Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఐదవ భాగం

Anubandhaalu Fifth part

అంతా విని తేలిగ్గా నవ్వేసింది అన్నపూర్ణేశ్వరి.

"అమ్మా! నాకు చిరాగ్గా వుంటే నీకు నవ్వులాటగా వుందా?" అంటూ విసుక్కుంది భ్రమరాంబ.

"లేకపోతే మరేమిటే పిచ్చిమొద్దూ. ఈ మాత్రానికే అంత విసుగైతే ఎలా? "

" ఈ మాత్రానికా...అమ్మా.! నువ్వేనా ఇలా మాట్లాడేది? క్రమశిక్షణ అదీ అంటూ చెవులు మేలదీసే నువ్వు...."

"అంటే నీ ఉద్దేశం ఏమిటి? క్రమశిక్షణ అంటే మిలిటరీ తరహాలో ప్రతిచిన్న విషయాన్నీ సీరియస్ గా తీసుకుని దండించడం కాదు. అతి గారాబం ఎంత చెడ్డదో అతిగా దండించడం అంతకన్నా చెడు చేస్తుంది. చాలామంది తల్లిదండ్రులు ఈ వ్యత్యాసం తెలుసుకోలేక పిల్లలు చెడిపోవడానికి తామూ కొంత కారణం అవుతున్నారు. ఆరోగ్యకరమైన అల్లరిని మనమూ తేలిగ్గా తీసుకుని వాళ్ళకి సర్ది చెప్పాలి గానీ, విసుగు, కోపం ప్రదర్శించకూడదు. మిమ్మల్ని ఎలా పెంచానో నీకు తెలియదా?"

"తెలుసు.మమ్మల్నేమిటి, మా పిల్లల పెంపకం కూడా నువ్వే చూసుకుంటున్నావ్ కాబట్టి మేం నిశ్చింతగా వున్నాం. కానీ వీళ్ళలా అన్నయ్యలూ, నేనూ ఎప్పుడూ గొడవ పడలేదు. నీకేం తెలుసు వీళ్ళ అల్లరి...?"

"నాకు తెలీకుండానే వీళ్ళు పెరిగారా ఏమిటి? ఎందుకంత బాధపడిపోతావ్? కాసేపు పోటీ పడి వాళ్ళే సర్దుకుపోతారు. మనం పట్టించుకోకూడదు. నీకు తెలుసో లేదో, ఓసారి చుట్టుపక్కల పిల్లల్ని గమనించు. ఆదివారం వచ్చిందంటే చేతికి దొరకరు. ఎక్కడ తిరుగుతారో, ఏం ఘనకార్యాలు వెలగబెడతారో వాళ్ళకే తెలియాలి. కానీ నీ కొడుకు, కూతురు ఆదివారం కూడా బయట వృధాగా తిరగకుండా ఇంటిపట్టునే ఉంటారు. అల్లరి చేస్తారు. చదువుకుంటారు. సంతోషించు. వాళ్ళ అల్లరితో నువ్వూ పోటీపడితే సంతోషిస్తారు. కావాలంటే చూడు. నువ్వు వెళ్ళి వాళ్ళిద్దర్నీ పక్కకు నెట్టి క్రికెట్ లేదు, సినిమా లేదు, సీరియల్ చూసేదాకా టి.వి.వదలనని చెప్పు. దెబ్బకు వాళ్ళిద్దరూ ఇక్కడకు పరిగెత్తుకొచ్చి కామ్ గా టీ.వి. ముందు కూర్చోకపోతే అడుగు"అంటూ వివరించిందామె.

తనకు జ్ఞానోదయం అయినంత సంభ్రమంగా తల్లివంక చూసింది భ్రమరాంబ.

"అయ్యబాబోయ్, అమ్మా..! ఇన్ని చిట్కాలు ఎక్కడ నేర్చుకున్నావ్?" అనడిగింది.

"తప్పు, ఇది నేర్చుకుంటే వచ్చే విద్య కాదు. పిల్లల వయసునీ, మనసునీ నువ్వు అర్థం చేసుకోగలిగితే వాళ్ళ తగవులు తీర్చే చిన్నచిన్న అద్భుత చిట్కాలు నీకూ బోలెడు తడతాయి. అనుమానం ఎందుకు? వెళ్ళి నేను చెప్పినట్టు చేసి చూడు. వాళ్ళిద్దరూ వచ్చి కామ్ గా ఇక్కడ కూర్చోకపోతే నన్నడుగు... గోల చేస్తే అక్కడ బామ్మ రాకాసి చెవులెక్కదీస్తుందని వాళ్ళకి తెలుసు." అంటూ నవ్వేసింది అన్నపూర్ణేశ్వరి.

