖాళీ సీసాలు.

రుణం తీరాక కాలిన బూడిదలు.

అంతా విన్న యోగి “చాలా బాగుంది సార్. ఇలాంటి సాహిత్యం ఉంటే ఆ పాట ఎప్పటికీ బతికి ఉంటుంది” అని మళ్ళీ చేసిన పల్లవికి అబద్ద సాహిత్యం పాడ్తున్నాడు. గంట సేపు పాట పాడిందే పాడ్తున్నాడు. అంతలో అతను కంపోజ్ చేసిన పల్లవి వయోలిన్ లో వినిపించింది ఎదురుగా ఉన్న షహనాజ్ గదిలోంచి. విన్న యోగి జీవన్ ని అడిగేడు “నేను కంపోజ్ చేసిన పల్లవిని ఆవిడెందుకు వయోలిన్ లో వాయించి వినిపించింది...?”  తెలీదన్నాడు జీవన్.

“ఆవిడెందుకు వాయించేదంటే ఒరే ఎదవా అపశృతిలో పాడ్తున్నావ్ అని నాకు చెప్పడం కోసం” అన్నాడు యోగి.

“ఈ పాట చీకట్లో చిందులెయ్.... వెన్నెల్లో గంతులెయ్ అంత హిట్టవుద్ది సార్. ఇదే ట్యూన్ ఆ వయోలిన్ లోంచి వస్తుంటే నేను చేసేనని కాదుగానీ బాగుంది సార్” అంటున్నాడు.

ఇంకో ట్యూన్ చెయ్యమన్నాడు జీవన్.

“ఇంక ఇవ్వాళింతే సార్. ఒకోసారి మహదేవన్ గారు కూడా ఇంతేనట. ఆ వేళ ఆ ట్యూన్ డైరెక్టర్ కి నచ్చకపోతే రేపు కూచుందాం అని లేచిపోయేవారట” అన్నాడు.

“అంటే ఇవ్వాళ్టికి కంపోజ్ చెయ్యను అంటావ్...! అలాగే” అని వాడు కొనుక్కొచ్చిన చెర్రీ పళ్ళ బ్రాందీ ఓపెన్ చేసేడు జీవన్.

కార్యక్రమం మొదలైంది.

రాత్రి ఎనిమిదైనా చీకటి పడ్డంలేదు. చలి మాత్రం ధారుణంగా పెరిగిపోతుంది. షూటింగ్ కి వెళ్ళిన బస్ ఇంకా రాలేదు.

ఆంగ్లో ఇండియన్ రిథమ్ ప్లేయర్ ఆలెన్ వాళ్ళింట్లో తయారు చేసే గ్రేప్ వైన్ కంటే తియ్యగా ఉందీ స్పిడ్జ్ బ్రాందీ. వచ్చేప్పుడు సూట్ కేసులో వేసిన తిరుమల రామచంద్ర గారి హంపీ నించీ హరప్పాలో బసివి నాగమ్మ గురించి చదువుతున్న జీవన్ లేచి నిలబడ్డాడు.

ఈ ఊరొచ్చి అప్పుడే ఒక రోజు గడిచింది. డాక్టర్ అబూ, షహనాజ్ కి పెట్టిన 14 రోజుల గడువులో ఒకరోజు గడిచిపోయింది. ఆ వజీర్ ఏవన్నా సాక్ష్యం చూపించగలిగాడా అబూకి..! షహనాజ్ దగ్గరికెళ్ళి అడుగుదాం అనిపించింది జీవన్ కి. పరిచయం లేదు. ఒకవేళ ఉన్నా ఇలాంటి విషయాల గురించి మాటాడాలంటే చాలా చనువు ఉండాలి కదా..? అనుకున్నాడు.

అంతలో...

తలుపెవరో బాదుతున్న చప్పుడయితే వెళ్ళి తీసేడు యోగి.

కారప్పూస పొట్లం పట్టుకుని దిగిన గోవిందూ, చందర్రావు “జార్జి ప్రసాదు మీకిమ్మన్నాడు” అన్నారు జీవన్ తో.

“ఈ ఊళ్ళో కారప్పూస దొరుకుద్దా..?” అన్నాడు యోగి.

“కాదండి బాబూ, వచ్చేటప్పుడు మా రాజమండ్రిలో కొని తెచ్చాం” అన్నాడు చందర్రావు.

పొట్లం విప్ప ఓ గుప్పెడు నోట్లో వేసుకున్న యోగి “చాలా బాగుందండి చందర్రావు గారూ” అన్నాడు.

గర్వంగా చూసిన చందర్రావు మరి రాజమండ్రి అంటే ఏంటనుకుంటున్నారు..! అసలు మా రాజమండ్రి లో ఎన్ని లక్షలు ఫైనాన్సు వడ్డీకి తిప్పుతున్నారో తెల్సా..? తాపేశ్వరం మడత కాజాలు ఎప్పుడన్నా తిన్నావా ఆ పక్క..? విప్పనపాడు లో నాకెన్ని ఎకరాలు పల్లపు భూముందో తెల్సా..? చాగల్నాడులో నాటు కోడి మాంసం ఏం రుచండి బాబూ. మా బామ్మరిదికి ద్వారపూడి హోలుసేలు మార్కెట్లో రెండు షాపులున్నాయి తెల్సా నన్ను వాటా ఉండమన్నాడు. ఇలా లింకులు లేకుండా చందర్రావు మాటాడ్తుంటే బాధ తట్టుకోలేని యోగి బాటిల్లో చెర్రీ బ్రాందీ గడగడా తాగేస్తుంటే ఎవరో తోసేసినట్టు రూమ్ లో కొచ్చి పడ్డాడో మనిషి. చూస్తే గంగరాజు. పూర్వం విఠలాచార్య సినిమాల్లో కాంతారావు వేసుకునే జానపదం డ్రస్సులో నిలబడ్డాడు.

“ఏంటిది..?” అడిగేడు జీవన్.

“సెకండ్ హీరో సాంగ్ డ్రస్. ఇవ్వాళ్టితో దీని వర్క్ అయిపోయిందిలేండీ” అన్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్