Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
parugu

ఈ సంచికలో >> కథలు >> నిజం

nijam

రైలు వేగంగా కదులుతోంది కానీ ఇంకాస్త వేగంగా వెళితే బాగుండు అని అనుకుంటున్నాడు రాఘవయ్య. ఎందుకంటే తన కుమార్తె శరణ్య పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంది. యాదగిరి గుట్ట మీద లక్ష్మీనరసిమ్హస్వామి సన్నిధిలో పెళ్ళి ముహూర్తం ఉదయం 11;45 ని.లకు. భువనగిరికి రైలు చేరుకోవడానికి ఇంకా గంట సమయం పడుతుంది. అక్కడి నుండి మరో గంట ప్రయాణం. ఇప్పుడు సమయం ఉదయం 8;45 అయింది. పెళ్ళివారికి ఇవ్వాల్సిన కట్నం డబ్బులు లక్షానలభై వేలు సూట్ కేసులో ఉన్నాయి... ఎంత ప్రయత్నం చేసినా తీరా ఈ రోజుకు కానీ సర్దుబాటు అవలేదు. అందుకే కూతురి పెళ్ళి ముహూర్తానికి సమయం దగ్గర పడే సమయానికి చేరుకోవాల్సి వస్తోంది...కానీ తప్పలేదు... ముహూర్తానికి ముందే కట్నం డబ్బులు ముట్టజెప్పనిదే పెళ్ళి జరగదని కాబోయే వియ్యంకుడు ఖరాఖండీగా చెప్పేశాడు.

సూట్ కేసు పక్కనే పెట్టుకుని చేయివేసి కూర్చున్నాడు రాఘవయ్య.

ఇంతలోకి ఓ అపరిచిత వ్యక్తి తన సీటుకు ఎదురు సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. అతడి వయసు పాతిక సంవత్సరాలుండొచ్చు. చేతిలో అచ్చు ఇలాంటిదే సూట్ కేసు ఉంది...

కాసేపటికి అతడే రాఘవయ్యను పరిచయం చేసుకుని మాటలు కలిపాడు..తన పేరు రాజేష్ అనీ, ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాననీ చెప్పాడు.. ఆ పనిమీదే వరంగల్ వెళ్ళి వస్తున్నానని కూడా చెప్పాడు. కుర్రాడు బుద్ధిమంతుడిలా ఉన్నాడు అని మనసులోనే అనుకున్నాడు రాఘవయ్య. యాదగిరి గుట్ట దగ్గర్లోని ఒక పల్లెటూరు తన స్వగ్రామమని రాఘవయ్యతో చెప్పాడు రాజేష్. చాలా సేపట్ణుంచి సీట్లో కూర్చున్న రాఘవయ్య కడుపు ఉగ్గబట్టినట్టు అవడంతో బాత్రూం కి వెళ్ళడానికి ఎలాగా అని సంశయిస్తూనే " బాబూ..కాస్త ఈ సూట్ కేసు చూస్తూంటావూ ..! ఇప్పుడే వస్తాను " అని అడిగాడు రాజేష్ ని... రాజేష్ నవ్వుతూ " అలాగే వెళ్ళి రండి అంకుల్..." అన్నాడు... రాఘవయ్య బాత్రూం కి త్వరగానే వెళ్ళి వచ్చాడు కానీ అపరిచిత వ్యక్తికి అప్పగించి వచ్చానే అని  అతడి మనసు సూట్ కేసు మీదే ఉంది....వచ్చి కూర్చుంటూనే అతడి కళ్ళల్లోని ఉద్దేశాన్ని పసిగట్టినట్టినట్టు రాజేష్ నవ్వుతూ " అంకుల్ మీ సూట్ కేసు తెరిచి ఒక సారి చూసుకోండి ఎందుకైనా మంచిది.." అన్నాడు... తన ఉద్దేశాన్ని రాజేష్ పసిగట్టాడని అర్థమైంది రాఘవయ్యకి...." చ..చ..అదేం లేదు బాబూ...మనిషిని సాటి మనిషి నమ్మకపోతే ఎలా..? అయినా మంచి కుర్రాడిలాడిలా కనిపిస్తున్నావు...అమ్మాయి పెళ్ళికని తీసుకుపోతున్న డబ్బని మనసు విప్పి చెప్పుకున్నాను కూడా...చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేంత చెడ్డవాడివని మాత్రం అనిపించడం లేదు..." అన్నాడు నిర్మలంగా....