భ్రమరాంబ తల్లి చెప్పిన చిట్కాలను ప్రయోగించి చూసేదో, లేదో తెలీదుగానీ బయట ఎవరో వస్తున్న అలికిడి కావడంతో తల్లీకూతుళ్ళ ఇద్దరి దృష్టి అటు మళ్ళింది. వాడిపేరు వెంకటేశులు. వాడితో బాటుగా వాడి పెళ్ళాం సరస, ఆ ఇద్దరి ఆరేళ్ళ కొడుకు. వాళ్ళ ముగ్గురి వెంట వాళ్ళ తాలూకు పదిమంది ఆడమగ అంతా కలిసి రావడం విశేషమే. ఏదో కారణం లేనిదే వాళ్ళలా రారు. బయటకు వచ్చి చూసి అదే అడిగింది అన్నపూర్ణేశ్వరి.

"ఏమిట్రా వెంకటేశులూ! అంతా కలిసి కట్టగట్టుకుని మరీ ఒకేసారి దండయాత్రకి వచ్చారు.ఏంటి సంగతి?" ముగ్గుబుట్టలా తెల్లబడిన జుట్టుని లాగి ముడివేసుకుని కళ్ళజోడు సవరించుకుంటూ అడిగింది.

బుర్ర గోక్కుంటూ కాస్త ఇబ్బందిగా చూశాడు వెంకటేశులు. "అదేం లేదండమ్మా.. మీ దర్శనం కోసమే వచ్చాం" అన్నాడు విషయం నాంచుతూ.

" ఏరా, దర్శనం ఇవ్వడానికి నేనేమన్నా గుళ్ళో అమ్మవారినా ఏంటిరా?"

"మాకు అంతకన్నా ఎక్కువమ్మా   మీరు...."

"సరిసరి చాలు, విషయానికిరా ఏమైందీ?"

"మా మొగుడూ పెళ్ళాల మధ్య సిన్న తగువు. మీరే తీర్పు చెప్పాల."

"తగువైతే వూరి పెద్దలున్నారు, అక్కడికెళ్ళండిరా నేనేమన్నా ప్రైవేట్  కోర్టు పెట్టానా తీర్పులు చెప్పడానికి"

"అదికాదమ్మా. ఇది కుటుంబకలహం. పంచాయితీకి ఎక్కితే పరువు వీధిన పడుద్ది.  మీ పొలాల్ని నమ్ముకుని బతుకుతున్నోళ్ళం. మా పెద్దదిక్కు మీరే. మాకష్టసుఖాలు తమకేగా సెప్పుకుంటాం. మీరే దీన్ని సక్కబెట్టాల."

"సరి సరి ఇంతకీ ఎందుకొచ్చింది కీచులాట మీకు? ఏమే సరసా... మళ్ళీ పుట్టింటికి పోతానంటూ వాడ్ని బెదిరిస్తున్నావా?" సరసను గుచ్చిగుచ్చి చూస్తూ అడిగింది.

దించిన తల ఎత్తలేదు సరస. పెదవి విప్పి పలకలేదు.

వెంకటేశులు కల్పించుకుంటూ "సెప్పవే. మౌనం దేనికీ అమ్మగారు అడుగుతున్నారు సెప్పరాదూ. నా తప్పుంటే ఇక్కడే సెప్పుతో కొట్టినా పడతాను. సెప్పు" అన్నాడు కాస్త దురుసుగా.

"నువ్వాగరా" అంటూ మెట్టుదిగి కిందకొచ్చి సరసముందు నిలబడింది అన్నపూర్ణేశ్వరి.

"ఏమిటే నీ మౌనం? ఆడవాళ్ళ పరువు తీయకు. మీరు గొడవ పడింది నిజమేకదా?" శాంతంగా అడిగింది.

"అవున"న్నట్టుతలూపింది సరస.

"తలతో కాదు, నోటితో చెప్పాలి. తప్పు నీదే అయి వుంటుందిలే. అందుకే మాట రావడం లేదు. ఈ మున్నలూరులో ఎవరినడిగినా చెప్తారు నాగురించి. ఆ సంగతి నీకూ తెల్సు. కాదంటే పొరుగూరినుంచి కోడలిగా ఇక్కడ అడుగు పెట్టావ్ కాబట్టి నేనంటే నీకు లెక్కలేదు. అంతేనా..?"

"లేదమ్మా. ఇందులో నా తప్పులేదు." అంది సరస కాస్త కంగారుగా.

"పోనీ వీడి తప్పేమిటి" అదయినా చెప్తావా?"

రోజూ తప్పతాగొచ్చి గొడవ సేత్తన్నాడమ్మా. అందుకే పుట్టింటికెళ్ళి పోతానన్నాను."

"అవును, పుట్టింటికెళ్ళిపోవడానికి ఏదో కారణం ఉండాలిగా, మంచిదే. కానీ నువ్వు అసలు విషయం చెప్పడం లేదు."

"నేను చెప్పింది నిజమే"

"అబద్ధాన్ని నిజం చేయాలని చూడకు. చెంప పగులుతుంది. తాగుబోతు ఎవడూ మా ఆవరణలో అడుగు పెట్టలేరు. మా పనివాళ్ళలో ఒక్కడు కూడా తాగుబోతు లేడు. నువ్వేమిటి కొత్తగా వాడు తాగి తందనాలాడుతున్నాడంటావ్? సాక్ష్యం ఎవరినన్నా తెచ్చావా? ఏమయ్యా మీరెవరన్నా చూసారా?" వెంట వచ్చిన వాళ్ళని అడిగింది.

"ఆదియ్యా, నువ్వు?" అంది ఒక వృద్ధున్ని.

"తాగినట్టు తెలీదమ్మా. ఆ పిల్ల పుట్టింటికి పోతానంటే వీడు పేచీ పడ్డాడు. మేం ఎంత నచ్చజెప్పినా గొడవ సర్దుబాటుగాక మీదగ్గరకొచ్చినం" చెప్పాడతడు.

"విన్నావ్ గా ఇప్పుడన్నా నిజం చెప్పు, పుట్టింటికి ఎందుకెళ్ళిపోతాననుకుంటున్నావ్?" కోపంగా అడిగింది.

దాంతో సరస కళ్ళనీళు పెట్టుకుంది. "మీతో అబద్ధం చెప్పడం తప్పేనమ్మా.ఆడి సంపాదన గొర్రెకు బెత్తెడు తోకనాగుంది. అప్పులు పెరిగి పోయాయి. అప్పుల బాధ పళ్ళేక పోతున్నా. అందుకే మా ఊరెళ్ళిపోతా" అంది.

తల పంకిస్తూ సరసను ఎగాదిగా చూసిందామె.

"ఓ మాటడుగుతాను చెప్పు. వెంకటేశును ఇష్టపడే చేసుకున్నావా, లేక మీవాళ్ళు బలవంతంగా కట్టబెట్టారా?"అనడిగింది.

"ఇష్టపడే చేసుకున్నానమ్మా" అంది.

"మరి వదిలేసి పోతానంటున్నావ్, నీకిదేం రోగమే? కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని ప్రమాణం చేసే కదా వాడికి పెళ్ళాం అయ్యావ్? మాట నిలబెట్టుకోవా? సుఖం లో మాత్రం మొగుడు కావాలి. కష్టాల్లో మాత్రం అక్కర్లేదు. వదిలేస్తావ్. అంతేనా?"

సరస బదులు చెప్పలేకపోయింది.

వెంకటేశులు  కల్పించుకుంటూ "అసలు మా కష్టాలకు కారణం ఏంటో దాన్నే అడిగి సూడండి అమ్మగారూ!" అన్నాడు.

"దాన్ని అడగడం కాదురా. నిన్ను తన్నాలి. చవటా... పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవడం తప్పు కాదు. దాన్ని నెత్తికెక్కించుకోవడం తప్పు. అందుకేరా ఈ పరిస్థితి వచ్చింది" అంటూ మండి పడిందావిడ.

"ఆమాట నిజమేనండమ్మా, కాని ఏం చేయను? నా సంపాదనంతా ఇది కొన్న వస్తువులకు వాయిదాలు చెల్లించడానికే సరిపోతుంది. ఇల్లు గడవడం ఎలా? అవసరం వున్నా, లేకపోయినా వీధిలో వాయిదాల బండి వస్తే పాపం, ఏదో ఒక వస్తువు పుచ్చుకోవడం, వారం వారం వాడికి డబ్బు కట్టడం. ఇదంతా నాకు తెలీకుండా జరిగింది. ఇంట్లొ కొత్త వస్తువులు చూసి ఎక్కడివే అంటే ఏదో చెప్పేది. చివరికి ఇంటిఖర్చుకిచ్చిన డబ్బులు కూడా  అయిపోయి రాత్రి పస్తులున్నాం.