" ఈరోజుల్లో కూడా ఇంత నిర్మలంగా ఉంటే ఎలా అంకుల్....అపరిచిత వ్యక్తినీ, కాబోయే అల్లుడ్నీ అంత స్వచ్చంగా నమ్మేస్తే ఎలా...నామాట విని సూట్ కేసు తెరిచి చూసుకోండి....." అన్నాడు స్థిరంగా.. అతడి మాటలు అర్థమయీ కానట్టనిపించి అప్రయత్నంగానే సూట్ కేసు తెరిచి చూసుకున్న రాఘవయ్య గుండె ఆగినంత పనయింది..." నా డబ్బు...నాడబ్బు..." అంటూ అరిచాడు.. " కంగారు పడకండి....ఇది చూడండి..." అంటూ అచ్చు అలాంటిదే తనదగ్గరున్న సూట్ కేసు తెరిచి చూపించాడు రాజేష్...అందులో తన డబ్బు......." అసలెవరీ అబ్బాయి...? దొంగా? కాదు...దొంగయితే తన వివరాలెందుకు చెప్తాడు? మరి సూట్ కేసులెందుకు తారుమారు చేసాడు...? మళ్ళీ ఎందుకు తన డబ్బు తనకు చూపించి తనను అయోమయానికి గురిచేస్తున్నాడు..?.....

" అన్నిటికీ సమాధానం చెప్తానంకుల్...ముందు మంచినీళ్ళు తాగండి...." రాఘవయ్య మనసులోని ఉద్దేశాన్ని గమనించినట్టుగా అన్నాడు రాజేష్......

అతడు చెప్పిన విషయాలు విన్న రాఘవయ్య నిర్ఘాంతపోయాడు......

**************************************

పెళ్ళివారు రాఘవయ్య కోసం ఎదురుచూస్తున్నారు.. గబగబా చేరుకున్నాడు రాఘవయ్య..నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ సూట్ కేస్ తన కొడుకు శేఖర్ చేతిలో పెట్టాడు రాఘవయ్య.

" ఏంటండీ..ఇంతాలస్యమైందీ? కాస్త తొందరగా రావొచ్చు కదా.... పెళ్ళివారు కట్నం డబ్బులిస్తేనే పెళ్ళిజరిగేది అని భీష్మించుక్కూర్చున్నారు...? " అంది రాఘవయ్య భార్య శ్యామలమ్మ..

శేఖర్ సూట్ కేసు తెరిచి చూసాడు..అందులో బట్టలు కనిపించాయి కానీ, డబ్బు లేదు.

" ఏంటి నాన్నా ఇందులో డబ్బులేవీ...."అనరిచాడు శేఖర్...

***************************

కట్నం డబ్బుల సూట్ కేసు పోయిందన్న వార్త క్షణంలో దావానలంలా వ్యాపించి మగపెళ్ళివారిదాకా చేరింది....

ఏమిటి రాఘవయ్యగారూ ఇదీ..? నేను విన్నది నిజమేనా..?" రాఘవయ్యను అడిగాడు కాబోయే వియ్యంకుడు ఆనందరావు..

" అవును బావగారూ...ఒక ఆగంతకుడు నాతోనే కలిసి ప్రయాణించాడు రైల్లో....అతడి దగ్గరా అచ్చు ఇలాంటి సూట్ కేసే ఉంది.. నా అనుమానం అక్కడే సూట్ కేసు మారిపోయి ఉంటుంది...." దిగాలుగా అన్నాడు రాఘవయ్య, తండ్రి పక్కనే నిలుచున్న్న పెళ్ళికొడుకు మొహంలోకి జాగ్రత్తగా గమనిస్తూ...

" నోనో..నేన్నమ్మను....ఇదంతా కటం డబ్బులు ఎగ్గొట్టడానికి మీరాడుతున్న నాటకం...." గట్టిగా అరిచాడు ఆనందరావు...

అలా అనకండి...ఒక్క ఆర్నెల్లు గడువివ్వండి.. మీ కట్నం డబ్బులు రెండు మూడు వాయిదాల్లో ఇచ్చేస్తాను..పెళ్ళి మాత్రం ఆపకండి.." దీనంగా అన్నాడు రాఘవయ్య..." నోర్ముయ్యండి..ఇక్కడ నేనేమన్నా ఈజీ ఇన్స్ టాల్మెంట్ స్కీం ఏమన్నా పెట్టానా?..... " అంటూ ఇంకేదో అనబోతుండగా మధ్యలో పెళ్ళికొడుకు కల్పించుకుని..." నాన్నా ఆర్నెల్లల్లో ఇచ్చేస్తామని అంటున్నారుగా...." అన్నాడు.