తెల్లారేసరికి వాయిదాల వాళ్ళగొడవ. నేను నిలదీసి అడిగానని పుట్టింటికి బయలుదేరిపోయింది. మీరు చెప్పండమ్మా! ఇందులో నా తప్పేమన్నా వుందా?" అంటూ వాపోయాడు వెంకటేశులు. "ఏమిటే ఇది సరసా..? తప్పంతా నీదగ్గర పెట్టుకొని నేరం వాడిమీద వేస్తావ్, ఇదేమన్నా బాగుందా? నీమొగుడి సంపాదన ఎంతో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా ఖర్చు చేస్తే కష్టాలనుండి తప్పించుకోవచ్చు. మీలాగే వాయిదాల పద్ధతిలో విలాసంగా గడపటానికి అనవసరమైన వస్తువుల్ని కొని, బాకీ కట్టలేక కుప్పకూలిన కుటుంబాలెన్నో ఉన్నాయి. నీ  కష్టార్జితంలో వంద రూపాయల వస్తువు కొంటే,  అదే వస్తువుని వాయిదా దారుడు రెండు వందలకి అమ్ముతాడు. వారం వారం సులువుగా కట్టెయ్యొచ్చు అనుకుని ఊబిలో దిగబడిపోతున్నారు. మరి వాడిని అప్పులవాడిని చేసింది నువ్వేకదా? నువ్వు పుట్టింటికి పారిపోతే  వాడి గతేమిటి? కొడుకుని ఏం చదివిస్తావ్? ఏం ప్రయోజకుడిని చేస్తావ్? సంసారమంటే ఇదేనా? " అన్నపూర్ణేశ్వరి నిలదీసి అడుగుతూంటే సమాధానం చెప్పలేక ఏడ్చేసింది సరస.

"నాది తప్పేనమ్మ.! బుద్ధి వచ్చిందమ్మా.. కానీ కష్టాల్లోంచి బయటపడే దారి కనిపించడం లేదు" అంది ఏడుస్తూనే.

"సరి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? బుద్ధి ముందు ఉండాలి. పుట్టింటి మంత్రం జపించకుండా లక్షణంగా కాపురం చేసుకుంటానని మాటివ్వు. నీకోసం కాకపోయినా మా వెంకటేశులు కోసమైనా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను." అంటూ పెద్దమనసుతో వాళ్ళకి హామీ ఇచ్చింది అన్నపూర్ణేశ్వరి.

వెంకటేశులు దంపతులే కాదు, వచ్చిన పెద్దలు కూడా తమ చెవుల్ని నమ్మలేకపోయారు. ఏవో నాలుగు నీతులు చెప్పి పంపించేస్తుంది అనుకున్నారు గానీ, తను బాధ్యత తీసుకుని వాళ్ళని ఆదుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అందుకే ఒక్కసారిగా కూలబడి ఆవిడ కాళ్ళకు చుట్టుకుపోతూ పెద్దగా ఏడ్చేసింది సరస.

" వెళ్ళనమ్మా! ప్రాణం పోయినా నా మొగుడ్ని, నా బిడ్డను వదిలి వెళ్ళను. నా మొగుడు సానా మంచోడు. నాకు తెలుసు. పాపిష్టి దాన్ని. సరదాలకు పోయి సంసారాన్ని అప్పులపాలు చేసుకున్నాను. బుద్ధొచ్చింది. వాయిదాల జోలికి పోను. ఈ గండం నుంచి మమ్మల్ని బయట పడెయ్యండమ్మా..మీ ఋణం తీర్చుకుంటాం." అంది ఏడుస్తూనే.

"అలాగే... ముందు లే, చెప్తాను." అంటూ సరసను భుజాలు పట్టి లేపి ఆప్యాయంగా కన్నీరు తుడిచింది అన్నపూర్ణేశ్వరి.

"ఏడవకు, ఇకనుంచైనా బుద్ధిగా కాపురం చేసుకో. నీ మొగుడికి నువ్వే మర్యాద ఇవ్వక పోతే, బయటివాళ్ళు ఎందుకిస్తారు? తప్పు నువ్వు చేసి నింద వాడి మీద వేయడం, పుట్టింటికి వెళ్తానంటూ నానా యాగీ చేయడం సరైన పద్ధతి కాదు. మొగుడి సంపాదనను అనుసరించి పతువుగా సంపాదన చేసుకోవడం తెలిసిన ఏ ఆడపిల్లకూ కష్టాలూ, కన్నీళ్ళూ వుండవు, అర్థమైందా?" అంటూ నచ్చజెప్పింది.

అర్థమైందని తలూపింది సరస.

"అరె వెంకటేశులు! మీ బాకీల వాళ్ళని నా వద్దకి పంపించు. వాళ్ళకి నేను సెటిల్ చేస్తాను. నీ జీతం లో కొంత మినహాయించుకుంటాన్లే. ఇంకెప్పుడూ గొడవలు పడకండి. ఏమంటావ్?" అని వెంకటేశుల్ని అడిగిందావిడ.

"అంతా మీ దయ తల్లీ. మా పెద్దదిక్కు తమరే గదా. చెప్పినట్టే నడుచుకుంటాం. మీరు చేస్తున్న సహాయానికి ఏం చెప్పాలో కూడా నాకు తెలీడం లేదమ్మా.మా సంసారాన్ని నిలబెట్టారు." అంటూ చెమర్చిన కళ్ళను తుడుచుకున్నాడు.

"పిచ్చోడా.. మీరు మా పనోళ్ళురా.మీరు సంతోషంగా వుంటేనే మాకూ సంతోషం. ఇక బాధపడకండి. అమ్మాయ్ భ్రమరాంబా! జీతం డబ్బులు బాకీలకు కట్టేసి, వీళ్ళు పస్తులున్నట్టున్నారు. వీడికి వెయ్యి రూపాయలిచ్చి పంపించు. తర్వాత లెక్క చూసుకుందాం." అంది కూతురుతో.
భ్రమరాంబ లోనకెళ్ళి వెయ్యి రూపాయలు తెచ్చి వెంకటేశుకి అందించింది. భార్యాభర్తలిద్దరూ కృతజ్ఞతతో పెద్దావిడకు నమస్కరించి తమ బిడ్డతో వెనుదిరిగారు.

వెంట వచ్చిన పెద్దలు కూడా వెంకటేశులు కుటుంబాన్ని ఆదుకున్న అన్నపూర్ణేశ్వరి మంచి మనసుకు ముగ్ధులై నమస్కారాలు పెట్టి వెనుదిరిగారు. వాళ్ళు వెళ్ళిపోగానే  లోనకు వచ్చి, హాల్లో కూర్చుంది అన్నపూర్ణేశ్వరి.

భ్రమరాంబ మాత్రం అక్కడ ఇంట్లో నవీన్, మహేశ్వరిలు ఏం గోల చేస్తున్నారో తెలీక కంగారు పడుతూ అటు వెళ్ళిపోయింది. ఇంతలో ఇరుగు పొరుగున ఉండే అన్నపూర్ణేశ్వరి స్నేహితురాళ్ళు నలుగురు ఆమెను చూడం కోసం లోనకొచ్చారు. వాళ్ళంతా అరవై దాటిన వయసు వాళ్ళే.
కాస్సేపు పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కూచున్నారు. కాస్సేపు అయాక మాటామంతీ అయాక... మాటల సందర్భంలో సిటీల నుంచి గ్రామానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లల ప్రస్తావన వచ్చింది. మాటలు ఫ్యాషన్ల వైపు మళ్ళాయి.

"ఏం ఫ్యాషన్లో ఏమిటో పిన్నిగారూ. చూస్తుంటే సిటీల్లో పిల్లలు మరీ పాడయిపోతున్నారనిపిస్తోంది. వచ్చింది సొంత పల్లెటూరు. కనీసం పండగరోజుల్లోనైనా మంచి డ్రస్సులు వేసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండడం లేదు." అంది ఒకావిడ.

"సరి సరి పిల్లలదాకా వెళ్ళావ్. కరణం గారి కోడల్ని చూశావా? వాళ్ళు ఢిల్లీలో ఉంటున్నారు. ఇద్దరు పిల్లల తల్లి. లక్షణంగా చీర, జాకెట్టు వేసుకోకుండా పంజాబీ డ్రస్సులోనే తిరిగింది. ఆ లావుకీ, డ్రస్సుకీ ... ఛ... ఛ... అసహ్యంగా లేదూ?" అంది మరొకామె.

అవునన్నట్టు తలూపింది అన్నపూర్ణేశ్వరి.

"నిజమే...సౌకర్యం చూసుకుంటున్నారు గానీ  సంప్రదాయం గురించి ఎవరూ ఆలోచించడం లేదు.. నాయుడు గారి అబ్బాయి కుటుంబం ముంబాయి నుండి వచ్చారు. వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో చూశారు కదా. మనవడు, మనవరాలు అంతా నిన్న రాములవారి కళ్యాణోత్సవంలో తిరుగుతూంటే చూశాను. ఆ అమ్మాయి చంకలు కనబడేలా, చేతులు లేని జాకెట్ వేసుకొంది... తల్లీ అర్ధ నగ్నం డ్రస్సులతో అదే ఫ్యాషననుకుంటూంది......

( .... తరువాయి భాగం వచ్చేవారం)

మరిన్ని సీరియల్స్
manthrasaani by varalaxmi