" బాబూ...!అంతా నువ్వనుకున్నట్టే జరుగుతోంది కదా...." పెళ్ళికొడుకు మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు రాఘవయ్య....షాక్ కొట్టినట్టు చూసాడు పెళ్ళికొడుకు...

" నేననుకున్నట్టు జరగడమేమిటి....నోనో..నాకేం తెలీదు......" నీళ్ళు నమిలాడు.  ఆనందరావు ఆశ్చర్యపోయి, " ఏమిట్రా ఇదీ? నువ్వనుకున్నట్టు జరగడమేమిటి...?" అంటూ కొడుకునడిగాడు..." పాతికవేలు వాటా తీసుకుని నా ప్లాన్ సక్సెస్ చేస్తానని..మొత్తం చెప్పేసి ఇంత మోసం చేస్తాడా రాజేష్ వెధవ..." గొణుక్కుంటున్నట్టు అన్నాడు పెళ్ళికొడుకు...

" మోసం నాది కాదురా వెధవా...నీది....కాబోయే మామగారి డబ్బు కొట్టేసి మళ్ళీ ఆయన నుంచే కట్నం కొట్టెయ్యడానికి ప్లాన్ చేస్తావా..?" గదిలోంచి బయటికొచ్చాడు రాజేష్.

అతన్ని చూస్తూనే చల్లగా జారుకోను చూసాడు పెళ్ళికొడుకు...

ఈలోగా శేఖర్ అతన్ని ఒడిసి పట్టుకున్నాడు....

ఆశ్చర్యపోయి చూస్తున్న అందరితో రాజేష్ ఇలా వివరంగా చెప్పాడు...

" వీడూ నేనూ స్కూల్లో కలిసి చదువుకున్నాము...తర్వాత చాలారోజులకు మళ్ళీ కలిసాడు..పెళ్ళి కుదిరిందని చెప్పాడు... దురాశతో తను వేసిన ప్లాన్ చెప్పి, నాకూ వాటా ఇస్తానన్నాడు...ఎంగేజ్ మెంట్ లో బట్టలు కొన్నప్పుడు గిఫ్టుగా వచ్చిన ఒకే మోడల్ సూట్ కేసులు చక్కగా వర్కవుట్ అయ్యాయి..అప్పుడే వీడి ప్లాన్ కి నేను సహకరించనని చెప్పేస్తే వేరేవాళ్ళ ద్వారానైనా అనుకున్న పని చేసి తీరతాడని ఒప్పుకున్నట్టు నటించాను....ఒక ఆడపిల్ల జీవితం మోసగాడి చేతిలో పడకుండా గుట్టురట్టు చేయగలిగాను...."


ఇవన్నీ విన్న తర్వాత అక్కడ క్షణమైనా ఉంటే అందరూ పట్టుకుని తన్నడం ఖాయం అని గుర్తించి కట్టుబట్టలతో మాయమయ్యారు పెళ్ళికొడుకుతో సహా ...

" డబ్బుకోసం వైవాహిక బంధాన్ని సైతం ఎరగా వాడుకోజూసిన ఆ దుర్మార్గుడి చేతిలో నా కూతురు ఇంకెన్ని పాట్లు పడేదో తల్చుకుంటేనే భయంగా ఉంది...."

బాధగా అన్నాడు రాఘవయ్య...

" నాన్నా...ఒక విషయం చెప్పనా...కనీసం పరిచయమైనా లేని ఒక ఆడపిల్ల జీవితం గురించి ఇంత మానవీయ కోణంలోంచి ఆలోచించాడంటే....కుల గోత్రాల కన్నా ముఖ్యమైన అతడి గుణమెంత గొప్పదో చూడండి... అతడి చేతిలో మన శరణ్య జీవితం ఆనందంగా ఉండగలదని నేననుకుంటున్నాను.." తండ్రితో అన్నాడు శేఖర్. రాజేష్, శరణ్యల పరస్పర అంగీకారంతో యాదగిరీశుని సన్నిధిలోనే వైభవంగా జరిగింది వారి పెళ్ళి.

మరిన్ని కథలు
jeevana jyoti